మతోన్మాదంపై ఉక్కుపాదం మోపిన సూపర్ కాప్

దేశభక్తికి నిలువెత్తు రూపం...సూపర్ కాప్ గా దేశానికి ఎనలేని సేవలు

అసమాన కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకొన్నఇమ్దాద్ అలీ

అందుకే ఆయన్ని విభజన సమయంలో...పట్టుబట్టి ఇండియాలోనే ఉంచుకొన్నారు

ఇమ్దాద్ అలీ

ప్రతి ముస్లిం తాను పుట్టిన గడ్డను అమీతంగా ప్రేమిస్తాడు...ఎందుకంటే అతడికి ఇస్లాం అదే హితబోధ చేసింది. ఇది అన్ని ప్రాంతాల్లోని ముస్లింలకు వర్తిస్తుంది. భారతీయ ముస్లింలకు వర్తిస్తుంది. అందుకే భారతదేశమంటే, భారత భూమి అంటే అంతే అమీతంగా భారతీయ ముస్లింలు ప్రేమిస్తారు. దీనికి కొలమానం సందర్భం వచ్చినపుడల్లా బట్టబయలైంది. అలాంటి దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం...నాటి భారతదేశానికి అవసరమైన అవసరాన్ని తీర్చగలిగే శక్తి ఇమ్ధాద్ అలీ. మంచి పరిపాలకులుగా, సమర్థత కలిగిన అధికార్ల అవసరమున్న భారతదేశానికి ఆయన ఓ వరమయ్యారు. తన సేవల ద్వారా భారతదేశ గడ్డ రుణం తీర్చుకొన్నారు. మత విద్వేషాలను ఆదిలో అణిచేస్తేనే దేశంలో మతసామరస్యం సాధ్యమని భావించిన మహోన్నతుడు. తన సర్వీసులో దానినే పాటించి మతోన్మాదంపై ఉక్కుపాదం మోపి అణిచేసిన యోధుడు ఇమ్ధాద్ అలీ. మనం 1962 లో భారత దేశం పై చైనా దురాక్రమణ జరిపినప్పుడు అస్సాం శాంతి బద్రతలను కాపాడటం లో విశేష కృషి చేసిన అస్సాం పోలీసులను,  అప్పటి అస్సాం పోలిస్ ఐ.జి.(ASSAM POLICE IG) గా పనిచేసి, అస్సాం సూపర్ కాప్ గా పేరుపొందిన   ఇమ్దాద్ అలీ ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలను, పరిపాలన దక్షతను ప్రస్తుత పరిస్థితుల్లో మరసారి స్మరించుకోవాల్సివుంది.

1913 లో జన్మించిన ఇమ్దాద్ అలీ జోర్హాట్ కు చెందిన ఐమన ఖాతూన్ (Aimana Khatun), ఖాన్ బహదూర్ కరామత్ అలీ దంపతుల ద్వితీయ సంతానం. జోర్హాట్ లో ప్రాధమిక విద్యను, కలకత్తా లో ఉన్నతవిద్యను అభ్యసించిన తరువాత ఆనాటి ఇంపీరియల్ పోలిస్ సర్వీసు కు 1937 లో ఎంపికయ్యారు. అస్సాం నుండి ఇంపీరియల్ పోలిస్ సర్వీసు కు ఎన్నికైన తోలి, చివరి  వ్యక్తి ఇమ్దాద్ అలీ.

రెండోవ ప్రపంచ యుద్ధం ఆరంభమైన వేళ అస్సాం లాంటి సరిహద్దు రాష్ట్రాలలో శాంతి భద్రతలను చక్క దిద్దుటకు యోగ్యులైన, పరిపాలన దక్షులైన అధికారుల అవసరం ప్రభుత్వానికి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులలో  పోలిస్ సర్విస్ లో చేరిన ఏడూ నెలలలోపే సదియ (Sadiya) ప్రాంతానికి ఇమ్దాద్ అలీ  అసిస్టెంట్ పొలిటికల్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. కొలది కాలంలోనే పొలిటికల్ ఆఫీసర్ గా పదోన్నతి పొందారు. ఈ సమయం లో యుద్ద కారణంగా బర్మా నుండి వచ్చిన భారతీయ శరణార్దుల తరలింపును ఇమ్దాద్ అలీ  పర్యవేక్షించారు.1942-45 మద్య ప్రసిద్ది చెందిన స్టిల్ వెల్ రోడ్ (stillwell road)నిర్మాణ పనులను సమర్ధవంతంగా నిర్వహించారు.

 1946-47 మధ్య దేశవిభజన జరుగుతున్నప్పుడు,  ఆస్తుల-అప్పులు-ఉద్యోగుల పంపకములు భారత్-పాకిస్తాన్ మద్య జరుగుతున్న సమయం లో ఇమ్దాద్ అలీ పేరు అతనికి తెలియకుండానే పాకిస్తాన్ కు కేటాయించబడిన అధికారుల జాబితా లో చేరింది. ఆ నాటి అస్సాం ముఖ్య మంత్రి గోపీనాథ్ బార్డోలీ చొరవ తీసుకోని తన పలుకుబడిని ఉపయోగించి ఇమ్దాద్ అలీ పేరును భారత దేశమునకు కేటాయించిన అధికారుల జాబితాలో చేర్పించారు. ఇమ్దాద్ అలీ సమగ్రత, వ్యక్తిత్వం, పాలనా సామర్ద్యంపై మంచి నమ్మకం  ఆ నాటి అస్సాం ముఖ్య మంత్రి గోపీనాథ్ బార్డోలీకి ఉండేది. ఆ నమ్మకాన్ని సైతం ఇమ్దాద్ అలీ అనునిత్యం కాపాడుకొంటూ వచ్చారు. 

1947 లో భారత దేశానికి స్వాతంత్రం లబించినప్పుడు ఇమ్దాద్ అలీ నాగా హిల్స్ ప్రాంతానికి మొదటి భారతీయ కమిషనర్ గా నియమితులయ్యారు. 1948 లో తన మాతృ సంస్థ అస్సాం పోలిస్ కు తిరిగివచ్చి1962 లో  అస్సాం పోలిస్ ఐ.జి.పి.గా నియమితులయ్యారు. ఆ రోజులలో ఐ.జి.పి.(IGP) స్థానం రాష్ట్ర పోలిస్ దళం లో ఉన్నతమైన స్థానం. ఆ రోజులలో డి.జి.పి. (DGP)పదవి లేదు. ఆప్పట్లో అస్సాం విభజన జరుగ లేదు. అస్సాం నాగా హిల్స్ నుంచి లుషై హిల్స్ వరకు, సదియ నుంచి ఖాసి –గారో హిల్స్ వరకు విస్తరించిఉంది.

1964 లో ఇమ్దాద్ అలీ కేంద్ర ప్రభుత్వ హోం శాఖ కు డేప్యుట్ చేయబడి 1965 లో గుజరాత్ ఐ.జి.పి గా నియమితులయ్యారు. అస్సాంకు  చెందిన పోలిస్ ఆఫీసర్ బయట రాష్ట్రం లో ఐ.జి.పి. గా నియమింపబడిన తోలి పోలిస్ అధికారి ఇమ్దాద్ అలీ. గుజరాత్ ఐ.జి.పి. పదవిని నిర్వహిస్తున్న మొదటి సంవత్సరం 1965 లో భారత-పాకిస్తాన్ మద్య యుద్ధం సంభవించినది. పాకిస్తాన్ దళాలు గుజరాత్ లోని రాన్ అఫ్ కచ్  (rann of kutch) ప్రాంతం లో భారిఎత్తున చొరబాటులకు ప్రయత్నించసాగాయి. గతం లో అస్సాం సరిహద్దులలో పనిచేసిన అనుభవం వలన ఇమ్దాద్ అలీ పాకిస్తాన్ చొరబాటుదారుల ప్రయత్నాలను సమర్ధవంతంగా అడ్డుకోగలిగారు. చొరబాటుదారులను అరికట్టినందుకు గాను అతని సేవలకు మెచ్చి  అతనికి పతాకము కూడా ఇవ్వబడినది. గుజరాత్ లో ఉన్న నాలుగున్నర సంవత్సరాల పదవి కాలం గుజరాత్ లో మతకల్లోలాలు లేకుండా  ఆయన చూడగలిగారు. ఇది అతని పోలిస్ పరిపాలనా సామర్ద్యం కు మచ్చుతునక. ఇమ్దాద్  అలీ అబిప్రాయంలో మతకల్లోలాను అరికట్టుటకు సరియిన మార్గం వాటిని మొదట్లోనే తుంచివేయడం, సంభవించిన తరువాత మతకల్లోలాను ఎదుర్కోవడం లో ప్రయోజనం లేదు.

1969 లో డిల్లి కి తిరిగి వచ్చి సి.ఆర్.పి.ఎఫ్. మొదటి డైరెక్టర్ జనరల్(DG) గా నియమింపబడినాడు. ఆ రోజులలో పోలిస్, ఇంటలిజెన్స్ సంస్థలు అన్నింటికీ కలిపి 4 గురు _(రా,సిబిఐ,బిఎసేఫ్, సిఆర్పిఎఫ్) డిజి లు ఉండేవారు. సిఆర్పిఎఫ్ డిజి గా నియమింప బడిన తరువాత సిఅర్పిఎఫ్ కేంద్రీయ కాంప్లెక్స్ ను న్యూడిల్లీలో మరియు దేశవ్యాప్తంగా సిఆర్పిఎఫ్ 12 గ్రూప్ సెంటర్లు స్థాపించుటలో ప్రధాన పాత్ర వహించారు  ఇమ్ధాద్ అలీ. అస్సామ్ రాజధాని గౌహాతి సమీపం లో ఒక సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్ నిర్మించుటలో ప్రధాన భూమిక వహించారు.

సిఆర్పిఎఫ్ డిజి గా నియమింపబడిన తరువాత సిఆర్పిఎఫ్ పనివిధానం లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారయన. సిబ్బందిని దూరప్రాంతాలకు త్వరితగతిన  తరలించుటకు వీలుగా   సిఆర్పిఎఫ్ కు  అవసరమైన ఆపరేషనల్ వెహికిల్స్ ఏర్పాటు చేశారు. డిల్లి నుంచి పశ్చిమ బెంగాల్ లోని నక్సలైట్ సమస్యను ఎదుర్కోవడంలో తగు సహాయ సహకారాలు అందించారు ఆయన.

ఉద్యోగ విరమణ అనతరం అస్సాం కు తిరిగి వచ్చే ఆలోచన ఉన్నప్పటికీ స్నేహితులు, సహచర అధికారుల వత్తిడి వలన డిల్లి లోనే ఉండిపొయారు ఇమ్దాద్ అలీ. త్వరలో యెమెన్ దేశానికి రాయబారి గా నియమింపబడ్డారు. భారత దేశం నుంచి ఇతరదేశానికి రాయబారిగా నియమింప బడిన మొదటి పోలిస్ అధికారి, మొదటి అస్సాం వాసి గా ఇతనిని పేర్కొనవచ్చును.

ఒక నిజాయతి పరుడు, సమర్ధత కలిగిన అధికారి, పోలిస్ అధికారిగా ఇతనంటే ప్రధాని ఇందిరా గాంధీ కి ప్రత్యేక అభిమానం . 70వ దశకంలో యెమెన్ దేశం  గల్ఫ్ ప్రాంతానికి వాకిలిగా పరిగణించబడేది. అక్కడ స్థావరం ఏర్పరచుకోవడానికి అమెరిక, రష్యా ఇతర సూపర్ పవర్ దేశాలు ప్రయత్నిస్తున్న రోజుల్లో, అలాంటి పరిస్థితులలో యెమెన్ లో భారత దేశ ప్రయోజనాలను కాపాడటానికి, అక్కడ జరుతున్న పరిస్థితులను భారతదేశానికి వివరించడానికి ఇమ్దాద్ అలీ వంటి  ఒక సమర్ధుడైన అధికారి అవసరం కేంద్ర ప్రభుత్వానికి నాడు ఉండేది. 

యెమెన్ నుంచి రాయబారిగా తిరిగి వచ్చిన తరువాత అమ్దాద్ అలీ అస్సాం జైలు సంస్కరణల కమిషన్ చైర్మన్ గా, అస్సాం పోలిస్ సర్వీసెస్ రిఫార్మ్స్ కమిషన్ చైర్మన్ గా పనిచేశారు. ఆతరువాత యు.పి.ఎస్.సి. మెంబర్ గా కొనసాగారు. తను అందించిన విశిష్ట సేవలకు గాను రాష్ట్రపతి పోలిస్ మెడల్, ఫైర్ సర్వీసెస్ మెడల్ పొందారు. భారత రాష్ట్రపతి కి సహాయకునిగా (ఎడిసి-Aide De-Camp)గా కూడా వ్యవహరించారు.

తన యవ్వనం లో ఇమ్దాద్ అలీ పేరుగల నటునిగా, క్రీడా కారునిగా మంచి పేరు సంపాదించారు. ఇమ్దాద్ అలీ  వివాహం నాటి అస్సాం ముఖ్యమంత్రి (1937-45) గా పనిచేసిన సర్ మొహమ్మద్ సాదుల్లా కుమార్తె సయీద తో జరిగింది. వీరికి ఇరువురు కుమారులు. వారిలో ఒకరు అబూ అలీ  బ్రిటన్ లో బ్యాంకర్. రెండో కుమారుడు  ఇఫ్జల్ అలీ ఆసియా డవలప్మెంట్ బ్యాంక్ లో చీఫ్ ఎకనామిస్ట్. 

1994 లో మనిలా లో తన రెండోవ కుమారుని వద్ద ఇమ్దాద్ అలీ మరణించెను. జోర్హాట్ లో  విద్యావాప్తికి గాను వీరి పేర “ఇమ్దాద్ అలీ మెమోరియల్ ట్రస్ట్” ఏర్పాటు చేయబడినది. విద్యలో ముందున్న ప్రతిభావంతులైన, అవసరం ఉన్న విద్యార్ధులకు వీరి పేర స్కాలర్ షిప్ అందిచబడుచున్నవి.

భవిష్యత్ తరాల వారికి మార్గదర్సకుడైన ఇమ్దాద్ అలీ సదా చిరస్మరణియుడు.

✍️ రచయిత-మహమ్మద్ అజ్గర్ అలీ 

రాజనీతి తత్వ శాస్త్ర విశ్రాంత అధ్యాపకులు

సెల్ నెం-94915-01910


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: