నాకు గుర్తింపు వచ్చింది మీడియాతోనే

హెచ్ యూజే డైరీ ఆవిష్కరణ సభలో సీపీ సి.వి.ఆనంద్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

బాల్యంలో ఓ క్రీడాకారుడిగా, ఆతర్వాతా సివిల్స్ లో ర్యాంకు సాధించిన విద్యార్థిగా, పోలీసు అధికారిగా మీడియాతోనే సమాజంలో తనకు గుర్తింపు లభించిందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ అన్నారు. శుక్రవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హాలులో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రూపొందించిన 2023 మీడియా డైరీని ఆయన ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ, మీడియాతో తనకు దాదాపు 40యేండ్ల అనుబంధం ఉందన్నారు. విధి నిర్వహణలో కొన్ని సందర్భాల్లో తమ నుండి దొర్లే తప్పులను తాము గ్రహించకపోవచ్చని, మీడియా ద్వారానే వాటిని గుర్తించి సరిచేసుకుంటామన్నారు. ఇదే క్రమంలో పోలీసుల పనితీరుపై పనిగట్టుకొని చేసే అసత్య ప్రచారాల్ని తాము అస్సలు పట్టించుకోమని, వాస్తవాలు ఉండే కథనాలనే పరిగణలోకి తీసుకుంటామని సీపీ ఆనంద్ స్పష్టం చేశారు.


ఒకప్పుడు మీడియా సమాజానికి దిక్చూసిగా నిలబడేదని, ప్రస్తుతం దాని స్వరూపం మారిపోవడమే కాకుండా లక్ష్మణరేఖ దాటి పనిచేస్తున్నదన్నారు. ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లకుండా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యతా మీడియా సంస్థలపై ఉంటుందన్నారు. సమగ్ర సమాచారంతో డైరీని రూపొందించిన హెచ్.యు.జెను ఆయన అభినందించారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పవిత్రమైన మీడియా పెడదారి పడుతుండడంతో ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుందన్నారు. రాజకీయులు, వాణిజ్యవేత్తలు మీడియా యజమానులుగా కొనసాగడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో తన కెరీర్ హెచ్.యు.జే నుండే మొదలైందన్నారు. చంచల్ గూడ సెంట్రల్ జైల్ సూపరిండెంట్ శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ, తన 20ఏళ్ల సర్వీసులో మీడియాతో మంచి బంధాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలబడే మీడియా, సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలను నిర్మూలించే దిశలో సామాజిక స్పృహతో  పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ, తమ సంఘం అనుబంధ సంస్థ అయిన హెచ్.యు.జే గొప్ప చరిత్ర కలిగివుందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో జాతీయ స్థాయికి నాయకత్వాన్ని హెచ్.యు.జే అందించిందన్నారు.


అంతేకాకుండా పలువురు సుప్రసిద్ధ పాత్రికేయులు హెచ్.యు.జేలో కొనసాగిన వారేనని ఆయన గుర్తుచేశారు. హెచ్.యు.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు కే.సత్యనారాయణ, టీయుడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, బొమ్మగాని కిరణ్ కుమార్, వి.యాదగిరి, మల్లయ్య, రియాజ్ అహ్మద్, హెచ్.యు.జే.కార్యదర్శి అబ్దుల్ హమీద్ షౌకత్,  హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రవికాంత్ రెడ్డి, సహాయ కార్యదర్శి రమేష్ వైట్ల, జాతీయ కౌన్సిల్ సభ్యుడు అయిలు రమేష్ లతో పాటు హెచ్.యు.జే కార్యవర్గం, పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.


 


 




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: