తెలంగాణాలో బీజేపీ త్రిముఖ వ్యూహాన్ని కార్యాచరణ

మోదీతో 5 సభలు నిర్వహించేందుకు ప్లాన్

పక్కా ప్లాన్ తో తెెలంగాణలో బీజేపీ అడుగులేస్తోంది. ఈ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే తెలంగాణపై ప్రత్యే దృష్టి పెట్టిన అధిష్ఠానం.. క్షేత్రస్థాయి నుంచే పని చేయటం మొదలుపెట్టింది. కేంద్ర మంత్రులు, ప్రముఖ నేతల పర్యటనలతో.. తెలంగాణ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా.. అధికార పార్టీపై నేతలు ఎప్పటికప్పుడు దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తమకు కలిసొచ్చిన ఫార్ములాను తెలంగాణలోనూ ఫాలో అయ్యేందుకు సిద్ధమైంది కమల దళం. తెలంగాణలోనూ త్రిముఖ వ్యూహాన్ని ప్రదర్శించనుంది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఫార్ములా సక్సెస్ అయ్యి మంచి ఫలితాలు ఇవ్వటంతో.. తెలంగాణలో కూడా అదే వ్యూహాన్ని అప్లై చేయాలని నిశ్చయించుకుంది. ఈ వ్యూహంతో భాగంగా పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో సమావేశాలు, భారీ బహిరంగసభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దశలవారీగా నిర్వహించే బహిరంగ సభలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరై శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యేలోపే నాలుగు నుంచి ఐదు బహిరంగ సభలు నిర్వహించటమే కాకుండా వాటిని ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యేలా ప్లాన్ చేస్తోంది బీజేపీ నాయకత్వం. ఈ క్రమంలో నిర్వహించే ప్రతీ కార్యక్రమం 15 రోజులపాటు కొనసాగేలా ప్రణాళికలు వేస్తోంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు.. సంస్థాగతంగా పోలింగ్‌ బూత్‌ కమిటీ అధ్యక్షులను, శక్తికేంద్రాల ఇంఛార్జులను నియమించనుంది. ఇదే కాకుండా.. అటు అధికార పార్టీ ఆగడాలను.. కేంద్రంపై చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూనే.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే విధంగా నాయకులకు సిద్ధం చేస్తోంది.

కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది? ఆ నిధులన్ని ఏమయ్యాయి? కేసీఆర్ సర్కార్ఇచ్చిన హామీలేంటి? వైఫల్యాలేంటి? వంటి అంశాలను చర్చిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 11 వేల కార్నర్‌ సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది రాష్ట్ర నాయకత్వం. ఫిబ్రవరి 10 నుంచి 25వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల తొలిరోజున బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇంఛార్జులతో పాటు జాతీయ పార్టీ కార్యవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలోని ముఖ్య నేతలు, సీనియర్‌ నాయకులు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు హాజరుకానున్నారు.

ఇక రెండో దశలో ఒక్కో మండలం ఒక్కో యూనిట్‌గా ప్రజాగోస- బీజేపీ భరోసా పేరుతో బైక్‌ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలు సుమారు 15 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇక మూడో దశలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగసభలు ఏర్పాటుచేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 15 రోజుల్లో వీటిని పూర్తిచేసి.. ఆ తర్వాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహిచనుంది బీజేపీ.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: