సమాజాన్ని అర్థం చేసుకోని వారే అంధులు

టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

కళ్ళు లేకున్నా పవిత్రమైన హృదయంతో మనుషుల్ని ప్రేమిస్తున్న వారు అంధులు కారని, కళ్ళుండి కూడా సమాజాన్ని అర్థం చేసుకోలేని వారే అంధులని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు. అంధుల ఆరాధ్యదైవం లూయిస్ బ్రెయిలి 212వ, జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నాడు తెలంగాణ అంధ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో, ప్రముఖ కవి, రచయిత డాక్టర్ నందిని సిధారెడ్డి అధ్యక్షతన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సభకు ఆయన గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు.
నాలుగేండ్ల ప్రాయంలోనే రెండు కళ్ళను కోల్పోయిన లూయిస్ బ్రెయిలి ఆత్మవిశ్వాసం, పట్టుదల, అంకుటిత దీక్షతో 17ఏండ్ల ప్రాయంలోనే పారిస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరి చరిత్ర సృష్టించారని విరాహత్ కొనియాడారు. అదే పట్టుదలతో అంధుల కోసం ఆరు చుక్కల ప్రత్యేక లిపిని కనుగొని కోట్లాది చీకటి పొరలకు వెలుగును ప్రసాదించిన మహానీయుడన్నారు. రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంస్థ ఛైర్మెన్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలి జీవితం కేవలం వికలాంగులకు మాత్రమే కాదని, ప్రపంచంలో ప్రతి పౌరుడికి స్ఫూర్తి దాయకమన్నారు. వికలాంగుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎనలేని చర్యలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ఛైర్మెన్ శివకుమార్ మాట్లాడుతూ, ఎలాంటి కల్మషం లేని హృదయాలు కలిగివున్న అంధులు సమాజానికి స్ఫూర్తి దాయకమన్నారు.టీఎన్జీవోల సంఘం అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా వికలాంగ ఉద్యోగులకు దక్కాల్సిన సౌకర్యాల సాధనకై తమ సంఘం ముందుండి పోరాడుతుందన్నారు. టీఎన్జీవోల సంఘం జిల్లా కమిటీల్లో, కేంద్ర కమిటీలో వికలాంగుల కోసం ఓ పదవిని కేటాయించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అంధ ఉద్యోగుల సంఘం నేతలు యాదయ్య, అనీల్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు లూయిస్ బ్రెయిలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన బర్త్ డే కేక్ కట్ చేసి అంధులకు తినిపించారు. వికలాంగుల సంక్షేమ సంస్థ ప్రచురించిన బ్రెయిలి లిపి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: