అక్టోబర్ 2022

 ఆ పరిహారాన్ని రెండింతలు చేసిన ఏపీ సర్కార్


ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురివుతున్నా ఏపీ సర్కార్ తన సంక్షేమ పథకాల దూకుడును ప్రదర్శిస్తోంది. తాజాగా కల్లు గీత కార్మికులు మరణిస్తే... వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం రెండింతలు చేసింది. ఈ మేరకు రానున్న ఐదేళ్లకు (2022-27) కల్లు గీత నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ప్రస్తుతం కల్లు గీత కార్మికులు మరణిస్తే... వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. నూతన కల్లు గీత విధానం ద్వారా ఈ పరిహారాన్ని రూ.5 లక్షల నుంచిరూ.10 లక్షలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

నరేగా, ఇతరత్రా ప్రభుత్వ పథకాల ద్వారా కల్లు గీత కార్మికులను ఆదుకుంటామని తన నూతన విధానంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కల్లు గీత కార్మికులకు వైఎస్సార్ బీమాను వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గీత కార్మికుల నుంచి వసూలు చేస్తున్న తాడిచెట్టు అద్దెను రద్దు చేస్తున్నట్లుగా కూడా ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది.


 కాపులకు మేం రిజర్వేషన్ ఇస్తే...దానిని జగన్ రద్దు చేశాడు


చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారని, కానీ జగన్ అధికారంలోకి రాగానే 5 శాతం రిజర్వేషన్ ను రద్దు చేశారని టీడీపీ నేత, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప ఆరోపించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు నేడు రాజమండ్రిలో సమావేశం జరపడంపై చినరాజప్ప విమర్శనాస్త్రాలు సంధించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కమిషన్ వేయడానికి రూ.40 లక్షల ఖర్చును బొత్స, అంబటి సమకూర్చలేకపోయారని, నేడు కాపు కార్పొరేషన్ గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అన్నారు.  

"వైఎస్సార్‌ కాపు నేస్తం పేరుతో కాపు మహిళలకు ఏటా రూ.15వేల చొప్పున అయిదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం చేయనున్నట్లు జగన్ రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారు. 2.35 లక్షల మహిళలకు సుమారు రూ.354 కోట్లు అందిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో కోటిన్నర మంది కాపు జనాభా ఉన్నట్లు పేర్కొన్న జగన్ రెడ్డి... కాపు నేస్తం పథకాన్ని మాత్రం 2.35 లక్షల మందికి మాత్రమే పరిమితం చేసి కాపు మహిళలను వంచించారు. 

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి కాపులకు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. కాపులకు రిజర్వేషన్‌ అంశాన్ని పార్లమెంటు సాక్షిగా  మోదీని ప్రశ్నించాల్సి వస్తుందన్న భయంతో వైసీపీ ఎంపీలు దొంగ రాజీనామాలు చేశారు. జగన్మోహన్‌ రెడ్డి కాపు రిజర్వేషన్‌ కేంద్రం పరిధిలోనిదంటూ చేతులెత్తేసి.. అధికారంలోకి వచ్చీ రాగానే.. తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్‌ను కూడా రద్దు చేశారు.

ఇచ్చిన రిజర్వేషన్‌ను ఎత్తేసి.. కాపుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ అబద్ధాలు చెబుతూ కాపు సామాజిక వర్గం మొత్తాన్ని మోసం చేస్తున్నారు. అసలు కాపులకు తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్‌ను ఎత్తివేయడానికి ఇంత వరకు స్పష్టమైన కారణాన్ని చెప్పకుండా.. రిజర్వేషన్‌ కల్పించడాన్నే తప్పుబట్టడం కాపు సామాజిక వర్గానికి ద్రోహం చేయడమే" అని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వివరించారు.


 న్యాయ రాజధానితోనే.... సీమకు పూర్వ వైభవం

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం పరిధిలోని  పాణ్యం లో మూడు రాజధానులకు మద్దతుగా పాణ్యంలో "రాయలసీమ ఆత్మగౌరవ"భారీ ర్యాలీ నిర్వహించారు. వివరాలలోకి వెళితే శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తేనే రాయలసీమకు పూర్వవైభవం వస్తుందనీ , "మూడు రాజధానులు ముద్దు - ఒక రాజధాని వద్దు"అనే నినాదంతో రాయలసీమ విద్యార్థి , యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పాణ్యంలో రాయలసీమ ఆత్మగౌరవ పేరుతో ర్యాలీ నిర్వహించారు.


స్ధానిక పాణ్యం బస్టాండు లోనీ నాలుగురోడ్ల కూడలిలో 1000 మంది  విద్యార్థిని, విద్యార్థులతో  మానవహారంగా ఏర్పడి మూడు రాజధానులు కావాలని పెద్ద ఎత్తున  నినాదాలు చేశారు. ఈ సందర్బంగా రాయలసీమ విద్యార్ధి , యువజన సంఘాల జేఏసీ నేతలు రవీంద్రనాధ్ , బత్తిని ప్రతాప్ , వేణు మాధవరెడ్డి , కేజే. శ్రీనివాసరావు , బాలకృష్ణా నాయక్ తదితరులు మాట్లాడుతూ తరతరాలుగా సీమకు జరుగుతున్న అన్యాయం ను  సహించేది లేదని , పరిపాలనా వికేంద్రీకరణ వలన ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తుంటే , దీనిని కొంత మంది కుట్రపూరితమైన ఆలోచనలతో అడ్డుకుంటున్నారని, కేవలం అమరావతి ప్రాంతం మాత్రమే రాజధానిగా ఉండాలనడం ఎంతవరకు సమంజసం అని,

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు అన్ని పార్టీలు సహకరించాలని లేదంటే సీమలో అడుగడుగునా అడ్డుకుంటామన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని కోసం మేధావులను, రాజకీయ నిపుణులను,అందరినీ కలుపుకొని పోరాటం మరింత ఉధృతం చేయనున్నట్లు విద్యార్థి జేఏసీ నేతలు తెలిపారు.


వైసీపీ సర్కార్ నిర్ణయానికి గవర్నర్ ఆమోద ముద్ర


ఏపీలో రాజకీయ దుమారానికి కారణమైన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును మారుస్తూ వైసీపీ సర్కారు చేసిన తీర్మానానికి సోమవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మారుస్తూ అధికార వైసీపీ తీర్మానం ప్రవేశపెట్టగా..ఆ పార్టీకి సభలో ఉన్న బలం ఆధారంగా సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ చట్టానికి ఆమోదం తెలపాలంటూ గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ వ్యవహారంపై పరిశీలన చేసిన గవర్నర్... సోమవారం ఆ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ ఆమెదం లభించడంతో ఈ బిల్లును చట్టంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫలితంగా సోమవారం నుంచి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు అధికారికంగా వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మారిపోయింది.

 

 టీడీపీ పాలనలో కాపులను అణచివేసే కార్యక్రమాలు


టీడీపీ పాలనలో కాపులను అణచివేసే కార్యక్రమాలకు పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ అనేక కాపు వ్యతిరేక చర్యలు చేపట్టి కాపు వ్యతిరేక పార్టీగా ముద్రపడిందని అంబటి అన్నారు.  వంగవీటి రంగా హత్య, రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేయడం, ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు అనుసరించిన విధానం, ముద్రగడను కొట్టడం, ఆయన భార్యను తిట్టడం, వారి కుమారుడ్ని వేధించడం, ముద్రగడను జైల్లో పెట్టినట్టుగా ఓ సెల్ లో ఉంచడం తదితర అంశాలతో టీడీపీ కాపు వ్యతిరేక ముద్ర పొందిందని అంబటి రాంబాబు వివరించారు. రాజమండ్రిలో వైసీపీ కాపు నేతల సమావేశం ముగిసిన అనంతరం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 

గతంలో వైఎస్సార్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం కానీ కాపులకు పెద్దపీట వేసి, వారిని గౌరవప్రదంగా చూస్తోందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రతి కాపు సోదరుడికి కూడా చేరవేయాలన్న ఉద్దేశంతో ఇవాళ తాము సమావేశమయ్యామని వెల్లడించారు. ఈ సమావేశం పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేశారంటూ కొందరు అంటున్నారని, కానీ అందులో వాస్తవం లేదని అంబటి స్పష్టం చేశారు. 

మొన్న పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడని, కాపు శాసనసభ్యులను కూడా దూషించాడని, పవన్ వ్యాఖ్యలను నేటి సమావేశంలో తాము తీవ్రంగా ఖండించామని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు చూస్తే పవన్ రాజకీయాల్లో పనికిరాడన్న విషయం అర్థమవుతోందని అన్నారు. రాజకీయాల్లో ఉండాలనుకునే వ్యక్తి ఈ భాష మాట్లాడడని అంబటి పేర్కొన్నారు. 

"పవన్ వైఖరి చూస్తే తాను సీఎం అవ్వాలని కోరుకుంటున్నట్టు లేదు... చంద్రబాబును సీఎం చేయాలని భావిస్తున్నట్టుంది. కొందరు కాపు యువకులు పవన్ కల్యాణ్ సీఎం కావాలని అనుకుంటున్నారు. కానీ పవన్ కల్యాణ్ చాలా నీచంగా దిగజారి మాట్లాడారు. వంగవీటి రంగాను హత్య చేస్తారని తెలిసినప్పుడు కాపులు ప్రతి గ్రామం నుంచి వెళ్లి ఎందుకు కాపలా కాయలేకపోయారు... ఈ హత్యకు కాపులు కూడా బాధ్యత వహించాలని పవన్ కల్యాణ్ అన్నాడు. ఇది అడిగిన గంటసేపటికే, రంగా హత్యకు ప్రధాన కారకుడైన చంద్రబాబును కలిశారు. ఎంత దుర్మార్గం ఇది! దీన్ని కూడా కాపు సమాజం గుర్తించాలి. ముద్రగడపై దాడి అనంతరం వైసీపీ నేతలపై కేసులు పెడితే సీఎం జగన్ ఒక్క కలం పోటుతో ఆ కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకున్నారు. 

చాలా చిత్రమైన విషయం ఏమిటంటే... పవన్ కల్యాణ్ కాపు సమాజాన్నంతా తీసుకెళ్లి కాపులకు శత్రువైన చంద్రబాబుకు తాకట్టుపెట్టాలని చూస్తున్నాడు. ఇది ప్యాకేజీగా జరుగుతోందని ఎప్పటినుంచో చెబుతున్నాం. మొన్నటితో ఆ ముసుగు తొలగిపోయింది. చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు పాటుపడుతున్న జనసేన పార్టీకి కాపులు ఎవరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరంలేదు" అని అంబటి రాంబాబు వివరించారు.






 ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం

సర్దార్ వల్లభాయ్ పటేల్..... జయంతి వేడుకలు


(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో విజయసింహారెడ్డి అధ్యక్షతన "జాతీయ ఐక్యత దినోత్సవం" మరియు ఆంధ్రుల ఉక్కుమనిషి"సర్దార్ వల్లభాయ్ పటేల్" జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ అధికారులతో, సిబ్బంది చేత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని , విద్యార్థుల చేత, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల చేత జాతీయ ఐక్యత దినోత్సవం ప్రతిజ్ఞ చేయించి ప్రధాన రహదారులపై భారీ ర్యాలీ నిర్వహించారు.


అనంతరం రాష్ట్ర, జిల్లా, అధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులకు 3.k పరుగు పందెం ఎంపీడీవో విజయసింహారెడ్డి పచ్చ జెండా ఊపి పరుగు పందెంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి ఖాలిక్ భాష,ఎంఈఓ రామకృష్ణుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం దస్తగిరమ్మ, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.


 మంత్రి జగదీశ్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు


మునుగోడు ఉప ఎన్నికల వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో కాకరేపుతోంది. తాజాగా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్న వేళ సోమవారం రాత్రి తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ మంత్రి గండకుంట్ల జగదీశ్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. నల్లగొండలోని ప్రభాకర్ రెడ్డి ఇంటికి చేరుకున్న ఐటీ అధికారుల బృందం ఆయన ఇంటిలో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను టీఆర్ఎస్ అధినాయకత్వం జగదీశ్ రెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకున్న జగదీశ్ రెడ్డి అలుపెరగకుండా ప్రచారంలో సాగుతున్నారు. రెండు రోజుల క్రితం ఎన్నికల నిబంధనలను జగదీశ్ రెడ్డి అతిక్రమించారంటూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని మరువక ముందే ఆయన పీఏ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేయడం గమనార్హం.


 బస్సు టాప్ పైకి ఎక్కి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసి


బస్సు టాప్ పైకి ఎక్కి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో ఎన్నడూ లేనంత హుషారుగా కనిపిస్తున్న రాహుల్ గాంధీ...తెలంగాణలోకి యాత్ర ప్రవేశించాక మరింతగా దూకుడు పెంచేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆదివారం చిన్నారులతో కలిసి పరుగు పందెం ఆడిన రాహుల్ గాంధీ... తాజాగా సోమవారం అదే జిల్లా పరిధిలో ఏకంగా ఆర్టీసీ బస్సు టాప్ పైకి ఎక్కి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 

సోమవారం నాటి యాత్ర ముగింపు సమయంలో ఆర్టీసీ కార్మికులతో రాహుల్ గాంధీ మాట్లాడేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. ఈ భేటీని కాస్తంత డిఫరెంట్ గా నిర్వహిద్దామన్న భావనతో ఆర్టీసీ బస్సు టాప్ ను వేదికగా ఎంచుకున్నారు. ఈ క్రమంలో అప్పటికే ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్లను బస్సు టాప్ పైకి ఎక్కించిన రేవంత్... ఆ తర్వాత తాను కూడా టాప్ ఎక్కారు. తన వెనకాలే రాహుల్ గాంధీని ఆయన బస్సు టాప్ పైకి ఆహ్వానించారు. రాహుల్ గాంధీ బస్సు టాప్ పైకి ఎక్కగానే... దేశ్ కీ నేత... రాహుల్ గాంధీ అంటూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశాయి. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులతో రాహుల్ గాంధీ మాట్లాడారు.



 పాలన తొలి నెల నుంచే బాదుడు


జగన్ రెడ్డి పాలనలో మొదటి నెల నుంచే ప్రజలపై భారాలు మోపుతూ వచ్చారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం  విమర్శించారు. నాటి నుంచే జగన్ రెడ్డి బాదుడే బాదుడు కార్యక్రమం నిర్విరామంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలపై విపరీతంగా బాదుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు  హయాంలో ప్రజలపై ఎలాంటి ఛార్జీల భారం మోపలేదని, ఒక్క నిమిషం కూడా కరెంట్ కోతలు లేవని వెల్లడించారు. కానీ, 

ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలను పరిశీలిస్తే, ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపుతున్నారని పట్టాభిరాం వివరించారు. విద్యుత్ ప్లాంట్లను సరిగా నిర్వహించకపోవడం, బొగ్గు కొనుగోళ్లలో అసమర్థత, ప్రభుత్వ అధీనంలోని ఏపీ జెన్ కో విద్యుత్ ప్లాంట్లలో సరిగా విద్యుత్ ఉత్పత్తి చేయకపోవడం, పీపీఏల రద్దు వంటి తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. 

బహిరంగ మార్కెట్ లో రూ.15 నుంచి రూ.20 వరకు కూడా పెట్టి విచ్చలవిడిగా విద్యుత్ కొనుగోలు చేశారని, ఈ అదనపు కొనుగోలు భారాన్నంతా ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై మోపుతున్నారని వెల్లడించారు. "భారాలు మోపే విషయంలోనూ జగన్ రెడ్డి రివర్స్ లో వెళ్లారు. 2014-19 మధ్య కాలానికి కూడా ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయడం జగన్ రెడ్డి  ప్రభుత్వానికే చెల్లింది. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. చంద్రబాబు పాలనలో ప్రజలపై పైసా భారం వేయలేదు. ట్రూ అప్ అనే పదానికే చోటివ్వలేదు. చంద్రబాబు పాలనా కాలానికి ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీలు వేయడం ఏంటి? ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. పోనీ రివర్స్ లో వెళ్లి టీడీపీ ప్రవేశపెట్టిన అన్ని పథకాలను కూడా ఇదేరకంగా మీరు కొనసాగించారా?" అంటూ పట్టాభిరాం నిలదీశారు. 

ఈ ట్రూ అప్ ఛార్జీల వడ్డనకు ప్రధాన కారణం థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు కొరత వల్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యానికి తగట్లు లేకపోవడమేనని వెల్లడించారు. ఆ లోటు పూడ్చుకోవడానికి బహిరంగ మార్కెట్ లో అత్యధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడం మరో కారణమని వివరించారు. చంద్రబాబు  ముందుచూపుతో బొగ్గు కోసం ఏపీఎండీసీ ద్వారా మధ్యప్రదేశ్ లో సులియారి కోల్ మైన్ ను తీసుకోవడం జరిగింది. ఇవాళ అదే కోల్ మైన్ అదానీ వాళ్లకు కట్టబెట్టడం జరిగింది. ఇదే సులియారి బొగ్గుగని ఏపీ జెన్ కోకు ఇచ్చివుంటే రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత ఉండేది కాదు. కావాల్సినంత విద్యుత్ ఉత్పాదన జరిగి ఉండేది. బహిరంగ మార్కెట్ లో అత్యధిక ధరలకు కొనాల్సిన పరిస్థితి ఉండేది కాదు. 

అదే బొగ్గుగని రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండి ఉంటే తక్కువ ధరకు నాణ్యమైన బొగ్గు మనకు అందుబాటులో ఉండి ఉండేది. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ ను అమ్మాల్సిన పరిస్థితి కూడా ఏర్పడేది కాదు. అన్నీ తెలిసే జగన్ రెడ్డి తన స్వలాభం కోసం లాలూచీ పడి ఇతరులకు  ఈ విధంగా దోచిపెడుతున్నారు. ప్రజలు ఈ వాస్తవాలన్నీ దయచేసి గ్రహించాలి" అన్నారు పట్టాభిరాం. 


 కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ఆత్మహత్య చేసుకుంటామని

సిపిఐ ఆధ్వర్యంలో ఉరితాళ్లతో నిరసన

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా లో నకిలీ సీడ్స్ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, నకిలీ విత్తనాలు అరికట్టడంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నకిలీ విత్తనాలను అరికట్టలేని వ్యవసాయ శాఖ అధికారులను సస్పెండ్ చేయాలని, నకిలీ విత్తనాల కంపెనీలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నూనెపల్లె లోని  వ్యవసాయ శాఖ అధికార కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయానికి తాళాలు వేసి బయటికి పంపించారు. అనంతరం జెడి గారిని కలవాలని రైతులు పట్టు పట్టడముతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలని ఏడి రాజశేఖర్ తెలపడంతో, నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీతో బయలుదేరి నకిలీ విత్తన యజమానులపై చర్యలు తీసుకోవాలని,విత్తన సంస్థలకు సహకరిస్తున్న ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టాలని,నష్టపోయిన పత్తి రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున పంట నష్ట పరిహారం ఇవ్వాలని నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయం చేరుకొని సిపిఐ, కార్మిక, ప్రజాసంఘాల నాయకత్వాన ధర్నా నిర్వహించి, రైతులు మెడకు ఉరితాళ్ళు బిగించుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు,  సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ లు   మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయి పంట చేతికి రాకపోగా అప్పులపాలవుతున్నా అధికారులు, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ముఖ్యంగా కావేరి, ప్రభాస్ విత్తన సంస్థలు నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారని


తెలిసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల జిల్లాలోని గోస్పాడు, పాణ్యం, నంద్యాల, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్ మండలాలకు చెందిన రైతులు నష్టపోయారని ఆరోపించారు. అలాగే పత్తి పంట వేసిన రైతులు పంట వేపుగా పెరిగింది గాని దీనివల్ల కాయలు చెట్టుకు కాయడం లేదని, వైరస్ సోకి లక్షల రూపాయలు నష్టపోవడం జరిగిందని, ప్రభుత్వ అధికారులు నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు ఇవ్వాలని, బ్యాంకులలో తీసుకున్న రుణాలను ఎత్తివేయాలని  డిమాండ్ చేశారు. ప్రభుత్వము, అధికార యంత్రాంగం న్యాయం చేయకపోతే వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సుబ్బరాయుడు మాట్లాడుతూ నకిలీ విత్తనాలను తయారు చేయడానికి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న నకిలీ విత్తనాల యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకొని పీడియాక్ట్ కింద కేసు నమోదు చేసి వారికి సహకరిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

దీంతో స్పందించిన జెడి మాట్లాడుతూ తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జెడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ  జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రఘురామ్మూర్తి, సుంకయ్య, సిపిఐ నాయకులు రమేష్ కుమార్, భాస్కర్, సామెల్, హరినాథ్, భూమని శ్రీనివాసులు, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుగుణమ్మ , ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి శివయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ధనుంజయ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్, ఎర్రి స్వామి తదితరులు పాల్గొన్నారు.


 ఆ ఘటనకు బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి


గుజరాత్ లోని మోర్బీ వద్ద మచ్చూ నదిపై కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన ఘటనకు అక్కడి బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇదిలావుంటే ఈ ఘటనలో 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. మృతుల్లో 47 మంది చిన్నారులు ఉండడం అందరినీ మరింతగా కలచివేసింది. ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. ప్రస్తుతం తెలంగాణలో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న ఆయనను మీడియా పలకరించింది. మోర్బీ వంతెన ప్రమాదానికి ఎవరు బాధ్యత వహించాలని మీరు భావిస్తారు? అంటూ మీడియా రాహుల్ ను ప్రశ్నించింది. అందుకు రాహుల్ బదులిస్తూ, ఈ దుర్ఘటనను రాజకీయం చేయదల్చుకోలేదని స్పష్టం చేశారు. 

ఈ ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఒకవేళ దీనిపై ఏదైనా రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయాల్సి వస్తే, మృతుల పట్ల అవమానకరంగా ప్రవర్తించడమే అవుతుందని పేర్కొన్నారు. అందుకే ఈ ఘటనపై రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేయలేనని రాహుల్ గాంధీ వివరించారు. ఇదిలావుంటే ఇతర కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ ఘటన నేపథ్యంలో తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణదీప్ సూర్జేవాలా స్పందిస్తూ, ఇది సహజసిద్ధంగా జరిగిన ఘటన కాదని, మానవ తప్పిదమే ఈ విషాదానికి కారణమని పేర్కొన్నారు. ఈ ఘోరానికి గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. 

మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఎక్స్ గ్రేషియా ప్రకటించడంపైనా సూర్జేవాలా విమర్శలు చేశారు. గుజరాత్ సోదరసోదరీమణుల ప్రాణాలకు రూ.2 లక్షల పరిహారంతో ఖరీదు కట్టిన ప్రధాని, సీఎం తమ బాధ్యతల నుంచి తప్పించుకోజాలరని స్పష్టం చేశారు. అటు, త్రిపుర కాంగ్రెస్ ఇన్చార్జి డాక్టర్ అజయ్ కుమార్ స్పందిస్తూ, మోర్బీ వంతెన ప్రమాదం మోసానికి ఫలితంగానే జరిగిందని, ఇది మోదీకి దేవుడు పంపిన సందేశం అని వ్యాఖ్యానించారు.


 నాదెండ్ల మనోహర్ కు...చేదు అనుభవం


జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు సోమవారం ఓ చేదు అనుభవం ఎదురైంది. గతంలో జనసేన ఆవిర్భావ వేడుకల కోసం ఏర్పాటు చేసిన సభ కోసం స్థలం ఇచ్చిన ఇప్పటం గ్రామస్థులతో భేటీ కోసం ఆయన సోమవారం సాయంత్రం ఆ గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ వాసులతో నాదెండ్ల మాట్లాడుతుండగానే... విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఈ తరహా పరిణామాలు జనసేనకు గతంలోనూ ఎదురైన నేపథ్యంలో జనసైనికులు తమ సెల్ ఫోన్లలో టార్చ్ లను ఆన్ చేశారు. ఈ సెల్ ఫోన్ల లైటింగ్ లోనే నాదెండ్ల తన సమావేశాన్ని కొనసాగించారు. నాదెండ్ల మనోహర్ ప్రసంగం ముగిసిన మరుక్షణమే గ్రామంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కావడం గమనార్హం.

ఈ సందర్భంగా ఇప్పటం గ్రామానికి జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించిన రూ.50 లక్షల విరాళంపై అధికారులు జారీ చేసిన ఆదేశాలపై నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సభ కోసం ఇప్పటం గ్రామస్థులు తమ భూమిని ఇస్తే... దానికి ప్రతిగా గ్రామానికి పవన్ రూ.50 లక్షల విరాళం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ నిధులను సీఆర్డీఏ ఖాతాలో జమ చేయమని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాకుండా పవన్ నిధులతో గ్రామంలో ఓ కమ్యూనిటీ హాల్ ను నిర్మించి దానికి వైఎస్సార్ పేరు పెడతామని అధికారులు చెప్పడం మరింత విడ్డూరంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


ద్రోహి జగన్ రెడ్డికి వైసీపీ కాపు నేతలు ఊడిగం


కాపుల ద్రోహి జగన్ రెడ్డికి వైసీపీ కాపు నేతలు ఊడిగం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ మండిపడ్డారు. పదవులకి కక్కుర్తి పడి తమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించని ఏ ఒక్క కాపు మంత్రీ క్షమార్హుడు కాదని స్పష్టం చేశారు. రాజమండ్రిలో వైసీపీ కాపు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం నిర్వహించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బొండా ఉమ స్పందించారు. పదవుల కోసం లాలూచీ పడిన ప్రతి ఒక్కరిని కాపు సోదరులు కాలర్‌ పట్టుకొని నిలదీయాలని, తమకు దక్కాల్సిన రిజర్వేషన్లు ఏవి? అని గట్టిగా అడగాలని పిలుపునిచ్చారు. గెలిపించిన పాపానికి కాపుల గొంతు కోసేందుకు జగన్‌ రెడ్డి పూనుకున్నారని విమర్శించారు. "విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఇతర అగ్రవర్ణాల వారి కంటే వెనుక బడి ఉన్న కాపు సామాజికవర్గాన్ని ఆదుకునే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో జనరల్ కేటగిరీ పేదల కోటాలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు కేటాయించారు. 2019లో జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చీ రాగానే కుట్ర పూరితంగా ఆ రిజర్వేషన్లను తొలగించాడు. 

కాపులకు 5% రిజర్వేషన్‌ రద్దుతో గత మూడేళ్లలో విద్యాసంస్థల్లో మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపులకు తీరని అన్యాయం జరిగింది. జగన్‌ రెడ్డి చెబుతున్న సచివాలయ ఉద్యోగాల్లోనే దాదాపు 13వేల ఉద్యోగాలు కాపు యువత కోల్పోయారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో కావులకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా తన సామాజికవర్గం వాళ్లకే ప్రాధాన్యత కలిగిన అన్ని పోస్టులను జగన్‌ రెడ్డి అప్పనంగా కట్టబెట్టేశాడు. కనీసం అలాంటి పోస్టులలో 5% కూడా కాపులకు ఇవ్వకుండా జగన్‌ వివక్ష చూపించాడు.

జగన్‌ క్యాబినెట్‌లో మంత్రులైన అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్‌, కొట్టు సత్యనారాయణ, దాడిశెట్టి రాజా కేవలం జగన్‌ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రెడ్లకు కాపు కాస్తూ, బానిస బతుకులు బతుకుతున్నారు. వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకొని జగన్‌ రెడ్డిపై తిరుగుబాటు చెయ్యాలి.  రాజకీయంగా విద్యాపరంగా ఆర్థికంగా కాపులు ఎదగడం జగన్‌ రెడ్డికి ఏమాత్రం గిట్టడం లేదు. తన సామాజిక వర్గం ఏమవుతుందో అన్న అభద్రత భావంతో ఉన్న సన్నాసి జగన్‌ రెడ్డి" అంటూ బొండా ఉమ విమర్శనాస్త్రాలు సంధించారు.

 సర్పరాజ్ ఐఏఎస్ ను కలిసిన...డి.ఎల్. పాండు ముదిరాజ్ 

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో  ఎక్సైజ్  గవర్నమెంట్ ప్లీడర్ గా తెలంగాణ ప్రభుత్వం తరఫున డి.ఎల్. పాండు ముదిరాజ్ నియమితులయ్యారు.  ఈ సందర్భంగా సోమవారం నాడు  అబ్కారీ భవన్లో  ఎక్సైజ్ కమిషనర్/ డైరెక్టర్ అయినటువంటి *సర్ఫరాజ్ అహ్మద్ ఐఏఎస్*ను డి.ఎల్. పాండు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎక్సైజ్ శాఖ తరపున లీడర్ గా నియమితులైన సందర్భంగా డి.ఎల్. పాండు ముదిరాజ్ కలిశారు. ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించుకున్నారు.



 కూలిన కేబుల్ బ్రిడ్జి..32 మంది మృతి


గుజరాత్ రాష్ట్రంలో తీవ్ర విషాధం చోటు చేసుకొంది. రాష్ట్రంలో మోర్బీలో మచ్చూ నదిపై ఉన్న ఓ కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందగా, అనేకమందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వంతెనపై 500 మంది ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నదిలో పడిన అనేకమందిని సహాయక సిబ్బంది, పోలీసులు కాపాడారు. ఈ కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన వెంటనే చాలామంది నీళ్లలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఐదు రోజుల కిందటే ఈ కేబుల్ బ్రిడ్జి ఆధునికీకరణ పనులు పూర్తి చేశారు. ప్రమాద ఘటనపై గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి స్పందిస్తూ, 70 మందిని కాపాడామని వెల్లడించారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. 

ఇదిలావుంటే ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో మాట్లాడారు. ఘటన వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనలో మరణించిన వారికి గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా, కేంద్రం రూ.2 లక్షలు ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50 వేల సాయం ప్రకటించింది 


 ఫిరాయింపుదారులకు కేరాఫ్ అడ్రస్ టీఆర్ఎస్ 


ఫిరాయింపుదారులకు కేరాఫ్ అడ్రస్ టీఆర్ఎస్ పార్టీనే అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కు ఎందుకు మద్దతు ఇస్తున్నారో వామపక్షాలు పరిశీలించుకోవాలని హితవు పలికారు. చండూరులో సీఎం కేసీఆర్ ప్రసంగంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ మాట్లాడిన తీరు చూస్తే అభద్రతాభావం, అపనమ్మకం కనిపించిందని అన్నారు. పరోక్షంగా కేసీఆర్ ఓటమిని అంగీకరించారని వ్యాఖ్యానించారు. చండూరులోనూ కేసీఆర్ పాత రికార్డునే ప్లే చేశారని విమర్శించారు. ఆరోపణలు, హామీలకు సంబంధించి కేసీఆర్ మాట్లాడినవన్నీ అవాస్తవాలేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన వారిని మీ పార్టీలో చేర్చుకున్నారు అని ఆరోపించారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన వ్యవహారంపై కిషన్ రెడ్డి స్పందిస్తూ... నలుగురు హీరోలని కేసీఆర్ చెబుతున్న నేతలు పార్టీ ఫిరాయించినవారేనని వెల్లడించారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ లో డబ్బు విషయం ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు.



 ఢిల్లీ పీఠమే కదిలిపోయే పరిస్థితి


ఢిల్లీ పీఠమే కదిలిపోయే పరిస్థితి దాపురించిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మునుగోడులో యుద్ధం చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నవంబరు 3న జరగనుండగా, టీఆర్ఎస్ పార్టీ నేడు చండూరులో రణభేరి సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు విచ్చేసిన సీఎం కేసీఆర్ ప్రధానంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు.  20, 30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్ ను పడగొట్టాలని చూశారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి దొంగతనంగా వచ్చి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసి జైలుపాలయ్యారని అన్నారు. 

"ఓ తలకు మాసినోడు వచ్చి తడిగుడ్డలతో ప్రమాణం చేస్తావా అంటాడు, ఇంకొకడు వచ్చి పొడి బట్టలతో ప్రమాణం చేస్తావా అంటాడు. ఇది రాజకీయమా? దొరికిన దొంగలు జైల్లో ఉన్నారు. ఈ కేసు న్యాయస్థానంలో ఉంది కాబట్టి దీనిపై ఇంతకుమించి మాట్లాడలేను. నేను రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను. నేను మాట్లాడితే దీన్ని ప్రభావితం చేశానని అంటారు. 

కానీ ఒక్క మాట మాత్రం చెబుతాను... నిన్న మొన్న మీరు టీవీలో చూసింది కొంతే... చూడాల్సింది చాలానే ఉంది. ఢిల్లీ పీఠమే కదిలిపోయే పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో అన్నీ బయటపడతాయి. ఈ దుర్మార్గులను కూకటివేళ్లతో సహా పెకలించి బంగాళాఖాతంలో విసిరేస్తే తప్ప భారతదేశానికి నిష్కృతి లేదు. ఈ మతోన్మాదులను, ఈ పెట్టుబడిదారుల తొత్తులను తరిమికొట్టకపోతే  ఈ దేశం బాగుపడదు. మునుగోడులో బీజేపీని గెలిపిస్తే అరాచకాలకు అంతే ఉండదు... ఆ తర్వాత మేం చేసేది ఏమీ ఉండదు" అని స్పష్టం చేశారు. 

ఈ అరాచకాలను మోదీ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? రెండు సార్లు ప్రధాని అయిన మోదీకి ఇంకా ఏంకావాలి? అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు నవంబరు 3వరకు అప్రమత్తంగా ఉండి, బ్రహ్మాండంగా ఈ చైతన్యాన్ని ఇలాగే కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. "వడ్లు కొనాలని కోరితే నూకలు తినాలని చెబుతారు. మనం నూకలు తినాలా? ఎవడైతే మనల్ని నూకలు తినమన్నాడో, ఈ ఎన్నికల ద్వారా వాని తోక కత్తిరించాలి. ప్రలోభాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికలప్పుడు వచ్చి మందుగుండు సామగ్రి తెస్తారు, ఇంటికి తులం బంగారం అంటారు, చంటిపిల్లల ముక్కుకు చీమిడి ఉంటే తుడుస్తారు... కానీ 3వ తేదీ ఎన్నికలు పూర్తయితే ఒక్కరు కనిపించరు. ఇదే ప్రభాకర్ రెడ్డి, ఇదే కేసీఆర్, ఇదే సీపీఐ జెండాలు తప్ప మరొకరు కనిపించరు. 

మనకు చైతన్యం ఉంటే స్వార్థ శక్తుల ఆటలు సాగవు. దయచేసి మీ అందరినీ కోరేది ఒక్కటే. మునుగోడులో మీ బిడ్డ ప్రభాకర్ రెడ్డిని గెలిపించండి. మీ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది. చండూరును డివిజన చేసే బాధ్యత నాది. మీకు 100 పడకల ఆసుపత్రి ఇచ్చే బాధ్యత నాది. మీ రోడ్లను బాగు చేసే బాధ్యత నాది. ఇవేవీ సాధ్యంకాని పెద్ద పనులేవీ కాను. టీఆర్ఎస్ ను గెలిపిస్తే ఫలితాలు మీకు వెంటనే కనిపిస్తాయి. కారు గుర్తుకే మీ ఓటు" అని స్పష్టం చేశారు.


 బూజునూరు గ్రామంలో బాదుడే - బాదుడు

కార్యక్రమంలో పాల్గొన్న గౌరు దంపతులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని బూజునూరు గ్రామంలో బాదుడే - బాదుడు కార్యక్రమం నంద్యాల జిల్లా టిడిపి మండల కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పాణ్యం మాజీ శాసనసభ సభ్యురాలు గౌరు  చరితా రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను అభిమానులను ఉద్దేశించి నంద్యాల జిల్లా టిడిపి కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఇసుక మాఫియాను అంతం చేస్తానని చెప్పి ఇప్పుడు తన అనుచరుల ద్వారా అధిక ధరలకు  పంపిణీ చేస్తూ ప్రజలకు మోయలేని భారాన్ని మోపుతున్నాడని, ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, విద్యార్థిని,విద్యార్థులకు రావలసినటువంటి రిమెంబర్స్ మెంట్ కూడా సరిగా అందడం లేదని ఆయన ధ్వజమెత్తారు.


పాణ్యం మాజీ శాసనసభ సభ్యురాలు గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు మండలంలో రైతులు రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేసిన విత్తనాలు వేసి ఎకరాకు 50 వేల నుండి 70 వేల దాకా ఖర్చు చేసిన దిగుబడులు రాక రైతులు విలవిలలాడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కేవలం వాలంటీర్, సచివాలయం ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి నిరుద్యోగ యువతి, యువకులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

గడివేముల మండలం టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ అలగనూరు రిజర్వాయర్ కట్ట తెగి నెలలు గడుస్తున్న ఇంతవరకు కట్టనిర్మానం జరగలేదని, అలగనూరు రిజర్వాయర్ లో నీరు నిలువ లేకపోవడంతో వందల మంది రైతులు పంటలు పండించుకోలేక బాధలు పడుతున్నా పట్టించుకోవడంలేదని, గ్రామాలలో  కుళాయిలకు రంధ్రాలు పడినా వాటిని మరమ్మతు చేసుకోవడానికి కూడా గ్రామపంచాయతీలో డబ్బులు లేక సర్పంచులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బూజునూరు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బూజునూరు రామచంద్రారెడ్డి, మంచాలకట్ట శ్రీనివాస్ రెడ్డి, ముస్లిం లీగ్ స్టేట్ కన్వీనర్ ఫరూక్, సుభద్రమ్మ, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

 మనసుని వ్యతిరేక ధోరణితో నిర్భంధించుకోవద్ఢు

ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎం.ఏ. కరీం

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

మనసుని నిర్భంధించే వ్యతిరేక ఆలోచన ధోరణిని గుర్తించాలని, మనసు అదుపు తప్పకుండ ఉండేందుకు ప్రతి ఒక్కరు తమ మనసు యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలని, మనసు చేసే అల్లరికి బానిసలుగా మారకూడదని తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షుడు ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎం.ఏ.కరీం అన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో శనివారం మహెదిపట్నం డిపోలో సిబ్బంది మరియు కార్మికులకు డిపో మేనేజర్ జి.వెంకటసూర్యనారాయణ నిర్వహణలో ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎం.ఏ.కరీం ప్రధాన శిక్షకులుగా పాల్గొని మాట్లాడుతూ నిరంతరంగా మారుతున్న జీవన ప్రమాణాల ఆధారంగా ప్రతిరోజు ఎదురైయ్యె అనుభవాల ఆధారంగా ఏర్పడే ఆలోచనలను ఎప్పటికప్పుడు బలపర్చుకోవాలని, సమస్యలు ఎదురైనప్పుడు మనసుపై నియంత్రణ కోల్పోవద్ఢని, ప్రతి సమస్యకు మూలం మనసే అని, మానసిక సామర్ధ్యం పెంచుకుంటే అది మనలో సర్వరోగనివారిణిలాగా పని చేస్తుందని అన్నారు. మానసిక నిర్వహణ అనేది సాఫల్యవంతమైన జీవితాన్ని ఇస్తుందని,


మన ఆలోచనలే మనకు శత్రువులుగా మారకూడదని, మన జీవితం మన  ఆలోచనలతోనే ముడి పడి ఉంటుందని, మంచి జీవనశైలి ప్రతి ఒక్కరికి చాల అవసరం అని ఆయన అన్నారు. అనంతరం వివిధ మానసిక సమస్యలతో బాధపడే వారికి వ్యక్తిగత కన్సల్టేషన్ మరియు మానసిక ప్రవర్తన లోపాలను సవరించుకునే విధి విధానాలను ప్రయోగ పూర్వకంగా అవగాహన కల్పించారు. వ్యక్తిగత మానసిక సమస్యల పరిష్కారం కోసం 9440488571 పై సంప్రదించాలని సైకాలజిస్ట్ డాక్టర్ కరీం కోరారు. అనంతరం సైకాలజిస్ట్ డాక్టర్ కరీం సేవలను అభినందిస్తూ ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మహెదిపట్నం ఆర్టీసి డిపో మేనేజర్ జి.వెంకటసూర్యనారాయణ ట్రాఫిక్ మేనేజర్ కరుణశ్రీ, అకౌంట్స్ మేనేజర్ స్వరూప రాణి, కార్యక్రమ నిర్వాహకులు ఆనంద్, కృష్ణ, జగన్నాధం, ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 భర్త తనువుచాలించిన..వెంటాడుతున్న లోన్ యాప్ 


రుణం తీసుకొన్న పాపానికి భర్త తనువు చాలించగా నష్టపోయిన భార్యను సైతం లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు కొనసాగుతున్నాయి. ఇదిలావుంటే లోన్ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడడ్డాడు.. రెండేళ్ల క్రితం ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయాడు. కొంతకాలం మౌనంగా ఉన్న లోన్ యాప్ నిర్వాహకులు సదరు యువకుడి భార్యకు ఫోన్ చేశారు. భర్తను కోల్పోయి, నెలల పసికందుతో పుట్టింటికి చేరిన ఆ మహిళను ఏడాదిగా వేధిస్తున్నారు. భర్త మరణానికి, తన జీవితం అస్తవ్యస్తం కావడానికీ కారణమైన లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయినా వేధింపులు ఆగట్లేదని వాపోయారు.

హైదరాబాద్ కు చెందిన పండిటి సునీల్ సాఫ్ట్ వేర్ డెవలపర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ కాలంలో ఉద్యోగం కోల్పోవడం, అదే సమయంలో భార్య పండిటి రమ్యశ్రీ గర్భంతో ఉండడంతో అప్పులను ఆశ్రయించాడు. ఓ లోన్ యాప్ నుంచి అప్పు తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పలేదు. అప్పు తీసుకున్న వారం రోజుల నుంచే సునీల్ కు ఫోన్లు, మెసేజ్ లు రావడం మొదలైందని రమ్యశ్రీ చెప్పారు. ఓ రోజు తనతో పాటు కుటుంబ సభ్యులు బంధువుల ఫోన్లకు కూడా మెసేజ్ లు వచ్చాయని వివరించారు. సునీల్ తమకు బాకీ ఉన్నాడని, ఆ మొత్తం చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఆ మెసేజ్ లో ఉందన్నారు. ఈ గొడవ కొనసాగుతుండగానే తమకు బాబు పుట్టాడని రమ్యశ్రీ వివరించారు. ఓవైపు సరైన ఉద్యోగం లేక, మరోవైపు లోన్ యాప్ వేధింపులతో 2020 డిసెంబర్ లో తన భర్త సునీల్ ఉరేసుకున్నాడని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

భర్త మరణంతో పుట్టింటికి చేరిన రమ్యశ్రీకి లోన్ యాప్ నిర్వాహకుల నుంచి ఫోన్లు రావడం మొదలైంది. మీ భర్త బాకీ ఉన్న మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని ఫోన్లలో బెదిరిస్తున్నారని రమ్యశ్రీ వివరించారు. ఏడాదిగా ఈ వేధింపులు ఆగడంలేదని ఆమె చెప్పారు. వాళ్ల వేధింపుల వల్లే తను భర్తను కోల్పోయానని, అయినా ఆపకుండా తననూ వేధిస్తున్నారని రమ్యశ్రీ వాపోయారు.

 వేగన్ ఆర్, సెలేరియా, ఇగ్నిస్ లలో సాంకేతిక సమస్య


 వేగన్ ఆర్, సెలేరియా, ఇగ్నిస్ వాహనాలను దాని తయారి సంస్థ వెనక్కి తీసుకొంటోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ పేరొందిన మోడళ్లు వేగన్ ఆర్, సెలేరియా, ఇగ్నిస్ లో వెనుక చక్రాల బ్రేకింగ్ లో సమస్యలను గుర్తించినట్టు ప్రకటించింది. దీంతో ఈ ఏడాది ఆగస్ట్ 3 నుంచి సెప్టెంబర్ 1 మధ్య తయారు చేసిన ఈ మోడళ్లకు సంబంధించి 9,925 యూనిట్లను వెనక్కి పిలిపిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది. 

వెనుక బ్రేక్ ల పిన్ లో సాంకేతిక సమస్యలను గుర్తించినట్టు మారుతీ సుజుకీ తెలిపింది. కస్టమర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని వీటిని రీకాల్ చేస్తున్నట్టు పేర్కొంది. దెబ్బతిన్న లేదా లోపాలున్న విడిభాగాలను ఎటువంటి చార్జీ లేకుండా మార్చి తిరిగి కస్టమర్లకు వాహనాలను అందించనున్నట్టు వెల్లడించింది. ఆటోమొబైల్ తయారీ సంస్థలు వాహనాల్లో లోపాలను గుర్తించినప్పుడు ఇలా రీకాల్ చేయడం సాధారణంగా జరిగేదే. 

 దళితుల భూములపై ఉన్న

డంపింగ్ యార్డ్ ను మార్చండి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు మునిసిపాలిటీ లో జరిగిన మునిసిపల్ సాధారణ సమావేశంలో  మునిసిపల్ వైస్ చైర్మన్  అర్షపోగు ప్రశాంతి, ఒకటో వార్డ్ కౌన్సిలర్  కాటేపోగు చిన్న రాజు, దళితుల భూములపై ఉన్న డంపింగ్ యార్డు గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్దిగట్ల పొలిమేరలో ఉన్న డంపింగ్ యార్డును వేరే చోటికి బదిలీ చేయాలని అక్కడ ఉన్నది కేవలం ఏబీఏం పాలెం కు చెందిన ఎస్సీ దళిత కుటుంబాలు కొన్ని ఏళ్ళ తరబడి గనెట్ పనిచేస్తూ కూలీ నాలి చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారని,అక్కడ ఏర్పడిన గుంతలను మట్టితో పూడ్చుకుంటూ భూమిని సాగుచేసుకొని పంటలు పండిస్తున్నారని 


అలాంటి సాగు భూములపై పట్టణంలోని మురికిని అంతా అక్కడ వదలడం వలన దళిత కుటుంబాలు సాగు చేసుకొంటున్న భూములు కోల్పోతారని, దీని వలన దళితులు పూర్తిగా నష్ట పోతారని జీవనాధారం పూర్తిగా కోల్పోతారని, అందువలన దళితుల భూములపై నిర్మించిన డంపింగ్ యార్డు ను వేరే చోటికి ఎక్కడికైనా మార్చాలని డిమాండ్ చేశారు

 జోరుగా...హుషారుగా,,, భారత్ జోడో యాత్ర


పిల్లలతో...పండు ముసలివాళ్లతో..విద్యాధికులతో,  యువతతో,  రైతు, శ్రామిక వర్గాలతో మమేకమవుతూ భారత్ జోడో యాత్ర సాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్  జోడో పాదయాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఐదో రోజు యాత్రలో భాగంగా ఆదివారం ఉదయం జడ్బర్లలో రాహుల్ పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులందరినీ ఉత్తేజ పరిచారు. యాత్రలో నడుస్తున్న రాహుల్ వద్దకు కొంతమంది చిన్నారులు వచ్చారు. ఇంతలో మనం పరుగెదామా.. రెడీ వన్ టు త్రీ అంటూ ఆయన రన్నింగ్ మొదలు పెట్టారు. రాహుల్ ను చూసి పక్కనే ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పరుగు అందుకున్నారు. మిగతా నాయకులు, భద్రతా సిబ్బంది కూడా పరుగెత్తారు. అలా కొద్దిదూరం వెళ్లిన తర్వాత పరుగు ఆపిన రాహుల్ మళ్లీ నడవడం కొనసాగించారు. రాహుల్ పరుగెత్తడం చూసి అక్కడున్నవాళ్లంతా కేరింతలు కొట్టారు. 

రాహుల్ ఈ రోజు 22 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సాయంత్రం గాంధీ షాద్‌నగర్‌లోని సోలిపూర్ జంక్షన్ వద్ద సభలో పాల్గొంటారు. నవంబర్ ఏడో తేదీ వరకు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 375 కి.మీ నడుస్తూ 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాలను రాహు కవర్ చేయనున్నారు. నవంబర్ 4న యాత్రకు ఒకరోజు విరామం ఇస్తారు. రాష్ట్రంలో పాదయాత్ర జరిగే సమయంలో రాహుల్ గాంధీ క్రీడా, వ్యాపార, సినీ రంగాలకు చెందిన ప్రముఖులతో సహా మేధావులు, వివిధ సంఘాల నాయకులతో సమావేశమవుతారు. కాగా, భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. 

 ఆమ్లెట్ వేసిన హీరో రామ్ చరణ్


తన విహార యాత్రలో హీరో రామ్ చరణ్  ఆమ్లెట్ వేశారు. ఇదిలావుంటే రామ్ చరణ్ దంపతులు టాంజానియా అందాలను వీక్షించే పనిలో ఉన్నారు. జపాన్ లో పర్యటన ముగించుకుని వీరు టాంజానియా చేరుకున్నారు. టాంజానియాలో ఓపెన్ టాప్ జీప్ ను రామ్ చరణ్ నడుపుతుంటే, పక్కనే ఓ చిన్నారి కూర్చున్నాడు. ఆ తర్వాత బహిరంగ ప్రదేశంలోనే ఏర్పాటు చేసిన స్టవ్ పై చరణ్ ఆమ్లెట్ వేశాడు. ఇదంతా టాంజానియా సఫారీలో భాగమని తెలుస్తోంది. రామ్ చరణ్ కు సాయంగా కొందరు స్థానికులు వెంట ఉన్నారు. 

తాను జీప్ నడుపుతున్న వీడియో క్లిప్ ను రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ఆ ప్రాంతం వన్యప్రాణి అభయారణ్యం అని తెలుస్తోంది. ఎందుకంటే అదే జీప్ నుంచి కెమెరాతో సమీపంలోని సింహాన్ని ఫొటో తీయడాన్ని వీడియోలో చూడొచ్చు. తమ పర్యటనకు సంబంధించిన దృశ్యాలను ఉపాసన కూడా సామాజిక మాధ్యమంలో షేర్ చేసింది. జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 21న విడుదలైంది. దీనికి ముందు అక్కడ సినిమా ప్రచారం కోసం రామ్ చరణ్ దంపతులు వెళ్లారు. అటు తర్వాత వీరు టాంజానియాలో పర్యటిస్తున్నారు.

 మూడు రాజధానులకు మద్దతుగా..

నంద్యాలలో సీమగర్జన పేరుతో విద్యార్థి సంఘాల భారీ ర్యాలీ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా విద్యార్థి సంఘాలు మరియు విద్యార్థులు దాదాపు 3,000 మంది భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ కర్నూలులో న్యాయ రాజధాని అడ్డుకుంటున్న చంద్రబాబుకు రాయలసీమలో రాజకీయంగా సమాధి కడుతామని, రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ చైర్మన్లు శ్రీరాములు, రాజు నాయుడు, చంద్రప్ప హెచ్చరించారు.


నంద్యాలలో స్థానిక సంజీవ నగర్ గేటు నుంచి శ్రీనివాససెంటర్ వరకు రాయలసీమ గర్జన పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేసి అనంతరం వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ చైర్మన్లు శ్రీరాములు, రాజు నాయుడు, చంద్రప్ప , జేఏసీ నేతలు వేణుమాధవ్ రెడ్డి, వెంకట్, రవీంద్ర, ప్రతాప్ , వెంకటేష్ , నేతలు  అమృతరాజు , జాకీర్ హుస్సేన్  లు మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ తోనే రాష్ట్రము అభివృద్ధి చెందుతుందని గత ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమను, ఉత్తరాంధ్రను విస్మరించి కేవలం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసి వేలకోట్ల రూపాయలు ఖర్చు చేశారని,


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మరోసారి ఆంధ్రప్రదేశ్ విడిపోకుండా ఉండాలంటే మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు గుర్తించి ఏర్పాటు చేస్తే చంద్రబాబు దాన్ని అడ్డుకోవడం చాలా దుర్మార్గం అని అన్నారు. చంద్రబాబు అమరావతి జపం చేస్తూ కర్నూలులో న్యాయ రాజధాని అడ్డుకుంటూ రాయలసీమ కు అన్యాయం చేస్తే చంద్రబాబుకు రాజకీయంగా సమాధి తప్పదు అని హెచ్చరించారు.

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేసేంతవరకు పోరాటం సాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు బాలకృష్ణ నాయక్ , కేజే శ్రీనివాసరావు , నాగరాజు , చంద్ర , యశ్వంత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 వస్తే పర్వాలేదు..టిక్కెట్ గురించి చెప్పలేం


బీజేపీతో కలిసి పనిచేయాలనుకునే వారికి పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ను పార్టీలోకి స్వాగతిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. అయితే, పార్టీ టికెట్ ఇచ్చే విషయం ఇప్పుడే చెప్పలేమని ఆయన వివరించారు. బీజేపీతో కలిసి పనిచేయాలనుకునే వారికి పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన ఈ సందర్భంగా కామెంట్ చేశారు. పార్టీ టికెట్ ఇవ్వడం తన ఒక్కడి చేతిలో లేదని, అంతర్గతంగా చర్చించి ఎవరికి టికెట్ ఇవ్వాలో పార్టీ పార్లమెంటరీ బోర్డులో నిర్ణయిస్తామని తెలిపారు. స్థానిక కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలను స్వీకరించి, వాటిపై చర్చించాకే పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతుందని వివరించారు. హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, అక్కడ పార్టీ టికెట్ల కేటాయింపుపై ఇప్పుడే మాట్లాడలేమని నడ్డా వెల్లడించారు.

రాజకీయాల్లోకి రావడంపై కంగనా రనౌత్ శనివారం స్పష్టత ఇచ్చారు. బీజేపీ టికెట్ ఇస్తే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమేనని ప్రకటించారు. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు స్పందించారు. పార్టీలో చేరాలనుకుంటే కంగాన రనౌత్ కు స్వాగతం పలుకుతామని తెలిపారు.

 దొంగ ఎవరో, దొర ఎవరో ఇప్పటికే ప్రజలకు అర్థమైంది


ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దొంగ ఎవరో, దొర ఎవరో ఇప్పటికే ప్రజలకు అర్థమైందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రేపిస్టులకు దండలేసి ఊరేగించిన ఘన చరిత్ర బీజేపీదని, అలాంటి వారు చేసే ప్రమాణాలకు విలువ ఏమి ఉంటుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దొంగ ఎవరో, దొర ఎవరో ఇప్పటికే ప్రజలకు అర్థమైందన్న ఆయన ఈ విషయంలో ఇప్పుడు ఏం మాట్లాడినా దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నానని అంటారని, అందుకే ఈ విషయంలో మాట్లాడడం లేదని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. సందర్భాన్ని బట్టి ముఖ్యమంత్రి కేసీఆర్, దర్యాప్తు సంస్థలు దీనికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తాయన్నారు. అందుకనే ఈ విషయంలో తొందరపాటు వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ నేతలకు చెప్పానన్నారు. 

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్టలో ప్రమాణం చేయడంపై కేటీఆర్ స్పందిస్తూ.. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమైపోతే పోలీస్ స్టేషన్లు, కోర్టులు, చట్టాలు ఎందుకని ప్రశ్నించారు. రేపిస్టులకు దండలేసి ఊరేగించిన బీజేపీకి చెందిన నాయకులు చేసే ప్రమాణాలకు విలువ ఎక్కడ ఉంటుందన్నారు. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో దేవుడ్ని తాకడం పాపమని, అందుకనే ఆలయాన్ని సంప్రోక్షణ చేయాల్సి ఉంటే చేయాలని వేదపండితులను కోరుతున్నట్టు కేటీఆర్ కోరారు.


 డీజిల్ లేక  ఆగిన అంబులెన్స్,,,వాహనంలోనే మహిళా కాన్పు


మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ధారుణ ఘటన చోటు చేసుకొంది. నిండు గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళుతున్న ఓ అంబులెన్స్ డీజిల్ కొరతతో మధ్యలోనే ఆగిపోయింది. ఆస్పత్రిని చేరే మార్గం లేక రోడ్డు మీదే గర్భిణీ ప్రసవించింది. అంబులెన్స్ సిబ్బందితో పాటు దగ్గర్లోని మహిళలు ఆమెకు పురుడు పోశారు. మధ్యప్రదేశ్ లో శుక్రవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పన్నా జిల్లా బనౌలీలోని షానగర్ కు చెందిన రేష్మా నిండు గర్భిణీ.. శుక్రవారం రాత్రి నొప్పులు మొదలవడంతో ఇంట్లో వాళ్లు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. ఫోన్ చేసిన కొద్దిసేపటికి అంబులెన్స్ వచ్చింది. అందులో వచ్చిన ఆరోగ్య కార్యకర్తలు రేష్మను పరీక్షించి కాన్పు జరగొచ్చని తెలిపారు. దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించేందుకు అంబులెన్స్ లో బయల్దేరారు.  అయితే, డీజిల్ అయిపోవడంతో అంబులెన్స్ మార్గమధ్యంలోనే ఆగిపోయింది. రేష్మ ఏ క్షణంలోనైనా ప్రసవించే పరిస్థితిలో ఉండడంతో మరో మార్గంలేక నడిరోడ్డు మీద, చీకట్లోనే ఆరోగ్య కార్యకర్తలు ప్రసవం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 తోటి విద్యార్థికి మానవత్మం చాటిన చిన్నారి హృదయాలు

స్పందించిన ఉపాధ్యాయులు.... విద్యార్థి పూజితకు ఆర్థిక సాయం అందజేత

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలపరది లోని గడిగరేవుల గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న చిందుకూరు గ్రామానికి చెందిన విద్యార్థిని పూజిత తల్లిదండ్రులు ఇద్దరు ఓకె సంవత్సర లో మృతి చెందడంతో  పూజిత తల్లిదండ్రులను కోల్పోయిన భాధతో, ఆర్థిక ఇబ్బందులతో పాఠశాలకు సక్రమంగా హాజరు కాకపోవడంతో విద్యార్థి పూజిత ను చూసిన తోటి విద్యార్థులు చలించి తోటి విద్యార్థులు పూజిత కు ఆర్థిక సహాయం చేయాలని తలంచి  కొంత నగదు జమ చేసుకుని  నిత్యావసర సరుకులు తీసుకుని పూజిత అందించాలని ఉపాధ్యాయులను కోరగా విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు విమల వసుంధర దేవి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల గొప్ప మనసుకు స్పందించి వారిని అభినందించటంతో పాటు పూజిత పరిస్థితి ఆరా తీయగా ఆర్థిక పరిస్థితి సరిగా లేదని పూజితకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్నారని వీరందరికీ ఆధారం నాన్నమ్మ మాత్రమే ఆని తెలుసుకొని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు  20 వేల రూపాయలు విరాళాలు సేకరించి మూడు నెలలకు కావలసిన  నిత్యావసర సరుకులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి నిర్మల వసుంధర దేవి ఆధ్వర్యంలో  చిందుకూరుకు వెళ్లి పూజిత కు ధైర్యం నింపటమే కాక భవిష్యత్తులో మీకు చదువు పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపాధ్యాయలు మీకు అండగా ఉంటారని భరోసా ఇచ్చి 28,000రూపాయులు, నిత్యఅవసర సరుకులను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయలు మాట్లాడుతూ విద్యార్థులను మీ చేతులు చిన్నవే అయినా హృదయం మాత్రం విశాలమైనదని, భవిష్యత్తులో మీరు "సమాజానికే ఆదర్శంగా" నిలుస్తారని,  విద్యార్థినీ, విద్యార్థులు నరేంద్ర, వినయ్, చిన్నారి, సుగుణ, అనూష, సుప్రియ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయనీ,ఉపాద్యాయలు పద్మజ, చంద్రావతి, కోమలమ్మ, పుష్పకుమారి, కవిత, కేశమ్మ, నాగలక్ష్మి, లక్ష్మీదేవి, లలిత, అదిషేశమ్మ, సుబ్బారెడ్డి, మారెన్న, దేవనాల శ్రీనివాసులు, బాలస్వామి,  మాజీ విద్యా కమిటీ చైర్మన్ గోవింద రాజులు మరియు ఔట్ సోర్సింగ్ సిబ్బంది మహబూబ్, హరిత తదితరులు పాల్గొన్నారు.


 రెండువేల ఏళ్ల నాటి పాత్ర


తెలంగాణ రాష్ట్రంలో ఓ అరుదైన వస్తువు  లభ్యమైంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండువేల సంవత్సరాల నాటి పాత్ర లభ్యమైంది. ఈ మేరకు తెలుగు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, పబ్లిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ హెరిటేజ్ సంస్థ (ప్రిహా) ప్రధాన కార్యదర్శి ఎంఏ శ్రీనివాస్ తెలిపారు. బాన్సువాడ సమీపంలోని బోర్లాం గ్రామంలో ఓ మట్టిదిబ్బపై ఈ పాత్ర లభించినట్టు చెప్పారు. దీనిపై క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ప్రాకృత భాష, బ్రహ్మీ లిపిలో లఘుశాసనం ఉన్నట్టు పేర్కొన్నారు.

మంజీరా నదీ పరీవాహక ప్రాంతంలో దొరికిన బ్రహ్మీ లఘు శాసనాల్లో ఇది ఆరోదని శ్రీనివాస్ వివరించారు. మంజీరా నదికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఇది లభించినట్టు పేర్కొన్నారు. దీనిని శాతవాహన కాలం నాటి చారిత్రక అవశేషంగా గుర్తించినట్టు చెప్పారు. పాత్రపై ఉన్న శాసనంలో ‘హిమాబుధియ’ అని ఐదక్షరాలతో బ్రహ్మీ లిపి ఉందన్న ఆయన.. హిమా పదానికి స్త్రీ బౌద్ధ భిక్షువు అని అర్థం కావొచ్చని దీనిని పరిశీలించిన ఎపిగ్రఫిస్ట్ మునిరత్నం రెడ్డి పేర్కొన్నారు.


 అసలు సినిమా ముందుంది


బీజేపీ నాయకత్వంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న నిన్న తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో ఇప్పటి వరకు వెలుగుచూసింది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని పేర్కొన్నారు. దర్యాప్తు బృందాల వద్ద చాలా విషయాలు ఉన్నాయన్న కేటీఆర్.. తమ ఎమ్మెల్యేలతో గంటలుగంటలుగా మాట్లాడిన ఆడియో టేపులు ఉన్నాయని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. 

శిశుపాలుడిలా బీజేపీ కూడా చేయాల్సిన తప్పులన్నింటినీ చేసేసిందన్నారు. శిశుపాలుడిని శ్రీకృష్ణుడు శిక్షించినట్టుగానే బీజేపీని కూడా మునుగోడు ప్రజలు శిక్షించాలని కోరారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ డబ్బులతో కొనాలని చూస్తోందన్న మంత్రి.. జూటా, జుమ్లా బీజేపీని ప్రజలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు.

 ఉగ్రరూపం ప్రదర్శించిన ఉక్రెయిన్


ఇప్పటి వరకు ఉక్రెయిన్ ను గడగడలాడించిన రష్యా తాజాగా తన ప్రత్యర్థి దాడులతో  వణుకుతోంది. రష్యాపై ఉక్రెయిన్ ఉగ్రరూపం ప్రదర్శించింది. ఉన్నంతలోనే రష్యాను ఎదురిస్తూ వస్తున్న ఉక్రెయిన్ నిన్న తన డ్రోన్ దెబ్బ రుచిని రష్యాకు చూపించింది. క్రిమియాలోని కీలకమైన సెవస్తపోల్ సైనిక స్థావరాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. 16 డ్రోన్లు ప్రయోగించి కీలకమైన యుద్ధ నౌకలను ధ్వంసం చేసింది. భారీ నష్టం జరిగినప్పటికీ రష్యా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లు అన్నింటినీ కూల్చేశామని, దాడులను తిప్పి కొట్టామని ప్రకటించింది. ఈ దాడిలో ఓ నౌకకు మాత్రమే స్వల్పంగా నష్టం వాటిల్లినట్టు తెలిపింది. 

రష్యాకు సెవస్తపోల్ చాలా కీలకం. నల్లసముద్రంలో రష్యా నౌకా దళానికి ఇది ప్రధాన కేంద్రం. రష్యా ఇక్కడి నుంచి అటు అజోవ్ సముద్ర తీరాన్ని, ఇటు నల్ల సముద్ర తీర ప్రాంతాన్ని నియంత్రిస్తోంది. కాబట్టే 2014లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించుకుని తన భూభాగంలో కలిపేసుకుంది. ఉక్రెయిన్‌ సైనిక చర్య ప్రారంభించిన తర్వాత రష్యా నౌకాదళం ఇక్కడి నుంచే తన దాడులను కొనసాగిస్తోంది. రష్యాకు ఇంత కీలకంగా ఉన్న ఈ ప్రాంతంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో విరుచుకుపడి ఉక్కిరిబిక్కిరి చేసింది. 

ఈ దాడిపై ఉక్రెయిన్ అధికారికంగా స్పందించనప్పటికీ, ఆ దేశ సైన్యం మాత్రం డ్రోన్ దాడుల్లో రష్యాకు చెందిన మూడు యుద్ధ నౌకలు ధ్వంసమైనట్టు పేర్కొంది. ఈ దాడిపై రష్యా తీవ్రంగా స్పందించింది. దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ఉక్రెయిన్‌ దళాలతోపాటు బ్రిటన్‌కు చెందిన నావికాదళం హస్తం కూడా ఉందని ఆరోపించింది. రష్యా ఆరోపణలను బ్రిటన్ ఖండించింది. ఉక్రెయిన్‌పై దాడితో ఎదురుదెబ్బలు తింటున్న రష్యా ఏం చేయాలో పాలుపోక తమపై దుష్ప్రచారానికి దిగిందని మండిపడింది.