నవంబర్ 2022

 సెట్విన్ కు స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆవార్డు

సంస్థ ఎండీ వేణుగోపాల్ కు అందజేసిన మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సెట్విన్ సంస్థ ఆన్ లైన్ లో ఇస్తున్న ఆధునిక శిక్షణ ను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు ప్రముఖ సంస్థ స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆవార్డును సెట్విన్ సంస్థ ఎం.డీ.వేణుగోపాల్ కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ అదేశాల మేరకు సెట్విన్  సంస్థ ద్వారా నిరుద్యోగ యువతి, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విరివిగా కల్పిస్తున్నానందుకు స్కోచ్  సంస్థ అందజేసే ఈ అవార్డ్ ను సెట్విన్ సంస్థ సాధించుకోవడం రాష్ట్రానికి ఎంతో  గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు.


 ఫలక్ నూమా ఏసీపీ షేక్ జహంగీర్ పర్యవేక్షణలో,,, 

తీగలకుంటలో వాహన తనిఖీలు,,,సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్  ప్రతినిధి)

ఫలక్ నూమా ఏసీపీ షేక్ జహంగీర్ పర్యవేక్షణలో పాతబస్తీలోని తీగలకుంటలో వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాల రికార్డులు సరిగా ఉన్నాయా లేదా అన్న  దానిపై పోలీసులు పర్యవేక్షణ కొనసాగింది. అదే సందర్భంలో ఎలాంటి నేరాలతో సంబంధం లేకుండా సత్ ప్రవర్తన కోసం కూడా పోలీసులు కొందరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగా సత్ ప్రవర్తనతో మెలిగేలా ఓ ఆటో డ్రైవర్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. అదే సమయంలో అక్కడే సైబర్ నేరాలు ఏ తరహాలో జరుగుతున్నాయా, వాటి పట్ల ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  పాట్రో కారుతోపాటు బ్లూ కోల్ట్ ఏఎస్ఐ అధికారులు పాల్గొన్నారు.  




 ఆ మహిళా నేతల మధ్య ట్విట్ వార్

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఆమె బెయిల్ పై బయటకు రావడం విదితమే. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై షర్మిల విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా తొలిసారి విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీ కోవర్టు షర్మిల అని విమర్శించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ట్వీట్ల వార్ జరిగింది.

'తాము వదిలిన “బాణం”...  తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”' అని తొలుత షర్మిలను ఉద్దేశించి కవిత వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ పై షర్మిల ఘాటుగా స్పందించారు. 'పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీలు అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు' అని షర్మిల విమర్శించారు. షర్మిల వ్యాఖ్యలపై కవిత మరోసారి అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. 

' అమ్మా.. కమల బాణం... ఇది మా తెలంగాణం... పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం... మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు... నేడు తెలంగాణ రూటు... మీరు కమలం కోవర్టు... ఆరేంజ్ ప్యారేట్టు... మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను... రాజ్యం వచ్చాకే రాలేదు నేను... ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి " కవిత" ను నేను !' అంటూ షర్మిలపై విమర్శలు గుప్పించారు.


 ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ బుధవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. లైగర్ సినిమా నిర్మాణ వ్యవహారాలకు సంబంధించి అధికారులు విజయ్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మీ కూడా విచారణకు హాజరయ్యారు. 

లైగర్ సినిమా నిర్మాణానికి నిధుల వ్యవహారంలో పెద్ద దుమారం రేగింది. ముందు నగదును దుబాయ్ కి పంపి, అక్కడి నుంచి పెట్టుబడుల రూపంలో తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సినిమా నిర్మాణంతో సంబంధం ఉన్న వాళ్లందరినీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ నేతకు, ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధం ఉందని భావిస్తున్నారు. 

'జనగణమన' పేరుతో కొత్త సినిమాను ప్రకటించిన విజయ్ దేవరకొండ.. లైగర్ నిర్మాణ సమయంలోనే కొత్త సినిమా కోసం కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందుకు సుమారు రూ.20 కోట్ల దాకా అయినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని సమకూర్చింది ఎవరనేది బయటపడాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, లైగర్ హిందీ వెర్షన్ కు కరణ్ జొహార్ కూడా నిర్మాతగా వ్యవహరించారు.


 సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఓటీపీ చెప్పాలని ఏ బ్యాంకు కస్టమర్లను కోరదు

ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే అది నేరగాళ్ల పనేనని గుర్తించాలి

సోషల్ మీడియా ఖాతాల విషయంలోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఉద్యోగ అవకాశాల కోసం ఆన్ లైన్ సర్చ్ చేసేవారు అపరిచిత లింక్ లను ఓపెన్ చేయోద్దు

సైబర్ నేరాలపై నిరంతరం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం

పలక్ నూమా ఏసీపీ షేక్ జహంగీకర్ 

పలక్ నూమా ఏసీపీ షేక్ జహంగీకర్ 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయని, వారు చేసే మోసాల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగితే మాత్రం వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చని ఫలక్ నూమా ఏసీపీ షేక్ జహంగీర్ వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల చేసే నేరాలు ఎలా ఉంటాయన్న దానిపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు తాము ఇప్పటికే ప్రారంభించామన్నారు. చంద్రయాణ్ గుట్టా, ఫలక్ నూమా పరిధిలో వివిధ బస్తీలలో సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచామన్నారు. మున్ముందు అన్ని ప్రాంతాల్లోని ప్రజలను ఈ నేరాల  పట్ల అప్రమత్తం చేస్తామన్నారు. వీటిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని ప్రజలు సైబర్ నేరగాళ వల్లలో చిక్కకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.  సైబర్ నేరగాళ నాలుగు రూపాల్లో నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మొబైల్ ఫోన్లకు వివిధ పేర్లతో ఓటీపీ పంపి ఆపై ఫోన్ చేసి ఓటీపీ చెప్పాలని అడిగి వాటిని తెలుసుకొని ప్రజల ఖాతాలోని డబ్బు కాజేస్తున్నారని వెల్లడించారు.


ఏ బ్యాంకు కూడా తన కస్టమర్ కు ఫోన్ చేసి ఓటీపీ అడగదని, ఏమైన సమస్యవుంటే కస్టమర్ కు బ్యాంకుకే పిలుస్తారని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించి ఎవరైనా ఫలాన బ్యాంకు పేరుతో మీకు వచ్చిన ఓటీపీ చెప్పండి అంటే అట్టి ఫోన్ కాల్ ను కట్ట చేయాలని, దీనిపై అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. నిరుద్యోగ యువత జాబ్ ల కోసం నేటి రోజుల్లో ఆన్ లైన్ లో వెతుకుతుంటారని, అట్టి వారిని గ్రహించిన సైబర్ నేరగాళ్ల ఫలాన చోట జాబ్ ఉందన్న లింక్ లు పంపుతారని, అలాంటి లింక్ ల పట్ల  నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ షేక్ జహంగీర్ సూచించారు. అదే సందర్భంలో ఫలాన ఉద్యోగ అప్లికేషన్ తదితర వాటికి ఇంత ఫీజు చెల్లించాలని వ్యక్తిగత ఫోన్, గూగుల్ పే నెంబర్ల అడుగుతుంటారని, ఆ తరువాత ఖాతాలో డబ్బును సైబర్ నేరగాళ్లు కాజేస్తారని ఆయన తెలిపారు. ఇలాంటి ఫేక్ జాబ్ లింక్ పంపేవారి పట్ల, ఫీజు చెల్లించాలని కోరే వారి పట్ల యువత ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సోషల్ మీడియాలోని వ్యక్తిగత ఖాతాలలోకి సైబర్ నేరగాళ్లు చొరబడి వీడియో ఫోన్ కాల్స్, వ్యక్తుల  ఫ్రెండ్స్ డాటా సేకరించి డబ్బు సహాయం కోరుతూ కూడా నేరగాళ్ల మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

కాబట్టి ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల విషయంలో ఎప్పటికపుడు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎవరైనా తమ ఖాతాలోకి చొరబడి వాటిని దుర్వినియోగం చేస్తున్నారని తేలితే బాధితులు తమ ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖతాలను వెంటనే లాక్ చేసుకొనేలా అప్రమత్తంగా ఉండాలన్నారు.  ఈ సైబర్ నేరాలతోపాటు మత్తు పదార్థాలు వినియోగించే వారిపైనా, అమ్మకాలపైనా కూడా ఉక్కుపాదం మోపుతున్నట్లు ఏసీపీ షేక్ జహంగీర్ వెల్లడించారు. ఎదైనా నేరం జరిగితే 100కు ఫోన్ చేయాలన్నారు. సైబర్ నేరగాళ్ల తమ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కాజేస్తే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు  చేస్తే కాజేసిన సొమ్మును తిరిగి రాబట్టవచ్చని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనంలోకి తీసుకోవాలన్నారు. తమ పరిధిలో రౌడీ షీటర్లకు అనునిత్యం కౌన్సిలింగ్ ఇచ్చి సత్ ప్రవర్తన వైపునకు తీసుకొస్తున్నామన్నారు. తీరుమారని రౌడీ షీటర్లపై మాత్రం ఉక్కపాదం మోపుతున్నామన్నారు. తమ స్టేషన్ పరిధిలో కొందరు రౌడీ షీటర్ల సత్ ప్రవర్తనతో నడుచుకోవడం వల్ల దాదాపు 47 మందిపై రౌడీ షీట్లను కూడా ఎత్తివేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించడంతోపాటు వారిలో సత్ ప్రవర్తన కోసం కూాడా తాము ప్రయత్నిస్తున్నామన్నారు.

 వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయండి

రంగారెడ్డి జిల్లా బిజెపి కార్యవర్గ సమావేశాలకు హాజరైన బిజెపి నాయకులు.. మురళీధర్ రావు..రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ 

(జానో జాగో వెబ్ న్యూస్- రాజేంద్రనగర్ ప్రతినిధి)

వచ్చే ఎన్నికల్లో బిజెపి విజయమే లక్ష్యంగా ప్రతి నేత కార్యకర్త పనిచేయాలని ఆ పార్టీ అగ్రనేతలు పిలుపునిచ్చారు. బుధవారం నాడు బిజెపి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహా రెడ్డి అధ్యక్షతన ఇబ్రహీంపట్నం మున్సిపల్ బాలాజీ గార్డెన్స్ లో నిర్వహించిన ఈ బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ బిజెపి ఇంచార్జి మురళీధర్ రావుతో కలిసి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ హాజరయ్యారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.  వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు వీలుగా ఇప్పటి నుంచే రెట్టింపు ఉత్సాహంతో పార్టీ నేతలు కార్యకర్తలు పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పదాధికారుల, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





 వచ్చే ఏడాది మేడారం మినీ జాతర

రెండేళ్లకు ఓసారి జరిగే మేడారం మహా జాతరకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో జరిగే ఈ జాతరను తెలంగాణ కుంభమేళా అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ మహాజాతరకు మధ్యలో మినీ మేడారం జాతర జరుగుతుంది. ఈ ఏడాది మహా మేడారం జాతర జరగగా.. వచ్చే సంవత్సరం మినీ మేడారం జాతర జరగనుంది. ఈ జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం జరగదు.. గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. తాజాగా మినీ మేడారం జాతర నిర్వహించబోయే తేదీలను సమ్మక్క, సారలమ్మ గుడి పూజారుల సంఘం ప్రకటించింది. 

మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మినీ మేడారం జాతరకు ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 4 వరకు మినీ జాతర నిర్వహించాలని నిర్ణయించినట్లు పూజారులు తెలిపారు. తొలిరోజు మండమెలిగే పండుగ, 2న సారలమ్మ అమ్మవారి గ‌ద్దె, 3న సమ్మక్క గద్దె శుద్ధి చేసి సమ్మక్క, సారలమ్మల గద్దెలను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకోవచ్చని తెలిపారు. కాగా, మినీ జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని అధికారులు వివరించారు.

 స్వలింగ వివాహ బిల్లుకు ఆమోదం తెలిపిన అమెరికా సెనేట్

అమెరికా సెనేట్ స్వలింగ వివాహ బిల్లుకు ఆమోదం తెలిపింది. 50 మంది డెమోక్రాట్ లతోపాటు ఈ బిల్లుకు మద్దతుగా 11 మంది రిపబ్లికన్లు కూడా ఓటు వేయడం గమనార్హం. ‘‘వివాహ చట్టాన్ని గౌరవిస్తూ సెనేట్ లోని ద్విపార్టీ సభ్యులు నేడు ఆమోదించడం అన్నది.. ప్రేమ అంటే ప్రేమే అన్న ప్రాథమిక సత్యాన్ని యునైటెడ్ స్టేట్స్ పునరుద్ఘాటించే అంచున ఉంది’’ అంటూ అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటన చేశారు. 

సెనేట్ ఆమోదం నేపథ్యంలో ఈ బిల్లును ప్రతినిధుల సభకు పంపిస్తారు. అక్కడ ఆమోదం తర్వాత అమెరికా అధ్యక్షుడి సంతకం కోసం బిల్లు వెళుతుంది. అధ్యక్షుడి ఆమోదంతో చట్టరూపం దాలుస్తుంది. అమెరికాలో ఒకే లింగానికి చెందిన వారు వివాహం చేసుకుంటే ప్రస్తుతం రక్షణ ఉంది. 2015 నుంచి సుప్రీంకోర్టు స్వలింగ వివాహాలకు రక్షణ కల్పిస్తోంది. 

గర్భ విచ్ఛిత్తి హక్కును ఈ ఏడాది జూన్ లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో తమ విషయంలోనూ అదే పరిస్థితి రావచ్చన్న ఆందోళన అక్కడి స్వలింగ సంపర్కుల్లో ఉంది. దీంతో డెమోక్రాట్లు ఆగమేఘాల మీద ఈ బిల్లుకు మార్గం చూపించారు. రెండు వేర్వేరు జాతుల మధ్య వివాహానికి కూడా ఈ చట్టం కింద ఆమోదం ఉంటుంది. 


 సద్భావన కోసం కలం కదిలించారు.. గళం వినిపించారు

ధార్మిక జనమోర్చా ఆధ్వర్యంలో ‘సద్భావనే ప్రగతికి సోపానం’ కవిసమ్మేళనం

ప్రపంచంలో నా మతమే గొప్పది, నేను అవలంబించే ధర్మం, నా విశ్వాసాలే ఆదర్శమైనవి అని నువ్వు భావిస్తున్నట్లయితే దానికి నిలువుటద్దంలా నిలవాలి. నీ విశ్వాసాలు నీలో మార్పు తీసుకురానప్పుడు ఇతరులెవ్వరినీ మార్చలేవు. ఎవరి మత ఆదర్శాలను వాళ్లు ఆచరించి చేతల ద్వారా, మాటల ద్వారా మతంలోని మంచితనాన్ని చెప్పుకోవడంలో తప్పులేదు. ‘చెట్టాపట్టాల్ పట్టుకుని / దేశస్థులంతా నడువ వలెనోయ్/ అన్నదముల వలెను జాతులు/ మతములన్నీ మెలగవలెనోయ్’ గురజాడ చెప్పిన ఈ మాటలు ప్రతీ భారతీయుడికీ స్ఫూర్తిదాయకం కావాలి.  కానీ నా మతమే గొప్పది, మిగతా వారంతా మెజారిటీ వాదాన్ని అనుసరించాల్సిందేనని మతమౌఢ్యంతో ఊగిపోతే ఏముంది సమాజంలో అశాంతి, అలజడులే రాజ్యమేలుతాయి! దశాబ్దాలుగా కొనసాగుతున్న సద్భావన స్ఫూర్తి బీటలువారుతుంది. సామాజిక సౌభ్రాతృత్వం దెబ్బతింటోంది. . కానీ మన దేశంలో ఇప్పుడు జరుగుతుంది ఇదే! ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాదులో జరిగిన ఓ కవి సమ్మేళనం అరుదైన దృశ్యాలకు వేదికైంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు యాభై మంది కవులు సద్భావనతోనే ప్రగతి సాధ్యమని తమ కలాల ద్వారా గళాల ద్వారా నొక్కి చెప్పారు. 


‘ఒకప్పుడు  ప్రేమలే  ఆస్తులు/ ఆప్యాయాతలే  అంతస్తులు/ కలిసివుంటే కలదు సుఖము/ ఒకరికొకరు  తోడుంటే/ 

ఏ దుష్ట శక్తి , ఆవహించదు /అనేభావన’ మనం కోల్పోతున్నదేమిటో హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ కోదాటి అరుణ తన కవితలో ఆవేదన వెలిచ్చారు.  ‘కులం పేరుతో కుంపట్లు రాజేసి/  కుచ్చితాల మంటల్లో చలికాచుకుంటున్నారు/ మతాలమార్పుతో మాయాముసుగు తొడిగి/ దొంగచాటు మారణహోమాలు చేస్తున్నారు’ అన్నది గోదావరి ఖని కి చెందిన కనుకుంట్ల వెంకటేశ్వర్లు ఆందోళన. దేశ ఐకమత్య సమగ్రత / భద్రతను కాపాడి /అంకిత భావం/ పరస్పర సంబంధ / బాంధవ్యాల అడుగులు / వేద్దాం ముందుకు’ అని పిలుపునిచ్చారు కవి ఆలూరి విల్సన్. భిన్న ప్రపంచాల మధ్య గోడను / కూల్చే సాధనం సద్భావన మాత్రమే !’ అంటూ మతోన్మాదులు కట్టే అడ్డుగోడలను కూల్చాలంటారు జయంతి వాసరచట్ల. ఆధిపత్య పోరులు/ఉగ్రవాద దాడులు/ప్రగతికి అవరోధమని/స్పష్టంగా  తెలిసేలా/ సాగాలి నీ పయనం/ సద్భావనే ప్రగతికి సోపానం అన్న  సందేశమిచ్చారు రామకృష్ణ చంద్రమౌళి. మరో కవియిత్రి అంజుం తన కవితలో ప్రజల్ని తట్టేలేపారు. నిద్ర నటిస్తున్న సమాజాన్ని కదుపుదాం/ నేను సైతం అంటూ మునుముందుకు కదులుదాం/ మంచికై పరితపించే ఐకమత్యమే మన సంపూర్ణ బలం/ సద్భావనే సదా ప్రగతికి సోపానం. ‘కులమతాలకతీతంగా/ మానవత్వం పరిమళించగా/ దానవత్వం అంతరించగా/ సద్భావనే ప్రగతికి సోపానంగా/వర్ధిల్లుగాక’ అంటూ కవి అబ్దుర్రషీద్ కవితతో కవి సమ్మేళనం ముగిసింది. 


మనదేశ విశిష్టత అయిన భిన్నత్వంలో ఏకత్వం గొప్పతనాన్ని తెలిపే కవితలు, గేయాలను కవులు వినిపించారు. కులమతాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల నలు మూలల నుంచి  అనేక మంది కవులు విచ్చేశారు. నవంబర్ 27న జరిగిన ఈ కవి సమ్మేళనానికి హైదరాబాద్‌ రవీంద్రభారతి వేదికగా నిలిచింది. భారత దేశ సద్భావన స్ఫూర్తి స్ఫరించేలా పాడిన కవితలు ఆలోచింపజేశాయి. సద్భావన ఆదర్శాలను బ్రతికించుకోవడానికి ఇలాంటి కవి సమ్మేళనాలు ఎంతగానో దోహదపడతాయని  ధార్మిక జనమోర్చా కన్వీనర్ సాదిక్ అహ్మద్ అన్నారు. విభజన రాజకీయాలు పెట్రేగిపోతున్న నేటి కాలంలో వాటిని తిప్పికొట్టడానికి కవులు కలం కదపాలని సాదిక్ అహ్మద్ అన్నారు.  హిందూ, ముస్లిముల ఐక్యతకు, మతవర్గాల మధ్య ప్రేమను బ్రతికించుకోవడానికి ఇలాంటి కవిసమ్మేళనాలు మరిన్ని నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మనిషికి మనిషి దూరంగా ఉండే పరిస్థితి కాకుండా మనుషుల మధ్య దగ్గర పెరిగే భావన గొప్ప అదృష్టమని, ద్వేషంతో కలిగే భయం కంటే ప్రేమభావనతో కలిగే సంతోషం ఎంతో గొప్పదని ఆయన అన్నారు. మతవర్గాల మధ్య సంతోషాలకు ఈ కవి సమ్మేళనాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ధార్మిక జనమోర్చా తెలంగాణ శాఖ నిర్వహించిన ఈ కవిసమ్మేళంలో పాల్గొన్న రచయితలందరికీ శాలువ, మెమెంటోతో సత్కరించుకోవడం విశేషం. ప్రముఖ కవి, రచయిత నాళేశ్వరం శంకరం, నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు బిక్కి కృష్ణ, కవి, రచయిత్రి మంగళ మక్కపాటి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ కవి, అనువాదకులు, రచయిత అబ్దుర్రషీద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. 

రచయిత-ముహమ్మద్ ముజాహిద్- 9640622076

కర్ణాటక రాష్ట్రంలో రైతులు దుస్థితి ఇది

ఉల్లి రైతులకు అందిన ఆధాయం

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్లో అమ్మితే నాలుగు రూపాయలు కళ్లజూడొచ్చని రైతులు ఆశపడతారు. కొంచెం రేటు ఎక్కువ పలుకుతుందని తెలిస్తే దూరం ఎక్కువైనా సరే తన పంటను కష్టపడి తీసుకెళతారు. తీరా అక్కడ పంట మొత్తం అమ్మాక దారి ఖర్చులకూ సరిపడిన సొమ్ము కూడా అందకుంటే..? కర్ణాటకకు చెందిన ఓ రైతుకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తను పండించిన 205 కిలోల ఉల్లిగడ్డను 415 కిలోమీటర్లు ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెట్టుకుని మరీ తీసుకెళ్లగా.. ఆయనకు అందింది కేవలం రూ.8.36 పైసలు. అవును.. అక్షరాలా ఎనిమిది రూపాయల ముప్పై ఆరు పైసలు మాత్రమే! ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వివరాలు..

కర్ణాటకలోని గడాగ్ జిల్లాకు చెందిన పెవడెప్ప హళికేరి ఉల్లి గడ్డ సాగుచేశారు. వర్షాలు ఎక్కువగా కురవడంతో దిగుబడితో పాటు నాణ్యత కూడా కొద్దిగా తగ్గింది. పంట నికరంగా 205 కిలోలు తేలింది. స్థానికంగా మంచి ధర పలకదనే ఉద్దేశంతో మరికొంతమంది రైతులతో కలిసి 415 కిలోమీటర్ల దూరంలో ఉన్న యశ్వంత్ పూర్ మార్కెట్ కు తీసుకెళ్లాడు. అక్కడ కూడా సరైన రేటు లేకపోయినా గత్యంతరం లేక, దారిఖర్చులకన్నా ఉపయోగపడతాయని క్వింటాల్ రూ.200 చొప్పున అమ్మేశాడు. అయితే, దారిఖర్చులకు కాదు కదా.. దారిలో టీ తాగేందుకు సరిపడా సొమ్ము కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.


 టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్... 

విక్రమ్ ఎస్ కిర్లోస్కర్ అకాల మరణం  

ప్రముఖ పారిశ్రామికవేత్త, టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ విక్రమ్ ఎస్ కిర్లోస్కర్ అకాల మరణం చెందారు. ఆయన వయసు 64 ఏళ్లు. గుండెపోటు రావడంతో మంగళవారం అర్ధరాత్రి బెంగళూరులో ఆయన తుదిశ్వాస విడిచారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారకులైన వారిలో విక్రమ్ కిర్లోస్కర్ ఒకరు.

అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసిన విక్రమ్.. జపాన్ కు చెందిన టయోటా మోటార్ కార్ప్ ను భారత్ కు తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించారు. టయోటా, కిర్లోస్కర్ భాగస్వామ్యంతో ఏర్పడిందే టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ. టయోటా బ్రాండ్ పై కార్లను ఈ జాయింట్ వెంచర్ కంపెనీయే మార్కెట్ చేస్తుంటుంది.

కిర్లోస్కర్ పారిశ్రామిక గ్రూపు నుంచి విక్రమ్ నాలుగో తరం వ్యక్తి. ఈ గ్రూపు 1888లోనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించడం గమనార్హం. కిర్లోస్కర్ సిస్టమ్స్ లిమిటెడ్ కు చైర్మన్, ఎండీగానూ విక్రమ్ సేవలు అందిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఆటోమొబైల్ పరిశ్రమ ఏర్పాటు కావడానికి దోహదం చేసిన వారిలో ముఖ్యులు. అందుకే ఆయనకు సువర్ణ కర్ణాటక అవార్డును రాష్ట్ర సర్కారు అందించింది. 

ఇక విక్రమ్ కు భార్య గీతాంజలి,కుమార్తె మానసి ఉన్నారు. బుధవారం హెబ్బెల్ శ్మశాన వాటికలో విక్రమ్ అంత్యక్రియలు జరుగుతాయని కిర్లోస్కర్  గ్రూపు ప్రకటించింది. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు విక్రమ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.


 "నాడు-నేడు"పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

గడివేముల ఎంఈఓ రామకృష్ణుడు

 (జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల పరిధిలోని స్థానిక ఎం.ఈ.ఓ రామకృష్ణుడు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించారు, పనులు వేగవంతం చేయాలని స్పెషల్ ఆఫీసర్ రూబీన గారికి సూచించారు. అనంతరం మోడల్ స్కూల్ లో  మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టిక ఆహారం  అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన మెనూను ఆవిష్కరించిందని, నూతన మెనూ ప్రకారమ,  నాణ్యమైన మరియు రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు సూచించారు.


అనంతరం ఎంఈఓ కార్యాలయంలో జరిగిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ"నాడు-నేడు" పనులలో పురోగతి ఉండాలని అలాగే విద్యార్థులకు అందించిన జగనన్న విద్యా కానుక కిట్ల యొక్క బయోమెట్రిక్ ఐడెంటికేషను రేపు సాయంత్రం లోగా పూర్తి చేయాలని,ఈరోజు అందిస్తున్న టిఎఆర్ఎల్ మెటీరియల్ ను ఉపయోగించి విద్యార్థులకు సరళమైన పద్ధతుల్లో విద్యను బోధించాలని, సంబంధిత మార్కులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.



 

 "జగన్ హఠావో-బుర్కా బచావో" అనే నినాదాలతో 

నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించిన. టిడిపి మైనార్టీ సెల్

 (జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు "జగన్ హటావో- బుర్కా బచావో" అనే నినాదాలతో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వివరాలలోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు ముస్లిం మైనారిటీల మహిళల కు నల్ల బుర్కాలు మరియు నల్ల చున్నీలు తొలగించి సభా ప్రాంగణంలోకి పంపించారని, ముమ్మాటికి మైనారిటీ మహిళలకు మరియు యావత్తు మహిళాలోకానికి జరిగిన అవమానమని,ఈ విషయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ఆదేశాల మేరకు ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి ఎస్ ఏ ఫరూక్,నంద్యాల పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు కరిముల్లా, నంద్యాల టిడిపి అధ్యక్షులు ఖలీల్ అహ్మద్, ముస్లిం మైనార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

 



 మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళులర్పించిన

బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ విద్యార్థి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పాలుట్ల రమణ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక ఆత్మకూరు పట్టణంలో సంగమేశ్వర సర్కిల్లో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే 132 వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్థి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పాలుట్ల రమణ పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక కార్యకర్తగా,మేధావిగా,కుల వ్యతిరేక సామాజిక సంస్కర్తగా,రచయితగా కులం పేరుతో తరతరాలుగా అణిచివేతకు గురైన పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ ధైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి వారి స్వేచ్ఛకు కృషి చేసిన మహానీయుడుపూలే గారని అతను భారతదేశంలో కుల విపక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం పేద,అంటరాని ప్రజల హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు రాజేష్,వంశీ, సురేష్, వేణు, తదితరులు పాల్గొన్నారు.


 నిమోనియా(ఆస్తమా) పట్ల జాగ్రత్తగా ఉండండి

గడివేముల పి హెచ్ సి డాక్టర్ తేజస్విని

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

గడివేముల మండల ప్రజలకు నిమోనియా (ఆస్తమా)పట్ల జాగ్రత్తగా ఉండాలని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ తేజస్విని తెలిపారు. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం మరియు రాత్రి సమయాలలో కొంతమంది చిన్న పిల్లలకు మరియు వృద్ధులకు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని,చల్లటి పానీయాలు తీసుకోవడం వల్ల,చల్లని ప్రదేశాలలో ఎక్కువగా తిరగడం వల్ల కొంతమంది చిన్నపిల్లలకు మరియు వృద్ధులకు ఊపిరితిత్తులకు నిమ్ము(నీరు) వస్తుందని,అలా రావడం వల్ల శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని,అలాంటి పరిస్థితుల్లో తక్షణమే ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని వచ్చి శ్వాసకోస ఇబ్బందికి తగు చికిత్స చేయించుకోవాలని,


నిమోనియా(ఆస్తమా)తో బాధపడేవారు ఉదయం ఏడు గంటలు దాటిన తర్వాత రాత్రి ఎనిమిది గంటల లోపల మాత్రమే ప్రయాణాలు చేసి నిమోనియా(ఆస్తమా)  బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్ళవలసి వస్తే తగు జాగ్రత్తలు తీసుకుని బయటికి వెళ్లాలని సూచించారు.గడివేముల మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి 24 గంటలు పని చేస్తుందని,వైద్య సేవలు అందించడానికి వైద్యసిబ్బంది ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని, ప్రజల ఆరోగ్య భద్రతే మా ప్రధమ లక్ష్యమని ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ తేజస్విని తెలిపారు.

నిర్ణీత సమయంలోపే వ్యాపారాలు చేసుకోవాలి

ఫలక్ నూమా సీ.ఐ.దేవేందర్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

నిర్ణీత సమయంలోపే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని వ్యాపార వర్గాలను ఉద్దేశించి ఫలక్ నూమా సీ.ఐ. దేవేందర్ అన్నారు. ప్రజలు, వ్యాపారస్తులతో ఫ్రెండ్లీ పోలీస్ గా తాము వ్యవహరిస్తున్నామన్నారు. కానీ నిబంధనల ఉల్లంఘనలలను ఏ మాత్రం సహించబోమని ఆయన స్పష్టంచేశారు. తమ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం వ్యాపారాలు నిర్ణీత సమయపాలనలోనే కొనసాగుతున్నాయని సీఐ దేవేంద్ వెల్లడించారు. ఇదే పద్దతిని వ్యాపారులందరూ మున్ముందు కూడా కొనసాగించాలని ఆయన సూచించారు. ఎక్కడైనా నిర్ణీత సమయాన్ని దాటి వ్యాపారాలు  చేసినట్లు  తెలిస్తే అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామన్నారు. ఈ విషయాన్ని వ్యాపారులందరూ పరిగణనలోనికి తీసుకోవాలని ఆయన కోరారు. 

 గిన్నిస్ బుక్ లో బీసీసీఐ


ఇటీవల చారిత్రాత్మక  టీ20 మ్యాచ్ ను బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. బీసీసీఐ నిర్వహించిన ఓ టీ20 మ్యాచ్ కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరుకావడం గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. ఐపీఎల్-2022 సీజన్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. గత మే 29న ఈ మ్యాచ్ జరగ్గా, అక్షరాలా 1,01,566 మంది హాజరయ్యారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక హాజరు. ఈ రికార్డును గిన్నిస్ బుక్ యాజమాన్యం గుర్తించింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధి నుంచి బీసీసీఐ కార్యదర్శి జై షా ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.

 రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థి మృతి


కెనాడలో భారతీయ విద్యార్థి దుర్మరణం చెందాడు.  కెనడాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మరణించిన విద్యార్థి పేరు కార్తీక్ సైనీ. 2021 ఆగస్టులో కెనడా వచ్చాడు. 20 ఏళ్ల సైనీ కెనడాలోని షెరిడియన్ కాలేజీలో చదువుతున్నాడు.  ఇదిలావుంటే టొరంటో నగరంలో సైకిల్ పై వెళుతుండగా, ఓ రోడ్డు దాటే యత్నంలో వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కు సైకిల్ తో పాటు కార్తీక్ సైనీని కూడా ఈడ్చుకుపోయింది. దాంతో అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తోంది. గత బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని స్థానిక పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 

ఈ ఘటనతో హర్యానాలోని కర్నాల్ లో కార్తీక్ సైనీ కుటుంబంలో విషాదం నెలకొంది. దీనిపై కార్తీక్ సైనీ బంధువు ప్రవీణ్ సైనీ స్పందిస్తూ, వీలైనంత త్వరలో కార్తీక్ మృతదేహం కెనడా నుంచి భారత్ చేరుకుంటుందని భావిస్తున్నామని తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న టొరంటో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 ఆ పరిస్థితి మా ప్రభుత్వంలో లేదు


ప్రభుత్వంలో అవినీతి జరిగితే ఉద్యోగులు, ముఖ్యమంత్రి తలదించుకోవాల్సి ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే తమ ప్రభుత్వంలో ఆ ఇబ్బంది లేదని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ఉద్యోగులు, సీఎం తలదించుకునే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ప్రథమ మహా జనసభ నేడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్ హాజరయ్యారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు, ఉద్యోగ సంఘాల నేతలు కూడా హాజరయ్యారు. మంత్రి బొత్స మాట్లాడుతూ

ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని బొత్స అన్నారు. ఏ అంశం అయినా కూర్చుని పరిష్కరించుకోవాలన్నదే తన విధానం అని స్పష్టం చేశారు. సర్వీస్ రూల్స్ సహా ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను జీఓఎంలో చర్చించి పరిష్కరిస్తామని బొత్స హామీ ఇచ్చారు. అవసరమైతే కాళ్లు పట్టుకుని అయినా సమస్య పరిష్కరించుకునే నేర్పు ఉద్యోగ సంఘాలకు ఉండాలని అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారంలో సామ, దాన, భేద, దండోపాయాలు సహజమేనని అన్నారు. అయితే ఉద్యోగ సంఘాలు నేరుగా దండోపాయాన్ని అవలంబించడం సరికాదని హితవు పలికారు. సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ అండగా ఉంటుందని తెలిపారు. 

మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ... గ్రామ, వార్డు సచివాలయాల్లో 500కి పైగా సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులకు స్వచ్ఛమైన సర్వీస్ రూల్స్ తో పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. ప్రమోషన్లు ఇచ్చేందుకు రోడ్ మ్యాప్ సిద్ధమవుతోందని అన్నారు. శానిటేషన్ ఉద్యోగులకు త్వరలోనే వారాంతపు సెలవు మంజూరు చేస్తామని మంత్రి ఆదిమూలపు వివరించారు.

ప్రభుత్వ కార్యాలయాల సైన్ బోర్డులపై...కొత్త జిల్లాపేరు ఎక్కడా

పాత జిల్లా పేరుతోనే బోర్డులు 

గడివేముల మండల అధికారుల నిర్లక్ష్యానికి...మచ్చుతునకలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా  గడివేముల మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారుల పనితీరుకు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. వివరాలలోకి వెళ్తే స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం,తహసిల్దార్ కార్యాలయం, ఎంఈఓ కార్యాలయం, ప్రభుత్వ వైద్యశాల, భావితరానికి విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాల లకు ఉన్నతాధికారులు, అధికారులు, ఆఫీసులకు ఉద్యోగరీత్యా వచ్చి విధులు నిర్వహించి సాయంకాలం వెళుతుంటారు.కానీ ఉద్యోగాలకు వచ్చే ఉన్నతాధికారులకు, అధికారులకు మాత్రం వారు పనిచేస్తున్న ఆఫీసులకు మొదట కనిపించే కార్యాలయాల పై ఉన్న సైన్ బోర్డులలో కర్నూలు జిల్లా పేరు ను మాత్రం చూసి చూడనట్లు వెళ్తుంటారు.


ప్రభుత్వ అధికారులు పనిచేయు కార్యాలయాల పై ఉన్న బోర్డులకు మాత్రం నేటికీ కర్నూలు జిల్లా పేరునే కొనసాగిస్తున్నారు. గడివేముల మండలం నంద్యాల జిల్లా లోకి మారి సంవత్సర కాలమైన నేటికి గడివేముల మండలంలో ప్రభుత్వ కార్యాలయాల పై ఉన్న సైన్ బోర్డులపై మాత్రం అధికారులు చొరవ చూపకపోవడంతో నేటికీ కర్నూలు జిల్లా పేరు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు, అధికారులు ప్రతినిత్యం కార్యాలయాలకు విధులు నిర్వహించడానికి వస్తు కార్యాలయాలపై ఉన్న సైన్ బోర్డులను చూస్తూ కూడా వాటిపై ఉన్న కర్నూలు జిల్లా పేరును తొలగించి నంద్యాల జిల్లా పేరును మార్చలేనంత  అధికారులు పనులు చేస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాలకు  వివిధ గ్రామాల

నుండి వారి పనుల నిమిత్తం వచ్చే ప్రజలు నేటికీ గడివేముల మండలం కర్నూలు జిల్లాలో ఉందా  లేక నంద్యాల జిల్లాలో ప్రభుత్వఅధికారులు విధులు నిర్వహిస్తున్నారా అ


ని చర్చించుకుంటున్నారు.

 మరి నువ్వు చంద్రబాబు దగ్గర ఏంచేస్తున్నావు


జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. పవన్ నిన్న మా వాళ్లు తూర్పు కాపులను పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడని, బొత్స సత్యనారాయణకు మీరు ఓటు వేస్తే ఆయన ఏంచేశాడని అంటున్నాడని, సీఎం జగన్ వద్ద నోరుమూసుకుని ఉంటున్నాడని విమర్శించాడని పేర్ని నాని మండిపడ్డారు. 

బొత్స సరే... మరి నువ్వు చంద్రబాబు దగ్గర ఏంచేస్తున్నావు? నోరు మూసుకుని ఉండలేదా? అని నిలదీశారు. "మేం ఒక పార్టీని నమ్ముకున్నాం... నేను, బొత్స గారు, అప్పలనరసయ్య, అప్పలనాయుడు వైసీపీలో ఉన్నాం. వైఎస్సార్ కుమారుడు జగన్ మా నాయకుడు... మాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మరి తమరెవరు? మా వాడివే! మీ పార్టీ ఏమిటి... జనసేన పార్టీ... అధ్యక్షులు ఎవరు... తమరే! కానీ తమరు ఎవరికి వంత పాడుతున్నారు, ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిల్చుంటున్నారు... చంద్రబాబు దగ్గర!

ఏమిటీ పిచ్చి ప్రేలాపనలు! మొన్నటిదాకా కులాలు వద్దన్నావు, కాపులకు రిజర్వేషన్లు ఎవడు చెప్పాడని చంద్రబాబు కోసం అప్పుడేవో మాట్లాడావు. ఇప్పుడొచ్చి కులభావం లేని సమాజాన్ని చూస్తే నాకు బాధేస్తుంది అంటున్నావు. వైసీపీలోని నేతలకు కులభావం లేదని బాధపడిపోయావు. ఇక్కడ కాపుల సంగతి అయిపోయింది, రాయలసీమ వెళ్లి బలిజల సంగతి చూశారు... అదీ అయిపోయింది. ఇప్పుడు తూర్పు కాపులు... వీళ్లను కూడా కైమా కొట్టేసి తామరాకుల్లో చుట్టి చంద్రబాబుకు అప్పగించారు. 

అదృష్టవశాత్తు బతికిపోయింది ఎవరయ్యా అంటే... మున్నూరు కాపులు! కానీ అక్కడ కేసీఆర్ ఉన్నాడు... మనోడికి కేసీఆర్ అంటే గజగజ. అందుకే అటు వెళ్లడు. మూడు జిల్లాల్లో ఓబీసీ సర్టిఫికెట్ ఇస్తున్నారు, మిగతా జిల్లాల్లో ఇవ్వడంలేదని అంటున్నారు... నీ యాక్షన్ చూడలేక చచ్చిపోతున్నాం. కనీసం తెరమీదన్నా ఉంటే పాన్ ఇండియా స్టార్ అయ్యుండేవాడివి. అక్కడ సీను లేదు... ఇక్కడికొచ్చి యమా నటించేస్తున్నావు. 

ఏ కులం ఏ ప్రాంతంలో ఏ కేటగిరీలోకి వస్తుందో కేంద్రం గెజిట్ లో పేర్కొంటుంది... దాని ప్రకారమే అధికారులు ఆ కులానికి ఓబీసీ సర్టిఫికెట్ జారీ చేస్తారు... పవన్ ఈ విషయం తెలుసుకోవాలి. విషయ పరిజ్ఞానం లేకుండా పవన్ పిచ్చితనంతో మాట్లాడుతున్నాడు" అంటూ పేర్ని నాని విమర్శనాస్త్రాలు సంధించారు.


ఆయన అన్ని అవార్డులకు అర్హులే

తన దృష్టిలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఏ అవార్డుకైనా అర్హులేనని బీజేపీ ఏపీ చీఫ్ సోమువీర్రాజు తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ప్రకటించడంపై కవులు, కళాకారులు, సాహితీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం తెలిసిందే. చాగంటిని గురజాడ అవార్డుకు ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ, విజయనగరంలో ర్యాలీ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. తన దృష్టిలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఏ అవార్డుకైనా అర్హులేనని తెలిపారు. గురజాడ అవార్డు ఎవరికి ఇవ్వాలనే విషయం ఆ అవార్డు అందించే వ్యక్తులు, సంస్థల అభిప్రాయంపై ఆధారపడి ఉంటుందని అని సోము వీర్రాజు స్పష్టం చేశారు. 

చాగంటి గారు అద్భుతమైన జ్ఞాన భాండాగారం అని కీర్తించారు. రోడ్లపై ధర్నాలు చేస్తూ చాగంటి గారి పేరు ఉచ్చరించే అర్హత ఎవరికీ లేదని సోము వీర్రాజు విమర్శించారు. అవార్డుల పేరుతో ఆయన కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.


 కాల్వ శ్రీనివాసులును అరెస్ట్ చేసిన పోలీసులు

టీడీపీ నేత మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులును పోలీసులుఅరెస్ట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ లపై వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందు తీవ్ర వ్యాఖ్యలు చేయగా, అనంతపురం జిల్లా టీడీపీ నేత జగ్గు కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. అయితే పోలీసులు జగ్గును అరెస్ట్ చేయగా, మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో టీడీపీ నేతలు చెన్నే కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. 

ఈ నేపథ్యంలో, ఆందోళన చేపట్టిన తమ పార్టీ శ్రేణులకు మద్దతుగా టీడీపీ సీనియర్ నేత కాలువ శ్రీనివాసులు చెన్నే కొత్తపల్లి బయల్దేరారు. అయితే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులును నిలువరించిన పోలీసులు ఆయనను స్థానిక టీడీపీ ఆఫీసులో గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులపై కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. 

పోలీసుల తీరును గర్హిస్తూ కనేకల్ రోడ్డుపై తన అనుచరులతో కలిసి బైఠాయించారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు కాలువ శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని రాయదుర్గంలోని ఆయన నివాసానికి తరలించారు.




 పవన్ బాబు కూడా అంతే

జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటిి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరిపడుతుంది... పవన్ బాబు కూడా అంతే అని విమర్శించారు.  ఇదిలావుంటే ఇప్పటం గ్రామస్తులకు చెక్కులు పంపిణీ చేసిన కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. "ఏమీ లేని ఆకు ఎగిరెగిరిపడుతుంది... పవన్ బాబు కూడా అంతే" అని విమర్శించారు. అంతకుముందు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానిస్తూ... అన్నీ ఆ నాయకుడి పేరు మీద పెద్దన్న పథకం, చిన్నన్న పథకం అని పథకాలు తెస్తుంటారని పరోక్ష విమర్శలు చేశారు. ఆ నాయకుడి నవ్వులకు అసలు లోటు ఉండదని, సమయం సందర్భం లేకుండా నవ్వుతూ ఉంటాడని ఎద్దేవా చేశారు. 

"నవ్వు నాలుగు విధాలా చేటు అన్నారు... అది ఆ విషయం అతనికి తెలియదనుకుంటా. ఎవరన్నా చనిపోయినప్పుడు కూడా నవ్వుతూనే అడుగుతాడు, ఆస్తులు పోయాయా... ఎంత పోయాయి... రూ.10 కోట్లు పోయాయా అని కూడా నవ్వుతూనే అడుగుతాడు. గడపలు కూల్చేశారా... అంటూ అది కూడా నవ్వుతూనే అడుగుతాడు. అలా అడగకూడదండీ... అది తప్పు. ఎదుటివాళ్లు బాధలో ఉన్నప్పుడు కనీసం నటించడమైనా నేర్చుకోండి" అని హితవు పలికారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో విడుదల చేసింది.

తన ప్రసంగంలో వైసీపీ నేతలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే రాజకీయాలు చేయాలా.. మేం చేయకూడదా?  రాజకీయాలు చేయడం మీకే చేతనవుతుందా... మాకు చేతకాదా? ఏం మాట్లాడుతున్నారు మీరు... రాజకీయాలు చేయాలంటే ప్రత్యేకంగా పెట్టి పుట్టాలా? అంటూ మండిపడ్డారు. 


 ఆ ఆరోపణల్లో వాస్తవంలేదు

కోట్టంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని కారుతో ఢీకొట్టారన్నది అవాస్తవం అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు పట్టణ టీడీపీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని కారుతో ఢీకొట్టారంటూ వార్తలు రావడం తెలిసిందే. కోటంరెడ్డి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఇది రాజకీయ కోణంలో జరిగిన దాడి అని ఆయన భార్య ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. శ్రీనివాసులు రెడ్డిని కారుతో ఢీకొట్టారన్నది అవాస్తవం అని పేర్కొన్నారు. ఈ దాడి నేపథ్యంలో తనపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు. జిల్లాలో ఏది జరిగినా తనకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు అబద్ధాలతో నెట్టుకొస్తున్నారని అనిల్ కుమార్ విమర్శించారు. కోటంరెడ్డి శ్రీనివాసులు విషయంలో వ్యక్తిగత విభేదాల వల్లే దాడి జరిగిందని అన్నారు.


 కులం చూసి ఓట్లు వేసే సంస్కృతి తొలగిపోవాలి


ఇక, కులం చూసి ఓట్లు వేసే సంస్కృతి తొలగిపోవాలని కోరుకుంటున్నట్టు మంత్రి రోజా తెలిపారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఓట్లు వేయాలని, మంచి వ్యక్తికి ఓటేసి గెలిపించుకుంటే మంచే జరుగుతుందని రోజా పేర్కొన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందని, ఇక ప్రజల కోసం నాయకులు మారాలని అభిప్రాయపడ్డారు.ఇంద్రసేన, రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యరాజ్, సోనియా అగర్వాల్, హెబ్బా పటేల్ తదితరులు నటించిన చిత్రం 'శాసనసభ'. వేణు మందికంటి దర్శకత్వంలో సాప్ బ్రో ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోంది. ఇదిలావుంటే ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ఏపీ మంత్రి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ సినిమా సక్సెస్ సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ చిత్రం పేరు 'శాసనసభ' అనగానే తనకు చాలా ఆసక్తిగా అనిపించిందని తెలిపారు. రాజకీయాలు అంటే నిత్యం యుద్ధరంగంలో ఉన్నట్టేనని, ఈ యుద్ధంలో ఎవరైతే ప్రజల మనసు గెలుస్తారో వాళ్లే శాసనసభలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని అన్నారు."ప్రతివాడికి యుద్ధంలో గెలవాలని ఉంటుంది... కానీ ఒక్కడే గెలుస్తాడు... వాడినే వీరుడు అంటారు" అనే డైలాగ్ నచ్చిందని, ఆ డైలాగ్ వినగానే సీఎం జగన్ గుర్తొచ్చారని రోజా వెల్లడించారు. ఈ చిత్రానికి రాఘవేంద్రరెడ్డి ఆకట్టుకునే డైలాగులు రాశారని అభినందించారు. 



 నాటు సారా విక్రయ దారుల అరెస్టు

రిమాండ్ కు పంపిన గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని ఎల్కే తాండ గ్రామం ఊరి బయట నాటుసారా బట్టి పెట్టుకొని తయారు చేస్తున్నారన్న పక్కసమాచారం తెలుసు కొన్న ఎస్సై బిటి. వెంకటసుబ్బయ్య అప్రమత్తమై వెంటనే తన సహచర సిబ్బందితో కలసి ఉదయం  గ్రామం ఊరిబయట గల కొండలలో దాడులు నిర్వహించి ఎల్కే తాండ గ్రామానికి చెందిన సుభాష్ నాయక్(22 ),గని గ్రామంనకు చెందిన పెద్దన్న(35), వై కే తాండ గ్రామానికి చెందిన బుజ్జి బాయి నాటు సారాయి బట్టి పెట్టుకొని ఉండగా 40 లీటర్ల నాటు సారాయి, హోండా హెచ్ఎఫ్ డీలక్స్  మోటర్ సైకిల్ ను స్వాధీన పరచుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపామని గడివేముల ఎస్సై బిటి. వెంకటసుబ్బయ్య తెలిపారు.

 ఎం.టి.యస్ పై ఎం.పి.ఈ.ఓ లు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి... 

వినతి పత్రం అందజేత

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజక వర్గం పరిధిలోని గడివేముల మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ లో పనిచేస్తున్న 1611 మంది ఎం.పి.ఈ.ఓ లు టి.టి.డి పాలక మండలి సభ్యులు,పాణ్యం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. వివరాలలోకి వెళ్తే బహుళ విస్తరణ అధికారులు కాంట్రాక్ట్ పద్ధతి లో డిస్ట్రీక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నుకోబడి గత 9 సంవత్సరాల నుండి రైతులకు మరియు వ్యవసాయ శాఖకు మధ్య వారధిగా ఉంటు వివిధ పథకాలు రైతులకు అందిస్తూ విధులు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం ఉన్నటివంటి రైతూ భరోసా కేంద్రాలకు ఇంఛార్జి లు గా కుడా విధులు నిర్వహిస్తున్నా మని తెలిపారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ మినిమం టైం స్కేల్ తప్పకుండా కల్పిస్తామని, అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో గడివేముల మండల వ్యవసాయశాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాసులు, గడివేముల జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి, గడివేముల బహుళ విస్తరణ అధికారులు రామకృష్ణ,రేవతి, మంజుల,శ్యామల,మాధవిలత, కవిత బాయి తదతరులు పాల్గొన్నారు.