దాచిన దాగని నిజం
నాడు కరోనాకు ఒక వర్గాన్ని దోషిగా చూపే యత్నం
నేడు వాస్తవాలు వెలుగులోకి

రచయిత-సయ్యద్ రహ్మత్
సెల్ నెం-7093951403
నిజం నిపులాంటిది. దాన్ని దాయాలన్న సాధ్యంకాదు. తాత్కాలికంగా నిజాన్ని అణగద్రొక్కే ప్రయత్నం చేసినా ఆ తరువాతైనా అది విస్పోటనంగా వెలుగులోకి వస్తుంది. అలాంటి ఘటనలే తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. యావత్తు ప్రపంచాన్ని నేడు కరోనా వైరస్ పట్టిపీడుస్తోంది. ఇలాంటి వైరస్ పై పోరాడాల్సిన తరుణంలో ఈ వైరస్ వచ్చేందుకు తబ్లీగులే కారణమని కొన్ని దుష్టశక్తులు ప్రచారం చేస్తే దాన్ని మరింత విస్త్రుతం చేసే బాధ్యత మనదేశంలోని కార్పోరేట్ మీడియా తీసుకొంది. ఈ మీడియాను గోది మీడియా...ఇంకో మీడియా అని బయట ప్రచారముంది. కానీ వ్యాపార యోచనతో కూడిన కార్పోరేట్ మీడియా అంతా ఇలా అమ్ముడుపోయిందనే చెప్పవచ్చు. అయితే కరోనా వైరస్ కు తబ్లీగులే కారణం కాదని, ఈ వ్యాధి భారిన పడినవారిలో తెలియక తబ్లీగులు కూడా కొందరు ఉన్నారని కొందరు నిష్పక్షపాతంగా వ్యవహరించే కొందరు జర్నలిస్టులు, ఒకటి రెండు మీడియా తమ వాదనలు తెరపైకి వచ్చింది. వీరు మాత్రం సత్యాన్వేషణ కోసం పనిచేశారు. ఇక దేశంలోని యావత్తు మీడియా, అది వివిధ రాష్ట్రాల ప్రాంతీయ మీడియా కూడా ఈ పాపంలో పాలుపంచుకొంది. కానీ అది ఎక్కువ కాలం పనిచేయలేదు. లాక్ డౌన్ సరైన సమయంలో మోడీ ప్రకటించారని, అందుకే యావత్తు దేశం ఎంతో నష్టంనుంచి తేరుకొందని కొందరు చెప్పడం ప్రారంభించారు. దురదృష్టవశాత్తు మన దేశం నేడు కరోనా వైరస్ కేసుల విషయంలో ఐదో స్థానం దాటి నాలుగో స్థానంలో అడుగెట్టిందని ప్రచారం సాగుతోంది. ఇక తబ్లీగులను కరోనా వైరస్ విస్తరణకు కారకులుగా చూపే సమయంలో దేశంలోని ఏ పార్టీ దానిని తీవ్రంగా ప్రతిఘటించలేదు. ఇక ప్రాంతీయ పార్టీలైతే చెప్పనక్కర్లేదు. ఈ విమర్శలకు ఊతమిచ్చేలా అవును మా రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ విస్తరణ కేవలం వారి వల్లే జరిగిందని చెప్పడానికి రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు సైతం ఏ మాత్రం వెనకాడలేదు. కానీ అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల నమోదు ప్రభుత్వాల వైఫల్యాలు ఎత్తిచూపే స్థాయికి ఎగబాకాయి. దీంతో తుబ్లీగీలపై నిందమోపి తప్పించుకోవచ్చని భావించిన ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు ఇపుడు భుజాలను తడుముకొంటున్నాయి. ఇపుడిపుడే దేశంలోని పలు ప్రధాన మీడియాలో కరోనా వైరస్ కట్టడి విషయంలో కథనాలు ప్రచురిస్తున్నాయి. నిజం వెలుగులోకి వచ్చాక కూడా ఇంకా తబ్లీగీలే కారణమని చెబితే ఇక సమాజంలో తమకు చోటే ఉండదని కార్పోరేట్ మీడియా భావించింది. అంతేకాదు ప్రాంతీయంగా, జాతీయంగా తాము వంతపడే పార్టీల ప్రభుత్వాలు సైతం ఇరకాటంలో పడటంతో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు ఇపుడు వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇపుడు వాస్తవం చెప్పడం వారికి అనివార్యం. అందుకే ప్రజా విశ్వాసం కోల్పోయిన మన దేశ మీడియా ఇపుడు తాను మోసే పార్టీల కోసం, ప్రభుత్వాల కోసం నిష్పక్షపాతంగా పనిచేసే ప్రక్రియలో నిమగ్నమయ్యాయి.

ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలు...?
కరోనా వైరస్ విస్తరణ తొలినాళ్లలో దీనికి ముస్లిం సమాజమే కారణమన్నట్లుగా ప్రచారం మొదలేశారు. కానీ తాజాగా వివిధ పత్రికలు, వారి వెబ్ సైట్లలో విచిత్రకరమైన కథనాలు వస్తున్నాయి. అయితే అవి వాస్తవంతో కూడుకొన్నవే. కానీ  ఈ పనియే నాడు చేయాల్సింది నేడు అనివార్యంగా అవి ప్రచారం చేస్తున్నాయి. ఇటీవల పలు పత్రికల్లో జాతీయ, ప్రాంతీయ మీడియాలో వారి వెబ్ మీడియాలో ఆసక్తికర కథనాలు వస్తున్నాయి. అవి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రావడం ఇక్కడ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కారణం మొన్నటి వరకు దేశంలో బీజేపీ వల్లే వైరస్ భయపడిందన్న వాళ్లు సైతం నేడు వాస్తవాలు చెప్పక తప్పని పరిస్థితి. ఈ కింద పేర్కొన్న కథనం కూడా వివిధ పత్రికలు, వాటి అధికారిక వెబ్ సైట్లలో వచ్చిన వాటి సారాంశమే. వాటిని ఓ సారి పరిశీలిద్దాం.కరోనా వైరస్ రోజురోజుకు దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారా... ? అన్న చర్చ దేశ వ్యాప్తంగా మొదలైంది. అదే సందర్బంలో లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్రం నుంచి భారీ ఎత్తున్న ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని ఆశించాయి. కానీ ప్రధాని నరేంద్ర మోడీ అద్భుత ప్రసంగాలు, స్వీయ జాగ్రత్తలు తప్పా ఈ క్లిష్ట సమయంలోఆదుకొన్నది ఏమీ లేదని స్వయంగా మొన్నటి వరకు కేంద్రానికి వంతపాడిన రాష్ట్ర ప్రభుత్వాలు సైతం విమర్శలు మొదలెట్టాయి. ఇందుకు తెలంగాణ రాష్ట్రం కూడా మినహాయింపు ఏమీ కాదు. ఇక వివరాలలోకి వెళ్లితే ...ప్రపంచంలో పలు దేశాలను కరోనా మహమ్మారి భయాందోళనలకు గురి చేస్తున్నప్పటికీ అది మన దేశానికి విస్తరించకుండా తగిన చర్యలు తీసుకునే విషయంలో భారత్‌ ఆలస్యంగా మేల్కొంది అన్నది ఇపుడు వస్తున్న కథనాల సారాంశం. భారత్‌లో జనవరి 30వ తేదీనాడే తొలి కరోనా కేసు బయట పడినప్పటికీ అంతర్జాతీయ విమాన సర్వీసులను మార్చి చివరి వారం వరకు అనుమతించడం పెద్ద పొరపాటని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు అని ఇటీవల ఓ తెలుగు మీడియా వెబ్ సైట్ లో కథనం వచ్చింది. చైనాలోని వుహాన్‌ నగరంలో చిక్కుకున్న భారతీయులను ప్రత్యేక విమానంలో ఫిబ్రవరి మూడవ తేదీన భారత్‌కు తీసుకువచ్చి, వారికి సైన్యం ద్వారా ప్రత్యేక క్వారెంటైన్‌ శిబిరం ఏర్పాటు చేయించిన కేంద్ర ప్రభుత్వం ఆ స్ఫూర్తిని అలాగే కొనసాగించడంలో పూర్తిగా విఫలమైందన్నది మన దేశంలోని వైద్య నిపుణుల వాదన అని పేర్కొంటున్నాయి. అప్పుడే అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసి, మిలటరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్వారెంటైన్‌ శిబిరాన్ని అలానే కొనసాగించి ఉన్నట్లయితే పరిస్థితి నేడు ఇంత తీవ్రంగా ఉండేది కాదని వారంటున్నారు.అందుకనే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించి కఠినంగా అమలు చేయాల్సి వచ్చింది. విదేశాలకన్నా కఠినంగా దేశంలో లాక్‌డౌన్‌ను దాదాపు 75 రోజులపాటు భారత ప్రభుత్వం కొనసాగించింది. లాక్‌డౌన్‌ను జూన్‌ 8వ తేదీ నాటికి దశలవారిగా భారీగా సడలిస్తూ వచ్చింది. లాక్‌డౌన్‌ను సడలిస్తూ వస్తున్న క్రమంలో దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతూ వచ్చాయి. లాక్‌డౌన్‌ నాటికి వందల్లో ఉన్న కేసులు నేటికి మూడు లక్షలు దాటాయి. ఏప్రిల్‌ ఆరో తేదీ నాటికి దేశంలోని 417 జిల్లాల్లో కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఆ తర్వాత రెండు నెలల్లోనే కరోనా లేని జిల్లాల సంఖ్య 49కి పడి పోయింది. ఈ నేపథ్యంలో జూన్‌ 25వ తేదీ నుంచి దేశంలో లాక్‌డౌన్‌ను తిరిగి విధిస్తారని, ఆ విషయాన్ని సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో వీడియో కాన్ఫరెన్స్‌ జరపుతారనే వార్త రుజువు చేస్తోందంటూ తెగ ప్రచారం జరగుతోంది. అది నిజమవుతుందా? అందుకు అవకాశం ఉందా? ఇప్పటి వరకు విధించిన లాక్‌డౌన్‌ను ఫలించిందా ? అన్నది ప్రస్తుతం మీడియాలో వస్తున్న కథనం. ‘భారత్‌ లాక్‌డౌన్‌కు కరోనా లొంగలేదు’ అని కేంద్ర ఆరోగ్య శాఖకు సలహా సంస్థగా పని చేస్తున్న ‘నేషనల్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ రిసోర్స్‌ సెంటర్‌’ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టీ.సుందరరామన్‌ వ్యాఖ్యానించారు. ‘భారత్‌ లాంటి అధిక జనాభా కలిగిన దేశంలో లాక్‌డౌన్‌లు పని చేయవు’ అని ప్రముఖ ఎపిడమాలోజిస్ట్‌ జయప్రకాష్‌ ములియాల్‌  అన్నారు. ఈ సమయంలో అందరిపైనా కాకుండా మధ్య వయస్కులు, వద్ధులపై ప్రధానంగా దృష్టి పెట్టడం మంచిదని ఆయన చెబుతున్నారు. ప్రముఖ వైరాలజిస్ట్‌ జాకబ్‌ జాన్‌ కూడా ఇదే వాదనతో ఏకీభవిస్తున్నారు. ‘నీటి ద్వారా కలరా విస్తరిస్తుంది. అలా అని ప్రజలకు నీటి సరఫరాను నిలిపివేస్తామా! ఫిల్టర్‌ చేసి సరఫరా చేయాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌ను విధించడం అంటే ఇక్కడ నీటి సరఫరాను నిలిపి వేయడం లాంటిదే’ అని వాయన వ్యాఖ్యానించారు. ప్రజలను అప్రమత్తం చేసి, స్వచ్ఛందంగా మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటించాలిగానీ లాక్‌డౌన్‌ పునరుద్ధరణ వల్ల ప్రయోజనం ఉండదని ఆయన హెచ్చరించారు. మరోసారి లాక్‌డౌన్‌ విధించే అవకాశం లేదని తాను చెప్పలేనని, విధించినా ప్రయోజనం ఉంటుందన్న గ్యారంటీ లేదని టీ. సుందరరామన్‌ అభిప్రాయపడ్డారు.

నాడు తబ్లీగీలను టార్గెట్ చేసిన నోర్లు ఇపుడేమంటాయి...?
దేశంలో కరోనా వైరస్ ముపు గురించి నాడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పలుమార్లు మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిని తేలికగా తీసుకొన్న కేంద్రం అప్రమత్తం అవ్వడంలో విఫలమైందన్న చర్చ ఇపుడు మొదలవుతోంది. వాస్తవానికి దేశంలో కరోనా వైరస్ తబ్లీగీల వల్లే వ్యాపించిందన్నట్లుగా నాడు ప్రచారం చేశారు. ఇపుడు అదే మీడియా జనవరి 30వ తేదీ నాడే కరోనా కేసు భారత్ లో వెలుగులోకి వచ్చిందని చెబుతోంది. అంటే లాక్ డౌన్ కంటే ముందే కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశముండేదన్నది దానర్థం. నాడు యావత్తు ముస్లిం సమాజం ఇదే ఘోషించి చెప్పింది. కరోనా వైరస్ గురించి గుర్తించే బాధ్యత దేశాన్ని పాలించే ప్రభుత్వానిది, దాని వైఫల్యం నిమిత్తం లేని ఓ వర్గంపై నిందగా మోపడం సరైంది కాదని ముస్లిం సమాజం మొత్తం ఏకతాటిపైకి వచ్చి చెప్పింది. కారణం ఢిల్లీలోని మర్కజ్ వల్ల కరోనా విస్తరించిందని నాడు ప్రచారం చేశారు. కానీ తాజా కథనాల నేపథ్యంలో దేశంలో మర్కజ్ ఘటన కరోనా విస్తరణకు కారణం కాదని ఆ సమావేశం ద్వారా ముస్లిం సమాజంలో పలువురు కరోనా భారినపడటానికి కారణం ప్రభుత్వ వైఫల్యాలే అని మీడియా ప్రస్తుతం తన కథనాల సారంశం ద్వారా అంగీకరిస్తుందా...? చైనాలో కరోనా దూకుడు ప్రదర్శించగానే తమ దేశంలో వాటి విస్తరణ కాకుండా చర్యలు తీసుకొన్న పలు దేశాలు ప్రపంచంలోని వివిధ దేశాలు చవిచూసిన నష్టాలను చూడలేదు. ఆ జాబితాలో క్యూబా, వియత్నం, ఇంకా పలు దేశాలు వస్తాయి. ఇక కరోనా విస్తరించినా విమర్శలను పక్కనెట్టి చట్టం ముందు అందరూ సమానులే అని భావించి చర్యలు చేపట్టిన దేశాలు సైతం నేడు కరోనా కష్టాల నుంచి బయటపడ్డాయి. దానికి తాజా ఉదాహరణ న్యూజిలాండ్. అక్కడి ప్రధాని ఓ మహిళా అయినా కరోనా వైరస్ కారకులెవ్వరూ అన్నది కోణం వెతకకుండా కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకొని ప్రభుత్వం తరఫున చేపట్టాల్సిన చర్యలు చేపట్టి, యావత్తు దేశ ప్రజలను ఏకం చేసి వారిని కరోనా నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై అవగాహన పెంచింది. అందుకే నేడు ఆ దేశం పూర్తిగా కరోనా రహిత దేశంగా నిలిచింది. కానీ మన దేశంలో జరిగిందేమిటీ...? కరోనా విస్తరించిన చాలా రోజుల వరకు దీనికి కారణం తబ్లీగీలేనని నిందలు మోపడంలో కొందరు నిమగ్నమవ్వగా సంపూర్ణ లాక్ డౌన్ పాటిద్దామని కేంద్ర, రాష్ట్రాల నుంచి సందేశాలు వచ్చాయి. అసలు కరోనా కట్టడికి లాక్ డౌన్ లో ఏం చేయాలి అన్నది అధికార యంత్రాంగం జనంలోకి వచ్చి చెప్పింది నామ మాత్రమే. మన దేశంలో నేటికీ మీడియాపై ఆధారపడి అవగాహన పొందే వారు 30 శాతం నుంచి 40శాతం లోపే. మిగితా వారంతా మీడియా ప్రసారాలతో అంతగా చైతన్యం పొందేవారు లేరు. ఇది కూడా కరోనా విస్తరణకు ఓ కారణంగా చెబుతున్నారు మన దేశ ఆరోగ్య నిపుణులు.
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: