రమజాన్ స్నేహ స్ఫూర్తికి నిదర్శనం..
హైరదాబాద్ షెహర్ చార్ సౌ సాలా తహెజీబ్ కి నిదర్శనం. విభిన్న మతాలు, సంస్కృతులు, విశ్వాసాలకు నిలయం. ఇక్కడి గంగా-జమునా తహెజీబ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక్కడి ప్రజలు వందల ఏళ్ల కాలం నుండి సామరస్యంగా జీవిస్తున్నారు. ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలుపంచుకుంటారు. పండుగ సంతోషాలను ఎంతో ఉత్సాహంగా పంచుకుంటారు. రమజాన్ నెల వచ్చిందంటే చాలు ఆ సంతోషం రెట్టింపవుతుంది. రోజాలు పాటించే ముస్లిములకోసం ఇఫ్తార్ ఏర్పాట్లు చేసే హిందువులు, క్రైస్తవుల సంఖ్య సిటీలో తక్కువేమీ కాదు. కొంతమంది హిందూ ఫ్రెండ్స్ అయితే ఈ నెల సాంతం ఆహారపు అలవాట్లను, సమయపాలనను మార్చుకుంటారు. ఇక యూత్ ఫ్రెండ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సిటీ నలుమూలల నుండి కులమతాలకు అతీతంగా తమ ఫ్రెండ్స్ తో కలిసి ఓల్డ్ సిటీలో లభించే అరేబియన్ డిష్ లు తినేందుకు వస్తారు. తెల్లవారు ఝామున సహెరీలోనూ ఫ్రెండ్స్ తో కలిసి భుజిస్తారు.. ఓల్డ్ సిటీలోని మదీనా సర్కిల్, షాలిబండ, పురానీహవేలీ, ఆజంపురా, తదితర ప్రాంతాలు హలీమ్ స్టాళ్లతో నిండి ఉంటాయి. హలీమ్, కబాబ్‌లు, ఫత్తర్ కా గోష్త్, కిచిడీ ఖీమా, బిర్యానీ, మంది, లాంటి రుచికరమైన అరబిక్ డిష్ లతోపాటు డ్రై ఫ్రూట్స్, అత్తర్, కుర్తా- పైజామాలు కులమతాలకతీతంగా కొనుగోళ్లతో సందడిగా మారిపోతాయి.
ఇఫ్తార్ విందులు...పలు ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులకు చక్కని ఆదరణ లభిస్తుంది. కులమతాలకు అతీతంగా ఈ ఇఫ్తార్ దావత్ లలో పాల్గొని, రమజాన్ నెల ప్రాశస్త్యం తెలుసుకుంటున్నారు. ‘ఒకరి మత భావాలను, విశ్వాసాలను తెలుసుకోవడం వల్ల అపోహలు, అపార్థాలు దూరమవుతాయని, ఆ ఉద్దేశంతోనే తాము గత కొన్నేళ్లుగా ‘ఇఫ్తార్ సమావేశం’ ఏర్పాటు చేస్తున్నాం’ అని గ్రేటర్ హైదరాబాద్ జమాఅతె ఇస్లామీహింద్ ప్రెసిడెంట్ హాఫిజ్ రషాదుద్దీన్ అన్నారు. "నేను 2009 నుండి దాదాపు ప్రతి సంవత్సరం ఇఫ్తార్ సమావేశానికి వస్తున్నాను. పాత ఫ్రెండ్స్ ను కలుసుకుని వారితో కలిసి భుజించడం మరిచిపోలేని అనుభూతి’ అని ప్రసాద్ చెప్పారు.
ప్రతీ రమజాన్ నెలలో తన ముస్లిం స్నేహితులను కలుసుకోవడానికి ఇష్టపడతానని బాలకృష్ణ చెప్పారు. మౌలానా హామిద్ ముహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ రంజాన్ సందేశం, సార్వత్రిక సౌభ్రాతృత్వాన్ని దేశం నలుమూలలా చేరవేయాలి’ అని అన్నారు.’మేమిచ్చే దావతె ఇఫ్తార్ అన్ని మతాలకు చెందిన ప్రజలు పాల్గొంటారు. ఉపవాసం ఉండని వారితో సహా. ధనవంతులు మరియు పేదవారు ఇలా అంతా కలిసి భుజిస్తారు.’ అని జమాఅతె ఇస్లామీహింద్ ఉమెన్స్ వింగ్ సెక్రటరీ ఆయెషా సుల్తానా అన్నారు.జమాఅతె ఇస్లామీహింద్ గ్రేటర్ హైదరాబాద్ శాఖ చాలా సంవత్సరాలుగా కులమతాలకు అతీతంగా ఇఫ్తార్‌లు, ఈద్ గెట్-టుగెదర్‌లను నిర్వహిస్తున్నది. వివిధ సంఘాల నాయకులు మరియు అన్ని మతాలు మరియు అన్ని రంగాలకు చెందిన సాధారణ ప్రజలు ఈ సమావేశాలలో పాల్గొనడం విశేషం.
“రంజాన్ అల్లాహ్ తో ఆధ్యాత్మిక సంబంధానికి చక్కని సమయం. ఇది సంయమనం, సహనం, క్షమాపణ కోసం అల్లాహ్‌ను అడగడానికి, విముక్తికి అవకాశం. ఇవి ప్రస్తుతం మనకు అవసరం”అని ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మేనేజర్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. ‘అన్ని మతాల ప్రజలతో సంబంధాలను పెంపొందించుకోవడానికి మరియు లోతైన సంబంధాలను పెంపొందించడానికి ఈ నెల ప్రజలకు ఒక అవకాశం.’ అని ఆయన చెప్పారు."ఇఫ్తార్ అనేది ఉపవాసం ఉండే ముస్లింలకు మాత్రమే కాదు, పరస్పర గౌరవాన్ని పెంపొందించడానికి సహాయపడే సామూహిక భోజనం. ఇది మతపరమైన సంబంధాలను నిర్మించే పునాది" అని అంటారు ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ సాదిక్ అహ్మద్. రమజాన్ ప్రేమ, సహనానికి నెలవు అని ఎంపీజే స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ అన్నారు. ఏడాది పొడవునా మంచి పౌష్టికాహారం తీసుకోని పేదలకు కూడా ఈ కాలంలో పౌష్టికాహారం లభిస్తుందని ఆయన అన్నారు. రమజాన్ పేదల పట్ల సానుభూతి చూపవలసిన నెలగా ఆయన అభివర్ణించారు. రమజాన్ పవిత్ర మాసం ఇందులో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుకుందాం!
రచయిత--ముహమ్మద్ ముజాహిద్
హైదరాబాద్
Post A Comment:
0 comments: