రాజారెడ్డి స్పూర్తితోనే గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం

రాజారెడ్డి స్పూర్తితో గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం చేపడుతున్నానని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం.. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు పొందింది. అంతకుముందు కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి అంటే ఎవరో తెలియని వారు కూడా.. ఇప్పుడు ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు. కేవలం ఏపీలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ కేతిరెడ్డికి అభిమానులు ఉన్నారు. ఇలాంటి ఎమ్మెల్యే తమకు కూడా కావాలని కామెంట్స్ పెడుతుంటారు. దానంతటికీ కారణం.. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి కార్యక్రమంపై.. తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటాయి. అది మొత్తం పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ నేతలు మరో అడుగు ముందుకేసి.. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో భాగంగా.. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఉదయం చూసుకొని.. రాత్రి వాటిని కబ్జా చేస్తారని ఆరోపణలు చేస్తున్నారు. కానీ.. ఎమ్మెల్యే కేతిరెడ్డి మాత్రం వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేస్తూ వెళ్తున్నారు. తాజాగా.. ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమానికి ఇన్సిపిరేషన్ ఎవరో చెప్పారు. అలాగే చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చారు. భూకబ్జాలు, పబ్లిసిటీ ఆరోపణలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు.

'గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం.. పబ్లిసిటీ స్టంట్ కాదు. అది నా బాధ్యత. మా నాన్న, చిన్నాన్న ఎప్పుడూ చెప్తుంటారు.. వైఎస్ రాజారెడ్డి పులివెందుల సర్పంచిగా ఉన్న సమయంలో.. రోజూ ఉదయమే పులివెందుల వీధుల్లో తిరిగేవారు. తాగునీరు, ఇతర సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గం చూపేవారు. ఆయన చేసిన పనిని ఆదర్శంగా తీసుకొని.. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం ప్రారంభించా. నిజంగా నాయకుడు అనేవాడు ప్రజల్లో తిరగాలి. అప్పుడే ప్రజల సమస్యలు తెలుస్తాయి. లేకపోతే ప్రజలతో సంబంధాలు తెగిపోతాయి' అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి చెప్పారు.

అటు కబ్జా ఆరోపణలపైనా కేతిరెడ్డి ఘాటుగా స్పందించారు. 'నేను గతంలోనే చెప్పాను. ఒక్క అడుగు భూమిని అయినా నేను కబ్జా చేసినట్టు నిరూపించాలని సవాల్ చేశాను. కానీ.. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే నేను ఒక్క సెంటు స్థలం కూడా కబ్జా చేయలేదు కాబట్టి. ఒక్క అడుగు కోసం గొడవలు పెట్టుకునే ఈ రోజుల్లో కబ్జాలు ఎలా సాధ్యం అవుతాయి. ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తున్నా.. ఎవ్వరి స్థలాన్నైనా నేను కబ్జా చేసినట్టు నిరూపిస్తే.. దేనికైనా సిద్ధం' అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి  స్పష్టం చేశారు. ఆరోపణలు చాలా చేస్తుంటారని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: