దార్శనికతకు మారుపేరు డా.పుట్ల హేమలత

మార్చ్ 26, 2020 తేదీ కోసం ఎన్నెన్నో ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అంతకు కొన్ని రోజుల ముందు "డాక్టర్ పుట్ల హేమలత సాహితీ పురస్కారం" తొలిసారిగా ప్రకటితమైంది. ఒకరినొకరు అమితంగా ప్రేమించుకునే  ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి అకస్మాత్తుగా నిష్క్రమించిన సమయమది. అస్తమించిన ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. కుటుంబాన్ని ఒక పక్క చక్కబెట్టుకుంటూనే సమాజానికి ఏదో చేద్దామని తపనపడిన మనిషి. అందుకోసం మల్టీటాస్కింగ్ చేస్తూ తనను తాను చెక్కుకున్న శిల్పి. గలగలా పారే సెలయేరు అకస్మాత్తుగా ఆగిపోతే ఎంత ఖాళీతనం ఉంటుందో ఆమె నిష్క్రమించిన ఆ కుటుంబంలో కావొచ్చు, సాహితీ లోకంలో కావొచ్చు...  అంతటి బోసితనమే ఏర్పడింది. ఏడాది పాటు మానసికంగా సర్దుకునే ప్రయత్నం చేసిన ఆ కుటుంబం అవార్డు ప్రకటనతో కోల్పోయిన ఆ విలువైన వ్యక్తిపట్ల తమ ప్రేమ, గౌరవాన్ని చాటుకోవాలనుకున్నారు. అనుకున్నట్లుగానే మార్చ్ 26వ తేదీని ఖాయం చేసుకున్నారు.  ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఇంతలో కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కబళిస్తోందనే వార్తలు. గుంపులుగా కూడే ఏ కార్యక్రమం జరగకూడదనే నిబంధనలు. ఫలితం కార్యక్రమం వాయిదా.

అలా వాయిదా పడి తొమ్మిది నెలలు గడిచినా ఇంకా కార్యక్రమాలు పెద్దగా జరగడంలేదు. మరో వారం రోజుల్లో 2021 నూతన సంవత్సరానికి నాంది పలకబోతుండడంతో అనుకున్నట్లుగానే 2020లో అవార్డు ప్రదానం చేయాలనుకున్న ఆ కుటుంబ పట్టుదలకు నిన్నటి సాయంత్రం వేదికైంది. ఘనంగా జరగాల్సిన కార్యక్రమం కరోనా వల్ల సింపుల్గా జరిగిపోయింది.


భర్త అజామ్ ఖాన్ తో రచయిత్రి- నస్రీన్ ఖాన్

రచయిత్రి- నస్రీన్ ఖాన్ కు సన్మానం

 

అందుకున్న వ్యక్తిని నేనైతే, అందించిన వారు ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్, వారి కుమార్తెలు మానస, మనోజ్ఞ.

"డాక్టర్ పుట్ల హేమలత సాహితీ పురస్కారం" తొలిసారిగా వారు ప్రకటించడం, నేనూ తొలిసారిగా ఒక సాహితీ పురస్కారాన్ని అందుకోవడం నాకు ఎంతో ప్రత్యేకం అనిపిస్తోంది.  

నిన్న సాయంత్రం సుధాకర్ సర్ మాట్లాడుతూ ఆమె భావజాలానికి దగ్గరగా ఉండే వారికి ఈ అవార్డును అందించాలనుకున్నామని చెప్పారు. నిజంగా ఒక అవార్డు అందుకునే అర్హత నాకు ఉందా అని ఎన్నోసార్లు నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. కానీ సర్ చెప్పిన మాటలు విన్నాక  హేమలత గారి భావజాలం, ఎక్కడో నా ఆలొచనా విధానంలోనూ ప్రతిఫలిస్తుందన్న విషయం అర్థమైంది.  

అనుకున్న పనిని పూర్తి చేయాలనే మొండి పట్టుదల, కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆసక్తి తదితర అంశాల్లో మంచి పోలికలే ఉన్నాయి. ఇవన్నీ నాకు అందించిన పుస్తకాల్లో చూసాను. 

సాహితీలోకానికి డాక్టర్ పుట్ల హేమలత చేసిన కృషి సామాన్యమైనది కాదు. అంతర్జాల సాహిత్యంతో పరిచయం పెంచుకుని, పరిశోధనాంశంగా స్వీకరించని "అంతర్జాలంలో తెలుగు సాహిత్యం" అనే అంశంపై పి.హెచ్డీ చేయడం, విహంగ అంటూ మహిళలకోసం వెబ్ మ్యాగజైన్ ను ప్రారంభించడం, అడవి బిడ్డలకు కంప్యూటర్ పాఠాలు నేర్పడం... వంటి ఎన్నో విషయాల్లో ఆమె స్ఫూర్తిదాయకంగా ఎప్పటికీ నిలిచిపోతారు.

ఇటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వారి పేరిట స్థాపించిన తొలి అవార్డు నాకు రావడం ఆనందంగా ఉంది. 

అవార్డు అందుకోవడానికి వారి ఇంటికి వెళ్ళినప్పుడు... ఆ ముగ్గురిలోనూ హేమలత గారి పట్ల ప్రేమ, ఎనలేని గౌరవం. ఆ ఇంటిలో పెద్ద దిక్కుగా ఉండాల్సిన వ్యక్తి లేని లోటు స్పష్టంగా కనిపించింది. 

తొలి అవార్డుగా "డా.పుట్ల హేమలత"గారి పేరిట తీసుకోవడం ఎంతో సంతోషాన్నిస్తోంది. 

ఈ అవార్డును ఇలాగే ఎందరో ప్రతిభావంతులైన మహిళలకు దక్కాలని మనసారా కోరుకుంటున్నాను.

నిన్న సాయంత్రం నుండి నాకు శుభాకాంక్షలు చెబుతున్న మితృలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు

✍️ రచయిత్రి- నస్రీన్ ఖాన్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: