లోయలో పడిపోయిన బస్సు..ఒకరి మరణం


జమ్మూ కాశ్మీర్ ప్రమాదాలకు నిలయంగా మారుతోంది.  ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. బస్సు మలుపు తిరగాల్సిన ఓ ప్రాంతంలో డ్రైవర్ బస్సుపై కంట్రోల్ కోల్పోవడంతో.. నేరుగా లోయలోకి దూసుకుపోయింది. 40 అడుగుల లోతున్న లోయలోకి ఫల్టీలు కొట్టి.. కింద పడిపోయింది. ఈ ప్రమాదకరమైన ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్కూళ్ల‌కు వెళ్తున్న విద్యార్థులు స‌హా మొత్తం 64 మందికి గాయాల‌య్యాయి.

ఉధంపూర్ జిల్లాలో సోమవారం ఉదయం ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రైవేట్ ప్యాసింజ‌ర్ బ‌స్సు మౌంగ్రీ ఖోర్ గ‌లీ నుంచి ఉధంపూర్ ప‌ట్ట‌ణానికి వెళ్తుండ‌గా క్రిమాచి-మాన్స‌ర్ ఏరియాలో ప్ర‌మాదానికి గురై లోయలోకి దూసుకెళ్లింది. అయితే యాక్సిడెంట్ జరిగిన టైంలో బ‌స్సులో ఎక్కువ‌గా పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు, కార్యాల‌యాల‌కు వెళ్తున్న ఉద్యోగులు ఉన్నారు.

ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు అక్కడకు వెళ్లారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన వ్యక్తులకు ఎటువంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలియజేశారు. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. అయితే అధికారుల ప్రాథమిక పరిశీలనలో డ్రైవర్ అతి వేగంగా బస్సును నడిపినట్టు తెలిసింది. దాని వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్టు పోలీసులు వెల్లడించారు.

ఇదిలావుంటే గత నెల 14వ తేదీన ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ మినీ బస్సు లోయలో పడిపోయింది. పూంచ్ జిల్లాలో ఇది జరిగింది. ఆ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మండి నుంచి సాజియాన్‌ ప్రాంతానికి వెళ్తుండగా.. బస్సు అదుపు తప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లిపోయింది. దాంతో 11 మంది స్పాట్‌లో చనిపోయారు. గాయపడిన వారిని మండిలోని ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అధికారులు ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: