ఆ కూల్చివేతలు...

రాజ్య కాంక్ష,,,ఆర్థిక కాంక్ష కోసమే..మత కోణంలో కాదు...

హిందూ రాజులు అనేక దేవాలయాలు కూల్చారు

ముస్లిం పాలకులు హిందూ దేవాలయాలను పరిరక్షించారన్నది తెలుసా..?

చరిత్ర కొన్ని ఘటనలను పొందుపర్చినా వాటిని అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. అందులోనూ వాస్తవ కోణం మరింత అవసరం. చరిత్రను తిరిగేస్తే నాడు గుళ్లు, గోపురాలు, చరిత్రక కట్టడాల కూల్చివేత పరం పరం దండయాత్ర చేసిన రాజుల రాజ్యాధికార కాంక్ష, ఆర్థిక కాంక్షలో భాగంగా చేశారో గానీ వారు మతకోణంలో చేశారని భావించకూడదు. ఎందుకంటే మత కోణంలో చూస్తే ఓ హిందూ రాజు దేవాలయాన్ని కూల్చుతాడా...కానీ చరిత్రలో అనేక ఘటనలు హిందూ రాజులు దేవాలయాలను కూల్చిన సందర్భాలను గుర్తుచేస్తున్నాయి. మతకోణంలో చూస్తే ముస్లిం రాజులు దేవాలయాలను పరిరక్షించే బాధ్యత చేపడతారా అన్నది కూడా కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అదేంటి మనందరికీ ముస్లిం పాలకులు హిందూ దేవాలయాలను పడగొట్టేశారని కదా మైండ్ ట్యూన్ చెయ్యబడుతూ వస్తుంది.. “ముస్లిం పాలకులు హిందూ దేవాలయాలను నిర్మించటం, పునరుద్ధరించటం ఏంటి? ఇది కాస్త వినటానికి వింతగానూ విచిత్రంగానూ అనిపిస్తుంది కదూ.  దాదాపు వెయ్యేళ్లు పరిపాలించిన ముస్లిం పాలకుల లక్ష్యం కేవలం భారతదేశంలో ఉన్న గుళ్లన్నీ పడగొట్టేసి ఈ దేశాన్ని ఏ ఇస్లామిక్ కంట్రీగానో మార్చేయ్యాలన్నదే అయి ఉంటే వారు హిందూ దేవాలయాలు పడగొట్టేసిన సంఘటనలు మాత్రమే చరిత్రలో ఉండాలి తప్ప హిందూ దేవాలయాలు నిర్మించిన, పునరుద్ధరించిన సంఘటనలు చరిత్రలో ఉండకూడదు.  

అక్బర్ చక్రవర్తి

“హిందువులను ఇస్లాంలోకి మార్చటానికి మధ్యయుగాల్లో ముస్లిం పాలకులు దేవాలయాలు ధ్వంసం చేసేశారని.. వేలకొద్దీ దేవాలయాలు కూల్చేసి మసీదులు నిర్మించేసుకున్నారని కల్పిత కథలు సృష్టించి... చివరిగా “హిందూత్వం ప్రమాదంలో ఉంది” అని చెప్పటంలో నేటి మతోన్మాద వేర్పాటువాదుల ఉద్దేశం సామాన్య హిందూ ప్రజానీకం దృష్టిలో ముస్లిం సమాజం పట్ల తప్పుడు ఇమేజ్ ను సృష్టించటం, ఈ ఇరు సమాజాల ప్రజల మధ్య విష బీజాలు నాటటం  మాత్రమే.

  ఇలాంటి వారికి 1). మధ్యయుగాల్లో ఒక్క ముస్లిం పాలకులే కాదు..  హిందూ పాలకులు సైతం ఎన్నో దేవాలయాలు పడగొట్టారని గానీ..  అదంతా వారి రాజ్యకాంక్ష తాలూకు యుద్ధోన్మాదమే తప్ప మతోన్మాదం కాదని..  2).  ముస్లిం పాలకులు ఎన్నో హిందూ దేవాలయాలు కట్టించటం, పునరుద్ధరించటం కూడా చేశారన్న వాస్తవాలు  తెలియవు. 

చరిత్రను వన్ సైడ్ అనాలసిస్ చేస్తూ హిందూ, ముస్లిముల మధ్య  విధ్వేషబీజాలు నాటటానికి ప్రయత్నించేవారు తెలుసుకోవలసింది..  ముస్లిం పాలకులు భారతదేశంలో వందల కొద్దీ దేవాలయాలు నిర్మించారు. పునరుద్ధరించారన్నది.

వైసూర్ పులి టిపు సుల్తాన్
ముస్లిం పాలకులు భారతదేశంలోని ముఖ్యమైన హిందూ, జైన దేవాలయాల నిర్మాణానికి దోహదపడటమే కాకుండా.. హిందూ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, చిత్రకూట్, మధుర, బృందావన్ సహా అనేక పుణ్యక్షేత్రాలలో దేవాలయాలు నిర్మించటమే కాక వాటి నిర్వహణను కూడా ఎన్నో సహాయసహకారాలు అందించారు. ఆ వాస్తవాలన్నీ నేడు మరుగు చెయ్యబడ్డాయి. 

మొఘల్ సామ్రాజ్యం యొక్క మూడవ చక్రవర్తి అక్బర్ మధుర ప్రాంతంలోని ఆగస్టు 27, 1598 మరియు సెప్టెంబర్ 11, 1598 తేదీలలో దేవాలయాలకు, దేవాలయ సేవకులకు బృందావన్, మధుర, వాటి పరిసరాలకు  అపార నిధులను అందజేశారు. అక్బర్ ఫతేపూర్ సిక్రీలో హిందూ ఉత్సవాల్లో పాల్గొనటమే కాక అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడు. అంతేకాదు రామాయణం, మహాభారతం మరియు బైబిల్ను పర్షియన్లోకి అనువదించడానికి అనువాద విభాగాన్ని ఏర్పాటు చేశాడు. 

అక్బర్ పరిపాలనలో అనేక హిందూ సామంతులు తమ రాజ్యాలలో వివిధ హిందూదేవాలయాలను నిర్మించుకొన్నారు. ఉదాహరణ: రాజామాన్ సింగ్ బృందావనంలో నిర్మించిన గోవింద దేవ ఆలయం

జహంగీర్ తన తండ్రి అక్బర్ చక్రవర్తి ఆమోదించిన దేవాలయపు గ్రాంట్లలో గణనీయమైన చేర్పులు చేసి.. 1598లో  అక్బర్ మంజూరు చేసిన ముప్పై ఐదు ఆలయాల జాబితాలో అతను అదనంగా రెండు దేవాలయాలను చేర్చాడు. 1620 లో బృందావన్ ఆలయాన్ని కూడా సందర్శించటమే కాక, మొఘల్ రాజు జహంగీర్ ఆలయ సేవకుల కుటుంబాలకు 30 హెక్టార్ల భూమిని కూడా రాసివ్వటం జరిగింది.

ఇక 18 మరియు 19 వ శతాబ్దాలలో ఉత్తర భారతదేశంలో ఔధ్/ అవధ్ రాజ్యాన్ని పరిపాలించిన ఔధ్ నవాబులు, అయోధ్య దేవాలయాలకు అనేక గ్రాంట్లు ఇచ్చాడు మరియు వాటి రక్షణ కల్పించాడు.

నవాబ్ సఫ్దర్‌జంగ్ అయోధ్యలో అనేక దేవాలయాలను నిర్మించాడు. ఇతర దేవాలయాల మరమ్మతు పనులకు సహకరించాడు. 

15 వ శతాబ్దంలో రాజు జైన్-ఉల్-అబిదిన్ కాశ్మీర్‌లో ఎన్నో దేవాలయాలను నిర్మించాడు. జైన్-ఉల్-అబిదిన్ సంస్కృత పండితుడు, ఉపనిషత్తుల భాగాలను పెర్షియన్లోకి అనువదించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.

నవాబ్ సఫ్దర్‌జంగ్ వారసుడు షుజా-ఉద్-దౌలా, హిందూ దేవాలయాలలో ముఖ్యమైన హనుమన్‌గరి నిర్మాణం కోసం 20 హెక్టార్ల భూమిని బహుమతిగా ఇచ్చాడు. హనుమన్‌గరి ప్రధాన పూజారి మహంత్ జ్ఞాన్ దాస్ ప్రకారం, 1774 లో అనారోగ్యంతో ఉన్న షుజా-ఉద్-దౌలాను ఒక హిందూ పూజారి సందర్శించి, అనారోగ్యం నుండి బయటపడటానికి సహాయం చేసిన తరువాత ఈ ఆలయాన్ని నిర్మించటం జరిగింది. 

చిత్రకూట్, వారణాసి, ఉజ్జయిని, అలహాబాద్ మరియు ఇతర ప్రాంతాలలో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలలో లభ్యమయ్యే పత్రాల ప్రకారం, ముస్లిం పాలకులు ఈ దేవాలయాలకు భారీ విరాళాలు ఇచ్చి సహాయం అందించినట్టు రికార్డులు ఈనాటికీ ఉన్నాయి. 

దక్కన్ రాజ్యాల విషయానికి వస్తే, 16 వ శతాబ్దపు రాజు ఆదిల్ షా కూడా ఒక గొప్ప గ్రంథాలయాన్ని స్థాపించి, సంస్కృత పండితుడు వామన్ పండిట్‌ను దాని అధిపతిగా నియమించాడు. బీజాపూర్‌లోని తన రాజభవనానికి సమీపంలో ఒక చిన్న మందిరం నిర్మించి, దేవతకు చెందిన పాదుకా (పాదరక్షలు) అక్కడ ఉంచాడు.

 కొందరు వేర్పాటువాదులు హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ఔరంగజేబ్.. భారతీయ చరిత్రకారుడు ప్రదీప్ కేషర్వానీ ప్రకారం..  చిత్రకూట్ లోని బాలాజీ మందిరం, గౌహతీ దగ్గర ఉన్న కామాఖ్య దేవీ మందిరం, అలాగే అలహాబాద్ ఆరాలి లోని సంగం ఒడ్డున సోమేశ్వర మహాదేవ ఆలయం, ఉజ్జయిన్ లోని మహాకాళేశ్వర ఆలయం, బృందావనం లోని కృష్ణుని ఆలయం.. ఇవే కాకుండా అనేక దేవాలయాల నిర్మాణాలకు ఔరంగజేబ్ ఎన్నో భారీ విరాళాలు ఇవ్వటం జరిగింది. ఈ విషయాన్ని డాక్టర్. బిసంబర్ నాథ్ పాండే రాసిన “ఫిర్మన్స్ ఆఫ్ కింగ్ ఔరంగజేబ్” పుస్తకంలో పేర్కొనటం జరిగింది.  అంతేకాదు ఔరంగజేబ్ సైన్యంలో, అధికారుల్లో హిందువులు ఎందరో ఉండేవారు. 

బీదరు జిల్లాలో ఈశ్వరాలయాన్ని పునరుద్దరించి, పూజాధికాలు నిర్వహించమని 1326 లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆదేశాలు ఇచ్చినట్లు  ఈనాటికీ రికార్డులున్నాయి (Kalyana inscription of sultan Muhammad - Epigraphic Indica 32)

హిందూ పాలకులు హిందూ దేవాలయాలు ఎందుకు కుల్చారు...?

ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ముస్లిం పాలకులే హిందూ దేవాలయాలు కుల్చారన్న చరిత్ర మాత్రమే చాలా మంది చెబుతారు. కానీ, హిందూ పాలకులు అంతకంటే ఎక్కువ దేవాలయాలు కుల్చారు. ఈ సందర్భంలో తెలుసుకోవలసిన మరో ముఖ్య విషయం- ప్రముఖ చరిత్రకారుడు భారతదేశం యొక్క పురాతన మధ్య యుగాల చరిత్ర నిపుణుడైన DN Jha తన “Against the Grain: Notes on Identity, Intolerance and History” పుస్తకంలో ఇస్లాం పూర్వ యుగంలో అశోకుని పాలన ముగిసిన తరువాత బ్రాహ్మణ పాలకులు అనేక బౌద్ధ మందిరాలు, మఠాలు, స్థూపాలను నాశం చేసి దేవాలయాలు నిర్మించారని పేర్కొన్నాడు.


 

అంతేకాదు, చాలా మంది హిందుత్వ వాదులు చెబుతున్నట్లు ముస్లిం పాలకులు 60 వేల దేవాలయాలు ధ్వంసం చేశారన్నది కూడా నిరాధార విమర్శే.  ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ Richard M. Eaton ప్రకారం భారతదేశంలో ముస్లిం పాలకుల ద్వారా 80 దేవాలయాల కూల్చివేతకు సంబంధించిన రికార్డులు మాత్రమే ఉన్నాయి. కానీ అంతకంటే ఎక్కువ దేవాలయాలను హిందూ పాలకులు కూడా కుల్చారన్న వాస్తవాన్ని పేర్కొన్నాడు. 

చరిత్రలో గమనిస్తే.. ఒక్క ముస్లిం పాలకులు మాత్రమే కాదు హిందూ పాలకులు సైతం అనేక దేవాలయాలు పడగొట్టేసిన చరిత్ర ఉంది. ఇంతకూ హిందూ పాలకులు హిందూ దేవాలయాలను ఎందుకు కుల్చారు? అన్నది గమనిస్తే..

మధ్య యుగాల్లో ఒక రాజ్యం మరో రాజ్యాన్ని జయించినప్పుడు ఓడిపోయిన రాజ్యం యొక్క రాజ్య దేవతను, ధ్వంశం చెయ్యాటమో, తరలించుకుపోయి తమ రాజ్యంలో కలుపుకునేవారు. అలా చెయ్యటం యుద్ధాన్ని నెగ్గటానికి, వారి రాజ్యాన్ని తమ రాజ్యంలో కలుపుకోవటానికి సంకేతంగా (Symbolic) భావించేవారు. ఆ విధంగా రాజ్యాలకు రాజ్యాలకూ మధ్య జరిగిన అనేక యుద్ధల్లో ఒక్క ముస్లిం రాజులే కాదు అనేక హిందూ రాజులు సైతం ఆలయాలను ధ్వంశం చేసిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. అదంతా కేవలం అప్పటి రాజ్యకాంక్ష తాలూకు యుద్ధోన్మాదమే తప్ప మతోన్మాదం కాదు. ఉదాహరణకు:   

642 CE లో పల్లవ రాజైన నరసింహవర్మన్  చాళుక్యులను నిర్మూలించి, వారి రాజధాని వతాపిని కొల్లగొట్టి, అలయ ధ్వంసం చేసి గణేశుడి బొమ్మను తమిళనాడులోని తన రాజ్యానికి తీసుకుపోయాడు.  

10 వ శతాబ్దం ప్రారంభంలో, రాష్ట్రకూట రాజు ఇంద్ర III కళాప్రియ ఆలయాన్ని ధ్వంసం చేశాడు.  

కళింగరాజ్యాన్ని మగధరాజులు జయించినపుడు రిషభనాథుని విగ్రహాలను ఎత్తుకుపోగా, ఆ తరువాత ఖారవేలుడు అనే కళింగరాజు మగధసామ్రాజ్యంపై దండెత్తి ఆ విగ్రహాలను తిరిగి తెచ్చుకొన్నట్లు క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన హతిగుంఫ శాసనం ద్వారా తెలుస్తున్నది.

పదకొండవ శతాబ్దానికి చెందిన రాజేంద్ర చోళుడు దండయాత్రలలో ఆలయాలు ధ్వంసం చేసి..  చాళుక్యరాజ్యం నుంచి గణేష, కళింగులనుంచి భైరవ, భైరవి, తూర్పు చాళుక్యుల నుంచి నంది, బెంగాలు నుంచి శివుని విగ్రహాలను తరలించుకొని వచ్చాడు.

గుజరాత్ లో పరమర వంశానికి చెందిన రాజులు అనేక జైన ఆలయాలను ధ్వంసం చేసారు. 

కృష్ణదేవరాయలు ఉదయగిరిని జయించి అక్కడ బాలకృష్ణుని విగ్రహాన్ని, పండరిపురాన్ని ఆక్రమించుకొని విట్టలనాథుని విగ్రహాన్ని ఎత్తుకొనిపోయి విజయనగరంలో ప్రతిష్టించుకొన్నాడు.

1579 లో గోల్కొండనవాబు వద్ద పనిచేసే మరాఠి బ్రాహ్మణుడైన మురహరిరావు రాయలసీమ ప్రాంతాలను గోల్కొండరాజ్యంలో కలిపే యత్నంలో అహోబిలం నరసింహస్వామి ఆలయంలోని విగ్రహాన్ని గోల్కొండకు తరలించుకొనిపోయాడు.

టిప్పూసుల్తాన్ పాలనలో శ్రీరంగ పట్నం పై మరాఠా రాజులు దాడి చేసి అక్కడ ఉన్న శృంగేరీ దేవాలయాన్ని కూలగొట్టి దేవీ శారదా విగ్రహాన్నీ అందులో సంపదనూ దొచుకెళ్లిపోయారు. తిరిగి ఆ దేవాలయాన్ని టిప్పూసుల్తాన్ పునరుద్ధరించటం జరిగింది. 

ఈ విధంగా చరిత్రలో అటు ముస్లిం రాజులే కాక ఇటు హిందూ రాజులు సైతం ఎన్నో దేవాలయాలను కూల్చేసిన సంఘటనలు కోకొల్లలు. అలాగే ఎందరో ముస్లిం పాలకులు హిందూ దేవాలయాల నిర్మాణాలకు భారీ విరాళాలు ఇచ్చిన, దేవాలయాలు కట్టించిన, పునరుద్ధరించిన చరిత్ర ఉంది. ఈ చరిత్ర నేడు మరుగుపరచబడింది.  అలాగే మధ్యయుగాల్లో పాలించిన హిందూ, ముస్లిం పాలకుల్లో కొందరు మంచివారూ ఉన్నారు. క్రూరంగా పరిపాలించినవారూ ఉన్నారు. కానీ, చరిత్రలో ఒక్క ముస్లిం పాలకులనే క్రూరులుగా హిందూ వ్యతిరేకులుగా నేడు చిత్రీకరించటం జరుగుతుంది. చరిత్రలో కేవలం ఒక్క ముస్లిం పాలకులు మాత్రమే దేవాలయాలు పడగొట్టేశారని చెప్పి ముస్లిం సమాజం పట్ల ధ్వేషాన్ని రగిలించటం జరుగుతుంది. 

చరిత్రలోని పై వాస్తవాలను తెలుసుకోకుండా ముస్లిములు మతోన్మాదంతో హిందూ దేవాలయాలు పడగొట్టేశారని సోషల్ మీడియాలో ప్రచారాలు చెయ్యటం కేవలం మూర్ఖత్వం మరియు అజ్ఞానం మాత్రమే అవుతుంది.    

✍️ రచయిత-ఎం.డీ.నూరుద్దీన్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: