24 గంటల ఉచిత కరెంట్ ఇస్తాం,,,రేవంత్ రెడ్డి మరో ట్వీట్

 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తాం,,,రేవంత్ రెడ్డి మరో ట్వీట్

రైతులకు ఉచిత విద్యుత్‌కి సంబంధించి అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య గత కొద్దిరోజులుగా వార్ నడుస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయాలన్నీ ఉచిత విద్యుత్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ అంశంతో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా రాజకీయాలు హీటెక్కగా.. బీజేపీ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయింది. తన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించి ప్రచారం చేస్తుందంటూ రేవంత్ ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా.. తాజాగా మరోసారి స్పందించారు

'కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తుంది. కేసీఆర్ కరెంటు అవినీతిని అంతం చేస్తుంది' అంటూ రేవంత్ శనివారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తన పోస్ట్‌కు బైబై కేసీఆర్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఉచిత విద్యుత్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందనే అభిప్రాయం రాజకీయాల్లో వ్యక్తమవుతోంది. దీంతో రేవంత్ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్‌ను రద్దు చేస్తుందని బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది.

ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రచారాన్ని కట్టడి చేసేందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తామనే అంశాన్ని రేవంత్ ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తానా మహాసభల కోసం ఇటీవల అమెరికా వెళ్లిన రేవంత్ రెడ్డి.. అక్కడ ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్ సభ్యులు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలోని రైతులకు కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారని, అది అవసరం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మూడెకరాలలోపు పోలం ఉన్న రైతులే ఎక్కువమంది ఉన్నారని, మూడు గంటలు ఉచిత కరెంట్ ఇస్తే సరిపోతుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బీఆర్ఎస్ మండిపడుతోంది.

రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేసి ఆందోళనలు చేపట్టింది. దీంతో రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలతో ఎన్నికల వేళ రాజకీయం వేడెక్కింది.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: