వైసీపిని....

అజేయశక్తిగా నిలిపిన 2020

ఇతర పార్టీల నేతల రాకతో నిండు కుండలా వైసీపీ

లోలోన లుకలుకలు...అయినా గీతదాటకుండా నియంత్రించిన నాయకత్వం

ప్రతిపక్షాలకు ప్రశ్నించే అవకాశమే లేకుండా...కలిసొచ్చిన లాక్ డౌన్ కాలం

సంక్షేమంలో దూకుడు...సాహసోపేత నిర్ణయాలు

మూడు రాజధానుల నిర్ణయంపై  జనంలోకి....ప్రతిపక్షాలపై పైచెయ్యి సాధించే యత్నం

నవ్యాంధ్ర తొలిసారిగా అధికారం చేపట్టిన వైసీపీకి 2020 సంవత్సరం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఆ పార్టీ ఓ అజేయశక్తిగా ఎదగడంలో ఈ ఏడాది అవకాశాలు ఆ పార్టీకి బాగా కలిసొచ్చాయి. టీడీపీతో సహా ఇతర పార్టీల నేతల వలసల కారణంగా ఆ పార్టీ నిండుకుండలా తయారైంది. అయితే అదే సందర్భంలో గతానికి భిన్నంగా వైసీపీలో గ్రూపు రాజకీయాలు పైకి కనిపించకపోయినా అసమ్మతి స్వరాలు ఉన్నాయన్న సంకేతాలు ఈ ఏడాదిలో కనిపించాయి. ఇక సంక్షేమ పథకాల దూకుడుతో ప్రతిపక్షాలకు ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా లాక్ డౌన్ కాలం కాస్త వైసీపీకి కలిసొచ్చింది. కారణం ప్రభుత్వ విధానపరమైన కొన్ని నిర్ణయాలను రాష్ట్రంలోని ప్రతిపక్షాలు రొడ్డెక్కి ప్రత్యక్ష ఆందోళనలు చేయలేని పరిస్థితి లాక్ డౌన్ కాలంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు మాత్రం వైసీపీకి మున్ముందు సవాల్ విసిరే పరిస్థితులు 2020వ సంవత్సరంలో నెలకొన్నాయి.

బీజేపీ, జనసేన జట్టుకట్టడం, టీడీపీ కూడా బీజేపీకి దగ్గరయే పరిస్థితులు కనిపించడంతోపాటు సొంతంగా రాష్ట్రంలో ఎదిగేందుకు కమలనాథులు సొంత వ్యూహాలతో ముందుకెళ్లడం మాత్రం వైసీపీకి ఈ ఏడాదిలో కొంత రుచించని పరిణామం. దేవాలయాలు, ఇతర మతపరమై అంశాలతో బీజేపీ దూకుడు పెంచడంతో వైసీపీకి అపుడపుడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏడాదిలో ఎదురయ్యాయి. అదే సందర్భంలో వైసీపీ లో గ్రూపు రాజకీయాలకు బీజంపడ్డ అది రొడ్డెక్కే స్థాయికి ఇంకా రాకపోవడం ఆ పార్టీకి కొంత ఆశాజనకంగా మారిన ఈ ఏడాదిలో అదే పార్టీకి చెందిన ఎంపీ రఘురామ సొంతపార్టీపై గళం ఎత్తుతున్న తీరు మాత్రం కాస్త రుచించని విధంగా తయారైంది. కరోనా అంశం పక్కనెడితే రాజకీయంగా చూసుకొంటే వైసీపీకి 2020 సంవత్సరం మాత్రం ఆశాజనకంగానే మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీకి 2020 సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా జరగకపోయినా ఏకగ్రీవాల రూపంలో కొన్ని స్థానాలను నిలుపుకొని తన ప్రభావం చాటింది.


నిండుకుండలా

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక... ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరతీసి... 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తనలో కలిపేసుకుంది టీడీపీ. ఇప్పుడు కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆ పార్టీకి అధికార వైసీపీ నుంచి ప్రతి రోజు సవాళ్లు ఎదురవుతున్నాయి. టీడీపీ నుంచి భారీగా వైసీపీలోకి వలసలు ఈ ఏడాది సాగాయి. టీడీపీ లాగా తాము ఫిరాయింపులకు ప్రోత్సహించే ప్రసక్తే లేదని వైసీపీ అధినేత, సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించడంతో... ఆపరేషన్ ఆకర్ష్ అనేది వైసీపీ నుంచీ ఉండకపోయినా... టీడీపీకి రాజీనామా చేసి... తిరిగి ఉప ఎన్నికలు రప్పించి... వాటిలో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచే ఆలోచనలో ఇప్పటికే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ప్లాన్స్ వేసుకుంటున్నట్లు తెలిసింది. ఇలా ఈ ఏడాది వైసీపీ బలోపేతం అవ్వడానికి దోహదపడింది. అదే సందర్భంలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిందన్న ఆరోపణలు ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకొంటోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా భారీసంఖ్యలో వైసీపీలో చేరారు.

 

సంక్షోభంలోనూ సంక్షేమం...ఇదే వైసీపీకి 2020 కలిసొచ్చేలా చేసింది...?

కరోనా సంక్షోభంతో యావత్తు ప్రపంచం ఆర్థిక పరిస్థితులపై ఆందోళన చెందుతుంటే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం సంక్షోభంలోనూ సంక్షేమ బాటేనని స్పష్టంచేస్తోంది. ప్రజా సంక్షేమం విషయంలో రాజీపడమని చెప్పిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే సంక్షేమ పథకాల అమలుకు అడుగులేస్తోంది. రాష్ట్రంలో ఓవైపు మద్యం అమ్మాకాలు తగ్గిస్తూ తన ఆదాయానికి గండిపడినా ఎక్కడా ఏ మాత్రం ప్రజా సంక్షేమ పథకాలకు వైసీపీ ప్రభుత్వం వెనకడుగు వేయడంలేదు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం వచ్చాక పలు రకాల విపత్తులతో ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. ఈ పరిస్థితుల్లోనూ వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల ఆధాయ వనరులపై శ్రద్ద వహిస్తూనే ఇతర సమస్యల పరిష్కారానికి మొగ్గుచూపుతోంది. ఈ 2020 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల క్యాలండర్ ను ఆ విష్కరించింది. దీంతో మరోసారి సంక్షేమంలో రాజీపడ్డమన్న సంకేతాలను వైసీపీ ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చింది.

 


అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో ఈ  ఏడాదిలో కాస్త దూకుడు పెంచి ప్రతిపక్షాలు ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేసింది. వైసీపీ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు ఎలావున్నా సంక్షేమం విషయంలో మాత్రం ప్రతిపక్షాలకు నోరెత్తే అవకాశమే లేకుండా ఈ సర్కార్ చేస్తోందని రాజకీయ వర్గాల మాట. ఇందుకు తాజా ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇక సంక్షేమ పథకాలలో ఏమైన లోపాలు ఎత్తిచూపే అవకాశం కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ లేకుండా పోయింది. కారణం టీడీపీ గత ఐదేళ్ల పాలనలో 2019 ఎన్నికలకు ముందు ఆరు నెలల కాలంలో సంక్షేమ పథకాలపై నాడు ముఖ్యమంత్రిగావున్న చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఇదే టీడీపీకి ఇపుడు సంకటంగా మారింది. సంక్షేమం విషయంలో నిలదీయలేని స్థితికి టీడీపీ చేరుకొంది.

తొలినుంచే సంక్షేమంపై వైసీపీ దృష్టి...?

అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం వైసీపీ ప్రభుత్వం హిస్టారికల్ డెసిషన్. అమ్మ ఒడి స్కీమ్ ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం తమ పిల్లలను స్కూలుకు పంపించిన ప్రతి తల్లి ఖాతాలో డబ్బులు వేసి ప్రోత్సహిస్తున్నారు జగన్. ఇది ఒకరంగా భవిష్యత్తులో దేశంకు మ్యాన్‌పవర్ ఇవ్వడమేనని వైసీపీ నేతల భావన. పేదల పిల్లలను కూడా ధనికుల పిల్లలతో ఇంగ్లీష్ మీడియం విద్య ద్వారా సమానత్వం కల్పిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత రజకులు, టెయిలర్స్, బార్బర్స్, ఆటో డ్రైవర్స్ క్యాబ్ డ్రైవర్స్, వీళ్లకు ఫైనాన్స్ హెల్ప్ అనేది గత ప్రభుత్వాలు ఎప్పుడూ చేయలేదు. ప్రత్యేకించి కరోనా సమయంలో వారికి చేసిన ఈ సహాయం వారెప్పుడూ మరవలేరు. ఆరోగ్య శ్రీ సంస్కరణలు తీసుకొచ్చారు. వెయ్యి రూపాయలు వైద్యం దాటిన ప్రతి ఒక్కరికీ కుల, మత పార్టీలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఆపరేషన్ జరిగితే రెస్ట్ పీరియడ్‌లో ఇన్‌సెంటివ్స్ ఇస్తామన్నారు..క్యాన్సర్ డయాలసిస్, పెరాలసిస్, పేషంట్స్‌కు పెన్షన్ ఇవ్వడం ద్వారా ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా తన తండ్రి కంటే నాలుగడుగులు ముందుకేసి నిరూపించాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.జగన్ దృష్టి మొత్తం విద్య, వైద్య, వ్యవసాయంపైనే ఉంది. ఈ మూడు కూడా పునరుత్పత్తి పద్దతిలో చూడాలి.

ఈ మూడు రంగాల్లో చాలా స్ట్రాటజిక్‌‌గా వెళుతున్నారని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.అధికారంలోకి వచ్చిన తొలి క్యాబినెట్లోనే ఆర్టీసీ ప్రభుత్వంలోకి విలీనం చేయడం, ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే వివిధ వర్గాల సంక్షేమంపై శ్రద్దపెట్టింది. దీంతో ప్రతిపక్షాలకు ఏ మాత్రం పనిలేకుండా పోయింది. ఇక రాష్ట్రంలో బలపడాలని యోచిస్తున్న బీజేపీ ప్రయత్నాలకు కూడా వైసీపీ సంక్షేమ పథకాలు గండికొడుతున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ వివిధ ప్రభుత్వ విధానాలపై పోరాడినా అది బీజేపీకి కలిసొచ్చింది మాత్రం నామ మాత్రంగా కూడా లేదు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సొంతంగా పోరాడుతూనే బీజేపీ కి మిత్రపక్షంగా చేరారు. దీంతో ఆయన చేసిన పోరాటం సైతం పెద్దగా ఆ పార్టీకి గానీ బీజేపీకి గానీ కలసిరావడంలేదు. పైగా పవన్ కళ్యాణ్ విమర్శలను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం లెక్కలోకి తీసుకోవడంలేదు. తాను చేయదల్చిన సంక్షేమ పథకాల అమలుపైనే ఆయన ప్రధానంగా శ్రద్ద పెడుతున్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఇరకాట స్థితిని ఎదుర్కొంటున్నాయి.

 


పార్టీలో ధిక్కార స్వరాలకు బీజం

ప్రభుత్వ పనితీరును ప్రతిపక్షాలు సైతం గట్టిగా నిలదీయలేని స్థితిలో అధికార పక్షం నుంచే ఏడాదిలో విమర్శలు మొదలయ్యాయి. ఐదేళ్ల పాటు విప‌క్షంలో ఉండ‌గా అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటూ సాగించిన పోరాటాల‌తో చివ‌ర‌కు వైసీపీ అధికార పీఠం ద‌క్కించుకొంది.  తీరా ఆరు నెల‌ల గ‌డ‌వ‌క‌ముందే అప్పుడే పార్టీలో ధిక్కార స్వ‌రాలు పెరుగుతున్న తీరు చ‌ర్చ‌నీయమైంది. తొలుత న‌ర్సాపురం ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్ అధికార పార్టీలో క‌ల‌క‌లం రేపింది. పార్టీ వైఖ‌రికి భిన్నంగా పార్ల‌మెంట్ వేదిక‌పై మాట్లాడ‌డంతో అంత‌ర్గ‌తంగా లుక‌లుక‌లున్న‌ట్టు బ‌య‌ట‌ప‌డింది. దానిపై సీరియ‌స్ అయిన పార్టీ వెంట‌నే ఆయ‌న వివ‌ర‌ణ కోరడం, ఆయ‌న నేరుగా సీఎంని క‌లిసి త‌న వాద‌న వినిపించారు. అయితే అంత‌టితో ఆ క‌థ ముగిసిపోయింద‌ని భావిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న హ‌స్తిన‌లో ఎంపీల‌కు విందు ఏర్పాటు చేశారు. వ్య‌క్తిగ‌తంగా అన్ని పార్టీల నేత‌ను పిలిచి ఆయ‌న విందు ఏర్పాటు చేయ‌డం విశేషంగా మారుతోంది. అందులోనూ దానికి వేదిక‌గా కేవీపీ రామ‌చంద్ర‌రావు ఇంటిని నిర్ణ‌యించ‌డం ఆస‌క్తిరేపింది. అదే స‌మయంలో ర‌ఘురామ‌కృష్ణం రాజు త‌ర్వాత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి కూడా వ్య‌క్తిగ‌తంగా పీఎంతో భేటీ కావ‌డం వెనుక కార‌ణాల‌పై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

వాట‌న్నింటికీ మించి నెల్లూరు వ్య‌వ‌హారం ర‌స‌రంజ‌కంగా మారుతోంది. మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి నేరుగా నెల్లూరులో మాఫియా న‌డుస్తోందంటూ వ్యాఖ్యానించ‌డం పార్టీలో కలకలం రేపుతోంది. ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా సీనియ‌ర్ నేత‌లు ధిక్కార స్వ‌రాలు వినిపిస్తున్న త‌రుణంలో వైసీపీలో ఈ ప‌రిణామాలు ఎటు మ‌ళ్లుతాయన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోంది. ప్ర‌స్తుతం పార్టీ అధిష్టానాన్ని లెక్క చేయ‌కుండా ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ నేత‌లంతా వివిధ పార్టీల నుంచి ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందే వైసీపీ తీర్థం పుచ్చుకున్న‌వారే కావ‌డం విశేషం. పార్టీ ఆవిర్భావం నుంచి జ‌గ‌న్ వెంట ఉన్న వారంతా అధినేత మీద విశ్వాసంతో సాగుతుంటే ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన నేత‌లు మాత్రం త‌మ‌కు తోచిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం. ర‌ఘురామ‌కృష్ణం రాజు అయితే గ‌తంలో వైసీపీలో పనిచేసి, ఆత‌ర్వాత బీజేపీ, టీడీపీ మీదుగా మ‌ళ్లీ జ‌గ‌న్ వ‌ద్ద‌కు చేరారు. ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి కూడా అదే రీతిలో వివిధ పార్టీలు మారి వైసీపీ గూటిలోకి వ‌చ్చారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా అదే రీతిలో పార్టీలో చేరారు. ఇలాంటి వ‌ల‌స నేత‌ల మూలంగానే ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి, ఎవరినీ కలవరు అని, ఎవరి మాట లెక్క చెయ్యరు అని, ఎవరి సలహాలు తీసుకోరు అని, అసలు తమకు లెక్క చెయ్యటం లేదని, సీనియర్లకు లోలోపల నెలకొన్న భావన అడపాదడపా ఇది బయట పడుతూనే ఉందని రాజకీయ విమర్శకుల మాట. 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఉన్న తమను కాదని, నిన్న కాక మొన్న వచ్చిన వారికీ, అవగాహన లేని వారిని అందలం ఎక్కిస్తున్నారనే కోపం సీనియర్లకు ఉంది అన్న చర్చ కూడా లోలోన సాగుతోంది. ఈ ధిక్కార స్వరం, వారం రోజులుగా ఎక్కువ అయ్యింది. వినుకొండ ఎమ్మెల్యే, బహిరంగంగా రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతున్న తీరు పై గళం ఎత్తారు, ఇసుక రీచ్ నుంచి, ఎక్కడికి వెళ్తుందో అర్ధం కావటం లేదని, గరమల్లో గుప్పెడు ఇసుక కూడా ఇవ్వలేక పోతున్నాం అన్నారు. ఇక మరో ఎమ్మెల్యే, 'జిల్లాలో పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఈ జిల్లాలో పాలనా వ్యవస్థ పూర్తిగా దారి తప్పింది. దీన్ని బాగు చేసేందుకు ఎవరో ఒకరు రావాల్సిన అవసరం ఉంది. సరిచేయకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు.' అని సీనియర్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి రెండు రోజుల క్రితం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇక నిన్న నెల్లూరు జిల్లా సీనియర్ నేత ఆనం రాంనాయరణ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఏడాది కేకు సంబరాలు తప్ప, అభివృద్ధి ఏది, 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు, ఇంకో ఏడాది చూస్తా ఇలాగే ఉంటే ప్రభుత్వాన్ని నిలదీస్తా అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు, ఇళ్ళ స్థాలల్లో అవినీతి, రాష్ట్రంలో మత మార్పిడులు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆర్డినెన్స్, తిరుమల భూవివాదం, ఇలా అన్నిటి పై, సొంత ప్రభుత్వం పైనే ఎదురు తిరుగుతున్నారు. ఇక గతంలో స్పీకర్ తమ్మినేని, నాటు సారా మాఫియా పై చేసిన వ్యాఖ్యలు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నీళ్ళు అమ్ముకున్నారు అనే ఆరోపణలు, కరెంటు బిల్లుల పెరుగుదల పై, విజయనగరం జిల్లా సాలూరు వైసీపీ ఎమ్మెల్యే రాజన్నదొర వ్యాఖ్యలు, ఇలా చాలా మంది ఎదురు తిరుగుతున్నారు.

వర్గ విభేదాలు కూడా...?

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే వివిధ జిల్లాలలోని వైసీపీలో వర్గ పోరు మొదలైంది. నెల్లూరు జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు వర్గాలుగా విడిపోయారు అన్న విమర్శలున్నాయి. ప్రకాశం జిల్లాలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదు. పంచాయతీ పెద్దదిగానే ఉంది. ఇదే జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరి దారి వారిదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. మానుగుంట మహేందర్ రెడ్డి సీనియర్ నేత అయినా నియోజకవర్గానికే పరిమితమయ్యారు.

క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో  వైసీపీ విజ‌యం సాధించింది. వైసీపీ నాయకుడు ఆర్థర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆరు మాసాలు బాగానే ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎంట్రీతో ఒక్కసారిగా ప‌రిస్థితులు తారుమారు అవుతున్నాయి. ప్రజ‌ల స‌మ‌స్యలు ప‌రిష్కరించాల్సిన ఎమ్మెల్యే, ఇత‌ర నాయ‌కులు త‌మ స‌మ‌స్యల్లో తామే కూరుకుపోయార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లో భాగంగా బైరెడ్డిని జ‌గ‌న్ ఇక్కడ పార్టీలోకి చేర్చుకున్నారు. దీంతో బైరెడ్డి త‌న హవాను పెంచుకునేందుకు ఎమ్మెల్యేపైనే ఆధిప‌త్యం ప్రద‌ర్శించేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పర్యవేక్షణలో జ‌ర‌గాల్సిన ప‌నులు కూడా తానే అన్నీ అయి చూస్తున్నారు. ఇక రాజధాని ప్రాంతంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే విడదల రజనీ, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిల మధ్య వివాదాలు జగన్ వరకూ వెళ్లినా ఇంతవరకూ ఆ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ పూర్తిగా పాలనపైనా శ్రద్దపెట్టడమేనని తెలుస్తోంది.

బందువులకు టిక్కెట్లు నో

ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి సాహసోపేత నిర్ణయాలు తీసుకొంటున్న వైసీపీ పార్టీ పరంగా కూడా కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకొంది. స్థానిక సంస్థల ఎన్నికలపై 2020వ సంవత్సరంలోనే వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులను స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో నిలపవద్దని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. ఎవరైనా పోటీలో నిలిపితే వారికి బీఫామ్‌లు ఇవ్వకూడదని రీజినల్‌ కోఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రతిపక్షాలకు కరోనా కష్టాలు....వైసీపీకి కలిసొచ్చిన వైనం

దేనికైనా కాలం కాలసిరావాలి అంటారు. ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. ఏపీలో ప్రభుత్వ విధానాలపై పోరాడేందుకు వీలున్నా కరోనా వైరస్ కష్టాలు మాత్రం రోడ్డెక్కలేని పరిస్థితి తెచ్చింది. ఏపీలోని ప్రతిపక్షాలకు ఇదే మైనస్ గా మారుతోంది. ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతవేడిగా సాగినా 2020 సంవత్సరం ప్రతిపక్షాలకు పెద్దగా కలపిరాలేదు. కానీ అధికార వైపీపీ మాత్రం బాగా కలిసొచ్చింది. అనునిత్యం సంక్షేమ పథకాల ప్రకటనతో అధికార పక్షం వైసీపీ ప్రజల్లో ప్రత్యేక ముద్రవేసుకొంటుండగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు పెద్దగా పనిలేకుండా పోయింది. ఇక వైసీపీ సర్కార్ ఎదుర్కొంటున్న సమస్యలలో కోర్టు తీర్పులు వల్ల ఇబ్బందులే తప్పా ఇతర విషయాలలో ప్రతిపక్షాలకు పెద్దగా అవకాశం ఇవ్వడంలేదు.

✍️ రచయిత-సయ్యద్ రహ్మత్

సెల్ నెం-7093951403


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: