తెలంగాణ పోరాటానికి దిక్చూచి బొల్లేపల్లి

యాదాద్రి-భువనగిరి జిల్లాలో బొల్లెపల్లి రావి నారాయణరెడ్డి గ్రామంగా ప్రసిద్ధం. తెలంగాణా రైతాంగ సాయుధపోరాట యోధుడిగా, నాయకుడిగా, పార్లమెంటేరియన్ గా రావి నారాయణది ప్రత్యేకముద్ర. భువనగిరిలో జరిగిన 11 ఆంధ్రమహాసభ తెలంగాణా పోరాటానికి దిక్సూచిగా నిలిచింది.

 బొల్లెపల్లి చరిత్రపరంగా కూడా ప్రసిద్దమైనదే. ఈ గ్రామంలోని మల్లికార్జునస్వామి దేవాలయంలో వున్న రెండుశాసనాలు బొల్లెపల్లి చారిత్రకతను తెలుపుతున్నాయి. మొదటి శాసనం కళ్యాణీచాళుక్య చక్రవర్తి రెండవ జగదేకమల్ల ప్రతాపచక్రవర్తి పాలనాకాలం, క్రీ.శ.1147వ సం. నాటిది. వేంగినాడులోని కొల్లిపురం ప్రభువు, భారద్వాజ గోత్రుడు మేడెయభట్టు కుమారుడు ప్రొద్దటూరి సౌధరి, మల్లెనాయక బిరుదుగల బ్రహ్మపురి అప్పనభట్టు, ఆయన భార్య బొల్లనమ్మల కొడుకు మేడెయభట్టు బొల్లెపల్లిగ్రామంలో తూర్పున నందనవనంలో ఆలయం నిర్మించి దానిలో మైలారదేవుణ్ణి ప్రతిష్టించాడు. ఆలయంలో ధూప,దీప,నైవేద్య,తాంబూలాలకు, వస్త్రాభరణం మొదలైన అంగభోగాలకు తగిన ద్రవ్యాన్నిచ్చి, బ్రాహ్మణ అధ్యక్షునికి 5మాడల జీతం, 3గద్యాలు తోటపనివారికి, దేవాలయాన్ని ఊడ్చి శుభ్రం చేసేవారికి 1మాడ లిచ్చాడు. దేవాలయానికి 1 మర్తురు తరిపొలము,15పుట్లు పండే వెలిపొలము భూదానం చేసినట్లు ఈ శాసనం వల్ల తెలుస్తున్నది. 

రెండవ శాసనం కాకతీయ వంశ పాలకులు రాణీ రుద్రమదేవి పాలనాకాలం, క్రీ.శ. 1267 నాటిది. ఇందులో అనేకబిరుదులున్న తేరాల ఏడిండ్ల రడ్లు బొల్లేపల్లి మల్లయదేవునికి  పురము పుట్టాయతికి వ్రిత్తిగా అవసరమైన నీరునేల 1మరుతురు, వెలిపొలము 30 మరుతురుల భూమిని వైశాఖ, కార్తీకాలలో సర్వమాన్యంగా ఇచ్చినట్టున్నది.

 కళ్యాణీ చాళుక్యుల కాలంలో నిర్మించిన మల్లన్నదేవాలయం మరొకటి మెదక్ జిల్లాలోని వేల్పుగొండలో వుంది. వరంగల్లులో కట్టమల్లన్న వున్నాడు. ఐలేని మల్లన్న వున్నాడు. కొమరెల్లి మల్లన్న వున్నాడు. మల్లన్నే మైలారుదేవుడు. మైలారుదేవుని గురించి పరిశోధించినవారు...మైలారుదేవుడు శైవుల దేవుడుగా చెప్తారు.  క్రీడాభిరామంలో మైలారుభక్తుల గురించి వర్ణించబడ్డది.

 బొల్లెపల్లిలో మైలారుదేవుని గుడినే మల్లికార్జునస్వామి గుడిగా పిలుస్తున్నారు.ఈ గుడి నిర్మాణం కళ్యాణీచాళుక్యులశైలిలో వుంది. తూర్పుదిశ ప్రధానద్వారమున్న ఈ దేవాలయంలో గర్భగుడి, అంతరాళం, 16స్తంభాల అర్ధమంటపాలున్నాయి.అంతరాళం ద్వారబంధాలమీద రెండుపక్కల కలశాలు అగుపిస్తున్నాయి. కడప మీద జైనదేవాలయాల మీద వుండే చతురస్రాకారాల డిజైన్ కనిపిస్తున్నది. కాని, అక్కడెక్కడ కూడా జైనం ఆనవాళ్ళు లేవు.

గర్భగుడిలో గద్దె, అధిష్టానపీఠం మీద మల్లన్న(లోహకవచంతో) కనిపిస్తున్నాడు. దేవేరులిద్దరు ఇరుపక్కల వున్నారు. గద్దె మీద కురుమ,గొల్లలు పూజించే లింగాలు( కొత్తరాతియుగంనాటి  చేతిగొడ్డండ్ల వంటి రాతిపనిముట్లు) వున్నాయి. గద్దె ముందు చతురస్రాకారపు పానవట్టం మీద బాణలింగం ప్రతిష్టించి వుంది.

గుడిముందర స్తంభపలకలతో ధ్వజస్తంభం వుంది. దానిముందర రెండువైపుల వున్న రెండుశిల్పాలలో ఒకటి కాలభైరవునిది. రెండవది వీరగల్లు. వాటిమధ్య ఒక జత పాదాలున్నాయి. కొత్తగా గుడిముందర వేసివున్న షెల్టర్లో మరొక జత చిన్నపాదాలు, చతురస్రాకారపు పానవట్టం మీద లింగం వున్నాయి. ఆ ప్రాంగణంలోనే రెండుపక్కల నిలబెట్టివున్న రెండు శాసనస్తంభాలున్నాయి. ఆలయ విమానగోపురం సోపానాలతో ఇటీవల నిర్మించినట్టుగా వుంది. ఈ గుడిపక్కన ఆంజనేయుని గుడి వుంది. మల్లికార్జునిగుడి చుట్టు రాతిప్రాకారం వుండేదనడానికి ఆనవాలుగా శిథిలమైన రాతిబండలున్నాయి.

బొల్లేపల్లిలో రావి నారాయణరెడ్డి ఇంటి ముందరవైపు గ్రామం మథ్యలో ఆంజనేయస్వామి గుడి వుంది. లోపల రాతిస్తంభాలు ధ్యజస్తంభాలు కనిపించాయి. అక్కడే లింగం, నందులు అగుపిస్తున్నాయి. ఇక్కడ పూర్వం వుండే గుడి ఏమిటో అర్థం కాలేదు. ఒక వైష్ణవాలయం వుండేదేమో అనిపిస్తున్నది. స్తంభాలలో ఒక స్తంభం మీద నలువైపుల హనుమంతుడు, గరుత్మంతుడు, వినాయకుడు, వేణుగోపాలుని శిల్పలాలున్నాయి.

ఈ ప్రాంగణం ఎత్తైన వేదిక మీద వుంది. వేదికకు పడుమట ఒరిగించిపెట్టిన మూడు వీరగల్లుల శిల్పాలున్నాయి. 

దీనికి దక్షిణం వాడలో రెండు గుడులున్నాయి. వాటిలో ఒకటి శివాలయం. రెండవది రామాలయం. శివాలయంలో ఎత్తుగా వున్న గద్దె మీద చిన్న శివలింగం, గర్భగుడి బయట చిన్న నంది వున్నాయి. చిన్నగుడి.

రామాలయానికి ముందర విరిగిపోయిన ద్వారబంధాలపై వైష్ణవ ద్వారపాలకుల శిల్పాలున్నాయి. గుడిలోపల రాతిశిల్పాలు లేవు. అర్చామూర్తులున్నారు. ఈ గుడికెదురుగా గ్రానైటు రాతిపలకమీద ఒక శాసనం వుంది.అది పూర్తిగా కనిపించడం లేదు. కనిపించిన సం. బట్టి శక సం.1850 నాటిది.అంటే 1928లో వేసినదని తెలుస్తున్నది.


✍️ రచయిత-శ్రీ రామోజు హరగోపాల్ 


 













 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: