ఢిల్లీ ఎయిర్‌పోర్టులో డ్యూయల్ ఎలివేటెడ్ ఈస్టర్న్ క్రాస్ టాక్సీవే,,,విమానాల సమయాన్ని తగ్గించేందుకు నిర్మాణం

 ఢిల్లీ ఎయిర్‌పోర్టులో డ్యూయల్ ఎలివేటెడ్ ఈస్టర్న్ క్రాస్ టాక్సీవే

 


దేశంలో అతి పెద్ద ఎయిర్‌పోర్టు అయిన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ఘనత సాధించింది. ఈ ఎయిర్‌‌పోర్టులో డ్యూయల్ ఎలివేటెడ్ ఈస్టర్న్ క్రాస్ టాక్సీవేను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రారంభించారు. దీంతో పాటు నాలుగో రన్‌నేను కూడా ప్రారంభించారు. ఈ ఎలివేటెడ్ టాక్సీవే కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మరిన్ని సర్వీసులు నడపడానికి ఉపయోగపడుతుందని కేంద్రమంత్రి సింధియా వెల్లడించారు. ఇది దేశంలోనే తొలి ఎలివేటెడ్‌ ట్యాక్సీవే కావడం మరో విశేషం.

మన దేశంలోనే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం - ఐజీఐఏ అన్నింటికన్నా పెద్దది. ఈ ఎయిర్‌పోర్టులో నిత్యం 1500 విమానాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఏడాదికి 7 కోట్ల మంది ఈ విమానాశ్రయంలో ఎక్కడం గానీ.. దిగడం గానీ చేస్తారు. అయితే ప్రస్తుతం విమానయాన రంగం మెరుపు వేగంతో విస్తరిస్తుండటంతో దానికి అనుగుణంగా ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా వెల్లడించారు. రాబోయే రోజుల్లో రోజుకు 2 వేల విమానాలు ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు నుంచి సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఇక ప్రయాణికుల విషయానికి వస్తే.. ఏడాదికి ప్రస్తుతం ఉన్న 7 కోట్లను 10.9 కోట్లకు పెరుగుతారని అంచనా వేస్తున్నారు. ఇటీవల ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోందని.. ఈ జూన్ నెలలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 19 శాతం పెరిగి.. 1.25 కోట్లకు చేరుకుందని తెలిపారు.

ఈ ఎలివేటెడ్ టాక్సీ వే పొడవు 2.1 కిలోమీటర్లు. విమానాలు ల్యాండింగ్ అయిన తర్వాత గానీ.. టేకాఫ్ సమయంలో గానీ ఈ డ్యూయల్ ఎలివేటెడ్ ఈస్టర్న్ క్రాస్ టాక్సీవేపైకి వస్తాయని కేంద్ర మంత్రి సింధియా తెలిపారు. దీంతో విమానం సమయం ప్రస్తుతం ఉన్న 20 నిమిషాల నుంచి 10 నిమిషాలకు తగ్గుతుందని వెల్లడించారు. ఈ డ్యూయల్ ఎలివేటెడ్ టాక్సీవేను 44 మీటర్ల వెడల్పు, 47 మీటర్ల గ్యాప్‌తో ఒకేసారి రెండు విమానాలు వెళ్లేలా సిద్ధం చేశారు. దీని ద్వారా ప్రతీ విమానానికి 350 కిలోల ఇంధనం ఆదా అవుతుందని వివరించారు.

దీంతో విమానాలు వేగంగా ల్యాండింగ్, టేకాఫ్ కావడానికి ఉపయోగపడుతుందని వివరించారు. ఈ ఎలివేటెడ్ టాక్సీవేలు.. ఎయిర్‌పోర్టులో ఉన్న టర్మినళ్లు, హ్యాంగర్లను.. రన్‌వేలతో అనుసంధానిస్తాయి. ఈ ఎలివేటెడ్ టాక్సీ వే.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని ఉత్తర, దక్షిణ ఎయిర్‌ఫీల్డ్‌లను అనుసంధానిస్తుంది. దీని ద్వారా మూడో రన్‌వే నుంచి టర్మినల్‌ - 1 కు మధ్య దూరం ఏడు కిలోమీటర్ల మేర తగ్గుతుంది. ఏ - 380, బీ - 777, బీ - 747 లాంటి పెద్ద పెద్ద విమానాలు కూడా దీనిపైనుంచి రాకపోకలు సాగించవచ్చని పేర్కొన్నారు. ఈ ఎలివేటెడ్ టాక్సీవే కింది నుంచి కార్లు, బస్సులు లాంటి వాహనాలు వెళ్లే వీలు కూడా ఉంది.

ఈ నాలుగో రన్‌వే ప్రారంభించిన తర్వాత ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్లే ఎయిరిండియా 821 విమానం తొలిసారి బయల్దేరింది. ఈ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నేతృత్వంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ కన్సార్టియం నిర్వహిస్తోంది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: