ఇక్కడే ఎందుకిలా...
న్యాయవాద సంబంధిత పదవుల్లో...
రిజర్వేషన్ల అమలు ఏదీ...?
రాజ్యాంగం ను నిత్యం పట్టుకొని తిరిగే న్యాయవాదులకు సంబంధించిన పదవులలో రిజర్వేషన్ల అమలు సజావుగా సాగలేదనేచెప్పాలి. ప్రైవేటు ప్రాక్టీస్ లో అసలు రిజర్వేషన్ అనేదే లేదు. తరచి చూస్తే 2001 మునుపు రిజర్వేషన్లు అమలు అనేది ప్రభుత్వ నియామకాల్లో జరగనే లేదు. అంతకు మునుపు ఉన్న ప్రభుత్వ న్యాయవాదులు అందరూ ఉన్నత వర్గాల వారే.అయితే ఈ నియామకాలన్నీ, అడ్వకేట్ జనరల్ మాత్రమే చేసేవారు. అడ్వకేట్ జనరల్ ను రాజ్యాంగంలోని అధికరణ 165 క్రింద గవర్నర్ నియమిస్తారు.ఆయన నియామకం రాష్ట్ర క్యాబినెట్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేబినెట్ తోచర్చించి అడ్వకేట్ జనరల్ ని ఎంపిక చేస్తారు. ఆ పేరును గవర్నర్ కు ప్రతిపాదిస్తారు.తర్వాత గవర్నర్ వీరిని నియమిస్తున్నట్టు గా ప్రకటిస్తారు. ఇక్కడి వరకు ఏ సమస్యా లేదు. అయితే ఇంత వరకు అడ్వకేట్ జనరల్ పదవి ఎస్ సి, ఎస్ టి, బీసీ న్యాయవాదులను వరించకపోవటం ఒక పెద్ద విశేషం. మరి ఇది యాదృచ్చికమో లేక ప్రభుత్వాలు ఎస్ సి, ఎస్ టి, బీసీ న్యాయవాదులు ఈ పదవికి పనికి రారు అనే అభిప్రాయమో తెలియాల్సివుంది. అడ్వకేట్ జనరల్ నియామకం అనేది పూర్తిగా రాజకీయ నియామకమే కాబట్టి, ప్రభుత్వం తనకు కావలసిన వారిని ఎన్నుకోవచ్చు. ఇక వచ్చి పడ్డ చిక్కంతా ఆయన నియమించే ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ న్యాయవాదులు స్టాండింగ్ కౌన్సిల్ కు సంబంధించిన విషయమే. వీరందరినీ కూడా లా డిపార్ట్మెంట్ జీవో ఎంఎస్ నెంబర్ 187 ప్రకారం నియమించాలి. ఇప్పటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 35 మంది గవర్నమెంట్ ప్లీడర్లను, 50-60 అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లను నియమించింది. స్టాండింగ్ కౌన్సిల్ విషయానికి వస్తే సరైన సంఖ్య ఇంతవరకూ ప్రభుత్వానికి కానీ అడ్వకేట్ జనరల్ కానీ తెలియదు. అధికారికంగా ఈ సంఖ్య ఎంత అనేది అయోమయంగానే వుంది.ఇప్పుడు మంజూరై వున్న ప్రభుత్వ న్యాయవాదుల సంఖ్య 35. వీరిలో ఏడుగురు మే నెలాఖరులో రాజీనామా చేశారు. ఐదుగురు కొత్తవారిని ప్రభుత్వం నియమించింది .ఇక రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 35 గవర్నమెంట్ లాయర్ లలో ఎస్సీలకు 15% బీసీలకు 29% ఎస్టీలకు 7శాతం చొప్పున, వారి వాటా వారికి ఇవ్వాలి. అయితే ఎస్టీలు అందుబాటులో లేకపోవడం వలన ఆ వర్గం నుండి ఒక ప్రభుత్వ న్యాయవాది మాత్రమే నియమింపబడ్డారు. ఎస్ సి ల లో తగినంత న్యాయవాదుల సంఖ్య ఉన్నప్పటికీ, ముగ్గురినే తీసుకున్నారు.
ఇక బీసీల విషయానికి వస్తే వారిలో ఏడుగురు కి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇక మిగిలిన 24 పోస్టులు కూడా మొత్తం ఉన్నత ఉన్నత వర్గాలకు మాత్రమే కేటాయించారు. ఒకవంక రిజర్వేషన్లు ఉన్నవారు వాటిని పొందలేకపోతున్నారు కాగా మరో వంక ఏ రిజర్వేషన్లు లేనివారు ఉచితంగా వీటిని అందుకుంటున్నారు. ఇక మహిళా రిజర్వేషన్లలో ఐదుగురు మహిళలు ఉన్నారు, వారిలో నలుగురు ఉన్నత వర్గాల వారే ఉన్నారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులలో కూడా మహిళలకు ఒక పోస్టు కూడా ఇవ్వలేదు. ఇక మహిళా సాధికారత అనేది కూడా ఉన్నతవర్గాలకు చెందినదిగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ నియామకాలు అన్నిటిలో ఒకటే పరమార్థం, అది ఏంటంటే రిజర్వేషన్లు ఉన్నవారికి పదవులు ఇవ్వకుండా రిజర్వేషన్లు లేనివారికి, లేని రిజర్వేషన్ కల్పించడమే పరమార్థం. అక్కడ సమానత్వం అంతు చిక్కడం లేదు. మనం ఇక్కడ ఈ వీరి నియామకాల ను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఉన్నత వర్గాలకు పెద్ద పీట వేసినట్లు గా స్పష్టంగా కనబడుతోంది. స్టాండింగ్ కౌన్సిల్ విషయంలో 101 పోస్టులు ఉండగా 18 పోస్టులు ఎస్సీలకు ఇచ్చారు. 25 పోస్ట్లు ఉన్నత వర్గాలైన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారికి ఇచ్చారు. ఇక మనం ఈ నియామకాలన్నింటినీ క్షుణ్ణంగా గమనిస్తే ఉన్నత వర్గాలకు ఇచ్చిన శాఖలలో అన్నీ కూడా తక్కువలో తక్కువ 2 నుంచి 10 లక్షల ఫీజులు వచ్చేవే. కానీ బీసీలు, ఎస్సీలకు, ఎస్ టి లకు 10వేల నుంచి ఒక లక్ష వరకు ఫీజులు వచ్చే శాఖలను ఇచ్చారు ఇక్కడ కూడా మనకు సమానత్వం ఏ మాత్రం కనిపించదు.ఇకపోతే ప్రభుత్వం లేదా అడ్వకేట్ జనరల్ ఏ ఉద్దేశంతో వీరికి రెండేసి, లేదా మూడేసి డిపార్ట్మెంట్ల ను కట్టబెట్టారో వారే చెప్పాలి. మనం ఇప్పటి నియామకాలను చూస్తే 70 శాతం నియామకాలు నియమావళికి వ్యతిరేకంగా ఉన్నాయనేది నగ్నసత్యం. అడ్వకేట్ జనరల్ వ్యవస్థను కాపాడాలి. కానీ వ్యవస్థలోని లోపాల ద్వారా చీలికలు తెచ్చి నాశనం చేయరు.ప్రస్తుతం జరిగిన నియామకాలను పరిశీలిస్తే విషయాలు తేట తెల్లం అవుతాయి.జరిగిన అవకతవకలు వివక్ష స్పష్టమవుతాయి. పౌరులు ఓటు వేస్తే ప్రభుత్వం ఏర్పడుతుంది. అంతేకానీ రాజకీయ నాయకుల అనుచరులు మాత్రమే ఓట్లు వేసినంత మాత్రాన ప్రభుత్వం ఏర్పడదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొవాలి. 80 శాతం ఓటర్లు ఎస్సీ ఎస్టీ మరియు బీసీలు అయినప్పటికీ ప్రభుత్వ న్యాయవాద పోస్టులు అన్ని ఓసీలకే ఇస్తున్నారు. ఎందుకు అన్న విషయం గోప్యంగా చిదంబర రహస్యం గా వుండి పోతోంది. ఇప్పుడున్న మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సెల్ గత ఆరు సంవత్సరాలనుండీ కొనసాగుతున్న వారే. ఆయన నిరాటంకంగా ఏకధాటిగా ఏపీ స్టాండింగ్ కౌన్సిల్ గా చేస్తున్నారు. ఇది కూడా నియమావళికి విరుద్ధంగానే. అలాగే ఏపీ ఎస్పీడీసీఎల్ మరియు ఏపీ జెన్కో ఇవి రెండూ కూడా పెద్ద కార్పొరేషన్లు. ఈ రెండు కార్పొరేషన్లను ఒకే న్యాయవాదికి అప్పజెప్పడం కూడా అసామాన్యమైనదే. ఇక బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు వీటన్నింటినీ కలిపి ఒకే న్యాయవాదికే అప్పగించారు. పౌరుడికి ఒక ఓటు మాత్రమే కాని మరి వీరికి మాత్రం రెండేసీ లేదా మూడేసీ డిపార్ట్మెంట్ లకు స్టాండింగ్ కౌన్సిల్ ఇచ్చారంటే వీరు రెండేసి మూడేసి ఓట్లు వేసి వుండటంవల్ల ఇలా ఇచ్చారేమోనన్న చందంగా యీ నియామకాలు అనుమానాలను కలగజేస్తున్నాయి. ఒక న్యాయవాదికి స్టాండింగ్ కౌన్సిల్ గా ఒక శాఖ ను ఇవ్వడమే గగనంగా భావించినప్పుడు వీరిని రెండు లేదా మూడేసి శాఖలకు స్టాండింగ్ కౌన్సిల్ గా ఎలా నియమించారో అంతుచిక్కదు.ఇదంతా ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం కాదా? పార్టీలజెండాలు మోసినంత మాత్రాన గౌరవప్రదమైన న్యాయవాద పదవుల్లో నాసిరకం ఎంపికలు చేయడం దురదృష్టకరం. నిష్ణాతులు, మెరికల్లాంటివారిని నియమించాలి.,న్యాయవాద వృత్తిలో అంకితభావంతో పని చేసేవారికి మొండి చేయి చూపి రాజకీయ అనుచరులతో నింపితే పరిస్థితులు ఎలా వుంటాయో ఇటీవలి ఫలితాలు బిళ్ళబీటుగా తేటతెల్లం చేస్తున్నాయి. కొన్ని చోట్ల అనర్హులను కూర్చోబెట్టి గౌరవ వేతనాలు అందజేస్తున్నారు. దీని పరమార్థం ప్రయోజనం చెప్పుకనే తెలిసిపోతుంది. ఇలాంటి విషయాల్లో కఠినంగా వుండాల్సిన కోర్టులు కూడా కొన్ని పరిస్థితుల దృష్ట్యా మెతక వైఖరి ని అవలంభిస్తున్నాయి. దీనికి ప్రభుత్వం సంబంధిత యంత్రాంగం బాధ్యత వహించాలి.రాజు ఎప్పుడూ తప్పు చేయడు అనే సూక్తి స్వతంత్రానికి మునుపే కొట్టివేయబడింది. దీనిని ప్రభుత్వానికీ, అడ్వకేట్ జనరల్ కు అన్వయించడం అసమంజసం.
ఆంధ్ర రాష్ట్రము 2014 లో తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత ఒక అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ మాత్రమే ఉండేవారు. 2016లో అడ్వకేట్ జనరల్ రాజీనామా ఇవ్వడంతో అడిషనల్ అడ్వకేట్ జనరల్ కాస్త అడ్వకేట్ జనరల్ అయ్యారు. ఇక అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్టు ఖాళీగా ఉండిపోయింది. ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ను నియమించారు. ఇక పోతే, ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరు అడిషనల్ అడ్వకేట్ జనరల్ లు ఉండేవారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మాజీ న్యాయమూర్తి కొడుకును అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ఇప్పుడు ఇద్దరు అడిషనల్ అడ్వకేట్ జనరల్ లు వచ్చారు. ఈ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఒక బీసీ కో, ఎస్ సి కో, ఎస్ టి కో ఇచ్చి ఉంటే చాల బాగుండేది. సామజిక న్యాయం అనేది పుస్తకాలలో పుష్కలంగా వుంది అనేది నగ్నసత్యం, అమలులో శూన్యంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా ప్రభుత్వ న్యాయవాదులను నియమించే నియమావళిని సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అప్పుడే న్యాయం నాలుగు పాదాల నడవగలదు. ఇదేనా నవ్యంధ్ర, ఇదేనా స్వర్ణాంధ్ర, ఇదేనా అందరు కళలు కన్నా ఆంధ్ర దేశం. ప్రభుత్వాలు, ప్రభుత్వ న్యాయవాద నియామకాల్లో సరైన పద్దతిని అవలంభించకపోతే మున్ముందు ప్రజలు ప్రభుత్వాలను నమ్మే పరిస్థితులు ఉండవు...
✍️ రచయిత-సోల్మన్ రాజు మంచాల
హైకోర్టు న్యాయవాది
Post A Comment:
0 comments: