కొత్త ఏడాది తీపి కబురు

కొత్త పీఆర్సీకి టీఎస్ సర్కార్ సన్నద్దం

ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం

ప్రగతిభవన్‌కు చేరిన పీఆర్సీ గడువు పొడిగింపు ఫైలు

గడువు పెంపునకు ముందే ఫిట్‌మెంట్‌ ప్రకటించే అవకాశం

పీఆర్సీ నివేదికతో సిద్ధంగా ఉన్న కమిటీన్యూ ఇయర్‌ కానుకగా పీఆర్సీ

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రతినిధి)

కొత్త సంవత్సరం కానుకగా ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ)పై సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఒకట్రెండు రోజుల్లో కీలక ప్రకటన చేసే అవకాశ ముంది. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన ఫిట్‌మెంట్‌ శాతాన్ని ప్రకటించడంతో పాటు పీఆర్సీ కమిటీ గడువు పొడిగింపు విషయంలో సీఎం కేసీఆర్‌ నెలాఖరులోగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు పీఆర్సీకి సంబంధించిన ఫైలు  ప్రగతిభవన్‌కు చేరిందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. 

మరో 3 నెలలపాటు పీఆర్సీ కమిటీ గడువు డిసెంబర్‌ 31తో ముగియనుండగా, మరో మూడు నెలలపాటు పొడిగించాలని పీఆర్సీ చైర్మన్‌ సీఆర్‌ బిస్వాల్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గడువు పొడిగింపునకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రగతిభవన్‌కు చేరినట్టు తెలుస్తోంది. అయితే సీఎం నుంచి పిలుపు అందిన వెంటనే పీఆర్సీ నివేదికను సమర్పించడానికి సీఆర్‌ బిస్వాల్‌ కమిటీ సిద్ధమై ఉంది. ఉద్యోగులకు సంబంధించిన కొత్త సర్వీసు నిబంధనల రూపకల్పనపై మరో నివేదిక సమర్పించాల్సి ఉండటంతో మరో మూడు నెలలపాటు గడువు పీఆర్సీ కమిటీ పొడిగించవచ్చని తెలుస్తోంది.

గడువు పొడిగింపు ఉత్తర్వులు రాక ముందే సీఎం కేసీఆర్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై ఫిట్‌మెంట్‌ శాతాన్ని ఖరారు చేయనున్నారని, ఆ వెంటనే పీఆర్సీ అమలుపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2021–22 ప్రారంభం (వచ్చే ఏప్రిల్‌ 1) నుంచి పెరగనున్న వేతనాలను పంపిణీ చేసే అవకాశాలున్నాయి. పీఆర్సీ బకాయిల చెల్లింపులపై సైతం సీఎం కేసీఆర్‌ ముఖ్య ప్రకటన చేస్తారని తెలుస్తోంది. 2018 మేలో పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయగా, ఇప్పటికే నాలుగు పర్యాయాలు గడువు పొడిగించారు. చివరిసారిగా గత ఫిబ్రవరి 18న ప్రభుత్వం గడువు పొడిగించింది. మళ్లీ గడువు పొడిగిస్తే ఉద్యోగ వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశాలుండడంతో ఈసారి కచ్చితంగా పీఆర్సీ ప్రకటిస్తారని అధికార వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆలస్యం చేస్తే అడ్డంకిగా ‘కోడ్‌’

వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు, రెండు పట్టభద్రుల మండలి స్థానాలకు ఎన్నికలు, ఆ తర్వాత వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల రూపంలో ఎన్నికల కోడ్‌ అడ్డురానుంది. మార్చి వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండనుండటంతో ఏప్రిల్‌ 1 నుంచి పీఆర్సీ అమలుకు ఆటంకం ఏర్పడనుంది. దీంతో ఈ ఏడాది చివరిలోపే పీఆర్సీ అమలుపై సీఎం నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: