ఎండమావిగానే మైనారిటీ సంక్షేమం

సింగరేణి కార్మిక నాయకుడు ముహమ్మద్ ఇస్మాయీల్


మౌలానా అబుల్ కలామ్ జన్మదినమైన నవంబరు 11ను మైనారిటీల దినోత్సవంగా నిర్వహించి, దేశం లోని వివిధ ప్రాంతాల్లో మైనారిటీల సభలు జరిపి ముస్లిం ప్రజల సంక్షేమం గురించి మొసలి కన్నీళ్లు కార్చటం అధికార పార్టీలకు ఒక ఆనవాయితీగా మారిందని సింగరేణి కార్మిక నాయకుడు ముహమ్మద్ ఇస్మాయీల్ విమర్శించారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం లోని ముస్లింలు విద్య, ఉపాధి రంగాల్లో దేశంలోని ఇతర ప్రజలతో పోల్చితే చాలా వెనకబడి వున్నారని, ఉన్నత విద్యలో దళితులు, గిరిజనుల కంటే కూడా అధ్వాన్నమైన స్థితిలో ఈ తరగతి ప్రజలు వున్నారని సచార్‌ కమిటీ నివేదిక వెల్లడించింది. అంతేగాక, విద్యలో ముస్లిం మహిళలు దేశంలోనే అందరికంటే వెనుకబడి వున్నారని, వ్యాపార రంగంలో ఈ తరగతి ప్రజలకు జాతీయ బ్యాంకులు చేస్తున్న సహాయం నామమాత్రంగా వుందని కూడా పేర్కొంది. ఈ పరిస్థితి మారనట్లయితే భవిష్యత్తులో ముస్లిం మైనారిటీలు దేశ ప్రధాన స్రవంతి నుండి వేరుపడతారని కూడా హెచ్చరించింది. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లిం ప్రజల సంక్షేమం కాదు! వారి జీవితాలకే ప్రమాదం వచ్చింది. గో రక్షణ దళాల దాడులు, ముమ్మారు తలాఖ్‌ పేరిట జైలు శిక్షలు వేయటం, లవ్‌ జిహాద్‌ పేరిట విద్వేషాన్ని రెచ్చగొట్టటం,  కరోనాను కూడా మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా కేంద్ర ప్రభుత్వం-అనేక రాష్ట్రాల్లోని బిజెపి నాయకులు వ్యవహరించటం ఈ దేశంలో మైనారిటీలకు తీవ్రమైన అభద్రత వాతావరణాన్ని సృష్టించాయి.  రాష్ట్రంలో వక్ఫ్‌ ఆస్తుల దురాక్రమణ యథేచ్ఛగా సాగుతున్నది. వక్ఫ్‌ బోర్డును ఏర్పాటు చేసి, దానికి ఎండోమెంట్‌ శాఖ మాదిరిగా అధికారాలనిచ్చి వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు కృషి చేయవలసిన ప్రభుత్వం వక్ఫ్‌ ఆస్తుల పట్ల ఉదాసీన భావంతో వ్యవహరిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ముస్లింలను సంఘటితం చేసి వారి మౌలిక హక్కులకై, అభివృద్ధిలో వారి జనాభాకు తగిన నిధుల కోసం...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా ఒత్తిడి పెంచాల్సిన అవసరం నేడు ఎంతైనా వుందని ఆయన పేర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: