వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్

వచ్చే ఎన్నికల్లో మహాకూటమి తరఫున సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్ కానున్నారా..ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమర్ తాజా వ్యాఖ్యలు అవే స్పష్టంచేస్తున్నాయా అన్న చర్చ సాగుతోంది.  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సంకీర్ణ కూటమిని డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నడిపిస్తారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రిగా ఇదే తన చివరి పదవీకాలమనే సంకేతాలు ఇచ్చారు నితీశ్. అంతేకాదు, తాను ప్రధానమంత్రి అభ్యర్థిని కానని పునరుద్ఘాటించారు. బీజేపీని ఓడించడమే నా లక్ష్యమని స్పష్టం బిహార్ సీఎం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను తేజస్వీ యాదవ్ సారథ్యంలో ఎదుర్కొంటామని అన్నారు. ‘‘నేను ప్రధానమంత్రి అభ్యర్థిని కాదు.. ముఖ్యమంత్రి అభ్యర్థిని కాను.. బీజేపీని ఓడించడమే నా లక్ష్యం.. తేజస్వీని ప్రోత్సహించాలి’’ అని మహాకూటమి ఎమ్మెల్యేతో జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించారు.

సోమవారం నలందలో దంత వైద్య కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా నితీశ్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘మేము చాలా చేస్తున్నాం. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా చేయాల్సి వస్తే తేజస్వీ చేస్తూనే ఉంటారు.. అన్ని పనులు పూర్తి చేస్తారు.. మమ్మల్ని విభజించాలకునేవారు ప్రయత్నాలు మానుకోవాలి.. ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నించవద్దు.. మనం ఐక్యంగా ఉండి కలిసి పని చేయాలి.. ఘర్షణ పడకూడదు’’ అని అన్నారు.

వేదికపై తేజస్వీని చూస్తూ.. ‘‘తేజస్వి ఇక్కడే ఉన్నాడు.. అతన్ని ముందుకు తీసుకెళ్లడానికి నేను చేయగలిగినదంతా చేశాను.. మరింత ముందుకు తీసుకెళతాను.. మీరందరూ ప్రతిదీ అర్థం చేసుకోవచ్చు.. మా అధికారులందరూ బాగా పనిచేస్తున్నారు. నేను చెప్పేది వినండి.. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఏం చేసినా గాంధీ బాటలోనే పయనిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు. దీంతో పరోక్షంగా తేజస్వి యాదవ్‌ను తన వారసుడిగా నితీశ్ ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నితీశ్ వ్యాఖ్యలపై తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. ప్రస్తుతం మా లక్ష్యం 2024 సాధారణ ఎన్నికలు.. ఆ తర్వాతే మిగతావన్నీ అని అన్నారు. ఆగస్టుకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తరుచూ నితీశ్‌పై తేజస్వీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నితీశ్ వయసు పైబడిందని, అలసిపోయిన ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని విమర్శించేవారు. 2017లో మహాకూటమి నుంచి బయటకొచ్చి.. బీజేపీతో కలిసి నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంతో ఆర్జేడీ, జేడీయూ మధ్య వైరం కొనసాగింది.

అయితే, ఈ ఏడాది ఆగస్టులో అనూహ్యంగా ఎన్డీఏ నుంచి వైదొలగిన నితీశ్ కుమార్.. ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. తేజస్వీ యాదవ్‌కు ఉప-ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. గత నెలలో ఓ సందర్భంగా తేజస్వీ మాట్లాడుతూ.. సుదీర్ఘ అనుభవం కలిగిన సీఎం నాయకత్వంలో పనిచేయడం ఎంతో అదృష్టమని వ్యాఖ్యానించారు.

‘‘నా కంటే అదృష్టవంతుడు ఎవరుంటారు? మా అమ్మ, నాన్న ముఖ్యమంత్రులు.. ప్రతిపక్ష నేతలు.. నేను రెండుసార్లు డిప్యూటీ సీఎంగా.. ఒకసారి ప్రతిపక్ష నేతగా ఉన్నాను.. సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేసే అవకాశం వచ్చింంది.. ఇంత కంటే అదృష్టం ఏముంటుంది?’’ అని అన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: