వైసీపీకి షాక్... జనసేనలోకి పంచకచర్ల రమేష్!

 వైసీపీకి షాక్... జనసేనలోకి పంచకచర్ల రమేష్!

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పంచకచర్ల రమేష్ బాబు.. జనసేన పార్టీ గూటికి చేరనున్నారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన పంచకర్ల రమేష్ బాబు.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 20వ తేదీన పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పంచకర్ల రమేష్ మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌తో కలిసి పార్టీలో పని చేయాలని అనుకుంటున్నానని పంచకచర్ల రమేష్ అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ తనను పార్టీలోకి స్వాగతించారని.. కలిసి పని చేద్దామని చెప్పారని వివరించారు. ఈ నెల 20వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు పార్టీలో చేరతానని.. సామాన్య కార్యకర్తలా పని చేస్తాను అని చెప్పారు. తన రాజకీయ అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకుంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం ఒక సైనికుడిలా పని చేస్తానని పంచకర్ల రమేష్ బాబు ప్రకటించారు.

ఆత్మ గౌరవం దెబ్బతినటం వల్లే వైసీపీని వీడానని పంచకర్ల రమేష్ బాబు వెల్లడించారు. వైసీపీలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా ఏడాదిలో పని చేసి చూపించానన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్క రూపాయి సంపాదించానని నిరూపించినా గొంతు కోసుకుంటానని వెల్లడించారు. ఇక, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా ఇంత తొందరగా వేరే అభ్యర్థిని ప్రకటిస్తారని తాను ఎందుకు అనుకుంటానని.. టికెట్ అనేది అంశమే కాదని స్పష్టం చేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: