ఈ సారి ఈద్ నమాజ్ ఇండ్లలోనే కదా
నమాజ్ ఇలా చేసుకోవాలి
ఈ పద్దతులు పాటించాలి


రచయిత- యండి. ఉస్మాన్ ఖాన్
సెల్-99125-80645
        కోవిడ్ 19 కారణంగా  ముస్లిం సమాజం ఈసారి పవిత్ర రమజాన్ ఆరాధనలన్నీ ఇంటి పట్టునే చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. రోజూ ఐదు పూటల నమాజుతో సహా, జుమా, తరావీహ్ నమాజులు సైతం ఇళ్ళలోనే చేసుకుంటున్నారు. పవిత్ర రమజాన్ ముగుస్తున్నందున ఈద్ నమాజ్ ఎలా చెయ్యాలి.. ఎక్కడ చెయ్యాలి.? అన్నసందేహాలు చాలా మందిని తొలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈద్ నమాజుకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 
           ఈద్ గాహ్ లో సామూహిక నమాజులు (ప్రార్ధనలు) ఆచరించే అవకాశం లేనందున, ఈ సారికి ఎవరి ఇళ్ళలో వారు ఈద్  నమాజు చేసుకోవాలి. ఈద్ నమాజ్ ఇంట్లో చేస్తున్న సందర్భంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు జమాత్ గా ఏర్పడి రెండు రకతులు నమాజ్ చేసుకోవచ్చు.
             ఇంట్లో నలుగురు పురుషులు ఉంటే, ఒకరు ఇమాంగా నమాజు చేయించాలి. ముగ్గురు ముక్తదీలు వెనుక వరుసలో ఇమాంను అనుసరించాలి. ఇమాం ముందు వరుసలో ఉంటాడు..ముక్తదీలు వెనుక వరుసలో నిలబడి అతన్ని అనుసరిస్తారు. వారి వెనుక వరుసలో పిల్లలు, మరో వరుసలో  స్త్రీలు నిలబడాలి. ఎంతమంది ఉన్నా ముందు వరుసలో మగవారు, రెండవ వరుసలో పిల్లలు, వెనుక వరసలో స్త్రీలు. ఎవరూ లేకపోయినా ఒంటరిగానే నమాజు చేసుకోవాలి. మనిషికి మనిషికి మధ్య మూడగుల ఎడం ఉండేలా చూసుకోవాలి. సాధారణ పరిస్థితిలో అయితే, భుజానికి భుజం ఆనించి నమాజు చేయాల్సి ఉండేది. కాని ప్రస్తుతం ఉన్నఈ ప్రత్యేక పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించడానికి షరియత్ పరంగా ఎలాంటి ఇబ్బందీ లేదు. అందుకే  పవిత్రమక్కా మదీనాలు సహా, యావత్ ప్రపంచ ముస్లిం సమాజం ఇదే విధానాన్ని ఆచరిస్తోంది.   
              ఈద్ నమాజులో  ఆరు, లేక పన్నెండు అదనపు తక్బీర్లు ఉంటాయి. 
         ముందుగా, రెండు రకతుల ఈద్ నమాజ్ వాజిబ్ , ఆరు అదనపు తక్బీర్ లతో ఖిబ్లా వైపు అభిముఖమై అల్లాహ్ కోసం చేస్తున్నాను. అని మనసులో సంకల్పం చెప్పుకోవాలి. తరువాత, అల్లాహు అక్బర్ అని తక్బీర్ పలుకుతూ రెండు చేతులు చెవుల వరకు ఎత్తి కట్టుకోవాలి. తరువాత సనా (సుబ్ హానకల్లాహుమ్మ వబిహందిక వతబార కస్ముక అత ఆలా జద్దుక వలాయిలాహ గైరుక..) పఠించాలి. మళ్ళీ అల్లాహుఅక్బర్ అని రెండు సార్లుతక్బీర్లు చెప్పి, మూడవ తక్బీరుకు చేతులు కట్టుకోవాలి. అప్పుడు సూరె ఫాతిహా, (అల్ హం సూరా)రెండవ సూరా (ఏది గుర్తుంటే అది) చదివి అల్లాహుఅక్బర్ అంటూ రుకూ చేయాలి. రుకూలో ' సుబ్ హాన రబ్బియల్ అజీం' అని మూడు సార్లు పలికి, ' సమిఅల్లాహులిమన్ హమిద ' అని రుకూనుండి లేవాలి. రుకూనుండి లేచి నిలబడి, ' రబ్బనా లకల్ హంద్ ' అనాలి. తరువాత అల్లాహుఅక్బర్అని పలుకుతూ సజ్దా చేయాలి. సజ్దాలో ' సుబ్ హాన రబ్బియల్ ఆలా ' అని మూడుసార్లు పలకాలి. రెండు సజ్దాల తరువాత, అల్లాహుఅక్బర్ అంటూ రెండవ రకతుకోసం లేచి నిలబడాలి. మళ్ళీ ఇప్పుడు కూడా ' రబ్బనా లకల్ హంద్ ' అనాలి. రెండవ రకతులో కూడా మొదటి రకత్ లో చేసినట్లూగానే ఖిరత్ చేయాలి. అంటే మొదట సూరె ఫాతిహా, తరువాత మరొక సూరా చదివి, రుకూలోకి వెళ్ళే ముందు అల్లాహుఅక్బర్ అని మూడు సార్లు తక్బీర్ చెప్పి, నాల్గవసారి చేతులెత్తకుండానే రుకూలోకి వెళ్ళాలి. తరువాత మామూలు నమాజుకు లాగానే సజ్దాలు, సలాంతో నమాజ్ ముగుస్తుంది. 
            పన్నెండు అదనపు తక్బీర్ లతో అయితే మొదటి రకతులో యధావిధిగా ఏడు తక్బీర్లు, రెండవ రకతులో ఖిరత్ కంటే ముందు ఐదు తక్బీర్లు చెప్పాలి. ఈద్ నమాజులో అజాన్ , ఇఖామత్ లు ఉండవు.
ఇండ్లలో చేస్తున్న ఈ నమాజ్ లో ఖుత్బా అవసరం లేదు. పఠించడం వచ్చిన వారు ఉండి పఠించినా తప్పులేదు. ఖుత్బా చదవక పోయినా, కేవలం రెండు రకతుల నమాజు చేసినా ' ఈద్ ' నమాజ్ ఇన్షా అల్లాహ్ నెరవేరుతుంది.
ఈద్ నమాజు సూర్యోదయమైన అరగంట తరువాత నుండి చేసుకోవచ్చు. అనివార్యమైతే పది, పదకొండు వరకూచేయవచ్చు, కాని త్వరగా ఆచరించడం  సాంప్రదాయ బద్దమైన ఉత్తమ విధానం. 
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: