సద్భావన కోసం కలం కదిలించారు.. గళం వినిపించారు
ధార్మిక జనమోర్చా ఆధ్వర్యంలో ‘సద్భావనే ప్రగతికి సోపానం’ కవిసమ్మేళనం
ప్రపంచంలో నా మతమే గొప్పది, నేను అవలంబించే ధర్మం, నా విశ్వాసాలే ఆదర్శమైనవి అని నువ్వు భావిస్తున్నట్లయితే దానికి నిలువుటద్దంలా నిలవాలి. నీ విశ్వాసాలు నీలో మార్పు తీసుకురానప్పుడు ఇతరులెవ్వరినీ మార్చలేవు. ఎవరి మత ఆదర్శాలను వాళ్లు ఆచరించి చేతల ద్వారా, మాటల ద్వారా మతంలోని మంచితనాన్ని చెప్పుకోవడంలో తప్పులేదు. ‘చెట్టాపట్టాల్ పట్టుకుని / దేశస్థులంతా నడువ వలెనోయ్/ అన్నదముల వలెను జాతులు/ మతములన్నీ మెలగవలెనోయ్’ గురజాడ చెప్పిన ఈ మాటలు ప్రతీ భారతీయుడికీ స్ఫూర్తిదాయకం కావాలి. కానీ నా మతమే గొప్పది, మిగతా వారంతా మెజారిటీ వాదాన్ని అనుసరించాల్సిందేనని మతమౌఢ్యంతో ఊగిపోతే ఏముంది సమాజంలో అశాంతి, అలజడులే రాజ్యమేలుతాయి! దశాబ్దాలుగా కొనసాగుతున్న సద్భావన స్ఫూర్తి బీటలువారుతుంది. సామాజిక సౌభ్రాతృత్వం దెబ్బతింటోంది. . కానీ మన దేశంలో ఇప్పుడు జరుగుతుంది ఇదే! ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాదులో జరిగిన ఓ కవి సమ్మేళనం అరుదైన దృశ్యాలకు వేదికైంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు యాభై మంది కవులు సద్భావనతోనే ప్రగతి సాధ్యమని తమ కలాల ద్వారా గళాల ద్వారా నొక్కి చెప్పారు.
‘ఒకప్పుడు ప్రేమలే ఆస్తులు/ ఆప్యాయాతలే అంతస్తులు/ కలిసివుంటే కలదు సుఖము/ ఒకరికొకరు తోడుంటే/
ఏ దుష్ట శక్తి , ఆవహించదు /అనేభావన’ మనం కోల్పోతున్నదేమిటో హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ కోదాటి అరుణ తన కవితలో ఆవేదన వెలిచ్చారు. ‘కులం పేరుతో కుంపట్లు రాజేసి/ కుచ్చితాల మంటల్లో చలికాచుకుంటున్నారు/ మతాలమార్పుతో మాయాముసుగు తొడిగి/ దొంగచాటు మారణహోమాలు చేస్తున్నారు’ అన్నది గోదావరి ఖని కి చెందిన కనుకుంట్ల వెంకటేశ్వర్లు ఆందోళన. దేశ ఐకమత్య సమగ్రత / భద్రతను కాపాడి /అంకిత భావం/ పరస్పర సంబంధ / బాంధవ్యాల అడుగులు / వేద్దాం ముందుకు’ అని పిలుపునిచ్చారు కవి ఆలూరి విల్సన్. భిన్న ప్రపంచాల మధ్య గోడను / కూల్చే సాధనం సద్భావన మాత్రమే !’ అంటూ మతోన్మాదులు కట్టే అడ్డుగోడలను కూల్చాలంటారు జయంతి వాసరచట్ల. ఆధిపత్య పోరులు/ఉగ్రవాద దాడులు/ప్రగతికి అవరోధమని/స్పష్టంగా తెలిసేలా/ సాగాలి నీ పయనం/ సద్భావనే ప్రగతికి సోపానం అన్న సందేశమిచ్చారు రామకృష్ణ చంద్రమౌళి. మరో కవియిత్రి అంజుం తన కవితలో ప్రజల్ని తట్టేలేపారు. నిద్ర నటిస్తున్న సమాజాన్ని కదుపుదాం/ నేను సైతం అంటూ మునుముందుకు కదులుదాం/ మంచికై పరితపించే ఐకమత్యమే మన సంపూర్ణ బలం/ సద్భావనే సదా ప్రగతికి సోపానం. ‘కులమతాలకతీతంగా/ మానవత్వం పరిమళించగా/ దానవత్వం అంతరించగా/ సద్భావనే ప్రగతికి సోపానంగా/వర్ధిల్లుగాక’ అంటూ కవి అబ్దుర్రషీద్ కవితతో కవి సమ్మేళనం ముగిసింది.
మనదేశ విశిష్టత అయిన భిన్నత్వంలో ఏకత్వం గొప్పతనాన్ని తెలిపే కవితలు, గేయాలను కవులు వినిపించారు. కులమతాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల నలు మూలల నుంచి అనేక మంది కవులు విచ్చేశారు. నవంబర్ 27న జరిగిన ఈ కవి సమ్మేళనానికి హైదరాబాద్ రవీంద్రభారతి వేదికగా నిలిచింది. భారత దేశ సద్భావన స్ఫూర్తి స్ఫరించేలా పాడిన కవితలు ఆలోచింపజేశాయి. సద్భావన ఆదర్శాలను బ్రతికించుకోవడానికి ఇలాంటి కవి సమ్మేళనాలు ఎంతగానో దోహదపడతాయని ధార్మిక జనమోర్చా కన్వీనర్ సాదిక్ అహ్మద్ అన్నారు. విభజన రాజకీయాలు పెట్రేగిపోతున్న నేటి కాలంలో వాటిని తిప్పికొట్టడానికి కవులు కలం కదపాలని సాదిక్ అహ్మద్ అన్నారు. హిందూ, ముస్లిముల ఐక్యతకు, మతవర్గాల మధ్య ప్రేమను బ్రతికించుకోవడానికి ఇలాంటి కవిసమ్మేళనాలు మరిన్ని నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మనిషికి మనిషి దూరంగా ఉండే పరిస్థితి కాకుండా మనుషుల మధ్య దగ్గర పెరిగే భావన గొప్ప అదృష్టమని, ద్వేషంతో కలిగే భయం కంటే ప్రేమభావనతో కలిగే సంతోషం ఎంతో గొప్పదని ఆయన అన్నారు. మతవర్గాల మధ్య సంతోషాలకు ఈ కవి సమ్మేళనాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ధార్మిక జనమోర్చా తెలంగాణ శాఖ నిర్వహించిన ఈ కవిసమ్మేళంలో పాల్గొన్న రచయితలందరికీ శాలువ, మెమెంటోతో సత్కరించుకోవడం విశేషం. ప్రముఖ కవి, రచయిత నాళేశ్వరం శంకరం, నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు బిక్కి కృష్ణ, కవి, రచయిత్రి మంగళ మక్కపాటి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ కవి, అనువాదకులు, రచయిత అబ్దుర్రషీద్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
రచయిత-ముహమ్మద్ ముజాహిద్- 9640622076
Home
Unlabelled
సద్భావన కోసం కలం కదిలించారు.. గళం వినిపించారు -ధార్మిక జనమోర్చా ఆధ్వర్యంలో ‘సద్భావనే ప్రగతికి సోపానం’ కవిసమ్మేళనం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: