రచయిత-- ముహమ్మద్ ముజాహిద్
                                                                                                                   సెల్-96406-22076

లాక్ డౌన్ వేళ ఇంట్లోనే షబేబరాత్ చేసుకొందాం


ఇస్లాం సంప్రదాయంలోని శుభదినాల్లో షబే బరాత్‌ ఒకటి. ఆనాటి రేయి(రాత్రి) మనిషి భాగ్యనిర్ణయం జరుగుతుందని విశ్వసిస్తారు. జననమరణ నిర్ణయాలు, ఎవరికి ఎంత ఉపాధి కల్పించాలి, ఎవరేం కర్మలు చేసుకున్నారో ఇలా ప్రతి ఒక్కరి చిట్టా అల్లాహ్‌ ముందుండే అద్భుతమైన రాత్రి ఇది. ఇస్లాం కాలమానినిలోని 8వ మాసం అయిన షాబాన్‌ నెల 15వ రోజున వచ్చే రాత్రిని షబే బరాత్‌గా చేసుకుంటారు. ఆనాడు అల్లాహ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ముస్లిం సోదరులు ఉపవాసం పాటిస్తారు. రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. షబే బరాత్‌ రాత్రి విశ్వాసులపై అల్లాహ్‌ అపారమైన కారుణ్యాన్ని కురిపిస్తాడని ప్రవక్త (స) తెలిపారు. రమజాన్‌ మాసానికి ముందు వచ్చే షాబాన్‌ నెలకు అధిక ప్రాధాన్యమిస్తారు. ఈ నెలలో ప్రవక్త (స) ఎక్కువగా ఉపవాసాలు పాటించేవారు. నెలలో తొలి పదిహేను రోజులు విరివిగా ఉపవాసాలు పాటించాలని ఆయన సహచరులకు తాఖీదు చేశారు. రంజాన్‌ ఉపవాసాలు ఎలాంటి చీకూచింత లేకుండా గడిపేందుకు పూర్వీకులు షాబాన్‌ నెలలోనే జకాత్‌ ధనాన్ని పేదలకు పంచేవారు. షబే బరాత్‌ రేయి(రాత్రి) తాము చేసుకున్న కర్మలు పరిహారం కావాలని, అల్లాహ్‌ అనుగ్రహించాలని కోరుతూ ఉపవాసాలు పాటిస్తుంటారు.
‘శుభాలు సమృద్ధిగా వర్షించే షాబాన్‌ నెలలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదు. రంజాన్‌ నెలను స్వాగతించే విధంగా ఎవరికి వారు సన్నద్ధం కావాలి. వీలైనన్ని ఎక్కువ ప్రార్థనలు చేసి దైవసాన్నిధ్యాన్ని పొందాలి’ అంటారు అబ్దుల్‌ ఖాదిర్‌ జీలానీ (రహ్మాలై) మహనీయులు.
ఇంట్లోనే జరుపుకోండి.....
షబే బరాత్ వేళ ముస్లిములు పెద్దఎత్తున మస్జిదులో రాత్రి ఇషా నమాజులు ఆచరిస్తారు. తెల్లవార్లూ జాగారం చేస్తూ అల్లాహ్ ఆరాధనల్లో లీనమవుతారు. మరుసటి రోజు తమ పూర్వీకుల సమాధులను సందర్శించి వారి మన్నింపుకోసం అల్లాహ్ ను వేడుకుంటారు. అయితే దేశంలో ప్రస్తుతం కరోనా అంటువ్యాధి తీవ్రంగా ప్రబలుతోంది. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు దేశమంతా లాక్ డౌన్ ను విధించాయి. ఈ నేపథ్యంలో ముస్లిములు తమ తమ ఇళ్లల్లోనే షబే బరాత్ ప్రార్థనలు చేసుకోవాలని మతపెద్దలు చేస్తున్న సూచనలు తూ.చ.తప్పకుండా పాటించాల్సిందే. ఈ మహమ్మారినుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడాలని అల్లాహ్ ను వేడుకోవాలని వారు సూచించారు. కరోనా నేపథ్యంలో షబే బరాత్ ఎలా జరుపుకోవాలో ఉలమాలు పేర్కొన్నారు. స్వీయ నిర్బంధాన్ని పాటించి వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడం  ముస్లిములు ధార్మిక విధిగా భావించాలి. కరోనా మహమ్మారి బెడదనుంచి కాపాడమని అల్లాహ్ ను మనస్ఫూర్తిగా వేడుకొందాం.
షబే బరాత్ ఇలా జరుపుకోండి..
- గురువారం షబే బరాత్ నేపథ్యంలో ఉపవాసం పాటించండి
- ఇంటి పట్టునే ఉంటారు కాబట్టి రోజంతా ఖుర్ఆన్ పారాయణం చేయండి. అరబీ రాకపోతే మీకొచ్చిన భాషలో అనువాదం చదివండి.  
- ఖియాముల్లైల్ (రాత్రి నమాజు) సుదీర్ఘంగా చేయండి. రాత్రంతా నమాజులో లీనమవ్వండి.
- తహజ్జుద్ నమాజు చేయండి.
- జరిగిన తప్పిదాలను మన్నించమని విశ్వప్రభువును వేడుకోండి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: