క్రీడాకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా

క్రీడాకారులకు యూపీలోని యోగి సర్కార్ ఇచ్చిన గౌరవంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేనా క్రీడాకారులకు ఇచ్చే గౌరవం అని నేటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలావుంటే టాయిలెట్స్‌లో మహిళా ఆటగాళ్లకు భోజనాలు ఏర్పాటుచేసిన దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్‌ నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా టోర్నమెంట్‌లో చోటుచేసుకుంది. బాలికలకు టాయిలెట్లలో భోజనాలు ఏర్పాట్లు చేయడంతో వారు ఇబ్బంది పడుతూనే భోజనం చేసిన వీడియోలు బయటకు రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, స్థలం లేకపోవడంతోనే ఇలా చేశామని అధికారులు తమ పనిని సమర్దించుకోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు, నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే సహారన్‌పుర్ జిల్లాలో సెప్టెంబరు 16న అండర్‌-17 బాలికల కబడ్డీ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌కు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 మంది క్రీడాకారిణులు హాజరయ్యారు. అయితే, తమకు స్టేడియం టాయిలెట్‌లో భోజనాలు ఏర్పాటు చేశారని కొందరు ఆటగాళ్లు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఎవరో ఫోన్‌లో రికార్డు చేయడంతో వీడియోలు కూడా బయటికొచ్చాయి. టాయిలెట్‌ గదిలో పాత్రలతో అన్నం, పప్పు, కూరలు ఉండగా అందులో నుంచి అమ్మాయిలు వడ్డించుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఒక చోట అయితే మరీ దారుణంగా పూరీలను నేలపై ఓ పేపర్‌లో వేసి ఉంచారు.

ఒక నిమిషం నిడివి గల వీడియోలో ఒక ఫ్రేమ్‌లో యూరినల్స్, వాష్ బేసిన్‌లు ఉండగా.. గేట్ దగ్గర రైస్, పప్పు, కూరలు పాత్రల్లో ఉండగా.. ఆటగాళ్లు ఆహారం తీసుకొని టాయిలెట్ నుంచి బయటకు వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. స్మిమ్మింగ్ పూల్ సమీపంలో వంటచేస్తున్న దగ్గరకు వర్కర్లు పాత్రలను తీసుకొస్తున్నట్టు మరో వీడియోలో ఉంది.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో యోగి సర్కారుపై విరుచుకుపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంపై సహారన్‌పుర్‌ క్రీడా అధికారి అనిమేశ్‌ సక్సేనా స్పందిస్తూ.. భోజనాలను టాయిలెట్‌లో ఏర్పాటు చేయలేదని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో వంట పాత్రలను ‘ఛేంజింగ్‌ రూం’లో పెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.

‘‘బాత్‌రూంలో భోజనాలు పెట్టలేదు.. ఆ రోజు వర్షం పడింది. అందుకే స్విమ్మింగ్‌పూల్‌ వద్ద భోజన ఏర్పాట్లు చేశాం.. ప్రస్తుతం స్టేడియం నిర్మాణ దశలో ఉంది. వర్షం కారణంగా వంట పాత్రలు పెట్టేందుకు స్థలం లేకపోవడంతో స్విమ్మింగ్‌ పూల్‌ పక్కనే ఉన్న ఛేంజింగ్‌ రూంలో పెట్టాం’’ అని సక్సేనా చెప్పడం గమనార్హం. దీనిపై సహారన్‌పూర్ కలెక్టర్ అఖిలేశ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ‘‘ఏర్పాట్లుపై ఫిర్యాదులు వచ్చాయి.. జిల్లా క్రీడా అధికారిని సస్పెండ్ చేశాం.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించి, సంబంధిత వ్యక్తి మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించాం... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని స్పష్టం చేశారు.

‘‘పలు ప్రచార ఆర్బాటాలకు బీజేపీ కోట్లాది రూపాయలను వెచ్చిస్తోంది.. కానీ, క్రీడాకారులకు కనీస సౌకర్యాలు కల్పించడానికి డబ్బుల్లేవా?’’ అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ‘‘ఉత్తర్ ప్రదేశ్‌లోని కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్‌లో ఆహారం వడ్డించారు.. ఇది ఆటగాళ్లకు బీజేపీ ఇచ్చే గౌరవం.. చాలా సిగ్గుచేటు’’ టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటన చాలా అవమానకరమని రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదురి మండిపడ్డారు. మరోవైపు, ఘటనకు బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్ పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: