సెల్‌ఫోన్లతో విచారణకు హాజరైన కవిత,,,

మీడియా ముందు సెల్‌ఫోన్లు ప్రదర్శన

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు కవిత.. తన సెల్‌ఫోన్లను మీడియాకు చూపించారు. మెుత్తం 9 సెల్‌ఫోన్లను మీడియాకు చూపించారు. స్పెషల్ కోర్టుకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌లో కవిత 10 ఫోన్లు వాడినట్లు ఈడీ పేర్కొంది. 2021 సెప్టెంబర్ నుంచి 2022 ఆగస్టు వరకు కవిత మెుత్తం 10 ఫోన్లు మార్చినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో మెుత్తం 36 మంది 170 ఫోన్లు మార్చినట్లు ఈడీ పేర్కొంది. ఆధారాలు చేరిపేసే క్రమంలో కవిత తన ఫోన్లు ధ్వంసం చేసినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది.

ఈ క్రమంలో ఆమె తన ఫోన్లను మీడియాకు చూపించటం చర్చనీయాంశంగా మారింది. తాను ఏ తప్పు చేయలేదని.., రాజకీయ కోణంలోనే ఈడీ విచారణ జరగుతోందని కవిత ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అందులో భాగంగానే ఈడీ నమోదు చేసిన అభియోగాలను తిప్పికొట్టాలనే ఉద్దేశ్యంతోనే కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యే ముందు తన సెల్‌ఫోన్లను చూపించినట్లు తెలుస్తుంది. అంతకు ముందు ఇవాళ్టి విచారణ నేపథ్యంలో ఉదయం సుప్రీం కోర్టు న్యాయవాదులతో కవిత భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు న్యాయవాదులతో చర్చించారు. న్యాయవాదులతో చర్చల అనంతరం.. ఆమె సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకొని అక్కడి నుంచి తన లాయర్లతో కలిసి ఈడీ కార్యాలయానికి బయల్దేరారు.

ఇత నిన్న సుమారు 10 గంటల పాటు ఈడీ అధికారులు కవితను విచారించారు. మెుత్తం 14 ప్రశ్నలను ఆమెపై సంధించినట్లు తెలిసింది. సౌత్ గ్రూప్ వ్యవహారాలు, అరుణ్ ఫిళ్లతో ఉన్న ఆర్థిక సంబంధాలు, హోటల్ సమావేశాలు, ఆధారాల ధ్వంసం ఇలా మెుత్తం 14 అంశాలపై ఆమెను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈనెల 11న ఆమె మెుదటిసారి విచారణకు హాజరు కాగా.. ఆ సమయంలో ఆమె ఫోన్‌ను అధికారులు సీజ్ చేశారు. ఫోన్లు ధ్వంసం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈమె ఇవాళ ఫోన్లతో ఈడీ విచారణకు హాజరయ్యారు.

మరోవైపు ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఫోన్ల ధ్వంసం చేశారని ఆరోపణలు చేయటాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ కోణంలోనే తనపై విచారణ సాగుతోందని చెప్పారు. "దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నాను. ఒక మహిళ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా ? దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు చేస్తూ.. నేను ఫోన్లు ధ్వంసం చేశానని పేర్కొంది. కనీసం సమన్లు జారీ చేయకుండా ఆరోపణలు చేశారు.

తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం. కేసు విచారణకు నేను పూర్తిగా సహకరిస్తున్నా." అని కవిత ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: