ఆ నగరాలలో ఇండోర్ ముందుంది


పరిశుభ్రతమైన నగరాల జాబితాలో ఇండోర్ తొలిస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో వరుసగా ఆరో ఏడాది ఇండోర్ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో అత్యంత శుభ్రమైన నగరాల జాబితాలో ఇండోర్ తర్వాత స్థానంలో సూరత్, నవీ ముంబయి , విశాఖపట్నం , విజయవాడ , భోపాల్ , రాజ్‌కోట్ , అహ్మదాబాద్, పుణే, హైదరాబాద్‌ చోటుదక్కించుకున్నాయి. ప్రతిరోజూ 1,900 టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేయడం ద్వారా కోట్లాది రూపాయలను ఆర్జించడంతోపాటు బస్సులకు ఇంధనం సమకూరడం వల్ల ఇండోర్ వరుసగా ఆరోసారి పరిశుభ్రమైన నగరం అవార్డును పొందడానికి సహాయపడింది.

సాధారణంగా వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వర్గీకరిస్తారు. కానీ, ఇండోర్‌లో మాత్రం ఆరు కేటగిరీలుగా వర్గీకరించి సేకరిస్తున్నారు. 35 లక్షల మంది జనాభా కలిగిన ఇండోర్ నగరం.. మధ్యప్రదేశ్ వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందింది. రోజుకు 1,200 టన్నుల పొడి చెత్త, 700 టన్నులు తడి చెత్తను నగర పాలక సంస్థ సేకరిస్తోంది. ‘‘వ్యర్థాలను ఆరు విభాగాలుగా విభజించాం... నివాసాలు, వ్యాపార సముదాయాల నుంచి 850 వాహనాలతో సేకరిస్తున్నాం’’ అని ఇండోర్ నగరపాలక సంస్థ శానిటరీ విభాగం ఎస్ఈ మహేశ్ శర్మ తెలిపారు.

వివిధ రకాలను వ్యర్థాలను సేకరించడానికి వాహానాల్లో వేర్వేరు విభాగాలు ఉన్నాయని అన్నారు. వాడేసిన శానిటరీ ప్యాడ్‌‌ల కోసం ప్రత్యేక కంపార్ట్‌మెంట్ ఉంటుందని శర్మ చెప్పారు. వ్యర్థాల సేకరణ ప్రారంభ దశలో వర్గీకరణ సమర్థవంతమైన ప్రాసెసింగ్‌కు ఉపయోగపడుతుందని వివరించారు. నగరంలోని సేకరించిన తడి చెత్తను ప్రాసెస్ చేసే బయో-సీఎన్‌జీ ప్లాంట్ ఆసియాలోనే అతిపెద్దదని అధికారులు తెలిపారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్లాంట్‌ను ప్రారంభించారు. దేవగురాడియా ట్రెంచింగ్ గ్రౌండ్‌లో రూ.150 కోట్ల ఖర్చు చేసి రోజుకు 550 మిలియన్ టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో దీనిని నిర్మించారు. 10 టన్నులకు 17,000 నుంచి 18,000 కిలోల బయో-సీఎన్‌జీ ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల నగరంలోని150 బస్సులకు అత్యంత చౌకగా కేవలం రూ.5 లకే వాణిజ్య సీఎన్‌జీ లభిస్తోంది.

ఇండోర్ నగర పాలక సంస్థకు గత ఆర్థిక సంవత్సరంలో వ్యర్థాల ప్రాసెసింగ్ ద్వారా రూ.14.45 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో రూ.8.5 కోట్లు అంతర్జాతీయ మార్కెట్‌లో కార్బనరహిత ఉద్గారాలు, ఓ ప్రయివేట్ బయో-సీఎన్‌జీ కంపెనీకి వ్యర్థాలను సరఫరా చేయడం ద్వారా రూ.2.5 కోట్లు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. నగరంలో 8,500 మంది పారిశుద్ధ్య కార్మికులు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నట్టు శర్మ తెలిపారు. నగరంలోని మురుగునీటిని మూడు ప్రత్యేక ప్లాంట్లలో శుద్ధి చేసి, 200 పబ్లిక్ గార్డెన్‌లు, పొలాలు, నిర్మాణ కార్యకలాపాలకు తిరిగి ఉపయోగిస్తారని ఉద్యానవన అధికారి చేతన్ పాటిల్ పేర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: