2020..విజన్ కాదు...ఓ మెసేజ్

 


2020... ఎన్నో దశాబ్దాలుగా ఎంతోమంది కలలు కన్న విజన్. ప్రపంచమంతా ఎన్నో ఆశలు, ఆశయాలతో 2020 విజన్ సాధించుకునేందుకు ముందుకు సాగింది. శాస్త్రవేత్తలు, మేథావులు, రాజకీయనాయకులు ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల వారూ తాము అనుకున్న గొప్ప లక్ష్యాలు, ధ్యేయాలను 2020కల్లా సాధించుకోవాలని కలలు కన్నారు. అయితే అందరి ఆశయాలపై, ఆశలపై, లక్ష్యాలపై కరోన బుసకొట్టింది. అందరి ఆశలపై నీళ్లుచల్లింది. కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ప్రపంచం చవిచూసింది. ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. కంటికి కనిపించని పురుగు దశాబ్దాలుగా మనిషి సాధించిన శాస్త్రసాంకేతికతను వెక్కిరించింది. చేతిలో ఏమీలేకపోయినా మాటిమాటికీ చేతులు కడుక్కునేలా చేసింది. నిర్బంధంగా మాస్కుధరించేలా చేసి అందరి నోటికి తాళాలు వేయించింది. ప్రకృతి మనిషి గుత్తాధిపత్యం కాదని, ప్రపంచ వనరులకు, ప్రాణకోటికంతటికీ పైన బిగ్ బాస్ ఉన్నాడనే విషయం 2020 తెలిసొచ్చేలా చేసింది. మనిషి కట్టుబాట్లకు, నియమనిబంధనలకు లోబడి జీవితాన్ని గడపాలనే సందేశాన్ని ఇచ్చింది. పుట్టుకే కాదు, చావూ మన చేతులో లేదని చెప్పకనే చెప్పింది. మనిషి జీవితం క్షణభంగురమని, ప్రాణం పోకడ, రాకడ మనచేతిలో లేవనే విషయాలు కళ్లముందే తెలిసివచ్చాయి. పారిశుద్ధ్యం, పరిశుభ్రత పాటించడం, పరిశుద్ధ వస్తువులను తినాలన్న ఖుర్ఆన్ ఉద్బోధ పాటించడమే మనందరికి మేలైన పద్ధతి అన్న విషయం బోధపడింది. వృథాను అరికట్టి పొదుపుగా ఎలా వాడుకోవాలో నిర్బంధంగా తెలియజేసింది.  వృథా ఖర్చు చేయకండి అన్న ఖుర్ఆన్ సూక్తి నిర్భంధంగా అమలయ్యింది. ప్రేమ, కరుణ, ధాతృత్వం అలవర్చుకోవాలన్న అల్లాహ్ సూచనలు కళ్లముందు కనిపించాయి. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయిన ఎంతోమందికి ఆపన్నహస్తం అందించారు. ధాతృత్వం వెల్లివిరిసింది. తమ సొంత ఆస్తులను సైతం అమ్మేసి తోటి వారి అవసరాలను తీర్చిన త్యాగాలు మన చుట్టూ కోకొల్లలు జరిగాయి. ఎంతోమంది అయినవారిని, అందరి వారిగా చెలామణి అయిన ఎంతోమంది ప్రముఖులనూ కోల్పోయాము. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు, అందరూ ఎప్పుడో అప్పుడు పోవాల్సిన వారమేనన్న చేదు వాస్తవాన్ని కరోనా మాటిమాటికీ గుర్తుచేసింది. కరోనా మిగిల్చిన సంక్షోభాలనుంచి, విషాదాల నుంచి గుణపాఠాలను నేర్చుకుని ముందుకెళితే 2021 సంతోషాలకు, సౌభాగ్యాలకు నాంది పలకవచ్చు. విజన్ 2020 కాస్తా మెసేజ్ 2020గా మహా సందేశమే ఇచ్చి వెళ్లిపోయింది.

✍️ రచయిత-ముహమ్మద్ ముజాహిద్

సెల్ నెం-96406-22076

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: