సంక్షోభంలోనూ ధీరత్వం

వలసలు వేధించినా సమర్థవంతమైన ప్రధాన ప్రతిపక్ష పాత్ర

ప్రభుత్వ వ్యతిరేక అస్త్రాలు అందొచ్చిన....లాక్ డౌన్ తో ఏమీ చేయలేని వైనం

చంద్రబాబుతోపాటు దూకుడు పెంచిన నారా లోకేష్

కరోనా కాలంలోనూ సామాజిక మాధ్యమాలతో ప్రభుత్వంపై పోరు

క్లిష్ట పరిస్థితుల్లోనూ జూమ్ లో మహానాడు నిర్వాహణ

రాజధాని అమరావతి కోసం నిరంతరం పోరు....అదే ప్లస్...అదే మైనస్...?


ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎపుడు రంజుగానే సాగుతాయి. కానీ గతానికి కంటే తాజా రాజకీయాలు ఏపీలో మరింత రంజుగా సాగుతున్నాయి. ఇక 2020వ సంవత్సరంలో కరోనా కష్టాలు వెంటాడినా, తన పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగినా ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ తనవంతు పాత్ర సమర్థవంతంగానే పోషించిందని చెప్పవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక అస్త్రాలు అందొచ్చినా రోడ్డెక్కలేని స్థితిలోనూ ఈ ఏడాదిలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని టీడీపీ అధినాయకత్వం వైసీపీ పై విమర్శనాస్త్రాలను సమర్థవంతంగా ప్రయోగించింది. అయితే వైసీపీ ప్రభుత్వం కరోనా సంక్షోభ కాలంలోనూ సంక్షేమ పథకాలను నిరంతరాయంగా ప్రవేశపెట్టడంతో టీడీపీ వివిధ అంశాలపై చేసిన పోరాటం పెద్దగా ఫలితమివ్వకలేకపోయింది. కానీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ శ్రేణులు మాత్రం ప్రభుత్వ విధానాలను ఎప్పటికపుడు ఎండగటడంలో సఫలమయ్యారు. అదే సందర్భంలో ఏపీలో 2020లో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారాయి.

బీజేపీతో జనసేన జతకట్టడంతో ఏపీలో రాష్ట్ర రాజకీయాలు మరోమలుపు తిరుగుతున్న నేపథ్యంలో టీడీపీ తన పోరాట పంథలో మరింత దూకుడు పెంచింది. అటు వైసీపీతోపాటు ఇటు బీజేపీ కూడా సందర్భంవచ్చిన ప్రతిసారి టీడీపీని టార్గెట్ చేశాయి. దీంతో ఇరువైపుల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం టీడీపీ నాయకత్వం చేపట్టింది. అదే సందర్భంలో టీడీపీ అంటే చంద్రబాబు అన్న ప్రచారానికి కాస్త మార్పును ఈ ఏడాదిలో ఆ పార్టీ నాయకత్వం తీసుకొచ్చింది. చంద్రబాబుతోపాటు టీడీపీ కోసం ఆయన తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ ఏడాది పూర్తిస్థాయిలో కథన రంగంలోకి దిగారు. దీంతో పార్టీకి నెంబర్ టూ నాయకత్వం పట్టిష్టంగా ఉందనే సంకేతాలను ఆ పార్టీ నాయకత్వం ప్రజల్లో పంపే ప్రయత్నం చేస్తోంది.

మొత్తంగా కరోనా కాలం టీడీపీకి ఏడాదిలో కాస్త ఇబ్బందులకు గురిచేసింది. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లోకి వెళ్లి పోరాడటం ప్రధాన ప్రతిపక్షంకు ఉన్న ఏకైక మార్గం. కొత్త ఇసుక విధానం, మద్యం పాలసీ, కరోనా వైరస్ కాలంలో ప్రభుత్వం చర్యలు, ఇతర కొన్ని తప్పిదాలు తెరపైకి వచ్చాయి. వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకొని జనంలోకి వెళ్లే అవకాశం ప్రధాన ప్రతిపక్షమై టీడీపీ కరోనా వల్ల కోల్పోయింది. దీంతో జూమ్ మీటింగ్ లలో తన గళాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా వినిపించినా దానికొచ్చిన మైలేజ్ కాస్త తక్కువేనని చెప్పాలి. జనంతో మమేకమై పోరాటం చేసే అవకాశం కరోనా కాలంలో లేకపోవడ టీడీపీకి మైనస్ గా మారింది. జిల్లాల వారీగా, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ శ్రేణులతో నిరంతరం సమీక్షా సమావేశాలు నిర్వహించడం ఆ పార్టీలో కొంత జోస్ నింపింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ జూమ్ ద్వారా మహానాడు నిర్వహించి, ఆ కార్యక్రమంలో ఆనై లైన్ లో వేలాది మంది టీడీపీ శ్రేణులు పాల్గొనేలా చేయడంలో టీడీపీ నాయకత్వం సఫలమైంది. ఇది కరోనా క్లిష్టకాలంలోనూ టీడీపీ సాధించిన ఓ గొప్ప విజయంగా పేర్కొన్నవచ్చు. ఏపీ, తెలంగాణలోని తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ సూచనల మేరకు ఆన్‌లైన్ ద్వారా టీడీపీ మహానాడు 2020లో పాల్పంచుకోనున్నారు. జూమ్ యాప్ సౌకర్యం అందుబాటులో లేని మిగతా నేతలు, కార్యకర్తలు, అభిమానులు టిడిపి అధికారిక వెబ్‌సైట్, ఫేస్‌బుక్ ద్వారా మహానాడు ప్రత్యక్షప్రసారాన్ని వీక్షించేవిధంగా పార్టీ ఏర్పాట్లు చేసుకుంది.

కరోనా నియంత్రణ చర్యలపై గళం...?

మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 2020లో కరోనాగురించే ఎక్కువగా చర్చించుకొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే అంశం హాట్‌టాపిక్‌గా నడిచింది. కరోనాపై రాజకీయాలు కూడా బాగానే వేడెక్కాయి. ఆంధ్రప్రదేశ్‌ పరీక్షల్లో రెండో స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం లెక్కలతో చెబుతుండగా ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించింది. కరోనా నియంత్రణ చర్యలు, వైసీపీ నేతల తీరును ఎత్తిచూపుతూ సమర్థవంతంగా టీడీపీ తన గళాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. వాస్తవానికి ఈ ఏడాది ఆరంభం నుంచే కరోనా భయం ప్రతి ఒక్కరికీ పట్టుకుంది. ఇందుకు రాజకీయనాయకులు అతీతమేమీ కాదు. ఇక మార్చి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో చంద్రబాబు హైదరాబాదులోని తన ఇంటికే పరిమితమయ్యారు. తన కుటుంబం అంతా విజయవాడలోని కరకట్టను వీడి హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌కు వెళ్లారు. ఈ విషయంలో అధికార పక్షం నుంచి టీడీపీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఇది టీడీపీకి కొన్ని ఇబ్బందులను మాత్రం తెచ్చిపెట్టింది. అయితే చంద్రబాబు మాత్రం జూమ్ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేశారు. ఇంట్లో నుంచే పార్టీ నాయకులకు కార్యకర్తలకు జూమ్ మీటింగ్ ద్వారా దిశా నిర్దేశం చేసేవారు. దీన్నే అధికార వైసీపీ నాయకులు టార్గెట్‌గా చేసుకుని విమర్శలు సంధించారు. 

రాజధాని అమరావతి కోసం అదే ఉడుంపట్టు పోరాటం...?

ఈ ఏడాది ఆరంభంలో అంటే 1 జనవరి 2020లో తన భార్య భువనేశ్వరితో కలిసి చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులను ప్రజలను కలిసి వారి ఆందోళనలకు మద్దతు తెలిపారు. ఆ సమయంలో సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు చంద్రబాబు. వద్దంటే జగన్‌కు ఓటు వేసి సీఎం కుర్చీలో కూర్చోబెట్టారని ఇప్పుడు రాష్ట్రాన్ని అదోగతికి తీసుకొచ్చారంటూ ఫైర్ అయ్యారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల్లో జగన్ చిచ్చు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇక రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తన గాజులను విరాళంగా ఇచ్చారు. రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతుగా చంద్రబాబు జోలి పట్టి భిక్షాటన చేశారు. ఇలా అమరావతి కోసం ఈ ఏడాది అంతా నిరంతర పోరాటాలను టీడీపీ నిర్వహించింది. ఇది కూడా టీడీపీకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది. వైసీపీ అధికార వికేంద్రీకరణ పేరుతో టీడీపీ పోరాటాన్ని నియంత్రించే దిశగా అడుగులేసింది. దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో మినహా ఇతర జిల్లాలలో టీడీపీ కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. బీసీ అస్త్రం ప్రయోగంలో సఫలం....?

గత సార్వత్రిక ఎన్నికల్లో చేజారిన బీసీ ఓటు బ్యాంకుపై టీడీపీ దృష్టి సారించింది. బీసీ అంటే టీడీపీ అన్నట్లుగా ఉన్న ఆ వర్గ ఓటు బ్యాంకును గత ఎన్నికల్లో వైసీపీ సొంతం చేసుకొంది. దీంతో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీని వైసీపీ సాధించుకొంది. ఓటమిపై పోస్ట్ మార్టం నిర్వహించిన టీడీపీ నాయకత్వం తనకు ఎన్నో ఏళ్లుగా అండగా నిలిచిన బీసీ ఓటు బ్యాంకు చేజారడం వల్లే ఈ ఘోర ఓటమి అని అంచనా వేసింది. ఇదిలావుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్లు దాటకూడదన్న సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లకుండానే స్థానిక సంస్థల ఎన్నికలను కోర్టు తీర్పునకు అనుగుణంగా నిర్వహించేందుకు వైసీపీ ప్రభుత్వం సన్నద్దమైన విషయం తెలిసిందే. దీనిపై బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. హైకోర్టు తీర్పును పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు పదిశాతం రిజర్వేషన్లను బీసీలు కోల్పోవాల్సి వస్తుంది. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీలు నినాదిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు కాస్త వెనకబడిన వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కల్గిస్తున్నాయి. దీంతో బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో గత విధానం అమలు కోసం టీడీపీ సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. ప్రభుత్వం చేయని పనిని తాను చేయడం ద్వారా బీసీలకు దగ్గరవ్వాలన్న దిశగా టీడీపీ అడుగులేసింది. తమ రిజర్వేషన్లకు అండగా ఎవరు నిలబడితే వారికే బీసీలు కూడా జై కొట్టడం సహజం. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం దూకుడు పెంచాలని టీడీపీ నిర్ణయించింది. దానికి అనుగుణంగానే అడుగులేసింది.


ప్రజా క్షేత్రంలోకి...?

పార్టీపై పట్టుకు లోకేష్ యత్నం.....అధికార పక్ష విమర్శలకు చెక్...?

గత ఎన్నికల్లో  పార్టీ ఘోర ఓటమితో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీడీపీని గట్టెక్కించే పనిలో తండ్రి, తనయుడు ఇద్దరూ నిమగ్నమయ్యారు. టీడీపీలో చంద్రబాబు తరువాత నెంబర్ టూగా ప్రస్తుతం నారా లోకేష్ ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. ఇటీవల టీడీపీ యువ నేతలతో, పార్టీ అనుబంధ విభాగాలతో నారా లోకేష్ తరచూ భేటీ అవుతున్నారు. అంతేకాకుండా కీలక నిర్ణయల సమయంలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు పార్టీలోని సీనియర్ నేతలతోనూ నారా లోకేష్ కలుపుగోలుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దంతా పార్టీపై పట్టుకోసమే నారా లోకేష్ చేస్తున్నారని, పార్టీ అధినాయకత్వం ఆదేశం మేరకే ఇద్దంతా జరుగుతోందని సమాచారం. టీడీపీ నాయకత్వం విషయంలో అధికార పక్షం వైసీపీ గత కొన్నేళ్లుగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.  

టీడీపీ పని అయిపోయిందని, చంద్రబాబు నాయుడు వయస్సు పై బడిందని, ఇక తెలుగుదేశం పార్టీ దుకాణం మూసేస్తారని తరచూ ఆ పార్టీపై వైసీపీ నేతలు చేసే విమర్శ. టీడీపీలో నెంబర్ టూ నేత ఎవరూ అని కూడా వైసీపీ విమర్శలు ప్రధానంగా మారింది. దీంతో నారా లోకేష్ ను పార్టీలో నెంబర్ టూ నాయకత్వం దిశగా తీర్చిదిద్దే ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగానే ఆయన పార్టీలోని యువ నేతలతో, పార్టీ అనుబంధ సంఘాలతో తరచూ భేటీ అవుతున్నారు. ఇదిలావుంటే ఇటీవల హైదరాబాద్ లో పార్టీకి చెందిన యువ నేతలకు దంపతులతో సహా భోజనానికి నారా లోకేష్ ఆహ్వానించారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నా మెయిన్ అట్రాక్షన్ గా నారా లోకేష్ వ్యవహరించారు. యువ నేతలతో మాటా మంతి కొనసాగించారు. టీడీపీ అధికారంలోనున్న సమయంలో మంత్రిగా వ్యవహరించిన నారా లోకేష్ కు ప్రజల్లోకి వెళ్లే అవకాశం తక్కువగా ఉండేది. ఒక వేళ వెళ్లిన ఓ మంత్రిగా వెళ్లారే గానీ ఓ నేతగా వెళ్లే అవకాశం మాత్రం ఆయనకు రాలేదు. అందుకే ఆయనకు పార్టీపై పట్టు అంతగా రాలేదని  టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. కానీ 2019 ఎన్నికల అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ దూకుడు పెంచుతున్నారు. స్వతహాగా తానే జిల్లా, నియోజవర్గాలకు నారా లోకేష్ వెళ్తున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తిస్థాయిలో సమాయత్తంచేసేందుకు వీలుగా పార్టీ అనుబంధ విభాగాలను పూనర్ నిర్మాణం చేయాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. పార్టీ యువత, విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కార్మికు వంటి అనుబంధ విభాగాల పునర్ నిర్మాణంపై నారా లోకేష్ స్వయంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఇలా టీడీపీలో నారా లోకేష్ తన పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

అరెస్టులతో...టీడీపీ ఉక్కిరి...బిక్కిరి...?....ఏపీలో తమిళనాడు తరహా రాజకీయాలు

ఏపీ రాష్ట్ర రాజకీయాలలో తమిళనాడు తరహా పరిణామాలు చోటుచేసుకొంటున్నాయా...? అక్కడి మాధిరిగా అధికార, ప్రధాన ప్రతిక్షం మధ్య ఢీ అంటే ఢీ అన్న పరిణామాలు చోటుచేసుకోనున్నాయా...? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత 2019 ఎన్నికలకు ముందు నుంచి నేటి వరకు ఏపీ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. 2019 ఎన్నికల అనంతర పరిణామాలు ఏపీలో మరింత రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. గత ప్రభుత్వ విధానాలను తిరగడోలుతున్న వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పెద్ద ఎత్తున్న విమర్శలకు దిగుతోంది. ఇందులో భాగంగా అరెస్టుల పర్వం ఏపీలో మొదలైంది. ఈఎస్‌ఐ స్కామ్‌లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కె.అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు వాహనాల విషయంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జే.సీ.ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇదిలావుంటే అచ్చెన్నాయుడి అరెస్టుకు నిరసనగా ధర్నాకు వెళ్లిన చింతమనేని ప్రభాకర్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో ఆయన్ని న్యాయస్థానం రిమాండ్ కు ఆదేశించింది. ఈ పరిణామాలతో ఒక్కసారిగా టీడీపీలో అలజడి మొదలైంది. మొన్నటి వరకు పార్టీ నేతలు పార్టీని వీడటం టీడీపీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తే తాజాగా ఆ పార్టీ నేతల అరెస్టుల వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. దీంతో టీడీపీ నాయకత్వం మరింత ఆందోళనకు గురవుతోంది.  తమపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఈ చర్యలకు దిగుతోందని విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు తపుచేసిన వారిని వదిలేయాలా...వారు బీసీ అయితే నేరం చేసినా వదిలేయాలా అని వైసీపీ తరఫున ఆ పార్టీ బీసీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ఇలా ఏపీలో రాష్ట్ర రాజకీయాలు రసోత్తరంగా మారాయి.

ఏపీ రాష్ట్ర రాజకీయాలు కాస్త తమిళనాడు తరహా రూపుదిద్దుకొంటున్నాయా..? అసలు ఏపీలో ఏ జరుగుతోంది అన్నది ఓ సారి పరిశీలిస్తే తమిళనాడు రాజకీయాలు మనకు గుర్తుకు రాకమానదు. తమిళనాడులో ఒకప్పుడు. కరుణానిధి, జయలలిత మధ్య హోరాహోరీ పోరు నడిచేది. అది ఎన్నికల్లో మాత్రమే కాదు బయట కూడా. ఎవరు అధికారంలో ఉంటే.. వాళ్లు ఇతరులను మెంటల్‌గా టార్గెట్ చేశారు. కేసులు వేధింపులు ఓ రేంజ్‌లో ఉండేవి. వాళ్లిద్దరూ ఇప్పుడు లేరు కాబట్టి తమిళనాడు రాజకీయాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. 2019 ఎన్నికల అనంతరం టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ ఫైట్ నువ్వా, నేనా అన్నట్లుగా సాగుతోంది.

✍️ రచయిత-సయ్యద్ రహ్మత్

సెల్ నెం-7093951403

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: