కేబినెట్ విస్తరణ వరకు నేను మంత్రినే,,,కిషన్ రెడ్డి
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అధిష్టానం కొత్త సారథిగా మంగళవారం ప్రకటించింది. అయితే తనకు రాష్ట్ర పగ్గాలు అప్పగించటం పట్ల కిషన్ రెడ్డి సంతృప్తి చెందటం లేదని వార్తలు వినిపించాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన్ను ఎంపికి చేసిన సమయంలో కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో ఉండగా.. ఆ విషయంపై స్పందించేందుకు నిరాకరించారు.
రాష్ట్ర బాధ్యతలు అప్పగించినందున ఆయన తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. బుధవారం ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమవ్వగా.. కిషన్‌రెడ్డి ఈ భేటీకి దూరంగా ఉన్నారు. ఆయన ఢిల్లీలోనే ఉన్నా సమావేశానికి హాజరు కాలేదు. ఇటు మంత్రిత్వశాఖ అధికారులు కూడా ఆయన ఇంటికి వెళ్లలేదు. దీంతో కేంద్ర మంత్రిత్వపదవికి ఆయన రాజీనామా చేసినట్లు ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా.. తన మంత్రి పదవికి రాజీనామా చేసే అంశంపై స్పందించారు. ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కిషన్ రెడ్డి కేబినెట్ విస్తరణ వరకు తాను మంత్రినే అని చెప్పారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని అన్నారు.
తాను పార్టీకి విధేయుడినని.. క్రమశిక్షణ గల కార్యకర్తనని చెప్పుకొచ్చారు. గతంలోనూ తాను రెండు సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశానన్న కిషన్ రెడ్డి.. అధిష్టానం నిర్ణయం మేరకు ముందుకు సాగుతానని అన్నారు. జులై 8న వరంగల్‌లో మోదీ పర్యటన తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతానని చెప్పారు. "కేంద్రమంత్రిగా ప్రధాని నాకు బాధ్యతలు ఇచ్చారు. నాకు ఫలానా కావాలని పార్టీ ఎప్పుడూ ఏదీ అడగలేదు. పార్టీ గుర్తించి ఇచ్చిన అన్ని పదవులను నిర్వర్తించా. పార్టీ విధానానికి కట్టుబడి ఉంటా. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. పలు అభివృద్ధి పనులకు మోదీ ఈనెల 8న శంకుస్థాపన చేస్తారు. ఆ సభ నిర్వహణ విషయమై ఇవాళ నేను, బండి సంజయ్ హైదరాబాద్ చేరుకొని స్థానిక నేతలతో చర్చిస్తాం." అని కిషన్ రెడ్డి మీడియాతో వెల్లడించారు.
అయితే బీజేపీలో ఒకరికి ఒక పదవి అనే కాన్సెప్ట్ ఉందని.. దీంతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కిషన్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయన స్థానంలో బండి సంజయ్‌కు లేదా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు.
Home
Unlabelled
కేబినెట్ విస్తరణ వరకు నేను మంత్రినే,,,కిషన్ రెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: