మాట నిలబెట్టుకొన్న సీఎం
అబ్దుల్ సలాం అత్త మాబున్నీసాకు రూ.25 లక్షల ఆర్థిక సహాయం
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నంద్యాలలో ఇటీవల కుటుంబ సభ్యులతో పాటు ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ సలాం అత్త మాబున్నీసాకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఇటీవల కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డిలు నంద్యాలలో మాబున్నీసా ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందించి వచ్చారు. అలాగే, ఇటీవల తుంగభద్ర పుష్కరాల ప్రారంభోత్సవానికి గత నెల 20 న కర్నూలు కు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణంలో ఏపీఎస్పీ బెటాలియన్ గెస్ట్ హౌస్ లో సలాం అత్త మాబున్నీసా, ఆమె కొడుకు, పెద్ద కూతురులను సీఎం పరామర్శించగా ఆ సందర్భంలో. సంఘటనకు కారకులైన పోలీసు సీఐ, కానిస్టేబుల్ ల బెయిల్ రద్దు చేయించాలని, అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో క్లర్కుగా పని చేస్తున్న తన కుమారుడు షేక్షావలీని నంద్యాలకు బదిలీ చేయించాలని, తన పెద్ద కూతురు కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మాబున్నీసా సీఎంకు విజ్ఞప్తి చేయగా సలాం అత్త మాబున్నీసా కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, మాబున్నీసా అడిగిన వినతులను వెంటనే తీర్చాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్పలను ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సలాం అత్తకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తరఫున నంద్యాల కోర్టులో ప్రత్యేక పిటిషన్ను వేయించి సలాం సంఘటనకు బాధ్యులైన సీఐ, కానిస్టేబుల్ ల బెయిల్ ను రద్దు చేయించి చట్ట ప్రకారం జ్యూడిషియల్ రిమాండ్ కు వెళ్లేలా చర్యలు చేపట్టారని, అలాగే, సలాం అత్త మాబున్నీసాకు ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు కుమారుడు షేక్షావలీని అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి నంద్యాల వైద్య ఆరోగ్య శాఖకు మాట ఇచ్చిన రోజే బదిలీ చేయించారన్నారు.
సలాం అత్త మాబున్నీసా పెద్డ కూతురి కుమార్తె రేష్మకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నెరవేరుస్తూ.. శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ నంద్యాల వెళ్లి స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డితో కలిసి మాబున్నీసా పెద్ద కూతురు కుమార్తె (మనుమరాలు) రేష్మ కు పశుసంవర్ధక శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జెడి డా.రమణయ్య, మార్కెట్ యార్డు చైర్మన్ ఇషాక్ బాష, మైనారిటీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ విధంగా సలాం అత్త మాబున్నీసా కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు, ఇటీవల కర్నూలులో తనకు ఇచ్చిన హామీలను ఇంత త్వరగా తీర్చిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి తమ కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటామని సలాం అత్త మాబున్నీసా, ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలను తెలిపారు.
Post A Comment:
0 comments: