ఏది తప్పో చెప్పే ధైర్యం లేదా: అసదుద్దీన్ ఓవైసీ


‘‘ఉయ్ ఘర్ ముస్లింలపై చైనా అరాచకాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ నిర్వహించిన కీలకమైన ఓటింగ్‌ కు భారత్‌ దూరంగా ఉండి చైనాకు ఎందుకు అనుకూలంగా వ్యవహరించిందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు.  చైనా అధ్యక్షుడు క్సి జింపింగ్ తో 18 సార్లు భేటీ అయ్యానని చెప్పే ప్రధాని మోదీ.. జింపింగ్ చేస్తున్నది తప్పు అని చెప్పడానికి ఎందుకు భయపడ్డారు? దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి..” అని అసదుద్దీన్ డిమాండ్ చేశారు.

లడఖ్ లో మన భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనాను తప్పుపట్ట లేకపోవడం ఏమిటని, పైగా అంతర్జాతీయంగా చైనాకు అనుకూలంగా వ్యవహరించడం ఏ రకమైన విదేశాంగ విధానమని అసదుద్దీన్ నిలదీశారు.

ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ కూడా ఈ అంశంపై విమర్శలు చేశారు. ‘‘మన భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చెప్పడానికి గానీ, చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని అనడానికి గానీ ప్రధాని మోదీ సిద్ధంగా లేరు. చైనా అంటే ఎందుకంత భయం?” అని ప్రశ్నించారు.

చైనాలో ఉయ్ ఘర్ ముస్లింలపై అత్యంత దారుణమైన స్థాయిలో అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. దాన్ని చైనాను నిలదీసే తీర్మానానికి భారత్ ఎందుకు దూరంగా ఉందని ఆయన నిలదీశారు. చైనా అధ్యక్షుడు క్సి జింపింగ్ అంటే ప్రధాని మోదీకి ఎందుకంత భయమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓవైసీ వరుసగా ట్వీట్లు చేశారు.

చైనాలోని జిన్‌ జియాంగ్ రాష్ట్రంలో ఉయ్ ఘర్ ముస్లింల సంఖ్య ఎక్కువ. వారిపట్ల చైనా దారుణంగా ప్రవర్తిస్తోందని,  హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని చాలాకాలం నుంచి ఆరోపణలు ఉన్నాయి. దీనిపై చర్చించేందుకు తాజాగా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ ముందుకు తీర్మానం వచ్చింది. దీనిపై చర్చించాలంటే తీర్మానానికి మెజారిటీ దేశాల ఆమోదం అవసరం. అయితే ఈ తీర్మానంలో ఓటింగ్ కు భారత దేశం దూరంగా ఉంది. మరికొన్ని దేశాలూ ఓటేయకపోవడంతో చైనాకు వ్యతిరేకంగా తీర్మానం జరగలేదు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ విమర్శలు చేశారు.




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: