బోధనోపకరణ కృత్యాల ప్రదర్శనను

ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి జడ్పీ హై స్కూల్ లో తొలి మెట్టులో భాగంగా ఏర్పాటు చేసిన మండల స్థాయి బోధనోపకరణ కృత్యాల ప్రదర్శన   కార్యక్రమాన్ని  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించి తిలకించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...


విద్యా వ్యవస్థ లో స్పష్టమైన మార్పులు వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ గుణాత్మక విద్యను అందించటానికి తెలంగాణ రాష్ట్రం లో కృషి చేస్తున్నారని అన్నారు. గురుకులాలు స్థాపించి నాణ్యమైన విద్య అందిస్తూ,ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టి,అన్ని రంగాల్లో ప్రతిభ చూపేలా తయారు చేస్తూ,తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడేలా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్  ఆకాంక్ష అన్నారు.

మన ఊరు మన బడి తో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని అన్నారు. కరోనా కాలంలో వెనుకబడ్డ విద్యార్థుల విద్య నైపుణ్యాలను మెరుగు పర్చటానికి తొలిమెట్టు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినట్లు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టిఎల్ఎం)ద్వారా 5 వ తరగతి వరకు విద్యార్థులకు సులభంగా అర్థం అయ్యేటట్లు బోధించటం జరుగుతుందన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఒరవడి సృష్టించి  కొత్త ఆలోచనలతో వివిధ బోధన పద్ధతుల ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి ప్రభుత్వం ఒక మహా యజ్ఞంగా ఈ కార్యక్రమం చేపడుతుందన్నారు.

దీన్ని రూపొందించడం వెనక,ప్రతి ప్రాంతం, ప్రతి రంగం, ప్రతి భాషకు చెందిన నిపుణులు, కఠోరమైన శ్రమ చేయాల్సిన అవసరం ఉందని,టీచర్లు వారి అంచనాల ప్రకారం బోధనా సామాగ్రిని సిద్ధం చేసుకోవడం ముఖ్యం అని ఇందుకు సంబంధించి భిన్నమైన ఆలోచనలు వస్తున్నాయని,చాలా మంచి మార్పు వస్తుందని, ఈ విద్యావిధానాన్ని అమలుచేసేందుకు ప్రధానోపాధ్యాయులు,అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు.


బోధనాభ్యసన సామగ్రి వినియోగంతో బోధన సులభతరమవుతుందని, విద్యార్థుల్లో అభ్యసన వేగం పెరుగుతుందని,ఉపాధ్యాయులు తాము తయారుచేసిన బోధనోపకరణాలను ఉపయోగించి సృజనాత్మకంగా బోధన చేయటం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయన్నారు.వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తయారుచేసిన వివిధ రకాల బోధన సామాగ్రి ఎంతగానో ఆకట్టుకొంటోందని వారిని అభినందించారు.


విద్యార్థుల్లో కనీస అభ్యాసన సామర్థ్యాలను పెంచేందుకే ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని,విద్యార్థులకు భాషా పరిజ్ఞానం, రాయడం, చదవడంతో పాటు గణితంలో పట్టు సాధించేలా ప్రణాళికలను రూపొందిస్తున్నామని,ప్రతి పాఠశాలలో చదువుకునే విద్యార్థులను ఉపాధ్యాయులు ఏ గ్రేడ్‌లో ఉండేటట్లు తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి , మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్ ,డిఈఓ సుశీందర్ రావు, కార్పోరేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: