ఇదేనా సామాన్యుడి సర్కార్

పంజాబ్ లో సామాన్యుడి సర్కార్ అంటే ఇదేనా అని ఆ రాష్ట్ర సీఎం కాన్వాయ్ తీరుపై అక్కడి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. వీఐపీ సంస్కృతికి స్వస్తి చెబుతామని ఎన్నికలకు ముందు ప్రకటనలతో ఊదరగొట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మరిచిపోయారంటూ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మాన్‌కి ముందున్న ముగ్గురు ముఖ్యమంత్రుల కాన్వాయ్‌‌లో వాహనాలు కంటే ఆయనే ఎక్కువ ఉపయోగిస్తున్నట్టు ఉన్నట్టు సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడయ్యింది. దీంతో ఆప్ సీఎంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికి, మాయ మాట‌లు చెప్పిన సీఎం కాన్వాయ్‌లో 42 వాహ‌నాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా మండిపడ్డారు.

ప‌న్ను చెల్లింపుదారులైన ప్ర‌జ‌ల సొమ్మును ఇలా దుర్వినియోగం చేయడానికి మీకు ఎవ‌రు అనుమ‌తి ఇచ్చారంటూ ఆయన నిలదీశారు. ఆమ్ ఆద్మీ పార్టీ మాట‌ల‌న్నీ అబ‌ద్దాలేనంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బాధ్య‌త లేకుండా పాల‌న సాగిస్తున్న భ‌గ‌వంత్ మాన్‌కు త‌మ‌ను విమ‌ర్శించే నైతిక హ‌క్కు లేద‌ని అన్నారు. గతంలో పంజాబ్ సీఎంలుగా పనిచేసిన ప్రకాశ్ సింగ్ బాదల్, కెప్టెన్ అమరీందర్ సింగ్‌ల కాన్వాయ్‌లో 33 వాహనాలే ఉండగా.. భగవంత్ మాన్ మాత్రం 42 వాహనాలను వాడుతున్నట్టు ఆర్టీఐ స్పష్టం చేసింది.

దీని ద్వారా ఏం చెప్పాల‌ని అనుకుంటున్నారంటూ ఆయన ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెడుతున్న ముఖ్యమంత్రికి త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లు బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌ని, కాన్వాయ్ విష‌యంలో స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ‘‘2007 నుంచి 2017 వరకూ సీఎంగా ఉన్న ప్రకాశ్ సింగ్ బాదల్ తన కాన్వాయ్‌లో 33 వాహనాలు ఉన్నాయి.. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం అయిన తర్వాత వాహనాల సంఖ్య పెరగలేదు.. కానీ సామాన్యుల సీఎంగా చెప్పుకునే భగవంత్ మాన్ 42 వాహనాలతో భారీ కాన్వాయ్‌లో వెళుతున్నట్టు ఆర్టీఐ ద్వారా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది’’ అని ప్రతాప్ సింగ్ బజ్వా ట్వీట్ చేశారు.

‘‘భగవంత్ మాన్ సీఎం కాకముందు చేసిన వాగ్దానాలకు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరించేవాటికి పొంతనలేదు.. ఇలాంటి విషయాలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భగవంత్ మాన్ అధికార పార్టీపై విరుచుకుపడేవారు’’ అని బజ్వా విమర్శించారు. కాన్వాయ్‌లో ఇంత భారీగా వాహనాలు ఎందుకు వినియోగిస్తున్నారో పంజాబ్ ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కెప్టన్ అమరీందర్ సింగ్ తర్వాత చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ సెప్టెంబరు 20, 2021 నుంచి మార్చి 16, 2022 మధ్య సీఎంగా ఉన్నప్పుడు తన కాన్వాయ్‌లో 39 వాహనాలను వినియోగించినట్టు ఆర్టీఐ ప్రశ్నకు రాష్ట్ర రవాణా కమిషనర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: