జల్లికట్టు ' పట్టు' ఎంత...?

హాలీవుడ్ లో సినీ రంగానికి చెందిన వివిధ విభాగాల్లో  విశిష్ట  ప్రతిభ కనబరిచిన వారికి అలాగే అత్యుత్తమ చిత్రాలకి  ప్రతి ఏటా ' ఆస్కార్'  పేరిట అవార్డులను ప్రసాదించడం 1929 (కాలిఫోర్నియా, యూఎస్) లో ప్రారంభం  అయినప్పటికీ , ' ఉత్తమ విదేశీ భాషా చిత్రం'  కేటగరిలో అవార్డుని  బహూకరించడం  మాత్రం 1956 లో మొదలైంది. అప్పటి నుండి నిన్నటి సంవత్సరం వరకు ' మదర్ ఇండియా' (హిందుస్తానీ, 1957) తో  'గల్లీ బోయ్'(హిందీ, 2019) ని కలుపుకుని 50 కి పైగా చిత్రాలు మన దేశం నుండి ఎంపిక అయ్యాయి. ఆస్కార్'  పోటీలకు వెళ్ళినప్పటికీ ఏ ఒక్క చిత్రమూ 'అవార్డ్' ని పట్టుకురాకపోవడం  విచిత్రం! వీటిలో  'సాగర్ '(హిందీ), 'అంజలి' (తమిళం), 'ఇండియన్ ' (తమిళం), "దేవదాస్' (హిందీ), లాంటి మేటి చిత్రాలు ఉండటం  గమనార్హం! ఐతే  'మదర్ ఇండియా',  సలాం బాంబే (1988),  లగాన్ (2001) ఈ మూడు చిత్రాలు  ఆస్కార్ రేస్ లో  'ఫైనల్ ఫైవ్' కి  చేరుకోవడం  కాస్త  ఊరట ! ఏ.ఆర్. రెహమాన్, మరికొందరు భారతీయులు  కొన్ని  కేటగరీల్లో అవార్డ్స్ ని  సాధించినప్పటికీ , 'ఉత్తమ విదేశీ భాషా చిత్రం'  విషయంలో మాత్రం మన  భారతీయ సినిమాకు 'ఆస్కార్ అవార్డు' అందని  'ద్రాక్ష '  కావటం ఆంతు పట్టని  పాఠం! అమెరికాలో  మన సినిమాకు మనదేశం తరఫున  సరైన ' ప్రమోషన్' లేకపోవడమే ఇందుకు కారణమన్నది కొందరి వాదన. అదలా ఉంచితే! అసలు 'అమెరికా'లో' ఉండే మెరికిల్లాంటి  'ఆస్కార్ కమిటీ  మెంబర్స్'  మన సినిమాలు  చాటిచెప్పే మన దేశ  సంస్కృతిని  ,  జీవనశైలిని, విభిన్న ఆచారాల్ని  ఆకళింపు చేసుకుని,  ఆపై ఆకర్షితులై  భారతీయ చిత్రానికి  'ఆస్కార్ అవార్డు 'తో  పాటు డాలర్లు కూడా  కురిపిస్తారా?  అన్నదే మిలియన్ డాలర్ల  ప్రశ్న!  ఇటువంటి పరిస్థితుల నడుమ  2020 సంవత్సరానికి గాను  93 వ  "ఆస్కార్ రేస్ ' లోకి మనదేశం ఎంపిక చేసిన చిత్రం ' జల్లికట్టు'!  మరి కనీసం ఈ సినిమా ఐనా  'జెల్లీ చేప' లా  ఆస్కార్ ని  ఓ పట్టు పడుతుందా? లేక 'బల్లిపిల్ల'లా  పట్టు సడలి పడిపోతుందా? కాస్త  'జల్లెడ'  పట్టి పరిశీలిద్దాం! 

                                      మళయాళ చిత్రమైన ' జల్లికట్టు'  విషయంలో  ఫోటోగ్రఫీ,  ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్,  సౌండ్ ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్  ఇలాంటి టెక్నికల్ అంశాలను పరిశీలిస్తే  ' ఆస్కార్ స్థాయికి తగ్గట్టు' గానే అనిపిస్తాయి, ఎటొచ్చీ కలవరపాటంతా ' కంటెంట్'  విషయంలోనే ! దర్శకుడు ' లిజో జోస్' చిత్ర ముగింపు లో  వేటాడి చంపిన దున్నపోతు ' పట్ల '  రాతియుగం నాటి ఆది మానవుని  ఆధిపత్య పోరుని , వికృత చేష్టలను చూపిస్తాడు, అలా చూపించడం వెనుక ఆ కాలం నాటి మానవుని లోని మూర్ఖత్వం,  క్రూరత్వం ప్రస్తుత  నాగరికత కాలంలో  జీవిస్తున్న మనిషిలోనూ  అంతర్లీనంగా ఉన్నాయన్నది  దర్శకుడి  ఉద్దేశంగా కనబడుతుంది!  కనబడటమే కాదు అందుకు అనుగుణంగానే  పాత్రలని, సన్నివేశాల్ని  డిజైన్  చేసుకున్నాడు దర్శకుడు! మనిషి, జంతువు  ఇద్దరూ 'ఒక్కటే'   అంటూ  'సింబాలిక్ ' గా చూపడం  కూడా జరుగుతుంది. అయితే  ఆధునిక  'బ్యాక్ డ్రాప్' లో నడిచే  కధాంశం లో అటువంటి  సన్నివేశాలు  'ఆస్కార్ సెలక్టర్స్' ని  ఎంత వరకు  'కన్విన్స్ ' చేస్తాయన్నదే  సందేహం!  కాని మరో విధంగా  ఆలోచిస్తే  ' జల్లికట్టు' సినిమా ప్రధానంగా మనిషి లోని  పశు ప్రవుత్తి గురించిన  అంశం తో  అల్లుకున్నది  కనుక, ఇలాంటి వ్యక్తులు 'మానవాళి ' అంతటా ఉంటారు కాబట్టి, 'యూనివర్సల్ '  కోణం నుంచి  ఈ సినిమా  'కాన్సెప్ట్'   కూడా  ఆస్కార్  కు అన్ని విధాలా  'అర్హత ' గా  చెప్పుకోవచ్చు! అంతే కాకుండా, ఈ చిత్రం లో 'రెగ్యులర్' మసాలాలు లేకపోవడం, పాత్రల మధ్య సంభాషణలు  పరిమితం గా  ఉండటం,,  పలు అంతర్జాతీయ  చిత్రోత్సవాల్లో అవార్డులతో పాటు, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడం, అన్నింటికీ మించి ' నిడివి'  కేవలం గంటన్నర మాత్రమే కావడం  లాంటి అంశాలు  'ఆస్కార్ ' పోటీల్లో  పాల్గొనే తక్కిన విదేశీ

చిత్రాలతో గట్టి పోటీకి 'దోహద ' పడేవిగా చెప్పొచ్చు! తొంభై శాతం పైగా సినిమా ' డార్క్  లైటింగ్' తో  'నైట్ ఎఫెక్ట్' లో ఉండడంతో  కళ్ళకి కాస్త ఇబ్బందిగా అనిపించినా  మూడు కోట్ల  బడ్జట్తో  నిర్మించి  నలభై  కోట్ల కి పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం యొక్క' ఫోటోగ్రఫీ'  కి  'ఆస్కార్ 'ని అందుకునే అవకాశం ఉందనే  చెప్పాలి!   'కెమెరా'  ని పాత్రధారులపై  కాకుండా పూర్తిగా 'సన్నివేశం ' పైనే ఫోకస్ పెడుతూ 'ఫోటోగ్రఫీ ' ని  కూడా ఓ 'పాత్ర ' వలే తక్కిన పాత్రలతో పాటు ప్రయాణం చేసేటట్లు, అవసరమైతే వాళ్లతో కలసి పరుగులు   పెట్టేటట్లు   డిజైన్ చేయబడిన   'స్క్రీన్ ప్లే' ని  చూస్తే "ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' మొత్తం 27 చిత్రాల్లో  "ఆస్కార్ నామినేషన్' కి జల్లికట్టు ఎంపిక  'జస్టిఫై' గానే తోస్తుంది!                                             ఈ చిత్రాన్ని కధగా చెప్పుకుంటే '' 'మాంసం '  కోసం పక్క గ్రామం నుండి తెప్పించుకున్న  ' దున్నపోతు' తప్పించుకు పారిపోయి గ్రామం లో అలజడి సృష్టిస్తుంది! చివరకు దాన్ని వెంటాడి చంపుతారు గ్రామస్తులు!  ఈ చిన్న 'లైన్ ' కి గ్రామస్తుల దిన చర్యలను జతచేసి, క్లైమాక్స్ లో  మనిషిలోని మృగత్వాన్ని  ' ఎలివేట్'  చేస్తూ సినిమాను ముగిస్తాడు  దర్శకుడు!   ఆణిముత్యాల్లాంటి  'స్వాతి ముత్యం' వంటి భారతీయ చిత్రాలు ఏవీ  'ఆస్కార్ ' ని  అందుకోలేకపోయినప్పటికీ ,ఆలోచింప చేసే  కాన్సెప్ట్  తో  షార్ప్ గా ఉండే "షాట్ డిజైనింగ్ " తో  రూపుదిద్దుకున్న ఈ  'జల్లికట్టు '  2021 ఏప్రిల్ నెలలో ' 'లాసెంజిల్స్' లో జరిగే  పోటీల్లో  పట్టు పట్టి "ఏంజిల్  " లా  'ఆస్కార్ 'ని  ఎగరేసుకురావాలని  ఆశిద్దాం!               

- ✍️ రచయిత-మురళి

సెల్ నెం-9866071944

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: