మన ఓటు ఉద్దేశం నెరవేరుతోందా....?

పక్కదారి పడుతున్న ఎన్నికల మేనిఫెస్టోలు

అధికారంలోకి వచ్చాక పార్టీలు పట్టించుకోవు...మనం ప్రశ్నించము

ఇక పార్టీలు హామీలు ఇవ్వడం దేనికి...దానిని మనం వినడం దేనికి...?


మన భారత రాజ్యాంగ ప్రతి భారతీయుడికి ఓటు ఎందుకు ఇచ్చింది...మన దేశం ప్రజాస్వామ్య దేశం అని ఎందుకు పిలుస్తారు...? ఈ ప్రశ్న కొంత వింతగా కనిపించినా ప్రస్తుత పరిస్థితుల్లో అడగకతప్పని పరిస్థితి ఓ సగటు భారతీయుడిగా నా ఆవేదన మరి. ఎందుకంటే నేను ఒకడినే ప్రశ్నించడం ద్వారా మన దేశ రాజకీయ వ్యవస్థలో మార్పు రాదు. ప్రతి ఒక్క ఓటరు ఈ విషయంలో ఆలోచించి ప్రశ్నించినపుడే అగ్రదేశాల సరసన నిలిచే అర్హతవున్న నా భారతదేశం మరింత పురోగతి సాధిస్తుంది. మన దేశ రాజకీయ వ్యవస్థకు...అగ్రదేశాల జాబితాలో ఉన్న దేశ రాజకీయాలకు మధ్య ఉన్న తేడాను మనం గమనించాలి. మన దేశం ప్రపంచంలో అగ్రదేశంగా ఎదగాలంటే ప్రతి భారతీయుడి ఆలోచన విధానం కూడా అంతే ప్రగతిపథంగా ఉండాలి. 

మన రాజ్యాంగం మనకు ఓటు ఎందుకు ఇచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఏ మాత్రం సంకోచించకుండా చెప్పేది మనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం. మరి ప్రజాస్వామ్యం అంటే ఏమిటీ అని ప్రశ్నిస్తే.... ప్రజల చేత, ప్రజల కోరకు, ప్రజల యెక్క ప్రయోజనాల కోసం పనిచేసేది అని మనం అంటాం. వాస్తవానికి ఇపుడు మన జాతీయ, రాష్ట్ర రాజకీయాలు అలా సాగుతున్నాయా...? ప్రభుత్వాన్ని నడపాల్సిన ఓటర్లు...అధికార పార్టీలు వేసే వలలో చిక్కుకొని వారి మార్గంలో నడుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని ప్రతి ఓటరు తన ఓటు విలువను కాపాడుకొంటున్నాడా...? ప్రజాస్వామ్య దేశంగా ఉన్న మన దేశాన్ని ప్రతి ఓటరు దానిని కాపాడుకొంటున్నాడా లేక తనే ఓటు ను అస్త్రసన్యాసం చేసి నియంత పాలనలోకి వెళ్తున్నాడా అన్నది ఇపుడు ఆలోచించాల్సిన తరుణం.

ప్రగతి చెందిన దేశాల ఆలోచన విధానం ఇలా 

ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్‌ కీలక నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్రను ప్రదర్శిస్తున్నారు. ఇటీవల 15 కీలక కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేసిన బైడెన్‌.. తాజాగా కరోనాతో దెబ్బతిన్న అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేలా సరికొత్త ప్యాకేజీని ప్రకటించారు. ఈ మేరకు 1.9 ట్రిలియన్‌ ‌డాలర్ల (సుమారు రూ.138.88 లక్షల కోట్లు) ప్యాకేజీకి సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేసినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ‘ద అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌’ పేరుతో ప్రకటించిన ఈ భారీ ప్యాకేజీ ద్వారా కరోనా మహమ్మారితో అల్లాడుతున్న ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగించనుంది. దీంతో అమెరికాలో ఒక్కో పౌరుడి బ్యాంకు ఖాతాలో 2 వేల డాలర్లు చొప్పున జమకానున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో తీవ్ర అవస్థలు పడుతున్న పౌరులకు ఇప్పటికే చెల్లించిన 600 డాలర్లు సరిపోవని బైడెన్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రజలను ఆకలితో ఉండబోనీయమని స్పష్టంచేశారు. అద్దె ఇళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయడంపైనా ఆంక్షలు విధించాలని ఆదేశించారు. ఈ ప్యాకేజీలో భాగంగా 2,000 డాలర్లను ప్రత్యక్ష చెల్లింపుల ద్వారా ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. తన ప్రమాణస్వీకారానికి ముందే ఈ నెల 15న బైడెన్‌ అమెరికా ఆర్థిక పునరుత్తేజానికి భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొని, మందగించిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టడమే లక్ష్యంగా ఈ భారీ ప్యాకేజీని ఆవిష్కరించారు.  1.9 ట్రిలియన్‌ డాలర్లను తమ ప్రభుత్వంలో వెచ్చిస్తామన్నారు. ఈ నిధులతో కరోనా పరీక్షల నిర్వహణ, టీకా కార్యక్రమాలతో పాటు.. పౌరులకు నేరుగా ఆర్థిక సాయం, చిరు వ్యాపారులకు అండగా నిలవడం వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నిరుద్యోగ భృతి, అధిక సమయం పనిచేసేవారి కనీస వేతనాల పెంపునూ ఈ ‘అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌’లో ప్రస్తావించారు. కరోనా సృష్టించిన సంక్షోభంతో 1.8కోట్ల మంది అమెరికన్లు ఇప్పటివరకు ఇంకా నిరుద్యోగ బీమాపైనే ఆధారపడుతున్నారు. అంతేకాకుండా దాదాపు 4 లక్షల చిన్న చిన్న వ్యాపార సంస్థలు శాశ్వతంగా మూతపడ్డాయి. జో బైడెన్‌ ఎన్నికల ప్రచారంలో ఈ రకంగా నగదు బదిలీ చేస్తానని హామీ ఇవ్వలేదు. తాను అధికారంలోకి వచ్చాక తన దేశ ప్రజల పరిస్థితి చూసి స్వయంగా నిర్ణయం తీసుకొన్నారు.

మన దేశంలోని పరిస్థితి ఎలా....?

గత 2014 ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ దేశమంతా కలియతిరిగి స్వీస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదోడి ఖాతాలో రూ.15ల వేస్తానని హామీ ఇచ్చారు. ఆ మామీ ఎక్కడా అమలులో కనిపించలేదు. అయినా మోడీ నాయత్వంలోని ప్రభుత్వం 2019లో తిరిగి అధికారంలోకి వచ్చింది. అయినా జనామోదం దక్కిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మోడీ చేసిన హామీని ఓటరు ఎందుకు ప్రశ్నించడంలేదు. రాజకీయ పార్టీలు చేసే హామీలను ఓటరు ప్రశ్నించనపుడు ఇక ఆ పార్టీలు విడుదల చేసే ఎన్నికల మేనిఫెస్టోలను చెవులు పెద్దవిగా చేసుకొని వినడం ఎందుకు...ఆ మేనిఫెస్టోల వార్తలు కళ్లు పెద్దవిగా చేసి చదవడం ఎందుకు...? ఓటు అనే శక్తితో పార్టీలను, ప్రభుత్వాలను నడపాల్సిన ఓటరు తానే స్వయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఆడే నాటకంలో భాగస్వామ్యం అవుతున్నాడు. మోడీ ప్రభుత్వానికి నగదు బదిలీ హామీపై అడగకుండా ఆ ప్రభుత్వం ఎన్నార్సీ, ఎన్సీఆర్, సీఏఏ చట్టాల నేపథ్యంలో దేశంలోని సమూహం రెండుగా విడిపోయే ప్రమాదం ఏర్పడింది. ప్రతి చోట మతం పేరుతో దాడులు, కులం పేరుతో రాజకీయాలు.  ఇవి భారతీయుల జీవితాల్లో మార్పు తెస్తాయా ఓ సారి ఆలోచించాలి.

✍️ రచయిత-సయ్యద్ నిసార్ అహ్మద్

జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం

జాతీయ అధ్యక్షులు

సెల్ నెం-780 101 9343


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: