గుడి వద్దు...మాకు లైబ్రెరీ కావాలి...బెంగళూరు యూనివర్శటీలో  నిరసన


కర్ణాటక రాష్ట్రంలో ఏదో ఒక రూపంలో మతపరమైన అంశాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా బెంగళూరు యూనివర్శిటీలో గుడి నిర్మాణం అంశం అక్కడ ఉద్రిక్తతకు ఆజ్యం పోస్తోంది. యూనివర్సిటీ ప్రాంగణంలో వినాయకుడి ఆలయ నిర్మాణాన్ని బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆలయానికి బదులుగా లైబ్రరీ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జ్ఞాన భారతి క్యాంపస్‌లో ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు గురువారం యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ప్రభుత్వ విద్యాసంస్థలో ఆలయ నిర్మాణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్రుహ‌త్ బెంగ‌ళూర్ మ‌హాన‌గ‌ర పాలిక యూనివర్సిటీ భూమిని ఆక్రమించి.. అనధికారికంగా ఆలయాన్ని నిర్మిస్తోందని విద్యార్థులు ఆరోపించారు. ఆలయ నిర్మాణం వల్ల యూనివర్సిటీలో విద్యా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని విమర్శించారు. గతంలో క్యాంపస్‌లో మరో చోట ఉన్న ఆలయాన్ని తరలించి పరిపాలన కార్యాలయం వెనుక అక్రమంగా నిర్మిస్తున్నారన్నారు.

"యూజీసీ చట్టం 2000 ప్రకారం యూనివర్సిటీలో మతపరమైన సంస్థలు, భవనాలు నిర్మించకూడదు.ఈ నిబంధనను అతిక్రమించి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. రెండు నెలల క్రితమే నిరసన తెలిపాం. ఆ సమయంలో వైస్ ఛాన్సలర్ పనులను నిలిపివేశారు. అయితే పోలీసులు, బీబీఎంపీ అధికారుల భద్రతతో బుధవారం అకస్మాత్తుగా నిర్మాణ పనులు ప్రారంభించారు." అని విద్యార్థులు ఆరోపించారు.

ఈ మేరకు యూనివర్సిటీ వీసీ జయకర్ ఆందోళనకారుల నుంచి మెమోరాండం స్వీకరించి అనంతరం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రస్తుతానికి పనులు నిలిపివేయాలని బీబీఎంపీ అధికారులను కోరారు. ఈ సందర్భంగా రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్ కారణంగా.. వినాయకుడి ఆలయం మార్చబడిందని, ఒప్పందం ప్రకారం ఆలయ నిర్మాణం కోసం యూనివర్సిటీ స్థలాన్ని మంజూరు చేసిందని వీసీ జయకర్ తెలిపారు. అయితే దీనిపై "విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పనులు నిలిపివేయాలని ఆదేశించాం. మరోసారి సమావేశం నిర్వహించి ఒక నిర్ధారణకు వస్తాం." అని వీసి తెలిపారు. కాగా ఆలయ నిర్మాణం విషయంలో వైస్ ఛాన్సలర్ ఏదైనా ప్రతికూల నిర్ణయం తీసుకుంటే.. బెంగళూరు యూనివర్సిటీ బంద్ చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: