వైద్య కళాశాలకు ఆ భూములను తీసుకోవద్దు

పంటలకు నష్టపరిహారం, భీమా సౌకర్యం వెంటనే విడుదల చేయాలి

కేంద్ర ప్రభుత్వం రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకుందామని, వైద్య కళాశాలకు ఆర్ఏఆర్ఎస్ భూములు తీసుకుంటే తీవ్రంగా ప్రతిఘటిద్దామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం నంద్యాల ఆర్ఏఆర్ఎస్ ఆవరణలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో  రైతుసదస్సు వై.ఎన్.రెడ్డి అద్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ 115 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రతో పాటు దక్షిణ భారతదేశానికి నూతన వంగడాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంటూ ప్రత్తి, వరి, జొన్న, కొర్ర, ప్రొద్దుతిరుగుడు,  శనగ, కంది తదితర నూతన వంగడాలను ఉత్పత్తి చేసి వ్యవసాయ శాస్త్రవేత్తల వ్యవసాయ పరిశోధన ఫలితాలను రైతులకు అందిస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందిన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని నిర్వీర్యం చేయాలని అనుకోవడం బాధాకరమన్నారు. నంద్యాల మెడికల్ కళాశాల మంజూరును స్వాగతిస్తున్నామని, అయితే ఆర్ఏఆర్ఎస్ భూములను కాకుండా ప్రత్యామ్నాయ స్థలాలను సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు.

నంద్యాల  వారసత్వ సంపద అయిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని కాపాడుకోవలసిన బాద్యత అందరిపైన ఉందని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీని రైతులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం దిగ్భందించారని ఆ రైతు ఉద్యమ స్ఫూర్తితో నంద్యాల ఆర్ఏఆర్ఎస్ భూములను కాపాడుకునేందుకు ఉద్యమిద్దామన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు,ఉద్యోగులు, కార్మికులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఐక్య ఉద్యమం ఉదృతం చేద్దామని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు ప్రజా ప్రతినిధులందరూ ముఖ్యమంత్రి దృష్టికి ఆర్ఏఆర్ఎస్ భూముల సమస్యను తీసుకెళ్ళి నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇటీవల కురిసిన తుఫాను వలన నష్టపోయిన పంటలకు నష్టపరిహారం, పంటల భీమా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు కూడా తమ గ్రామ పరిధిలోని రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి తమ పంటల ఈక్రాఫింగ్ నమోదు, పంటల భీమా నమోదును చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా రైతు ఉద్యమం కొనసాగిద్దామని ఆయన కోరారు.  కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలు రైతుల అపనమ్మకానికి కారణమయ్యాయని అందువలనే లక్షలాది మంది రైతులు దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని దిగ్బంధం చేశారన్నారు. రైతులకు చట్టబద్దమైన కనీస మద్దతు ధర, రాజ్యాంగబద్ద వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమిటీని ఏర్పాటు చేయాలని దశరథరామిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.   కె.సి.కెనాల్ కు ప్రపంచ వారసత్వ సాగునీటి నిర్మాణంగా గుర్తింపు సాధించిన రాష్ట్ర ప్రభుత్వం కె.సి.కెనాల్ కు సక్రమంగా సాగునీరు అందించే గుండ్రేవుల రిజర్వాయర్ ను  తక్షణమే చేపట్టాలని కోరారు.

ఆర్ఏఆర్ఎస్ వ్యవసాయ కార్మికురాలు ఎల్లమ్మ మాటలు రైతుల కంట కన్నీరు కార్చేలా చేసిందని అన్నారు. ఆత్మకూరు కు చెందిన ప్రముఖ  సీనియర్ వైద్యులు డాక్టర్ డి.నాగన్న మాట్లాడుతూ నంద్యాల మెడికల్ కళాశాలకుఆర్ఏఆర్ఎస్ భూములు తీసుకుని ఇటు రైతులను అటు కార్మికులకు అన్యాయం చేయవద్దని, శివారు ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం నంద్యాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. వైద్య కళాశాల వల్ల ఏర్పడే కాలుష్యం నంద్యాల పట్టణ అభివృద్ధికి నష్టం కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు.  ప్రముఖ సీనియర్‌ న్యాయవాది బి.శంకరయ్య మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానం భూములను మెడికల్ కళాశాలకు ఇవ్వడం ప్రభుత్వానికి తగదని నంద్యాల పట్టణ సమీపంలోనే మెడికల్ కళాశాలకు అవసరమైన ప్రభుత్వ భూములు ఉన్నాయని లేదా భూసేకరణ చేసి మూతబడ్డ 126 ఎకరాల షుగర్ ఫ్యాక్టరీ భూములలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయవచ్చని ప్రభుత్వానికి సూచించారు. నంద్యాల ప్రాంత రైతు ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామాలలో జోలెపట్టి భిక్షమెత్తుకుని ఆనిధులు మెడికల్ కళాశాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసి ఆర్ఏఆర్ఎస్ భూముల వైపు చూడకుండా చేద్దామని కోరగా సభలోని వందలాది మంది రైతులు హర్షధ్వానాల మద్య రైతుల తీర్మానాన్ని ఆమోదించారు. 

ఆర్ఏఆర్ఎస్ లో కూలీపని చేసుకుని జీవించే 300వందల నిరుపేద కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయం వలన రోడ్డుపాలు కావలసి వస్తుందని వ్యవసాయ కార్మికురాలు ఎల్లమ్మ రైతుసదస్సులో రోదిస్తూ వివరించగా మీకు అండగా ఉద్యమిస్తామని రైతుసదస్సు భరోసా ఇచ్చింది. రాయలసీమ సాగునీటి సాధన సమితి అనంతపురం జిల్లా ప్రతినిధి మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఆర్ఏఆర్ఎస్ భూములను కాపాడుకునేందుకు రాయలసీమ స్థాయిలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని అన్నారు. ఆర్ఏఆర్ఎస్ భూములను కాపాడుకునేందుకు న్యాయపోరాటం, క్షేత్ర స్థాయిలో ప్రజా ఉద్యమం తీవ్రతరం చేద్దామని రైతుసదస్సు తీర్మానించింది.ఈ సదస్సులో నంద్యాల పార్లమెంట్ పరిధిలోని వందలాది మంది రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధులు స్వచ్చందంగా పాల్గొన్నారు. అనంతరం ఆర్ఏఆర్ఎస్ ప్రధాన ద్వారం ముందు నిరసన తెలుపుతున్న కార్మికులు, ఉద్యోగులకు రాయలసీమ సాగునీటి సాధన సమితి రైతు బృందం సంఘీభావం తెలిపింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: