జీవో నెంబర్ 77 ను తక్షణమే రద్దు చేయాలి
ఎఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగ రాముడు
మాట్లాడుతున్న ఎఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగ రాముడు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
రాష్ట్రంలోని ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన రద్దును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగ రాముడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్, ఎయిడెడ్, పీజీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు రద్దు చేయడం సరైంది కాదన్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కూడా రద్దు చేయడం సమంజసం కాదన్నారు.
అందుకోసం జారీ చేసిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2020- 21 సంవత్సరం నుండి బోధనా ఫీజుల ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం పేద, మధ్య తరగతి విద్యార్థులను పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుకు దూరం చేయడమే అని విమర్శించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, పీజీ కళాశాలల్లో సరిపడా సీట్లు లేవన్నారు. అన్ని రకాల కోర్సులకు మొత్తం ఫీజు చెల్లిస్తానని ఇచ్చిన హామీని 18 నెలల్లోనే జగన్ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు విష్ణు, చైతన్య, సురేష్ రవి,అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: