ఎందుకీ పేచీ....?

పంచాయతీ తెగేనా....?

అటు ఇటు పంతం..

గత కొన్ని రోజులుగా ఏపీలో ఎన్నికల వార్

ఎన్నికల నిర్వాహణపై ముందుకు ఎస్ఈసీ నిర్ణయం

ససేమీరా అంటున్న ఏపీ ప్రభుత్వం

ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల బాసటా....?

ఎస్ఈసీ నిర్ణయానికి ప్రతిపక్షాల మద్దతు

నాలుగు దశల ఎన్నికలకూ ఒకేసారి నోటిఫికేషన్‌ ఇచ్చిన ఎస్‌ఈసీ

ఎన్నికలు సాధ్యం కాదంటున్న ప్రభుత్వ ఉన్నతాధికారులు

టీకా వేయనిదే విధుల్లో పాల్గొనేది లేదన్న ఉద్యోగ సంఘాలు

ఏపీ పోలీస్ అధికారుల సంఘంది అదే మాట 

ఎన్నికల్ని అడ్డుకుంటే మూల్యం తప్పదు-ఎస్ఈసీ

సుప్రీంకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి...?

(జానోజాగో వెబ్ న్యూస్-పొలిటికల్ బ్యూరో)

ఎపుడూ హాట్ హాట్ టాపిక్ రాజకీయాలతో వేడెక్కే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు తీవ్ర చర్చాంశనీయంగా మారాయి. ప్రస్తుతం ఇవి ఏపీని అగ్నిగుండంగా మార్చుతున్నాయి. ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకోగా వాటికి ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. కరోనా పూర్తిగా అంతరించని ప్రస్తుత తరుణంలో ఎన్నికలు వదేవద్దు అని ప్రభుత్వం చెబుతోంది. ఈ వాదనకు ఉద్యోగ సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ఇలా ఏపీలో ఎస్ఈసీ, ప్రతిపక్షాలు ఒకవైపు...ప్రభుత్వం...ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మరోవైపు అన్నట్లుగా రెండుగా చీలిపోయాయి. ఈ పరిస్థితుల్లో అసలు స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తిగా మారింది.

పంచాయతీ ఎన్నికలపై ప్రతిష్టంభన తొలగలేదు. ఉత్కంఠకు తెరపడలేదు. ఎన్నికల సంఘం వెనకడుగు వేయలేదు. ప్రభుత్వం పట్టు వీడలేదు. ముందు చెప్పినట్టుగానే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ శనివారం పంచాయతీ ఎన్నికల నాలుగు దశలకూ ఒకేసారి నోటిఫికేషన్‌ జారీ చేశారు. దాన్ని ప్రభుత్వం లెక్క చేయలేదు. ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదన్న వైఖరి¸ పునరుద్ఘాటించింది. ఎస్‌ఈసీ తలపెట్టిన వీడియో సమావేశానికి అధికారులంతా ముఖం చాటేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎస్‌ఈసీపై విమర్శల జోరు మరింత పెంచారు. టీకా వేయకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న ఎస్‌ఈసీ ఎన్నికలను అడ్డుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగసంఘాల వైఖరినీ తప్పుబట్టారు. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం మాత్రం తన వైఖరిని వీడలేదు. ఎస్‌ఈసీ వీడియో సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా అధికారులెవరూ వెళ్లలేదు సరికదా, జిల్లా కలెక్టర్లనూ వెళ్లనివ్వలేదు. తాజా పరిణామాలపై ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో సీఎం జగన్‌ చర్చించినట్లు సమాచారం. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కానున్న తరుణంలో అందరి చూపూ సుప్రీంకోర్టు వైపే ఉంది. ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సోమవారం విచారించనున్న సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలావుంటే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ శనివారం ఉదయం విడుదల చేశారు. 4 దశల ఎన్నికలకూ కలిపి ఒకే నోటిఫికేషన్‌ ఇచ్చారు. ప్రతి దశకూ విడివిడిగా నోటిఫికేషన్‌ ఇస్తామని గతంలో ఎన్నికల సంఘం తెలిపింది. దానికి భిన్నంగా.. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో జరిగే ఎన్నికలకు ఒకే నోటిఫికేషన్‌ జారీ చేశారు. తొలి విడతలో 11 జిల్లాల్లోని 14 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉన్న 146 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో తొలి విడతలో ఎన్నికలు జరగడం లేదు. తమ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 34 మండలాలే ఉన్నాయని, ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా 3, 4 దశల్లో నిర్వహించాలని విజయనగరం కలెక్టరు కోరినట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఎన్నికల ఏర్పాట్లకు కొంత సమయం కావాలని, తమ జిల్లాను తొలి విడతలో చేర్చవద్దని ప్రకాశం జిల్లా కలెక్టరు కోరినట్లు వెల్లడించాయి. ప్రకాశం జిల్లాలో 2, 3, 4 దశల్లోనూ, విజయనగరం జిల్లాల్లో 3, 4 దశల్లోనూ ఎన్నికలు నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలన్న ఎస్‌ఈసీ ఆదేశాల్ని ప్రభుత్వం అమలు చేయనందున.. ఆ 2 జిల్లాల్లో తొలి దశలో ఎన్నికలు ఉండవని అధికార వర్గాల్లో శుక్రవారం విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఆ 2 జిల్లాల్లోని పంచాయతీలకు తొలి విడతలోనే ఎన్నికలు జరపాలని చివరి క్షణంలో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఒక మండలం మినహా.. రాష్ట్రంలో 659 మండలాలున్నాయి. వాటిలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం గ్రామీణ మండలం మినహా మిగతా అన్ని మండలాల్లోని పంచాయతీలకూ 4 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. రాజమహేంద్రవరం గ్రామీణ మండలాన్ని నగరపాలక సంస్థలో విలీనం చేసే ప్రతిపాదన ఉన్నందున ఎన్నికలు నిర్వహించట్లేదని అధికారులు తెలిపారు.

నిమ్మగడ్డకు సహాయనిరాకరణ...ఈసారి ఏపీ పోలీస్ అధికారుల వంతు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం ససేమిరా అంటోంది. అయినా సరే ఎన్నికలు నిర్వహించి తీరుతాం అని పట్టిన పట్టు విడవకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడుగులు వేస్తున్నారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరొకసారి పునరాలోచించాలి : ఏపీ పోలీస్ అధికారుల సంఘం

ఇదే సమయంలో ఎన్నికల విధులను చెయ్యలేమని, తమ ప్రాణాలను పణంగా పెట్టలేమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఏపీ పోలీస్ అధికారుల సంఘం కూడా ఎన్నికలపై విముఖతను వ్యక్తం చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరొకసారి పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సహాయనిరాకరణ కొనసాగుతుంది.

ఎస్ఈసీ వైఖరి ఇలా....

ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సమస్యల్ని ఎప్పటికప్పుడు గవర్నరు, న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి, రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాం. ఇది నా వ్యక్తిగత నిర్ణయం కానేకాదు. నాకున్న రాజ్యాంగ బాధ్యతల్ని మాత్రమే నిర్వహిస్తున్నా. ఇకపైనా అలాగే వ్యవహరిస్తామని ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ స్పష్టంచేశారు. పంచాయతీ ఎన్నికల్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే దానికి ప్రభుత్వ వ్యవస్థే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఎస్ఈసీ స్పష్టంచేసింది. ‘ఎన్నికలు జరపాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత పూర్తిగా ప్రభుత్వంపైనే ఉంది. ఎన్నికల సంఘంలో వేళ్లమీద లెక్కించదగ్గ సంఖ్యలోనే సిబ్బంది ఉంటారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగుల ద్వారా జిల్లా కలెక్టర్లు ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి అవరోధాలు ఎదురైనా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిది, ప్రభుత్వ యంత్రాంగానిదే. ఎన్నికలకు అవరోధం కలిగించేందుకు ఎవరు ప్రయత్నించినా దానిపై గవర్నరుకు నివేదిక అందజేస్తా. సోమవారం కేసు విచారణ సందర్భంగా.. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉందని సుప్రీంకోర్టుకూ నివేదించాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోవడం లేదు. అవసరమైతే నివేదిస్తాను. ఉన్న పరిస్థితుల్ని దాచలేను’ అని ఆయన స్పష్టం చేశారు. అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, అవరోధాలన్నీ అధిగమించి ఎన్నికలు జరపాలన్న కృత నిశ్చయంతో, జరపగలమన్న నమ్మకంతో ఎన్నికల సంఘం ఉందన్నారు. సోమవారం సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తుంది కాబట్టి ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి సహేతుకంగా లేనందునే తిరస్కరించామన్నారు.

కరోనా వైరస్ వచ్చాక దేశంలోని పలు ప్రాంతాల్లో అసెంబ్లీ, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి..

కరోనా మొదలైన కొత్తలో 8-2-2020న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మినహాయిస్తే...

1. బీహార్‌ - 28-10-2020 నుంచీ 07-11-2020 వరకూ మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు

2. మధ్యప్రదేశ్‌ -  28 అసెంబ్లీ స్థానాలకు 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు

3. గుజరాత్‌లో - 8 అసెంబ్లీ స్థానాలకు 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు

4. ఉత్తరప్రదేశ్‌లో - 7 అసెంబ్లీ స్థానాలకు 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు

5. మణిపూర్‌లో - 4 అసెంబ్లీ స్థానాలకు 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు

6. జార్ఖండ్‌లో - 2 అసెంబ్లీ స్థానాలకు 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు

7. కర్ణాటకలో - 2 అసెంబ్లీ స్థానాలకు 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు

8. నాగాలాండ్‌లో - 2 అసెంబ్లీ స్థానాలకు 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు

9. ఒడిశాలో - 2 అసెంబ్లీ స్థానాలకు 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు

10. ఛత్తీస్‌గఢ్‌లో - 1 అసెంబ్లీ స్థానానికి 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు

11. హర్యానాలో - 1 అసెంబ్లీ స్థానానికి 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు

12. తెలంగాణ- దుబ్బాక అసెంబ్లీ స్థానానికి 03-11-2020న జరిగిన ఉప ఎన్నిక

13. 7-11-2020న బీహార్ లోని వాల్మీకి నగర్ ఎంపీ ఉప ఎన్నిక

 14. డిసెంబర్ 22, 27న కర్నాటకలో జరిగిన స్థానిక ఎన్నికలు

15. 11-12-2020.. రాజస్థాన్ లోని జైపూర్ లో అర్బన్ స్థానిక సంస్థల ఎన్నికలు

16. డిసెంబర్1, 2020న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు

17. డిసెంబరు 8 నుంచి 14 వరకు కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు 

18. డిసెంబరు 22,27, 2020 కర్నాటక స్థానిక సంస్థల ఎన్నికలు.

వచ్చే నెలలో తెలంగాణ లో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక, ఏపీ లో తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక..

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: