సామాన్యుడికి దూరంగా వందే భారత్ రైలు..ఛార్జీలు మాత్రం భారీగానే


వందే భారత్ రైలు మనకు దక్కినా ఛార్జీలు చూస్తే మాత్రం ఇది సామాన్యుడికి మాత్రం అందేలా లేదు. తెలుగు రాష్ట్రాల మధ్య ఈ నెల నుంచి వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య నడవనున్న ఈ రైలును ఈ నెల 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. అయితే, ఆ రోజు మాత్రం ప్రయాణికులను అనుమతించరు. వారికి ఈ రైలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చేది రైల్వే అధికారులు త్వరలో ప్రకటించనున్నారు. 

ఇక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. వీటి ప్రయాణం పగటి పూట మొదలై సాయంత్రానికి ముగుస్తుంది. కాబట్టి ఈ రైళ్లలో బెర్త్‌లు ఉండవు. చైర్ కార్స్ మాత్రమే ఉంటాయి. రెండు రాష్ట్రాల మధ్య నడుస్తున్న దురంతో రైలు కంటే వేగంగా ఇది ప్రయాణిస్తుంది. 

విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే దురంతో రైలు 10.10 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. వందేభారత్‌ రైలు మాత్రం 8.40 గంటల్లోనే గమ్యాన్ని చేరుకుంటుంది. అంటే  గంటన్నర ముందే గమ్యాన్ని చేరుకుంటుందన్నమాట. మిగతా రైళ్లకు గరిష్ఠంగా 12.45 గంటలు పడుతుంది.

చార్జీలు ఇలా ఉండొచ్చు

విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ రైలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చేది అధికారులు ప్రకటించలేదు. చార్జీల గురించి కూడా వెల్లడించలేదు. అయితే, ప్రయాణికుల జేబులు గుల్లయ్యే రీతిలో చార్జీలు ఉంటాయని మాత్రం తెలుస్తోంది. ఢిల్లీ-జమ్మూలోని కట్రా మధ్య ప్రస్తుతం వందేభారత్ రైలు నడుస్తోంది. ఆ రెండు నగరాల మధ్య దూరం 655 కిలోమీటర్లు. చైర్ కార్ టికెట్ ధర రూ. 1,665 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 3,055. ఈ లెక్కన చూసుకుంటే సికింద్రాబాద్-విశాఖ టికెట్ ధరలు ఇంతకంటే ఎక్కువే ఉంటాయని అంచనా. ఎందుకంటే ఢిల్లీ-కట్రా మధ్య ఉన్న దూరంలో పోలిస్తే విశాఖ-సికింద్రాబాద్ మధ్య దూరం ఎక్కువ. కాబట్టి చార్జీలు భారీగానే ఉండే అవకాశం ఉంది.

ప్రతి రోజూ పరుగులు

విశాఖపట్టణం-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ రైలు ప్రతిరోజూ నడుస్తుంది. విశాఖపట్టణంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మధ్యలో రాజమండ్రి(8.08), విజయవాడ(9.50), వరంగల్‌(12.05)లో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.25 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటుంది. మధ్యలో వరంగల్ (4.25), విజయవాడ (7.10), రాజమండ్రి (9.15) ఆగుతుంది. వందేభారత్ రైలు ఆగే స్టేషన్లలో ఖమ్మంను కూడా చేర్చినప్పటికీ సమయాలను మాత్రం వెల్లడించలేదు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: