ఆ నిర్మాణాలను కూల్చేయండి


బాంబే హైకోర్టు తాజాగా ఓ‌ కేంద్ర మంత్రి కేసు విషయంలో కీలక తీర్పు వెలువరించింది. అక్రమ నిర్మాణం విషయంలో కేంద్ర మంత్రి నారాయణ్ రాణేకు బాంబే హైకోర్టులో ఝలక్ తగిలింది. జుహూలోని అక్రమంగా నిర్మించిన ఆయన బంగ్లాను కూల్చివేయాలని ఆదేశించింది. అలాగే, రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. బంగ్లా నిర్మాణంలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, కోస్టల్ రెగ్యులైజేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఆర్డీ ధనూక, జస్టిస్ కమల్ ఖాటాల ద్విసభ్య ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.

‘‘హోల్‌సేల్‌గా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ అనధికార నిర్మాణాన్ని క్రమబద్ధీకరించాలని కోరుతూ రాణే కుటుంబం నడుపుతున్న సంస్థ దాఖలు చేసిన రెండో దరఖాస్తును బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలించదు, అనుమతించదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బంగ్లాలోని అక్రమ నిర్మాణాలను రెండు వారాల్లోగా కూల్చివేయాలని, అనంతరం వారం రోజుల్లోగా నివేదికను సమర్పించాలని బీఎంసీని ఆదేశించింది.

అక్రమ నిర్మాణాన్ని చేపట్టినందుకు రూ.10 లక్షలు జరిమానా విధించిన హైకోర్టు.. ఈ మొత్తాన్ని రెండు వారాల్లోగా మహారాష్ట్ర స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాలని సూచించింది. సుప్రీంకోర్టులో అప్పీలుకు ఈ ఉత్తర్వులను ఆరు వారాల పాటు నిలిపివేయాలన్న రాణే తరఫు లాయర్ శార్దూల్ సింగ్ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.

గతంలో బీఎంసీ జారీచేసిన ఆదేశాలను పక్కనబెట్టి తమ రెండో దరఖాస్తుపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ కేంద్ర మంత్రి రాణే కుటుంబానికి చెందిన కాల్కా రియల్ ఎస్టేట్స్ దాఖలుచేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. బంగ్లా నిర్మాణం అక్రమని పేర్కొంటూ కాల్కా రియల్ ఎస్టేట్స్ క్రమబద్దీకరణ కోసం చేసిన దరఖాస్తును ఈ ఏడాది జూన్‌లో బీఎంసీ తిరస్కరించింది. మళ్లీ జులైలోనూ రెండో దరఖాస్తును చేసింది. డెవలప్‌మెంట్ అండ్ ప్రమోషన్ రెగ్యులేషన్ 2034లోని కొత్త నిబంధనల ప్రకారం గతంలో పేర్కొన్న దానితో పోలిస్తే చిన్న భాగాన్ని క్రమబద్ధీకరించాలని కోరింది. అయితే, దీనిపై బీఎంసీ నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టుకు వెళ్లగా అక్కడ ఎదురుదెబ్బ తగిలింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: