ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం
ఘనంగా 136వ ఆవిర్భావ దినం
నంద్యాలలో నిరసన ర్యాలీ
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
దేశంలో కులమతాలకు అతీతంగా ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని నంద్యాల పార్లమెంట్ డీసీసీ అధ్యక్షులు జె లక్ష్మీ నరసింహ యాదవ్ అన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పద్మావతి నగర్ రాజీవ్ భవన్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు జె లక్ష్మీ నరసింహ యాదవ్ పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండా ఎగరవేసే మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం ఢిల్లీ వేదికగా రైతులు చేసిన ఉద్యమానికి మద్దతుగా నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి సంజీవనగర్ పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమం ముగించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహా మాట్లాడుతూ లౌకికవాదం ప్రజాస్వామ్య, ఐక్యత గల దేశంగా భారత దేశాన్ని మార్చడంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని కొనియాడారు. పార్టీ ఆవిర్భవించి నేటికి 136సంవత్సరాలు అయిందని ఎన్నో అసమానతలు అడ్డంకులు ఉన్నప్పటికీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారతదేశం అత్యంత పేద దేశం అయినప్పటికీ భారత రాజ్యాంగ ఆలోచన విధానాల వల్ల నేడు ప్రపంచంలోనే సూపర్ పవర్ గా భారతదేశం ఎదిగిందన్నారు. ప్రపంచంలో అన్ని రంగాలలో భారతదేశాన్ని అగ్ర స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిందని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ నమ్మకానికి అమ్మలాంటి పార్టీ అని దేశమంటే ప్రజలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని అన్నారు. కుల మత లింగ భేదాలు లేకుండా ఎల్లప్పుడూ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ కు నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంగళం పాడుతుందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫీజ్ రీఎంబర్స్మెంట్ పథకాన్ని కూడా జగన్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని తీసివేస్తే కొన్ని లక్షల మంది ఉన్నత విద్యకు గొడ్డలిపెట్టు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కోటి మందికిపైగా రైతులు చేస్తున్న ఉద్యమానికి బిజెపి పార్టీ బలికాక తప్పదని హెచ్చరించారు. దేశానికి రైతే వెన్నెముక అని కాంగ్రెస్ పార్టీ రైతుల మేలు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే నేడు బిజెపి పార్టీ రైతు వెన్నెముకను విరిచేసే విధంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకువచ్చి దేశంలో ఉన్న రైతులందరినీ కూడా రోడ్లపాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నంపెట్టే రైతును ఈ కార్పొరేట్ నల్ల చట్టాల వల్ల కార్పొరేట్ కూలిగా, బానిసగా మార్చే ప్రయత్నం బిజెపి పార్టీ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు మోడీ ప్రభుత్వం భారత ప్రభుత్వ సంస్థలన్నింటినీ కార్పోరేట్ మయం చేస్తూ గతంలో అ అంటే అమ్మ ఆ అంటే ఆవు అని చదువుకునేవారని, నేడు మోడీ అమిత్ షా జోడీ వల్ల అ అంటే అంబానీ, ఆ అంటే ఆదానీ అనే స్థాయికి భారతదేశాన్ని తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఉద్యమాలకు భయపడి మోడీ ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించకుండా వెనుకడుగు వేసిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చట్టం తీసుకువస్తే దానికి బీజేపీ పార్టీ ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇస్తామని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా నాడు బిజెపి ప్రముఖ నాయకులు వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రజలను నమ్మించి వంచనకు గురిచేశారని, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బిజెపి పార్టీకి సరెండర్ అయ్యారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ తెచ్చే దమ్ము రెండు పార్టీలకు లేకుండా పోయాయని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక హోదాతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే చేస్తారని మన నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నో వేదికల్లో తెలియజేశారని చెప్పారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధికార ప్రతినిధి ఊకొట్టు వాసు అధ్యక్షత వహించగా జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి భరత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్లా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఫారూక్, జిల్లా కార్యదర్శి కరాటే బాలకృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ రహమాన్, జిల్లా ఉపాధ్యక్షులు గంధం మల్లేశ్వర్రెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు పఠాన్ హబీబ్ ఖాన్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బోయ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ కౌన్సిలర్లు అబ్దుల్ సలామ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: