ఉగ్రరూపం ప్రదర్శించిన ఉక్రెయిన్


ఇప్పటి వరకు ఉక్రెయిన్ ను గడగడలాడించిన రష్యా తాజాగా తన ప్రత్యర్థి దాడులతో  వణుకుతోంది. రష్యాపై ఉక్రెయిన్ ఉగ్రరూపం ప్రదర్శించింది. ఉన్నంతలోనే రష్యాను ఎదురిస్తూ వస్తున్న ఉక్రెయిన్ నిన్న తన డ్రోన్ దెబ్బ రుచిని రష్యాకు చూపించింది. క్రిమియాలోని కీలకమైన సెవస్తపోల్ సైనిక స్థావరాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. 16 డ్రోన్లు ప్రయోగించి కీలకమైన యుద్ధ నౌకలను ధ్వంసం చేసింది. భారీ నష్టం జరిగినప్పటికీ రష్యా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లు అన్నింటినీ కూల్చేశామని, దాడులను తిప్పి కొట్టామని ప్రకటించింది. ఈ దాడిలో ఓ నౌకకు మాత్రమే స్వల్పంగా నష్టం వాటిల్లినట్టు తెలిపింది. 

రష్యాకు సెవస్తపోల్ చాలా కీలకం. నల్లసముద్రంలో రష్యా నౌకా దళానికి ఇది ప్రధాన కేంద్రం. రష్యా ఇక్కడి నుంచి అటు అజోవ్ సముద్ర తీరాన్ని, ఇటు నల్ల సముద్ర తీర ప్రాంతాన్ని నియంత్రిస్తోంది. కాబట్టే 2014లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించుకుని తన భూభాగంలో కలిపేసుకుంది. ఉక్రెయిన్‌ సైనిక చర్య ప్రారంభించిన తర్వాత రష్యా నౌకాదళం ఇక్కడి నుంచే తన దాడులను కొనసాగిస్తోంది. రష్యాకు ఇంత కీలకంగా ఉన్న ఈ ప్రాంతంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో విరుచుకుపడి ఉక్కిరిబిక్కిరి చేసింది. 

ఈ దాడిపై ఉక్రెయిన్ అధికారికంగా స్పందించనప్పటికీ, ఆ దేశ సైన్యం మాత్రం డ్రోన్ దాడుల్లో రష్యాకు చెందిన మూడు యుద్ధ నౌకలు ధ్వంసమైనట్టు పేర్కొంది. ఈ దాడిపై రష్యా తీవ్రంగా స్పందించింది. దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ఉక్రెయిన్‌ దళాలతోపాటు బ్రిటన్‌కు చెందిన నావికాదళం హస్తం కూడా ఉందని ఆరోపించింది. రష్యా ఆరోపణలను బ్రిటన్ ఖండించింది. ఉక్రెయిన్‌పై దాడితో ఎదురుదెబ్బలు తింటున్న రష్యా ఏం చేయాలో పాలుపోక తమపై దుష్ప్రచారానికి దిగిందని మండిపడింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: