గెలుపెవరిది...?

ఉత్కంఠ రేపుతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు

గెలుపుకోసం అన్ని పార్టీలు సమాయత్తం

దుబ్బాక గెలుపుతో ఊపుమీదున్న బీజేపీ

గత అనుభవాలతో టీఆర్ఎస్ ఆచితూచి అడుగులు

పాత సీటు కోసం కాంగ్రెస్ యత్నాలు


తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో అందర్ని ఆకర్షించిన దుబ్బాక ఉప ఎన్నికల తరహాలోనే ప్రస్తుతం నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు కూడా ఆసక్తిగా మారాయి. అధికార టీఆర్ఎస్ సీటు అయిన దుబ్బాకను బీజేపీ కైవసం చేసుకోవడంతో అధికార టీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక గత దుబ్బాక అనుభవాలను గుర్తుంచుకొన్న టీఆర్ఎస్ ఈ సారి నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తన పట్టునిలుపుకోవాలని యోచిస్తోంది. ఇక నాగార్జున సాగర్ అసెంబ్లీ ఒకపుడు కాంగ్రెస్ ఖాతాలో ఉండేది. దీంతో ఈ ఉప ఎన్నికలతోనైనా సరే ఆ సీటును తిరిగి తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు చేస్తోంది.

ఇదిలావుంటే నల్గొండ జిల్లా లోని నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో గెలుపు కోసం అన్ని పార్టీలు కసరత్తును ప్రారంభించాయి. నాగార్జున సాగర్ నియోజక వర్గ ఎమ్మెల్యే నోముల నరసింహం ఇటీవలే ఆకస్మికంగా మరణించారు. దీంతో మరోమారు తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలపై  అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఈ ఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్యే త్రిముఖ పోటీ నెలకొంది. బిజెపి పార్టీ ఇప్పటినుంచే ప్రచార పంథా ను అవలంభిస్తోందని తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా కార్యకర్తల గ్రూపులను నమోదు చేసి బలాన్ని ప్రోగు చేసుకునే పనిలో నిమగ్నమైంది. బిజెపి నేత కంకనా ల నివేదిత ఇప్పటినుంచే ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కార్యకర్తల బలన్ని పెపొందించే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి సైతం ఈ నియోజక వర్గంలో పట్టుంది. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ పార్టీ సైతం గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. తన పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి సమాలోచన చేస్తున్నట్లు సమాచారం.


నోముల నరసింహం మృతి పట్ల ప్రజలు సానుభూతి తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. సానుభూతిని సొంతం చేసుకునే దిశగా తెరాస నేతలు పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల దుబ్బాక ఉపఎన్నికలో బిజెపి పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు విజయంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 49 కార్పొరేట్ సీట్లను గెలిచి ఊపు మీద ఉన్న బిజెపి ఇక్కడ కూడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ ఉపఎన్నికలో కూడా గెలిచి అధికార పార్టీకి చెక్ పెట్టాలని యోచిస్తోంది. తెరాస పార్టీ సైతం పథకం ప్రకారం విజయాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. దుబ్బాక ఉపఎన్నికలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెరాస పార్టీ  అధిష్టానం యోచిస్తోంది. త్రిముఖ పోటీలో చివరకు గెలుపెవరిని వరిస్తుందో వేచి చూడాలి

✍️ రచయిత-డి.అనంత రఘు

అడ్వకేట్...సీనియర్ జర్నలిస్ట్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: