విజయలక్ష్మి శ్రీగిరిరాజు...
ఆమె ఓ బహుముఖ ప్రజ్ఞ అద్భుతం
విజయలక్ష్మి శ్రీగిరిరాజు గారు ఇక లేరు! ఆమె ఆకస్మిక మరణం గురించి వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు! ఆత్మీయత, స్నేహం, అభిమానం ఆమె దగ్గర వైవిధ్యంగా చూశాను! చివరి వరకు తనదయిన మార్క్ కోసం ఎదురీదారు ! ఆమె బహుముఖ ప్రజ్ఞ అద్భుతం! కానీ, ఆ స్థాయి లో గుర్తింపు కు నోచుకోలేక పోయారు! చివరకు ఆమె మరణం కూడా అంతే! ఆమె తపించిన తీరు కు ఆమె ఆఖరి ప్రయాణానికి పొంతన లేకుండా పోయింది! ఆమె ఏదయితే బాధ పడుతూ వచ్చారు...చివరకు అదే జరిగింది! ఆత్మీయులకు ఆఖరి చూపు కూడా దక్కకపోవడం, పత్రికల్లో ఒక్క ముక్క కూడా రాయక పోవడం విచారకరం, దురదృష్టకరం!
విజయలక్ష్మి కవయిత్రి, రచయిత్రి, గాయని, వీణా విద్వాంసురాలు, చిత్ర కళాకారిణి ! అన్ని రంగాల్లోనూ ఆల్ రౌండర్ ! ఆమె ఇరిగేషన్ శాఖ లో సూపరింటెండెంట్ స్థాయి లో రిటైర్డ్ అయ్యారు! పెన్షన్ లో సగానికి పైగా సేవా కార్యక్రమాలకు, సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలకు ఖర్చు చేసేవారు! వారి అమ్మగారు సుబ్బమ్మ గారి పేరిట అమ్మ పురస్కారాలు ఏర్పాటు చేసి గత పాతికేళ్లుగా సినారే నుంచి నా వరకు అందరికి పురస్కారాలు నగదు పారితోషికాలు ఇచ్చి సత్కరించారు! అసలు ఆమె ఇల్లు ఒక మ్యూజియంలా ఉంటుంది బోయినపల్లి లో! ఆమె కు వచ్చిన అవార్డులు రివార్డులు ఆమె పొందిన సత్కారాలు, ఆమె రాసిన కవితలు, గీసిన బొమ్మలతో గోడలు కూడా కనిపించకుండా అందంగా అలంకరించుకున్నారు! అది ఆమె ఇష్టపడి కట్టించుకున్న ఇల్లు అయినా ఒక స్నేహితుడు చేసిన మోసం వల్ల కొన్ని నెలల క్రితం ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు ఆమె పడిన వేదన అంతా ఇంతా కాదు! కొంచెం దగ్గర లోనే ఇంకో ఇంటికి మారినా ఆమె మనసు భారం తగ్గలేదు! అప్పటికే ఆమెను breast cancer కుంగదీసింది ! వయసు 76, వైద్యానికి భయపడుతూ వచ్చారు ! మరో వైపు షుగర్, ఇంకో వైపు నడుము నొప్పి, ఇలా అనేక కష్టాలు పడ్డారు! అసలు ఆమె జీవితం చిన్ననాటి నుంచి కష్టాలే! భర్త బలాదూర్, వదిలించుకుంది 40 ఏళ్ళ క్రితమే! అప్పటి నుంచి ఒంటరి జీవితం! సాహిత్యమే జీవితం! కథలు నవలలు, కవితలు, గజళ్ళు అన్నీ రాశారు! అన్ని ప్రక్రియల్లోను పుస్తకాలూ ప్రచురించారు! డాక్టర్ గజల్ శ్రీనివాస్ అంటే ఆమె కు చాలా ఇష్టం! వారి ఆటో బయోగ్రఫీ రాసి పుస్తకంగా తీసుకొచ్చారు! నేను అంటే చాలా ఇష్టం! కుమారుడిగా భావించారు ! ఒకసారి నేను నా శ్రీమతి రిజ్వానా ను తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాను! ఆమె మెడ లో వున్న బంగారు గొలుసు తీసి రిజ్వానా మెడలో వేసేశారు! ఆమె కు ఉత్తరాలు రాయడం చాల ఇష్టం! Face Book లో ఎంతో మంది స్నేహాలు! అందులో ఒకరు మనసుకు దగ్గరయ్యారు ! పెళ్లి చేసుకుందాం అనుకున్నారు! ఇరువురు కలసి మా ఆఫీస్ కు వచ్చి విషయం చెప్పి స్వీట్స్ పంచారు ! మరి ఏమయ్యిందో తెలియదు, అదీ బ్రేక్ అప్! అనుకున్నవన్నీ జరగవు అని బాధ పడుతుండే వారు! ఇంటికి ఎవరు వెళ్లినా గుర్తుగా ఏదొక వస్తువు, నగదు ఇవ్వడం... ఆమె మనసు ఎంత ప్రేమ గలదో అర్ధం చేసుకోవచ్చు !
ఆమెతో చివరిగా మాట్లాడింది నవంబర్ 30; ఆ తరువాత రోజు నుంచి ఆమె గుడ్ మార్నింగ్ లు ఆగిపోయాయి! ఎలాంటి సమాచారం లేదని పలు మార్లు ఫోన్ చేసినా స్పందన లేదు! డిసెంబర్ 2 న ఆమె చనిపోయారు! జనానికి తెలిసింది ఇవాళ డిసెంబర్ 17! నిజంగా దురదృష్టకరం ! ఆమె లేరు , ఆమె జ్ఞాపకాలు పదిలం నా మనసులో ! అంతే, అశ్రు నివాళి!
- డాక్టర్ మహ్మద్ రఫీ
Post A Comment:
0 comments: