శైలేంద్ర ఉద్యోగ విరమణ
ఆయనతో విడదీయరాని బంధం
ఆంధ్రభూమిలో నా సహచర ఉద్యోగి, స్పెషల్ కరస్పాండెంట్ కందుకూరి విజయ శైలేంద్ర (కేవీ శైలేంద్ర) నిన్న గురువారం ఉద్యోగ విరమణ చేశారు. కరోనా కారణంగా మూతపడిన ఆంధ్రభూమి దిన పత్రిక వునఃప్రారంభం కాబోతున్న తరణంలోనే ఆయన ఉద్యోగ విరమణ చేయడం బాధాకరమైన విషయమే. గురువారం ఉదయం ఆయన ఫోన్ చేసి ఈ రోజు నా రిటైర్మెంట్ డే అని చెప్పారు. వీడ్కోలు సమావేశం గట్రా ఏమి లేవు, పత్రిక మూతపడిన సమయంలో ఆఫీస్ కు ఎవరు వస్తారు? రావడం కూడా అందరికి ఇబ్బందేకదా అని ఆయనే అన్నారు. ఇంతకాలంగా మూడున్నర దశాబ్దాల నుంచి కలిసి పని చేశాం, మీ రిటైర్మెంట్ రోజు కలవకుండా ఎట్లా ఉంటాను? నేను ఆఫీసుకు వస్తానని చెప్పాను. ఉదయం 11-30 గంటలకు నేను మా ఆఫీసు (దక్కన్ క్రానికల్ కార్యాలయం, సికింద్రాబాద్) చేరుకునే సరికే అప్పటికే శైలేంద్రగారు నా కోసం వేచి చూస్తున్నారు. నేను వెళ్లగానే ఆప్యాయంగా కౌగలించుకొని...నేటితో ఈ ఆఫీతో నా బంధం తీరిపోతుంది...చివరిసారిగా మన సీట్లో కూర్చొని ఫోటో తీయించుకుందామా? అని అన్నారు. అవును ఆయన అన్నది నిజమే, నర్వీసులో ఉండగా ఆయనతో కలి సి ఫోటో తీసుకునే ఫోటో ఇదే చివరిది అవుతుందని అన్నాను. ఆ వెంటనే మేమిద్దరం సెకండ్ ఫ్లోర్ కు వెళ్లాం. మాకు ఎడమవైపునుండే దక్కన్ క్రానికల్ రన్నింగ్ లో ఉండటంతో అది ఓపెన్ చేసే ఉంది, కానీ కుడివైపునుండే ఆంధ్రభూమి మూతపడటంతో అది మూసే ఉంది. డోర్ తీసుకొని లోపలికెళ్లి లైట్లు వేసాం. ఒక్కసారిగా పూర్వకల వచ్చింది. కానీ 80, 70 మంది కూర్చొని పని చేసే పెద్ద హాల్ లో మేము ఇద్దరమే ఉండటంతో గుండెల్లో కలుక్కుమంది. రిపోర్టర్స్ బ్యూరో లోకి వెళ్లి మేము ఎప్పుడు కూర్చునే సీట్లో కూర్చున్నాం. మొదటి నుంచి బ్యూరోలో మావీ పక్కపక్క సీట్లే. మేము కూర్చునే సీట్లకు కూడా కొంత స్థల పురణం ఉంది. బ్యూరోలో సరిగ్గా మధ్యలో బ్యూరో చీఫ్ కూర్చోవడం ఆనవాయితీ. సిహెచ్ వి కృష్ణారావు (పెద్ద బాబాయి), ఎస్ఎస్ఎసి ఆచార్యులు (చిన్న బాబాయి) బ్యూరో చీఫ్ లుగా ఉన్నప్పుడు అలాగే కూర్చునేవారు. ఆ తర్వాత బ్యూరో చీఫ్ గా ఉన్న శైలేంద్ర, ఈశ్వర్ రెడ్డి అదే సాంప్రదాయాన్ని కొనిసాగించారు. అయితే శైలేంద్రతో నాకున్న అనుబంధం, గౌరవం వల్ల నేను బ్యూరో చీఫ్ అయిన తర్వాత కూడా ఆయన్ను అదే సీట్లో కూర్చొమని చెప్పి గత సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చింది నేనే. బ్యూరో చీఫ్ అయినంత మాత్రాన సీటు మారాల్సిన అవసరం లేదని, ఎప్పటిలాగనే మీ సీట్లో మీరే కూర్చొండి, నా సీట్లో నేను కూర్చుంటానని ఒప్పించాను. అదే విధంగా ఆయన రిటైర్ అయిన రోజు కూడా ఆయన సీట్లో ఆయన, ఆ పక్క సీట్లో నేను కూర్చున్నాను. సిస్టమ్స్ డిపార్టుమెంట్ నుంచి ఇంజనీర్ మాథ్యూస్ ను పిలిచి ఇద్దరం ఫోటో తీయించుకున్నాం. మా ఇద్దరి మధ్య స్నేహబంధం ఈనాటిది కాదు, 27 ఏళ్ళ నుంచి కొనసాగుతోంది. నేను మహబూబ్ నగర్ నుంచి 1993లో రాజమండ్రి ఎడిషను తొలి బ్యూరో ఇంచార్జీగా బదిలీ అయి వెళ్లిన సమయంలో శైలేంద్ర అక్కడ దక్కన్ క్రానికల్ రిపోర్టర్‌గా ఉన్నారు. నేను తెలంగాణ వాడిని కావడంతో (మహబూబ్ నగర్ జిల్లా) ఆంధ్రప్రాంతం గురించి అప్పుడు నాకు ఏమాత్రం అవగాహన లేదు. గోదావరి జిల్లాల స్థితిగతులు, సామాజిక, ఆర్థిక, రాజకీయాలపై అవగాహన కల్పిస్తూ వృత్తిపరంగా నాకు శైలేంద్ర బాసటగా నిలిచారు. శైలేంద్ర కూడా ఆంధ్రప్రాంతానికి చెందినవాడు కాదు. ఆయన స్వస్థలం కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు. కర్నూల్ మహబూబ్ నగర్ రెండు పక్కపక్క జిల్లాలు కావడం వల్లనేమో నా పట్ల కొంత ప్రాంతీయ అభిమానాన్ని కూడా ఆయన కనబర్చారు. మా ఇద్దరి మధ్యనే కాకుండా మా ఇరు కుటుంబాల మధ్య స్నేహసంబంధాలు ఏర్పడ్డాయి. రాజమండ్రిలో నేను పని చేసింది మూడు సంవత్సరాలే. అయినా, ఆ తర్వాత ఇద్దరం కలిసి హైదరాబాద్ లో 13 ఏళ్ళుగా పని చేస్తున్నాం. ఆంధ్రభూమిలో నేను, శైలేంద్ర, బుద్ధ మురళీ మా ముగ్గురిది ఒక జట్టు. టీకెళ్లినా, మరె క్కడికి వెళ్లినా ముగ్గురం కలిసి వెళ్లేవాళ్లం. మా కుటుంబాల మధ్య ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఏర్పడటంతో రాకపోకలు కూడా ఉన్నాయి. ఇక వృత్తిపరంగా శైలేంద్రతో కలిసి రాజ మండ్రిలో పని చేసినప్పుడు మేము ఎన్నో సాహసాలు చేసాం. అవి నేటితరం జర్నలిస్టులకు కచ్చితంగా మార్గదర్శకమని గర్వంగా చెప్పగలను కూడా, పాశర్లపూడి బ్లో ఆవుట్ కానీ, ముద్రగడ్డ నేతృత్వంలో కాపు ఉద్యమం కానీ, చెన్నై నుంచి విశాఖ బయలుదేరిన చమురు నౌక కాట్రేనికోన వద్ద సముద్రంలో (ఇసుకమేట) కూరుకుపోయిన వ్పడు కానీ, మద్య నిషేదం సమయంలో యానం నుంచి మద్యం స్మగ్లింగ్ వంటి ఎన్నో, ఎన్నెన్నో స్పెషల్ స్టోరీస్ ఇద్దరం కలిసి రాసాం. వాటి గురించి నా జర్నలిస్ట్ డైరీలో తప్పకుండా మరోసారి రాస్తాను. రిటైర్ తర్వాత తిరిగి రాజమండ్రికి వెళ్లిపోయిన శైలేంద్ర తన శేష జీవితంలో కూడా ఇదే వృత్తిలో ఉండాలని కోరుకున్నారు. ఆయన అను కున్నట్టే ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్ పెద్ద బాబాయి (సిహెచ్ ఎం కృష్ణారావు) శైలేంద్రకు రాజమండ్రి రిపోర్టర్ గా అవకాశం కల్పించారు. ఈ రోజు నుంచే ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టర్ గా శైలేంద్ర (9849998097) తన రెండో ఇన్నింగ్స్ రాజమండ్రి నుంచి ప్రారంభించిన సందర్భంగా నా హృదయపూర్వగా శుభాకాంక్షలు.
-వెల్డాల చంద్రశేఖర్ 9849998092
Post A Comment:
0 comments: