సైబర్ నేరాలపై అవగాహనకు..షార్ట్ ఫిల్మ్ విడుదల 

విడుదల చేసిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ (ఐపీఎస్) 

షార్ట్ ఫిల్మ్ లో నటించిన...ధన్ రాజ్, వేణులను అభినందించిన సీపీ 

సామాజిక మాధ్యమాలలోని నకిలీ ఖాతాలతో పారాహుషార్‌

అప్రమత్తంగా ఉండాలని ప్రజలు, సెలబ్రిటీలకు సూచన 

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రముఖ ఫిల్మ్ అండ్ టీవీ యాక్టర్స్ ధన్ రాజ్, వేణు నటించిన షార్ట్ ఫిల్మ్ ను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ తన ఛాంబర్ లో విడుదల చేశారు. షార్ట్ ఫిల్మ్ లో నటించిన ధన్ రాజ్ ని, షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్, స్క్రిప్ట్, డైరెక్షన్, ఎడిటింగ్ చేసిన హైమను, సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ రికార్డింగ్ చేసిన గాయత్రి స్టూడియోస్ ప్రతినిధిని సజ్జనార్ అభినందించి సన్మానించారు. 

ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ... "ఇటీవల కాలంలో సామాజిల మాధ్యమల్లో కొంతమంది సైబర్ నేరగాల్లు, ఆకతాయిలు సెలబ్రిటీలు, వీఐపీలు, రాజకీయ నేతలు, సినీ నటులు, సమాజంలోని వివిధ ప్రముఖులు, పోలీసులు, బాగా పరిచయమున్న వారి పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి తమకు అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని, వెంటనే తిరిగి చెల్లిస్తామని చెప్పి నమ్మబలికి మోసం చేస్తున్నారు. ఈ విషయమై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు!

ప్రజలు జాగ్రత్తగా ఉండాలి!!

మారుతున్న సమాజంతో పాటు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న ప్రజలకు తగ్గట్టుగానే సైబర్‌ నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. ఫేస్‌బుక్‌.. ట్విట్టర్‌... ఇలా వివిధ సామాజిక ఖాతాల్లో చురుగ్గా ఉంటూ ముఖ్యంగా ప్రజలు, అభిమానులకు దగ్గరగా ఉంటున్న వీఐపీలు, సెలబ్రిటీల పేర్లను వాడేస్తున్నారు. వారి ఖాతాల్లోని ఫొటోలు, వారు వాడే భాషను అనుకరిస్తూ ఏకంగా వారి పేరుకు దగ్గరగానే నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలను సృష్టిస్తున్నారు. ఇలా వీరు ఆ నకిలీ ఖాతా ద్వారా వారి అభిమానులు, కార్యకర్తలకు ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిస్తున్నారు.  అంతా పెద్దోళ్ల దగ్గర నుంచి వచ్చిన ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ అనుకుని... మరేమీ ఆలోచించకుండానే యాక్సెప్ట్‌ చేస్తున్నారు. ఇదే సైబర్‌ నేరగాళ్లకు వరమవుతోంది. ఆ తర్వాత వారితో వ్యక్తిగత చాటింగ్‌ చేస్తూ దగ్గరవుతున్నారు. అనంతరం ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో మీ సహకారం కావాలంటూనో.. మరొకటో చెప్పి వారిని నమ్మిస్తున్నారు. ఇది నిజమని నమ్మిన వారు మరో ఆలోచన చేకుండా వారు చెప్పినట్టుగానే నగదును ఫోన్‌ పే, గూగుల్‌ పేల ద్వారా పంపిస్తున్నారు. ఆ తర్వాత అటువైపు నుంచి సరైన సమాధానం లేకపోవడం, వారి పోకడలపై అనుమానం రావడంతో మోసపోయామని అప్పుడు తీరిగ్గా సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయిస్తున్నారన్నారు. వీవీఐపీ, వీఐపీలు, సినిమా తారలు, సెలబ్రిటీలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫేస్‌బుక్, వాట్సాప్‌ ద్వారా డబ్బులు అడగరన్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు పెరిగాయని, స్వీయ అప్రమత్తతోనే మోసం బారిన పడకుండా ఉండాలన్నారు. 

సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలి!!

సైబర్ నేరగాళ్లు వీఐపీలు, సెలబ్రిటీలు, ప్రముఖుల సోషల్‌ మీడియా ఖాతాలనే టార్గెట్‌ చేస్తున్నారు. అక్షరం తేడాతో అసలు ఐడీలను పోలిన.. నకిలీ సోషల్‌ మీడియా ఖాతాలను సృష్టిస్తున్నారు. వీఐపీలు, సెలబ్రిటీలు, ప్రముఖుల పేర్లను అడ్డం పెట్టుకుని నకిలీ ఖాతాల ద్వారా స్వయంగా వారే చాట్‌ చేస్తున్నట్లు భావన కల్పిస్తూ మోసం చేస్తున్నారు. ఈ విషయమై వీఐపీలు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. సోషల్‌ మీడియా ఖాతాలను నిరంతరం తనిఖీ చేసుకోవాలన్నారు. మీ పేర్ల తో ఏమైనా నకిలీ ఐడీలు సోషల్‌ మీడియా వేదికగా ఉంటే వాటిపై వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే... కొన్ని సందర్భాల్లో చట్టపరమైన ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందన్నారు. మీరే నిజంగా చాట్‌ చేస్తున్నారనే అపోహలో అభిమానులు ఉండి అకతాయిలు, మోసగాళ్లు చేసే చాట్‌లకు బోల్తా పడే అవకాశాలు ఉన్నాయి. మీరు..  మీ మేనేజర్లకు, టీం సభ్యులకు నిరంతరం సూచనలు చేస్తూ.. మీ అసలు ఖాతాను పోలిన మరేదైనా కొత్త ఖాతా సోషల్‌ మీడియాలో కనపడితే అప్రమత్తం అయి.. పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. 

సోషల్ మీడియాలో వీఐపీలు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, సినీ నటులు తదితర వారి పేరుతో డబ్బు అడిగితే అది సైబర్ నేరగాళ్ల పనిగా గుర్తించాలన్నారు. డయల్ 100 లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444 నంబర్ కు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

జాగ్రత్తలు ఇలా.. 

వీవీఐపీ, వీఐపీ, సినీ ప్రముఖుల పేర్లతో ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు వస్తే నమ్మవద్దు. సరిగా తనిఖీ చేసుకున్నాకే వారి సైన్‌ అనుకరించి ముందుకెళ్లాలి. 

- డబ్బులు అవసరమని చాట్‌ చేస్తే మాత్రం సదరు వ్యక్తికి ఫోన్‌ కాల్‌ చేసి నిజమా, కాదా అన్నది నిర్ధారించుకోవాలి. పిల్లలు, వృద్ధులకు వైద్య చికిత్సలకు డబ్బులు అవసరం ఉన్నాయని గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు అడిగితే ట్రాన్స్ఫర్ చేయవద్దు. 

- వీవీఐపీ, వీఐపీ, సినిమా తారలు, సెలబ్రిటీలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫేస్‌బుక్, వాట్సాప్‌ ద్వారా డబ్బులు అడగరని గుర్తించండి.  

- మీకు వ్యక్తిగతంగా తెలియనివారు డబ్బు అడుగుతుంటే అనుమానించాలి. అలాంటి వారి పోస్టులు, మెస్సేజ్లకు స్పందించకూడదు.

- మీకు ఎవరైనా డబ్బు, గిఫ్ట్ కార్డులు, లోన్లు, నగదు బహుమతులు అందిస్తామని చెప్తే.. మోసం జరిగేందుకు అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి.

- ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన వ్యక్తులు దరఖాస్తును తీసుకోవడానికి డబ్బు అడుగుతుంటే, వారిని అనుమానించాల్సిందే.

- మీకు తెలిసిన వ్యక్తులు అనారోగ్యంతో ఉన్నామని, చికిత్సకు డబ్బులు కావాలని డబ్బులు అడిగితే స్పందించకూడదు. అవసరమైతే నిజంగా అనారోగ్యంతో ఉన్నవారికి ఫోన్ చేసి నజమో కాదో తెలుసుకోవాలి.

- ఫేస్ బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో మీకు కనిపించే పోస్టులు, మెసేజ్ లకు సంబంధించిన భాష సరిగ్గా లేకపోతే అనుమానించాల్సిందే. ఇలాంటి విషయాలపై కనీస అవగాహన పెంచుకుంటే ఆన్లైన్, ఫేస్బుక్ మోసాలకు దూరంగా ఉండవచ్చు!!

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: