హిజాబ్ ఆమె హక్కు 
ఫిబ్రవరి 1న వరల్డ్ హిజాబ్ డే

ఓ హిజాబ్ ధరించిన యువతి ఫ్రాన్స్ సూపర్ మార్కెట్ కి వెళ్లింది. తమకు కావాల్సిన సరుకులన్నీ ట్రాలీలో వేసుకుని డబ్బులు చెల్లించడానికి క్యాష్  కౌంటర్ దగ్గరకు వెళ్లింది. కౌంటర్లో క్యాషియర్ గా ఉన్న అరబ్బు యువతి హిజాబ్ ధరించిన ఆమెను చూసి అసహనం వ్యక్తం చేసింది. ‘ఈ దేశంలో హిజాబ్, నఖాబ్ నడవదు. ఫ్రాన్స్ లో బురఖా గిరఖా నైజాన్తా’ అన్నది. హిజాబ్ దరించిన యువతి ముఖానికి కప్పుకున్న ముసుగును తొలగించగానే.. క్యాష్ కౌంటర్లో ఉన్న అరబ్ యువతి ఒక్కసారిగా ఖంగుతిన్నది. ఆమె మరే ముస్లిమ్ కంట్రీ నుంచి వచ్చినామె కాదు. అక్కడి ఫ్రాన్స్ పౌరురాలు. క్యాష్ కౌంటర్లో కూర్చున్న అరబ్బు యువతితో ‘నేను ఇస్లామ్ ధర్మాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాను. మా తాత ముత్తాతలది ఇక్కడే. నేను అచ్చమైన ఫ్రాన్స్ పౌరురాలిని. నేనిక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. నువ్వే బయటి దేశం నుంచి వచ్చావ్! మీరు మీ విశ్వాసాలను అమ్ముకున్నారు. మేము కొనుకున్నాం’ అని చెప్పిన మాటలకు అరబ్బు యువతి చెంప చెళ్లుమనిపించినట్లయింది. 

నోబుల్ బహుమతి గ్రహీత తవక్కుల్ కర్మాన్, యమన్ లో విప్లవానికి తల్లి వంటి వారు. ఆమెను పాశ్చాత్య జర్నలిస్టులు హిజాబ్ గురించి ప్రశ్నిస్తు, హిజాబ్ ఆమె తెలివితేటలకు, విద్యాజ్ఞానాలకు పొంతన లేనిదిగా కనబడుతుందని అన్నారు. ఆమె జవాబిస్తూ “మనిషి చరిత్ర ప్రారంభంలో దాదాపు నగ్నంగా ఉండేవాడు. తెలివితేటలు పెరిగి, జ్ఞానం పెంపొందిన తర్వాత దుస్తులు ధరించడం మొదలు పెట్టాడు. నేను నేడు ఎలా ఉన్నానన్నది? ఏమి ధరిస్తున్నానన్నది మనిషి సాధించిన నాగరికత, ఆలోచనల ఔన్నత్యానికి నిదర్శనం. ఇది వెనుకబాటు కాదు. దుస్తులను వదిలేయడమే అనాగరిక కాలానికి తిరిగి పోవడం వంటిది” అన్నారు. 



"నేను ఇస్లాం మతంలోని పరదా వ్యవస్థ ద్వారా ప్రభావితమైన తర్వాతనే ఇస్లాంను స్వీకరించాను.ఇది స్త్రీ గౌరవాన్నిపెంచుతుంది. ఆమెస్త్రీత్వాన్నికాపాడుతుంది. ఇప్పుడు నాకు పరదా రక్షణకవచం”

- కమలాసూరయ్య (గతంలోకమలాదాస్) ఒక ప్రసిద్ధ మలయాళ రచయిత్రి. 

"పశ్చిమ దేశాలలో చాలా మంది ముస్లిం మహిళలు తమ గుర్తింపులో భాగంగా హిజాబ్‌ను ధరించాలని ఎంచుకున్నారు. ఇది ఛాందసవాదం కానే కాదు.  

- ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ రాచెల్వుడ్‌లాక్ 


హిజాబ్ అంటే ఏమిటి? అరబీలో “హజబ” అన్న మూలపదం నుంచి హిజాబ్ వచ్చింది. ఈ పదానికి అర్ధం దాచి పెట్టడం, లేదా " కప్పి పెట్టడం అని అర్ధం. ఇస్లామీయ పరిభాషలో యుక్తవయస్సుకు చేరుకున్న తర్వాతి నుంచి ముస్లిమ్ మహిళ ధరించవలసిన వస్త్రధారణ నియమాన్ని హిజాబ్ గా పిలుస్తారు. హిజాబ్ అంటే పూర్తి దేహాన్ని, ముఖం చేతులు తప్ప మిగిలిన శరీరాన్ని కప్పి ఉంచడం. కొందరు తమ ముఖాన్ని, చేతులను కూడా కప్పుకుంటారు. దీన్ని బురఖా లేదా నికాబ్ అంటారు. అందరు మహిళలు ఉన్నప్పుడు, సమీప మగబంధువులు మాత్రమే ఉన్నప్పుడు హిజాబ్ అవసరం లేదు. నిజానికి హిజాబ్ అనేది కేవలం బాహ్య వస్త్రధారణకు సంబంధించినది మాత్రమే కాదు. లజ్జ, మాట్లాడే పద్ధతి, హుందాతనాలకు సంబంధించినది. ఇవి పురుషులు కూడా పాటించవలసినవే.

హిజాబ్ అంటే దైవవిధేయత 

హిజాబ్ వల్ల అనేక లాభాలున్నప్పటికి, ముఖ్యంగా దైవాదేశాలను అనుసరించడానికి హిజాబ్ ధరిస్తారు. ఇది దైవవిధేయతకు చిహ్నం. ఇది ధార్మిక విశ్వాసాన్ని ప్రతిఫలిస్తుంది. దివ్యఖుర్ఆన్ ఈ విషయమై ఏమందంటే : ‘‘విశ్వాసుల యొక్క స్త్రీలకు తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడ తీసుకోమని చెప్పు.’’

(దివ్యఖుర్ఆన్ : 33 : 59)

లజ్జకు నిదర్శనం 

ఇస్లామ్ సిగ్గు లజ్జలను ప్రోత్సహిస్తుంది. సమాజంలో అనైతికతను అదుపు చేస్తుంది. ఈ లక్ష్యసాధనలో హిజాబ్ కూడా ఒక సాధనంగా ఉపయోగపడుతుంది.

అనవసరంగా ఒకరినొకరు తదేకంగా చూసుకోవడం అనే రుగ్మత ప్రస్తుత కాలంలో చాలా మంది పురుషులలో ఉంది. పైగా దీన్ని పెద్ద తప్పుగా కూడా భావించడం లేదు. సామాజిక పతనానికి ఇది మొదటిమెట్టుగా ఇస్లాం భావిస్తుంది.

ప్రవక్తా! విశ్వసించిన పురుషులకు తమ చూపులను కాపాడుకోండి అనీ తమ మర్మాంగాలను రక్షించుకోండి అని చెప్పు. ఇది వారికి ఎంతో పరిశుద్ధమైన పద్ధతి. వారు చేసే దానిని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. ప్రవక్తా! విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు, తమ చూపులను కాపాడుకోండి అని, తమ మర్మాంగాలను రక్షించుకోండి అని, తమ అలంకరణను ప్రదర్శించవలదని దానంతట అదే కనిపించేది తప్ప- తమ వక్షస్థలాలను ఓణీ అంచులతో కప్పుకోవాలని, వారు తమ అలంకరణను వీరు తప్ప మరెవరి ముందూ ప్రదర్శించకూడదని. (దివ్యఖుర్ ఆన్: 24:30-31)

పైన పేర్కొన్న దివ్యఖుర్ ఆన్ వాక్యాల్లో ముందుగా పురుషులను ఉద్దేశించి చూపులను క్రిందికి వాల్చుకొమ్మని చెప్పడం జరిగింది. తమ సిగ్గులజ్జలను కాపాడుకోవాలని కూడా చెప్పడం జరిగింది. 

హిజాబ్ రక్షణ కవచం..

హిజాబ్ వెనుక ముఖ్యమైన ఉద్దేశ్యం లైంగిక ఆకర్షణను తగ్గించడం ద్వారా సమాజంలో నైతిక పతనాన్ని అడ్డుకోవడం. హిజాబ్ అనేక విధాలుగా సముదాయాల్లో, కుటుంబాల్లో స్థిరత్వాన్ని సాధించడం ద్వారా స్త్రీలను, పురుషులను, సమాజాన్ని కాపాడుతుంది. 

- కామదృష్టి నుంచి, వికృత పోకడల నుంచి స్త్రీలకు రక్షణనిస్తుంది. 

- ఆకర్షణ కారణంగా స్త్రీల పై జరిగే మోసాలను తగ్గిస్తుంది. 

- వాంఛలు, నష్టదాయకమైన కోరికల నుంచి రక్షణ ఇస్తుంది.

- మహిళల స్త్రీత్వాన్ని ప్రోత్సహిస్తుంది. 

-హిజాబ్ స్త్రీత్వాన్ని అణిచివేయదు. 

- స్త్రీలకు హుందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రసాదిస్తుంది. 

- బాహ్య ఆకారాన్ని బట్టి కాక ఒక వ్యక్తిగా వారికి గుర్తింపు నిస్తుంది. 

హిజాబ్ హుందాతనానికి నిదర్శనం 

హిజాబ్ అంటే గౌరవం 

నేడు అనేక సముదాయాల్లో మహిళలకు చిన్నప్పటి నుంచి వారు ఎంత అందంగా ఉన్నారో అంత విలువైన వారన్న భావం కలిగిస్తున్నారు. అందువల్ల మహిళలు తప్పనిసరిగా అహేతుకమైన, అసంబద్దమైన సౌందర్య ప్రమాణాలను అనుసరించక తప్పడం లేదు. ఆ విధంగా సమాజంలో ఎదురయ్యే ఒత్తిడిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇతరుల అభిలాషలకు అనుగుణంగా మారడానికి శ్రమిస్తున్నారు. ఇలాంటి కృత్రిమమైన వాతావరణంలో, బాహ్య సౌందర్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు వ్యక్తి అంతర్గత సౌందర్యం గురించి పట్టించుకోవడమే లేదు. కాని ఇస్లామ్ మాత్రం అంతర్గత సద్గుణాలు, వ్యక్తిత్వం, సదాచరణల ఆధారంగానే వ్యక్తికి విలువ లభస్తుందని బోధిస్తుంది. పుట్టుకతో లభించే అందం, రూపాల ఆధారంగా విలువ ఉండదని స్పష్టం చేస్తుంది. ఇస్లామీయ సమాజంలో స్త్రీ గుర్తింపు పొందడానికి తన ఆందచందాలను ప్రదర్శించవలసిన అవసరం లేదు. హిజాబ్ వల్ల బాహ్య రూపానికన్నా అంతర్గత గుణగణాలకే ఎక్కువ ప్రాముఖ్యం లభిస్తుంది. సద్గుణాలు, లజ్జ, తెలివితేటలు వంటి గుణగణాలు హిజాబ్ వల్ల గుర్తింపుకు ముఖ్య సాధనాలవుతాయి.

 హిజాబ్ ఆత్మవిశ్వాసం

 హిజాబ్ వల్ల స్త్రీలలో ఒక వ్యక్తిగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీని వల్ల  సాధికారత, స్త్రీ ఆత్మగౌరవం పెరుగుతుంది.

జీవితంలో ఏది ముఖ్యమో ఆలోచించే   వాతావరణం ఏర్పడుతుంది. బాహ్య సౌందర్యం పట్ల తీవ్రమైన వ్యామోహం

వల్ల ప్రమాదకరమైన, అనారోగ్యకరమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు. కొందరు మహిళలు అందంగా కనిపించేందుకు ప్రమాదకరమైన పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. హిజాబ్ వల్ల అలాంటి మానసిక, శారీరక నష్టాలను నివారించవచ్చు. 

హిజాబ్

• సామాజిక కార్యకలాపాల్లో అడ్డంకి కాదు 

• అణిచివేతకు నిదర్శనం కాదు. 

• కేవలం స్త్రీలు, సమీప పురుష బంధువులున్న చోట హిజాబ్

అవసరం లేదు. 

• పురుషులకన్నా స్త్రీలు తక్కువ అనడానికి చిహ్నం కాదు. 

• స్త్రీ తన భావాలు ఆలోచనలు ప్రకటించడానికి అడ్డంకి కాదు. 

• విద్యాజ్ఞానాలు పొందడానికి, కెరీర్ లో ఎదగడానికి అడ్డంకి కాదు. 

• ఇది మొబైల్ జైలు కాదు ఇది ముస్లిమేతరులపట్ల ప్రతిఘటన, వ్యతిరేకత, సవాలు వంటిది కాదు.


రచయిత- ఆయిషా సుల్తానా

హైదరాబాద్,  98669 19779


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: