కేంద్ర ప్రజావ్యతిరేక వైద్య చట్టాల ను రద్దు చేయాలని....
ఈ నెల 11వ తేదీ దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్
(జానో జాగో వెబ్ న్యూస్-- కర్నూలు జిల్లా ప్రతినిధి)
కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన నేషనల్ మెడికల్ కమిషన్, అదేవిధంగా నీతి అయోగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీల నేపథ్యంలో, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్ (భారతీయ వైద్య కేంద్ర మండలి) ఆయుర్వేద కోర్సులు చేసిన వారికి ఆయుర్వేద వైద్యం అందించడంతో పాటు ఆధునిక వైద్యంలో ఉన్న 58 రకాల శస్త్ర చికిత్సలు చేయడానికి అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా పారామెడికల్ కోర్సులు చేసినవారికి స్వల్పకాల శిక్షణ ఇచ్చి ఆధునిక వైద్య చికిత్స అందించే అనుమతులు ఇవ్వడం, సాధారణ డిగ్రీలు చేసినవారికి స్వల్పకాల శిక్షణతో అల్లోపతీ వైద్యం చేయడానికి పబ్లిక్ హెల్త్ వర్కర్స్ పేరుమీద అనుమతివ్వడం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అత్యవసర చికిత్సలు మినహాయించి దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాధారణ వైద్య సేవలు బంద్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో, నంద్యాలలో కూడా ఆ రోజున అత్యవసర సేవలు మినహా అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో సాధారణ వైద్య సేవలు పూర్తిస్థాయిలో నిలిపివేయడం జరుగుతుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల నాయకులు తెలిపారు. ఈ విషయాలను నంద్యాలలో సోమవారం సాయంత్రం మధుమణి నర్సింగ్ హోమ్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, డాక్టర్ మధుసూదన రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ మధుసూదన రావు, నంద్యాల ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్ గుప్తా, మాజీ అధ్యక్షులు డాక్టర్ వినోద్, తెలియజేశారు. ఈనెల 8వ తేదీ మంగళవారం ఉదయం నంద్యాల ఐఎంఏ శాఖ ద్వారా వైద్యులు నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ వైద్యవిధానంలో శిక్షణ పొందితే ఆ వైద్య విధానం ద్వారా ప్రజలకు వైద్యం అందించాలని, ఆ విధంగా కాకుండా అన్ని రకాల వైద్య విధానాలను కలిపేసి వైద్యం అందించడం ద్వారా ప్రజలకు హాని కలుగుతుందన్నారు. ఇది తిరోగమన చర్యగా అభివర్ణించారు. అన్ని రకాల వైద్య విధానాల అభివృద్ధికి వేరువేరుగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ వైద్య విధానానికి తాము వ్యతిరేకం కాదన్నారు. సరైన శిక్షణ లేకుండా ఆధునిక వైద్యం అందించే అవకాశం ఇవ్వడం ద్వారా ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు.
ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఈ నిర్ణయాల రద్దు కోసం చేస్తున్న వైద్యుల ఉద్యమానికి సహకరించవలసిందిగా ప్రజలను, ప్రజాసంఘాలను కోరారు.
Post A Comment:
0 comments: